అది 1992 అక్టోబర్ 9. కోట్ల విజయ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు. హైదరాబాద్‌కు ఫోన్ చేస్తే, ఢిల్లీలోనే ఉన్నారని వర్తమానం. పీవీ క్యాబినెట్‌లో న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారప్పుడు. ఢిల్లీ నివాసానికి ఫోన్ చేస్తే, విజయ భాస్కరరెడ్డి ఫోన్ ఎత్తారు. ‘ఏమిటి సార్ ఈరోజే ప్రమాణ స్వీకారం అన్నారు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటంటే – ‘ఉదయం విమానం అందుకోలేక పోయాను. ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్నాన’న్నారు. సరే వారిని అభినందించి, విజయవాడలో దంత వైద్య కళాశాల నెలకొల్పమని సలహా ఇచ్చాను. ‘ఊరుకో శివాజీ! నా ముందున్న ముఖ్యమంత్రి వైద్య కళాశాలల జోలికిపోయి ఉద్యోగం పోగొట్టుకొన్నాడు. నాకు ఈ సలహా ఇస్తున్నావు’ అన్నారు. ‘అది కాదులెండి, నేను హైదరాబాద్ వచ్చి వివరిస్తాను’ అని అప్పటికా సంభాషణ ముగించాను.
మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి సవివరంగా వివరించాను. అప్పటికి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా వైద్య కళాశాలలో మాత్రమే దంత వైద్య విద్య ఉంది. దానిలో మొత్తం సీట్లు 32. అందులో 7 సీట్లు జమ్మూ–కశ్మీరుకు కేంద్ర ప్రభుత్వ కోటాలో పోతే... మిగిలిన 25 సీట్లలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు వరుసగా 11, 6, 8 సీట్లు పంచుతారు. కనుక ‘విజయవాడలో హెల్త్ యూనివర్సిటీలో ఒక కళాశాల నెలకొల్పితే, మరొక 40 సీట్లు వస్తాయి. దానికి పెద్దగా నిధులు కూడా అవసరం ఉండదు కదా! మొదటి, రెండు సంవత్సరాల చదువుకు – అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బాక్టీరియాలజీ, ఫార్మకాలజీలకూ; వాటి నాన్‌క్లినికల్ సబ్జెక్టులకు వైద్య కళాశాలలోనున్న వసతులు సరిపోతాయి కదా.
మూడో సంవత్సరం వచ్చేసరికి కాస్త అవుట్ పేషెంట్ పార్టులో ఓ 10, 15 డెంటల్ థియరీలు, కాస్త ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషెంట్లకు వసతి వంటివి ఏర్పాటు చేసుకోవడానికి నామమాత్రపు కేటాయింపులు సరిపోతాయ’ని చెప్పాను. వైద్య విశ్వవిద్యాలయం కులపతిగా ఉన్న డాక్టర్ లింగం సూర్యనారాయణను పిలిపించి, దానికి అవసరమైన నివేదిక తయారు చేయమని పురమాయించమని కోరాను. ఇది ప్రభుత్వ రంగంలో నెలకొంటుంది గనక అవినీతి ఆరోపణలకు తావుండదనీ చెప్పాను.
ఈ సంగతి డాక్టర్ లింగం గారికి ముందుగానే తెలియజేస్తే – ‘అమ్మో! వారిని కలవడం మాటలా? నావల్ల కాదని’ కంగారుపడ్డారు. తరువాత రెండు, మూడు రోజులకు వారికి ఫోన్ చేసి చెప్పాను... ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు వస్తుందనీ, కంగారు పడకుండా సవివరంగా నివేదిక తయారు చేసుకొని వెళ్లమనీ. ‘ఫోను వచ్చింది – శివాజీ ఈరోజే వెడుతున్నాను’ అని సెలవిచ్చారు. ముఖ్యమంత్రి ఆ నివేదిక పరిశీలించి వెంటనే ఐదు లక్షల రూపాయలు కేటాయించి, విజయవాడ పాత ఆర్‌టీసీ బస్టాండు భవనాన్ని బదలాయించి, కాలేజీ మొదలు పెట్టమన్నారు.
ఇకపై, ప్రభుత్వం నుండి నిధుల కోసం ఎదురు చూడకుండా, మీ కాళ్ల మీద మీరు నిలబడి కాలేజీ నడుపుకోవాలని కూడా హెచ్చరించారు. అలా 1992–93లో 40 వార్షిక ప్రవేశాలతో, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఈ కాలేజీ పురుడు పోసుకుంది. ఇది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో, ద్వితీయ దంత వైద్య కళాశాల. హెల్త్ యూనివర్సిటీ మొత్తం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు చెందింది కనుక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దానిలో ప్రవేశాలకు అవిభక్త రాష్ట్రమంతటికీ అన్ని జిల్లాలకూ పది సంవత్సరాల పాటు అర్హత ఉంది. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కనుక విభజిత ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది.
ఇదిలా ఉండగా, డాక్టర్ లింగం పదవీ విరమణ తర్వాత వారి స్థానంలో డాక్టర్ సీఎస్ భాస్కరన్ వైస్ ఛాన్స్‌లర్ అయ్యారు. వారు బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్. వారికి హాస్పిటల్ పని, ఆపరేషన్లు, రోగులు, వైద్యం వంటి బాధ్యతలు ఉండవు. దానితో వారు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించారు. గతంలో కూడా డాక్టర్ డి. జగన్నాథరెడ్డి, డాక్టర్ డి. భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ వంటి వారు వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌గాను, వైద్య విద్యాశాఖ సంచాలకులుగాను బాగా రాణించారు.
డాక్టర్ భాస్కరన్ విజయవాడలో ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్న సీనియర్ దంత వైద్యులను పిలిచి ‘ఈ కళాశాల అమ్మా, అబ్బా లేని అనాథ. మీరు ఈ ప్రాంతం వారు. ఇవి బతికి, బట్టగట్టేటట్లు కాపాడవలసిన గురుతర బాధ్యత మీ మీద ఉంది. జీతం–భత్యం ఆశించకుండా పని చేయండి’ అని విన్నవించారు. అలాగే పనిచేసి, వారు దాన్ని నిలబెట్టారు. అదే నేడు బీడీఎస్‌తో పాటుగా ఎమ్‌డీఎస్ కోర్సుల్లో కూడా తర్ఫీదునిస్తూ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలగా నిలదొక్కుకుంది.
– డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment