అభిప్రాయం
చైనాకు మించిన జనసంఖ్యతో భారత దేశం పేదరికానికి పెద్ద పీటగా మారినందుకు బాధపడుతున్న సమయంలో మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరింత మందిని కనండని ప్రజలకు పిలుపునివ్వడం కలయా, వైష్ణవ మాయయా అనిపిస్తున్నది. గతంలో ఒకసారి అస్పష్టంగా ఈ ప్రకటన చేసిన చంద్రబాబు ఇప్పుడు దీనికొక ప్రణాళికను జోడించారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ మేరకు చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి అవుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఎక్కువమందిని కనాలేమో అన్నారు గానీ ఈ ఇద్దరు సీఎంల ఆలోచనల్లో స్పష్టమైన తేడా ఉంది.
ముందు ముందు దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోయి ముసలివారు అధికమవుతారని, ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు అంటున్నారు. మేమిద్దరం, మాకు ఇద్దరు అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించినందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమిత మయిందని, అందువల్ల 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటులో మన స్థానాలు తగ్గిపోతాయని,కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మరింతగా కుంచించుకు పోతున్నాయనే కారణాల మీద ఎక్కువమంది బిడ్డలను కనాలే మోనని స్టాలిన్ అన్నారు. ఇందుకు తమిళనాట దీవెనగా ఉన్న 16 రకాల భాగ్యాల ప్రస్తావన తెచ్చి ఒక్కొక్కరూ అంతమందిని కనవలసి వస్తుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ విషయంలో వల్లమాలిన ఆత్రం ప్రదర్శించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
కుటుంబ నియంత్రణను జాతీయ విధానంగా చేపట్టి 1950 లోనే అమలు ప్రారంభించిన దేశం ఇండియా. అయినా జనాభాలో ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చిన చైనాను ఈ మధ్యనే దాటి పోయాము. ప్రస్తుతం భారత జనాభా 145 కోట్లమంది. ఇందులో 25 సంవత్సరాల లోపు వయసువారు 40 శాతం మంది. 40 ఏళ్ల లోపు జనం 74 శాతం. ఈ పరిస్థితి 2061 వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. పనిచేసే వయసులోని జనం ఇంత ఎక్కు వగా ఉండటం ఒక వరం. వీరందరికీ పని కల్పించగలిగితే సంపద పెరిగి ఇండియా త్వరితంగా అభివృద్ధి చెందిన దేశం కాగలుగుతుంది. కానీ పాలకులు ఇందులో ఘోరంగా విఫలమవుతున్నారు.
కుటుంబ నియంత్రణ పాటింపువల్ల జనాభా తగ్గిపోవడం, ఉత్తరాదికంటే అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటం దక్షిణాది రాష్ట్రాలకు పెనుశాపమయ్యింది. అయిదు దక్షిణాది రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ) ఉమ్మడి జనాభా 24 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభాయే ఇప్పుడు దాదాపు 25 కోట్లని అంచనా. 2026 తర్వాత జరిగే నియోజక వర్గాల పునర్వి భజనలో అప్పటికి ఉండే జనాభా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న వాటిలో 20 పార్లమెంటు స్థానాలు కోల్పోవచ్చు; ఉత్త రాది రాష్ట్రాలు అదనంగా 31 స్థానాలు పొందవచ్చు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే 11 పార్లమెంటు స్థానాలు వచ్చి చేరుతాయని అంచనా. దాంతో ఇపుడున్న 80 స్థానాలు 91కి పెరుగుతాయి. తమిళనాడు 8 స్థానాలను కోల్పోవచ్చు. ప్రస్తుతం దానికున్న 39 స్థానాలు 31కి కుదించుకుపోతాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉండిన 42 పార్లమెంటు స్థానాలు 34కి తగ్గిపోతాయంటున్నారు. బిహార్ పది, రాజస్థాన్ ఆరు స్థానాలను, మధ్య ప్రదేశ్ నాలుగింటిని, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్ ఒక్కో పార్లమెంటు స్థానాన్ని అదనంగా పొందవచ్చని భావిస్తున్నారు.
పునర్విభజన వాయిదా ఒక పరిష్కారం
ఈ మార్పు కారణంగా కేంద్ర పాలకులు ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసి నిధులను ఉత్తరాది రాష్ట్రాలకే మరింత ఎక్కువగా కేటాయిస్తారు. పర్యవసానంగా దక్షిణాది ఇంతవరకు సాధించిన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. జనాభా నియంత్రణను చిత్త శుద్ధితో పాటించినందువల్ల ఇలా నష్టపోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువమందిని కనక తప్పదా అని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు.
లోక్‌సభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 543. ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినది. కుటుంబ నియంత్రణ పాటింపు దెబ్బ తినకుండా చూసుకొనేందుకు, దానిని ప్రోత్సాహించడం కోసం ఈ సంఖ్యను 30 ఏళ్ల పాటు యధాతథంగా కొనసాగించాలని భావించి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. అలా ఆ సంఖ్యను అక్కడే ఆపి ఉంచారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనను 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతర కాలానికి వాయిదా వేస్తూ 2000 సంవత్సరంలో మళ్ళీ నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా మరి కొన్ని సంవత్సరాలపాటు యధాతథ స్థితిని కొనసాగిస్తూ 2026లో ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా జనసంఖ్యను బట్టి ప్రజా ప్రాతినిధ్య నియోజకవర్గాల పునర్విభజనను పార్లమెంటుకు బదులు రాష్ట్రాల శాసనసభలకు బదలాయించవచ్చు. కొంపలేం మునగవు.
లోక్‌సభ స్థానాలను కాపాడుకోవడం కోసం, వాటిని పెంచు కోవడానికి ఎక్కువ మందిని కనాలనడం ఎంతమాత్రం హర్షించ వలసినది కాదు. అసలే వనరులు తక్కువగా ఉన్న దేశంలో జనాభాను పెంచుకోడం ఆత్మహత్యా సదృశమే. దేశ జనాభాలో 60 శాతం మంది సగటున రోజుకి 250 రూపాయలతో జీవిస్తున్నారు. జీవన హక్కు అంటే అన్ని సౌకర్యాలతో గౌరవప్రదంగా బతికే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్వచించింది. దేశంలో 50 శాతానికి మించిన జనాభా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువమందిని కనాలని చంద్ర బాబునాయుడు అనడం పరమ హాస్యాస్పదంగా ఉన్నది.
పరిమిత సంతానమే మేలు
ఏ రోజు పని ఉంటుందో ఏ రోజు ఉండదో తెలియని స్థితిలోని ప్రజలను, అందీ అందని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచేవారిని కనండి కనండి అంటూ అదిలించడం మానవీయం కాదు. దేశంలో ఐదేళ్ల లోపు బాలల్లో 44 శాతం మంది వయసుకు తగిన బరువు లేమితో బాధపడుతున్నారు. బాలల్లో 72 శాతం మంది, వివాహిత మహిళల్లో 52 శాతం మంది రక్త హీనతతో తీసుకుంటున్నారు. గర్భవతులకు పోషకాహారం లోపిస్తే పుట్టే పిల్లలు రోగాల బారిన పడతారు. 2013 నుంచి స్థూల దేశీయ ఉత్పత్తి 50 శాతం పెరిగినప్పటికీ ప్రపంచమంతటిలో గల పోషకాహార లోపమున్న పిల్లల్లో మూడింట ఒక పాలు కంటే ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారనీ, ఇందుకు విపరీతమైన ఆర్థిక వ్యత్యాసాలే కారణమనీ నిపుణులు నిగ్గు తేల్చారు.
శారీరకంగా చితికిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుక్కెడు గంజి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అత్యధిక శాతం మహిళలు ఎక్కువ మంది బిడ్డలను కనడమంటే చావుకి త్వరితంగా దగ్గరవ్వడమే. పిల్లలు లేనివారికీ ఇద్దరే బిడ్డలు కలవారికీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరచడమే. పరిమిత సంతాన సూత్రం ప్రజలకు మంచి చేసింది. బతుకు భారాన్ని తగ్గించి ఎండిన పెదాలను తడిపింది.
దక్షిణాది సాధించుకున్న ఈ సౌభాగ్యాన్ని నాశనం చేయా లనే దుర్బుద్ధి హానికరం. ఒకవైపు పిల్లల విద్యను, వైద్యాన్ని నానాటికీ ప్రియం చేస్తూ ఇంకా ప్రసవించండని అనడం దుర్మార్గమే. చంద్ర బాబునాయుడుకి ఈ ఆలోచన ఎందుకు కలిగిందో గాని అది ప్రజలపట్ల ద్రోహ చింతనే. ఈ దురాలోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి మానుకోవడం మంచి చేస్తుంది. ఎప్పుడో వచ్చే విపత్తు కోసం ఇప్పుడే శోక గంగలో దూకమనడం విజనూ కాదు, విజ్ఞతా అనిపించుకోదు.
జి. శ్రీరామమూర్తి
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment