family planning
-
సంతాన సాఫల్య తంత్రం
చైనాకు మించిన జనసంఖ్యతో భారత దేశం పేదరికానికి పెద్ద పీటగా మారినందుకు బాధపడుతున్న సమయంలో మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరింత మందిని కనండని ప్రజలకు పిలుపునివ్వడం కలయా, వైష్ణవ మాయయా అనిపిస్తున్నది. గతంలో ఒకసారి అస్పష్టంగా ఈ ప్రకటన చేసిన చంద్రబాబు ఇప్పుడు దీనికొక ప్రణాళికను జోడించారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ మేరకు చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి అవుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఎక్కువమందిని కనాలేమో అన్నారు గానీ ఈ ఇద్దరు సీఎంల ఆలోచనల్లో స్పష్టమైన తేడా ఉంది.ముందు ముందు దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోయి ముసలివారు అధికమవుతారని, ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు అంటున్నారు. మేమిద్దరం, మాకు ఇద్దరు అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించినందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమిత మయిందని, అందువల్ల 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటులో మన స్థానాలు తగ్గిపోతాయని,కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మరింతగా కుంచించుకు పోతున్నాయనే కారణాల మీద ఎక్కువమంది బిడ్డలను కనాలే మోనని స్టాలిన్ అన్నారు. ఇందుకు తమిళనాట దీవెనగా ఉన్న 16 రకాల భాగ్యాల ప్రస్తావన తెచ్చి ఒక్కొక్కరూ అంతమందిని కనవలసి వస్తుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ విషయంలో వల్లమాలిన ఆత్రం ప్రదర్శించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నది.కుటుంబ నియంత్రణను జాతీయ విధానంగా చేపట్టి 1950 లోనే అమలు ప్రారంభించిన దేశం ఇండియా. అయినా జనాభాలో ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చిన చైనాను ఈ మధ్యనే దాటి పోయాము. ప్రస్తుతం భారత జనాభా 145 కోట్లమంది. ఇందులో 25 సంవత్సరాల లోపు వయసువారు 40 శాతం మంది. 40 ఏళ్ల లోపు జనం 74 శాతం. ఈ పరిస్థితి 2061 వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. పనిచేసే వయసులోని జనం ఇంత ఎక్కు వగా ఉండటం ఒక వరం. వీరందరికీ పని కల్పించగలిగితే సంపద పెరిగి ఇండియా త్వరితంగా అభివృద్ధి చెందిన దేశం కాగలుగుతుంది. కానీ పాలకులు ఇందులో ఘోరంగా విఫలమవుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటింపువల్ల జనాభా తగ్గిపోవడం, ఉత్తరాదికంటే అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటం దక్షిణాది రాష్ట్రాలకు పెనుశాపమయ్యింది. అయిదు దక్షిణాది రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ) ఉమ్మడి జనాభా 24 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభాయే ఇప్పుడు దాదాపు 25 కోట్లని అంచనా. 2026 తర్వాత జరిగే నియోజక వర్గాల పునర్వి భజనలో అప్పటికి ఉండే జనాభా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న వాటిలో 20 పార్లమెంటు స్థానాలు కోల్పోవచ్చు; ఉత్త రాది రాష్ట్రాలు అదనంగా 31 స్థానాలు పొందవచ్చు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే 11 పార్లమెంటు స్థానాలు వచ్చి చేరుతాయని అంచనా. దాంతో ఇపుడున్న 80 స్థానాలు 91కి పెరుగుతాయి. తమిళనాడు 8 స్థానాలను కోల్పోవచ్చు. ప్రస్తుతం దానికున్న 39 స్థానాలు 31కి కుదించుకుపోతాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉండిన 42 పార్లమెంటు స్థానాలు 34కి తగ్గిపోతాయంటున్నారు. బిహార్ పది, రాజస్థాన్ ఆరు స్థానాలను, మధ్య ప్రదేశ్ నాలుగింటిని, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్ ఒక్కో పార్లమెంటు స్థానాన్ని అదనంగా పొందవచ్చని భావిస్తున్నారు. పునర్విభజన వాయిదా ఒక పరిష్కారంఈ మార్పు కారణంగా కేంద్ర పాలకులు ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసి నిధులను ఉత్తరాది రాష్ట్రాలకే మరింత ఎక్కువగా కేటాయిస్తారు. పర్యవసానంగా దక్షిణాది ఇంతవరకు సాధించిన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. జనాభా నియంత్రణను చిత్త శుద్ధితో పాటించినందువల్ల ఇలా నష్టపోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువమందిని కనక తప్పదా అని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. లోక్‌సభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 543. ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినది. కుటుంబ నియంత్రణ పాటింపు దెబ్బ తినకుండా చూసుకొనేందుకు, దానిని ప్రోత్సాహించడం కోసం ఈ సంఖ్యను 30 ఏళ్ల పాటు యధాతథంగా కొనసాగించాలని భావించి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. అలా ఆ సంఖ్యను అక్కడే ఆపి ఉంచారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనను 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతర కాలానికి వాయిదా వేస్తూ 2000 సంవత్సరంలో మళ్ళీ నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా మరి కొన్ని సంవత్సరాలపాటు యధాతథ స్థితిని కొనసాగిస్తూ 2026లో ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా జనసంఖ్యను బట్టి ప్రజా ప్రాతినిధ్య నియోజకవర్గాల పునర్విభజనను పార్లమెంటుకు బదులు రాష్ట్రాల శాసనసభలకు బదలాయించవచ్చు. కొంపలేం మునగవు. లోక్‌సభ స్థానాలను కాపాడుకోవడం కోసం, వాటిని పెంచు కోవడానికి ఎక్కువ మందిని కనాలనడం ఎంతమాత్రం హర్షించ వలసినది కాదు. అసలే వనరులు తక్కువగా ఉన్న దేశంలో జనాభాను పెంచుకోడం ఆత్మహత్యా సదృశమే. దేశ జనాభాలో 60 శాతం మంది సగటున రోజుకి 250 రూపాయలతో జీవిస్తున్నారు. జీవన హక్కు అంటే అన్ని సౌకర్యాలతో గౌరవప్రదంగా బతికే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్వచించింది. దేశంలో 50 శాతానికి మించిన జనాభా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువమందిని కనాలని చంద్ర బాబునాయుడు అనడం పరమ హాస్యాస్పదంగా ఉన్నది. పరిమిత సంతానమే మేలుఏ రోజు పని ఉంటుందో ఏ రోజు ఉండదో తెలియని స్థితిలోని ప్రజలను, అందీ అందని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచేవారిని కనండి కనండి అంటూ అదిలించడం మానవీయం కాదు. దేశంలో ఐదేళ్ల లోపు బాలల్లో 44 శాతం మంది వయసుకు తగిన బరువు లేమితో బాధపడుతున్నారు. బాలల్లో 72 శాతం మంది, వివాహిత మహిళల్లో 52 శాతం మంది రక్త హీనతతో తీసుకుంటున్నారు. గర్భవతులకు పోషకాహారం లోపిస్తే పుట్టే పిల్లలు రోగాల బారిన పడతారు. 2013 నుంచి స్థూల దేశీయ ఉత్పత్తి 50 శాతం పెరిగినప్పటికీ ప్రపంచమంతటిలో గల పోషకాహార లోపమున్న పిల్లల్లో మూడింట ఒక పాలు కంటే ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారనీ, ఇందుకు విపరీతమైన ఆర్థిక వ్యత్యాసాలే కారణమనీ నిపుణులు నిగ్గు తేల్చారు. శారీరకంగా చితికిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుక్కెడు గంజి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అత్యధిక శాతం మహిళలు ఎక్కువ మంది బిడ్డలను కనడమంటే చావుకి త్వరితంగా దగ్గరవ్వడమే. పిల్లలు లేనివారికీ ఇద్దరే బిడ్డలు కలవారికీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరచడమే. పరిమిత సంతాన సూత్రం ప్రజలకు మంచి చేసింది. బతుకు భారాన్ని తగ్గించి ఎండిన పెదాలను తడిపింది. దక్షిణాది సాధించుకున్న ఈ సౌభాగ్యాన్ని నాశనం చేయా లనే దుర్బుద్ధి హానికరం. ఒకవైపు పిల్లల విద్యను, వైద్యాన్ని నానాటికీ ప్రియం చేస్తూ ఇంకా ప్రసవించండని అనడం దుర్మార్గమే. చంద్ర బాబునాయుడుకి ఈ ఆలోచన ఎందుకు కలిగిందో గాని అది ప్రజలపట్ల ద్రోహ చింతనే. ఈ దురాలోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి మానుకోవడం మంచి చేస్తుంది. ఎప్పుడో వచ్చే విపత్తు కోసం ఇప్పుడే శోక గంగలో దూకమనడం విజనూ కాదు, విజ్ఞతా అనిపించుకోదు.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల విజయం పార్లమెంటులో వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేదిలా ఉండకూడదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణలో సాధించిన విజయం ఆయా రాష్ట్రాలకు దండనగా మారకుండా తగు నిబంధనలను రూపొందించాలని కేంద్రానికి సూచించారు. సోమవారం ‘ఎక్స్’లో ఆయన... ‘కుటుంబ నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి. పరిమిత సంతానం విషయంలో 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదే శ్, 2005లో కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించగలవని కొంతకాలంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. అందుకే 2001 లో వాజ్‌పేయి ప్రభు త్వం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 82ను సవరించింది. లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన 2026 తర్వాత సేకరించే మొదటి జనాభా లెక్కలపై ఆధారపడి ఉంటుందని అందులో పేర్కొన్నా రు. సాధారణంగా, 2026 తర్వాత మొదటి జన గణన అంటే 2031 అని అర్థం. కానీ ప్రస్తుతం మొత్తం జన గణన షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడింది. 2021లో చేపట్టాల్సిన జనగణన మొదలే కాలేదు. ఇలా ఆలస్యం చేస్తూ వస్తున్న జన గణనను లోక్‌సభ సీట్ల కేటాయింపునకు ఉపయోగిస్తారా?’అని ఆయన ప్రశ్నించారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల విజయానికి ఇది విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదని, అలా జరగకుండా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని జైరాం రమేశ్ సూచించారు. -
ఇబ్రహీంపట్నం: కు.ని. ఆపరేషన్ల ఘటనపై కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కాలు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీహెచ్ఎస్ ఝాన్సీలక్ష్మిపైనా బదిలీవేటుతో పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్ సునీల్‌కుమార్‌పైనా క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కాణ కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. ఏం జరిగిందంటే.. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (డీపీఎల్ క్యాంప్) చేశారు. అయితే శాస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఇదీ చదవండి: ఇకపై తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి! -
స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలా?
పిల్లలు పుట్టని ఆపరేషన్ అనగానే మన దేశంలో గుర్తొచ్చేది స్త్రీలే. మొదటి కాన్పులోనో రెండో కాన్పులోనో ఆపరేషన్ ప్లాన్ చేసే భర్తలు ఉంటారు భార్యకు. ‘మీరు చేయించుకోండ’ని భార్య అనలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021) నివేదిక ప్రకారం వందమంది వివాహితలలో 38 మంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు. పురుషులలో నూటికి ముగ్గురే వేసెక్టమీకి వెళుతున్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి స్త్రీలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఈ సర్వే మరోసారి విశదపరిచింది. ఇవాళ దేశంలోని 15–49 వయసు మధ్య ఉన్న వివాహితులలో 99 శాతం మందికి కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఏదో ఒక పద్ధతి గురించి తెలుసనేది ఒక అంచనా. అయినప్పటికీ తాత్కాలిక నియంత్రణ కాకుండా శాశ్వత నియంత్రణ విషయానికి వచ్చేసరికి మన దేశంలో ఆ బాధ్యత స్త్రీదేనన్న అవగాహన స్థిరపడిపోయింది. ‘ఫెడరేషన్ ఆఫ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ అధ్యయనంగానీ తాజాగా వెలువడ్డ ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021)గాని ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దేశంలోని మగవారు ‘వేసెక్టమీ’ పట్ల చాలా వైముఖ్యంగానే ఉన్నట్టు ఈ నివేదిక చెబుతోంది. ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణ గురించి ప్రభుత్వంగాని, స్వచ్ఛంద సంస్థలుగాని చేసే ప్రచారం ఎప్పుడూ స్త్రీ కేంద్రితంగానే ఉంటుంది. ఆపరేషన్ గురించి, పిల్స్ గురించి, లేదా స్త్రీకి అమర్చే గర్భనిరోధక సాధనాల గురించి ఎక్కువ ప్రచారం ఉంటుంది. పెళ్లయి సంతానం పుట్టడం మొదలయ్యాక ఏ కాన్పులో ఆపరేషన్ చేయించాలో భర్తో అత్తామామలో నిర్ణయిస్తూ ఉంటారు. భార్యకు కూడా కుటుంబ నియంత్రణ సమ్మతమే అయినా ఆపరేషన్ భర్తకు జరగడం గురించి ఆమె అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉండదు. అసలు ఆ ఆలోచనే లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. ‘వేసెక్టమీ చేయించుకుంటే పురుషుడిలో లైంగిక శక్తి బలహీన పడుతుందని... మునుపటి ఉత్సాహం ఉండదని... శారీరక కష్టం చేసే వృత్తులలో ఉన్నవారైతే బరువులెత్తలేరని ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు దూరం చేయాల్సిన పని తగినంతగా జరగడం లేదు. పురుషులతోపాటు స్త్రీలు కూడా వీటిని నమ్మడం వల్ల ఇంటికి సంపాదించుకుని తేవాల్సిన మగవాడు ఎక్కడ బలహీన పడతాడోనని తామే ఆపరేషన్లకు సిద్ధం అవుతున్నారు’అంటున్నారు (గైనకలాజికల్) ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ శాంత కుమారి. ‘నిజానికి స్త్రీల ఆపరేషన్ కన్నా పురుషులు చేయించుకునే వేసెక్టమీ సులువైనవి, సురక్షితమైనది’ అంటారు ఆమె. కాని వేసెక్టమీ వైపు చూసే పురుషులు లేరు. పిల్స్ వత్తిడి శాశ్వత నియంత్రణకు వెళ్లే ముందు సంతానానికి సంతానానికి మధ్య తాత్కాలిక నియంత్రణ విషయంలో కూడా స్త్రీల మీదే ఒత్తిడి ఉంటోంది. మన దేశంలో కేవలం 10 శాతం మంది పురుషులే కండోమ్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. 90 శాతం మంది స్త్రీలు పిల్స్ వాడటం గురించి, గర్భనిరోధక సాధనాలు అమర్చుకోవడం గురించి ‘ప్రోత్సహిస్తున్నారు’. దీర్ఘకాలం పిల్స్ వాడటం వల్ల స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసినా. ‘పల్లెల్లో పురుషులు లైంగిక విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఆరోగ్య కార్యకర్తలు స్త్రీలే కావడం వల్ల వీరి మాటామంతి స్త్రీలతోనే సాగుతోంది. పురుషులను ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి మగవారిలో కుటుంబ నియంత్ర ఆపరేషన్ల పట్ల ప్రచారం కలిగిస్తే మార్పు రావడం సాధ్యం’ అని సర్వేలో పాలుపంచుకున్న నిపుణులు అంటున్నారు. కుటుంబ బాధ్యత స్త్రీ పురుషులదైనప్పుడు కుటుంబ నియంత్రణ బాధ్యత స్త్రీ పురుషులదే. కాని అది స్త్రీదిగానే ఎంచేంత కాలం స్త్రీకి ఈ భారం తప్పదు. పురుషులు మేల్కోవాలి. 3 శాతమే పురుషులు 2019–2021 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం వంద మంది వివాహితలలో 38.9 శాతం మంది ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు. గత సర్వేతో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. కాని ఆశ్చర్యకరమైన పరిశీలన ఏమిటంటే గత సర్వేలోనూ ఈ సర్వేలోనూ కేవలం 3 శాతానికే పురుషుల శాతం వేసెక్టమీకి పరిమితమైంది. అంటే పురుషులు ఇది ఏ మాత్రం తమకు సంబంధించిన వ్యవహారంగా చూడటం లేదు. ఈ సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఉత్తర ప్రదేశ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలలో 50 శాతం మంది మగవారు ‘అది ఆడవాళ్లు చేయించుకోవాల్సిన ఆపరేషన్’గా జవాబు ఇస్తే మధ్యప్రదేశ్‌లో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు ‘కుటుంబ నియంత్రణ ఆడవాళ్లదే’ అన్నారు. చదవండి: Normal Delivery: నార్మల్ డెలివరీ టిప్స్! -
భారత్‌లో కుటుంబ నియంత్రణ పథకం
1952లో దేశ జనాభా 36 కోట్ల 90 లక్షలకు చేరుకున్నప్పుడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించారు. అప్పుడు ప్రతి కుటుంబానికీ ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలనే ఎర్ర త్రికోణం గుర్తు ఎక్కడ పడితే అక్కడ కనిపించి అధిక ప్రాచుర్యం పొందింది. అయితే అత్యయిక పరిస్థితి కాలంలో సంజయ్ గాంధీ నిర్బంధ కుటుంబ నియంత్రణలు చేయించడంతో కుటుంబ నియంత్రణ అనేది ఒక చెడ్డ మాటగా ప్రచారం అయింది. 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలలో ఇది కూడా ఒకటనే ప్రచారం జరిగింది. కానీ, దక్షిణాది రాష్ట్రాలు అనుసరించిన నవ్య వ్యూహాలు, పథకాల ఫలితంగా జనాభా పెరుగుదల నియంత్రణలో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించింది. 1951లో 6శాతం ఉన్న సంతానోత్పత్తి రేటు 1999 నాటికి 2.5కి తగ్గింది. ప్రస్తుతం అయితే దాదాపు 140 కోట్ల జనాభా కలిగి, ప్రతి ఏడాదీ కోట్ల మంది అదనంగా జమ అవుతున్న భారతదేశంలో కుటుంబ సంక్షేమ పథకాలు, జనాభా నియంత్రణ చర్యలు విజయవంతం అవుతాయని ఆశించడానికి కొన్ని సందర్భాలలో సంశయం కలుగుతుంది. (చదవండి: పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం) -
అత్తల కనుసన్నల్లో పల్లెపడుచులు
సామాజిక సంబంధాలపై అత్తల ఆంక్షలు దేశంలోని గ్రామీణ ప్రాంతాల మహిళలు కనీస వ్యక్తిగత విషయాల్లోనూ స్వేచ్ఛగా వ్యవహరించలేకపోతున్నారట. గ్రామీణ మహిళలు తమ కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోవడానికి అత్తల పెత్తనమే కారణమని బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అత్తల పెత్తనానికి కూడా వారిలోని పురుషాధిపత్య భావజాలమే కారణమని గుర్తించింది. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల మహిళలు పునరుత్పత్తి, కుటుంబ నియంత్రణ విషయాల్లో మెరుగ్గా ఉండడానికి వారికున్న సోషల్ మొబిలిటీ, సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండడమే కారణమని ఈ సర్వే పేర్కొంది. – న్యూఢిల్లీ కర్స్ ఆఫ్ ద మమ్మీజీ బోస్టన్ యూనివర్సిటీకి చెందిన మహేష్ కర్రా, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన కాటలీనా హెర్రేరా అల్మాంజా, బోస్టన్ కాలేజీకి చెందిన ఎస్.అనుకృతి, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రవీణ్ పాఠక్‌లు ‘కర్స్ ఆఫ్ ద మమ్మీజీ’(అత్తల కనుసన్నల్లో) పేరుతో పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. అధ్యయనంలో భాగంగా 2018లో ఉత్తరప్రదేశ్‌లో 18– 30 ఏళ్ల మధ్య వయస్సు గ్రామీణ వివాహితల ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. మహిళల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణపై సామాజిక సంబంధాల ప్రభావంపై ఈ అధ్యయనంలో గుర్తించిన కీలకాంశాలు.. ►గ్రామీణ స్త్రీ తన కుటుంబంలోని భర్త, అత్త కాకుండా సగటున తమ జిల్లాలోని 1.6 మంది వ్యక్తులతో మాత్రమే వ్యక్తిగత విషయాలను చర్చిస్తున్నారు. ►సగటున ఒకరికన్నా తక్కువ 0.7 వ్యక్తులతో వ్యక్తిగత, గోప్యతాంశాలపై మాట్లాడుతున్నారు. ►గ్రామీణ స్త్రీలలో 36 శాతం మందికి తమ ప్రాంతంలోని అన్ని రకాల విషయాలూ చర్చించుకోగలిగే ఒక్క సన్నిహిత వ్యక్తి కూడా లేరు. ►22 శాతం మందికి జిల్లాలోనే కాకుండా మరెక్కడా సన్నిహితమైన వ్యక్తులు లేరు. ►14 శాతం స్త్రీలకు మాత్రమే ఒంటరిగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు అనుమతి ఉంది. ►12 శాతం మంది స్త్రీలకు అదే గ్రామంలోని బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లే అనుమతి ఉంది. గ్రామీణ స్త్రీల సామాజిక సంబంధాలపై అత్తల ప్రభావం ఎక్కువగా ఉంది. కోడళ్లు కనీసం గడపదాటి బయటకు వెళ్లాలన్నా చాలా ఇళ్లలో అత్తల అనుమతి తప్పనిసరి. తమకున్న పరిమిత సన్నిహితుల రీత్యా వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ వారు చర్చించే అవకాశాల్లేవు. దీంతో పిల్లల్ని కనడం,, కుటుంబ నియంత్రణ విషయాల్లో కోడళ్ల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా అత్తల నిర్ణయాలే అమలవుతున్నాయి. ఆధునిక కుటుంబ నియంత్రణకు 21.4 కోట్ల మంది దూరం అత్తలతో కలిసి జీవించని స్త్రీలతో పోల్చుకుంటే అత్తలతో ఉండేవారు కుటుంబ నియంత్రణ కోసం 50 శాతం తక్కువగా ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. అత్తలతో జీవించడం వల్ల ఆధునిక గర్భనిరోధక పద్ధతులను అనుసరించేవారు 12.5 శాతం వరకు తగ్గారు. 2018 ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 21.4 కోట్ల మంది స్త్రీలు ఆధునిక కుటుంబ నియంత్రణా పద్ధతులను అవలంభించడం లేదు. పట్టణ స్త్రీలు సామాజిక సంబంధాలు, సామాజిక మాధ్యమాల కారణంగా ఈ విషయంలో గ్రామీణ స్త్రీల కంటే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. గ్రామీణ స్త్రీలు అత్తల కనుసన్నల్లో మెలగాల్సి రావడం వారి పునరుత్పత్తి హక్కులను ప్రభావితం చేస్తోంది. వీరు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లిగానీ, ఇతర కుటుంబ సభ్యులతోగానీ వ్యక్తిగత విషయాలను చర్చించే వేదికే కరువైన స్థితిలో వారు ఉన్నారు. పైపెచ్చు, సంతానోత్పత్తికి సంబంధించి పురుషుల్లో సమస్య ఉంటే, దాన్ని సైతం అత్తలు బయటపడకుండా గోప్యంగా ఉంచుతున్నారని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఎందుకీ ఆధిపత్యం? అత్తాకోడళ్ల మధ్య పరస్పర విరుద్ధ భావాలు ఈ అవరోధానికి కారణం. అయితే, ఇందుకు మూల కారణం మాత్రం అత్తల్లోని పురుషాధిపత్య ధోరణేనంటున్నారు అధ్యయనవేత్తలు. ఇవే అత్తల్లోని ఆధిపత్య ధోరణికీ, పెత్తందారీ పోకడలకీ, తమ మాటే చెల్లుబాటు కావాలనే మొండి పట్టుదలకు కారణాలని అధ్యయనం వెల్లడించింది. అత్తలతో లేని వివాహితలు చాలా విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. పురుషాధిపత్య భావజాలం ప్రభావంలో ఉన్న అత్తల ఆధిపత్యం యువతుల అభివృద్ధికి అడ్డుకట్టగా నిలుస్తోందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. -
‘అంతర’ వచ్చిందోచ్..!
సాక్షి, మంచిర్యాల: తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే దంపతులకు శుభవార్త. మాటిమాటికీ మందు బిల్లలను వాడడం, ఇతరత్రా పద్ధతులు వాడాల్సిన బాధ తప్పనుంది. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించే వారి కోసం గురువారం నుంచి జిల్లాలో కొత్త విధానానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నాంది పలికింది. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తి ఉచితంగా.. ఎలాంటి సైడ్ఎఫెక్ట్ లేని ‘అంతర’ ఇంజిక్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. జాయింట్ కలెక్టర్ వై.సురేందర్‌రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భీష్మ, అంతర ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ నీరజ జిల్లాకేంద్ర ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంచిర్యాల పట్టణానికి చెందిన నగునూరి సౌజన్య, యాదగిరి దంపతులకు కవల పిల్లలు పుట్టగా.. మూడేళ్ల వరకు తాత్కాలిక గర్భనిరోధక మందులు వాడాలని వైద్యులు సూచించారు. మొదటి ఇంజిక్షన్‌ను సౌజన్యకు వేసి జిల్లాలో అధికారికంగా ఈ అంతర ఇంజక్షన్‌ను ప్రారంభించారు. నూతన జంటలకు ఎడం కావాల్సిన వారికి ఈ ఇంజక్షన్ ఒక వరంగా మారనుంది. అంతర అంటే... తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే వారి కోసం ఈ ఇంజిక్షన్‌ను రూపొందించారు. గతంలో ఉన్న కుటుంబ నియంత్రణ, యూఐడీ పద్ధతుల స్థానంలో ఈ నూతన విధానం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా పెళ్లయిన వారితో పాటు, పిల్లల మధ్య ఎడం (ఎక్కువ సమయం తీసుకోవడం) కోరుకునే దంపతులకు అంతర ఇంజిక్షన్‌ను ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఇంజిక్షన్ తీసుకున్న మూడు నెలల వరకు గర్భం రాకుండా నిరోధించవచ్చు. ఈ తర్వాత కూడా పిల్లలు వద్దు అనుకుంటే మళ్లీ ఇంజిక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు కావాలని అనుకుంటే ఇంజిక్షన్ ఆపేసిన మూడు నెలల తర్వాత గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. సులువైన, మేలైన పద్ధతి.. కొత్తగా పెళ్లయిన దంపతులు.. పిల్లల మధ్య ఎడం కావాల్సిన వారికి ఇది చాలా సులువైన, మేలైన తాత్కాలిక పద్ధతి. తాత్కాలిక కుటుంబ నియంత్రణ కోసం పాటించే పాత పద్ధతులతో చాలా సైడ్ ఎఫెక్ ఉండేవి. కుటుంబ నియంత్రణ పద్ధతులు కొన్నిసార్లు విఫలమై గర్భం దాల్చే అవకాశముండేది. మరికొన్ని పద్ధతులు పాటించడం ద్వారా ప్రాణాల మీదకు వచ్చేవి. ఇలాంటి వాటికి అవకాశం లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘అంతర’ ఇంజిక్షన్‌ను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజిక్షన్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అమలు చేశారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రమంతా అమలు చేసేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని వేదికగా తీసుకున్నారు. అంతర ఇంజిక్షన్ తీసుకునే మహిళలకు సంబంధిత ఆరోగ్య కేంద్రం సిబ్బంది హెల్త్‌కార్డు కేటాయిస్తారు. అందులో ఇంజిక్షన్ వివరాలు నమోదు చేస్తారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజిక్షన్ అందుబాటులో ఉంటుంది. రూ.1500 విలువైన ఈ ఇంజిక్షన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వేస్తారు. పూర్తయిన శిక్షణ అంతర ఇంజిక్షన్ వినియోగానికి సంబంధించి జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలకు, ఇతర సిబ్బందికి జిల్లాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ సమయంలో అంతర ఇంజిక్షన్కు సంబంధించి విధి విధానాలు, ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోజనాలను వివరించారు. ప్రయోజనాలు ఇవే... అంతర ఇంజిక్షన్ వినియోగంతో మూడు నెలల పాటు గర్భం దాల్చే అవకాశముండదు. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇంజిక్షన్ మానేస్తే సరిపోతుంది. పెళ్లయిన కొత్తలోనే గర్భం దాల్చడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తి మాతా శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నిరోధించడానికి ‘అంతర’ ఉపయోగపడుతుంది. మహిళలు చిన్న వయస్సులోనే పిల్లలు కనడం వల్ల రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు ‘అంతర’ తోడ్పడుతుంది. అనవసరమైన వైద్య చికిత్సలు, గర్భ నిరోధానికి వాడే పద్ధతుల వల్ల మహిళలకు ఇతర సైడ్ ఎఫెక్టŠస్ ఉండేవి. ఈ నూతన విధానం వల్ల ఇలాంటి వాటికి అవకాశముండదు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉంచాం మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘అంతర’ ఇంజిక్షన్లను అందుబాటులో ఉంచాం. ఉచితంగా ఈ ఇంజిక్షన్‌ను మెడికల్ ఆఫీసర్లు వేస్తారు. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ కూడా పూర్తయ్యింది. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి విధానంలో ‘అంతర’ ఇంజిక్షన్ ఎంతో సురక్షితమైంది. ఇంజిక్షన్ వేసే ముందు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, మహిళ హెల్త్ కండీషన్ ఆధారంగానే వేస్తాం. - డాక్టర్ నీరజ, అంతర ప్రోగ్రాం జిల్లా అధికారి -
డాక్టర్ మెడపట్టి గెంటివేశాడని ఏఎన్ఎం ఆవేదన
నెల్లూరు, వెంకటగిరి: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం బాలింతలను తీసుకువచ్చిన ఏఎన్ఎంపై కమ్యునిటీ హెల్త్‌సెంటర్ వైద్యాధికారి అనుచితంగా ప్రవర్తించడంతో సోమవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి మండలంలోని ఇలగనూరు వైద్యారోగ్య కేంద్రం పరిధిలో జ్యోతి అనే మహిళ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె ప్రతి సోమవారం బాలింతలకు వెంకటగిరి సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుంటుంది. ఈ క్రమంలో నలుగురు బాలింతలను ఆపరేషన్‌కు సిద్ధంచేసి ఆదివారం సీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. సోమవారం ఉదయం శ్రీనివాస్ ఆస్పత్రిలో మరో గైనకాలజిస్ట్ సెలవుపై వెళ్లారని, ఆపరేషన్లు నిర్వహించడంలేదని జ్యోతికి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆమె తన ఏరియా పరిధిలోని బాలింతలకు ఆ సమాచారం చేరవేశారు. అయితే అప్పటికే ఇద్దరు బాలింతలు ఆస్పత్రికి చేరుకోగా మరో ఇద్దరు మార్గమధ్యలో ఉన్నారు. కాగా జ్యోతి తను విధులు నిర్వర్తించే ఎంపేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది. తోటి ఏఎన్ఎంల ద్వారా వెంకటగిరి ఆస్పత్రిలో కు.ని ఆపరేషన్లు చేస్తున్నారని తెలుసుకుంది. తన ఏరియా పరిధిలోని బాలింతలకు మాత్రం ఎందుకు నిరాకరించారో తెలసుకుందామని ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఎనిమిది మందికి ఆపరేషన్లు చేసేందుకు సిద్ధం చేస్తున్న వైద్యుడు శ్రీనివాస్ వద్దకు వెళ్లి మాట్లాడింది. తాను తీసుకువచ్చిన బాలింతలకు ఎందుకు ఆపరేషన్లు నిర్వహించడం లేదని అడిగింది. గిరిజన, దళితవర్గాలకు చెందిన బాలింతలు వ్యయప్రయాసలతో ఆస్పత్రికి వస్తే తిరిగి పంపడం ఏంటని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీనివాస్ కు.ని ఆపరేషన్లు అత్యవసర సేవలా?, గురువారం చేస్తాం. అప్పుడు బాలింతలను తీసుకురావాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేస్తే అందరికీ చేయాలని, లేకుంటే వాయిదా వేయాలని తాను అనడంతో ఆగ్రహానికి గురైన డాక్టర్ మెడపట్టి గెంటివేశాడని ఏఎన్ఎం జ్యోతి విలపిస్తూ అక్కడున్న బాలింతలకు చెప్పింది. విషయం తెలుసుకున్న ఏఎన్ఎం బంధువులు, కొందరు బాలింతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్యుడు శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈనేపథ్యంలో డాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఎస్సై నాగయ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఇరువర్గాలతో మాట్లాడారు. డాక్టర్ ఏఎన్ఎంకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. గతంలోనూ వివాదాలు వైద్యాధికారి శ్రీనివాస్ వ్యవహారశైలిపై గతంలోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాన్ భార్యకు ఆస్పత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయగా వేసిన కుట్లు ఊడిపోయాయి. దీనిపై ప్రశ్నించిన జాన్‌తో వివాదం జరిగింది. పోస్టుమార్టం కేసుల్లో జాప్యం జరుగుతున్న వైనంపై బంధువులతో వివాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. రెండురోజుల క్రితం వెంకటగిరి పరిధిలో జరిగిన ఓ మహిళ హత్యకేసులో స్థానికంగా శవపరీక్ష చేయకపోవడంతో పోలీసులు నెల్లూరుకు వెళ్లాల్సి వచ్చింది. -
'కుని'కిపాట్లు..!
కుటుంబ నియంత్రణ పట్టని వైద్య, ఆరోగ్య శాఖ.. మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,500 స్త్రీలకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,000 సాక్షి, హైదరాబాద్: దేశానికి అతి పెద్ద సవాలు.. జనాభా పెరుగుదల. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ (కు.ని.)కోసం పలు చర్యలు చేపట్టారు. అవగాహన, ప్రోత్సాహకాలతో పాటు దీని పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ శాఖ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. గత మూడేళ్లుగా దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. గతంలో ఏటా జిల్లాలవారీగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రణాళిక సిద్ధం చేసి.. ఆయా జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించేది. ప్రస్తుతం లక్ష్యాలను సైతం నిర్దేశించే పరిస్థితి లేకుండాపోయింది. ఎవరైనా సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయించడమేగానీ.. శాఖాపరంగా పర్యవేక్షణ ఉండటంలేదు. దీంతో మూడేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఏడు జిల్లాల్లోనే.. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. మిగిలిన నిధులతో పోల్చితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాల నిధులను ముందుగానే విడుదల చేస్తోంది. గత ఏడాది వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు, వైద్య సిబ్బందికి కలిపి రూ.1,500, అదే మహిళ అయితే ఆమెకు సిబ్బంది కలిపి అయితే రూ.వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని శస్త్రచికిత్స చేయించుకున్న వారికే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయినా రాష్ట్రంలో శస్త్రచికిత్సలు బాగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, వికారాబాద్, యాదాద్రి భువనగరి జిల్లాల్లోనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు వైద్య శాఖ తాజా నివేదికలో పేర్కొన్నాయి. పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో మాత్రమే పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నమోదయ్యాయి. ఈ ఏడాది 112 మంది పురుషులు మాత్రమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారని నివేదికలో వెల్లడైంది. -
అక్కడికొచ్చేసరికి భయమంటాడు..
అంతంటాడు.. ఇంతంటాడు.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు మగాళ్ల వెనకడుగు - ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్న మహిళలు 75 శాతం - వేసెక్టమీ చేయించుకుంటున్న మగాళ్లు 0.62 శాతమే మగాడు.. కోరమీసమున్న మగాడు.. అన్నింటా ముందుంటానంటాడు.. అంతంటాడు.. ఇంతంటాడు.. అక్కడికొచ్చేసరికి మాత్రం అమ్మో.. భయమంటాడు.. కుటుంబ నియంత్రణ విషయానికొచ్చేసరికి మగాడు ముందుండనంటున్నాడు.. అనేక అపోహల బారిన పడి.. తూచ్ అంటున్నాడు. అప్పట్లోనే కాదు.. ఇప్పటి హైటెక్ పురుషులదీ అదే బాట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015ృ16 గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నా యి. ‘‘చిన్నకుటుంబం.. చింతలేని కుటుంబం..’’ కుటుంబ నియంత్రణపై ప్రచారం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన నినాదం ఇది.. ఒకవైపు పెరిగిపోతున్న దేశ జనాభా.. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు.. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణకు సర్కారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో చాలా జంటలు.. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సిద్ధమవుతున్నాయి. కానీ.. ఒక కుటుంబంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించు కోవాల్సింది ఎవరు..? మా మూలుగా అయితే మగాళ్ల యినా.. ఆడ వాళ్లయినా ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే వాస్తవంలో జరుగు తోంది వేరు.. కుటుంబ నియంత్రణ అంటే ఆడవాళ్లకే పరిమితం అనే ధోరణి మన దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అధికారిక గణాం కాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గర్భ నిరోధానికి సంబంధించిన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను చేయించుకుంటున్న మహి ళలు 75 శాతానికి పైనే. ఫ్యామిలీ ప్లానింగ్ చేయిం చుకుంటున్న మగాళ్ల సంఖ్య 0.62 శాతమే. పదేళ్ల నాటి కంటే తక్కువగా.. పదేళ్ల క్రితం 1శాతం ఉన్న మగాళ్ల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్య ఇప్పుడు 0.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఈ సంఖ్య మగాళ్లలో గర్భ నిరోధక ఆపరేషన్ల పట్ల ఉన్న నిరాసక్తతను స్పష్టం చేస్తోంది. దీనికి అనేక కార ణాలు ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక, గర్భ నిరో ధానికి సంబంధించి అవగాహన లేకపోవడం.. కుటుంబ నియంత్రణ పద్ధతులపై పరిజ్ఞానం లేకపోవడం.. మూఢ నమ్మకాలు.. దురభిప్రా యాలు.. అన్నిటికన్నా ఎక్కువగా.. ఇది చేయిం చుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని భయపడటం. వాస్తవానికి మహిళలతో పోలి స్తే.. కుటుంబ నియంత్రణకు అత్యంత సురక్షి తమైన పద్ధతి వేసెక్టమీ. సులువైనది.. త్వరిత గతిన పూర్తయ్యేది. ఎటువంటి సైడ్ ఎఫెక్టస్ లేనిది. ృ సాక్షి, తెలంగాణ డెస్క్ ఎటు చూసినా ఇదే తీరు.. ప్రపంచవ్యాప్తంగా కూడా వేసెక్టమీ చేయించుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. 2.4 శాతం మందే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అమెరికాలో 10.8 శాతం.. కెనడాలో 21.7 శాతం బ్రిటన్‌లో 21 శాతం మంది వేసెక్టమీ చేయించుకుంటున్నారు. మన పొరుగుదేశాల విషయానికి వస్తే.. భూటాన్ 12.8 శాతం.. నేపాల్‌లో 4.8 శాతం మంది వేసెక్టమీ చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌లో పురుషులే ఎక్కువగా పాల్గొనాలని, ఇందుకోసం భారీ స్థాయిలో చర్యలు తీసుకోవాలని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా చెపుతున్నారు. భాగస్వామి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి మగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు రావాలని.. కుటుంబ నియంత్రణ వంటి నిర్ణయాల్లో భార్యలను కూడా భాగస్వాములను చేయాలని ఆమె సూచించారు. -
పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు
-
కబూతర్ జా..జా..జా
భారీగా పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు ⇒ జంట నగరాల్లో జయశంకర్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి ⇒ ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణం ⇒ పలు రకాల వైరస్‌లూ విస్తరించే ప్రమాదం ⇒ చర్మ సంబంధిత వ్యాధులూ వచ్చే అవకాశం ⇒ వాటి రెట్టల కారణంగా అపరిశుభ్రత, దుర్వాసన ⇒ జంట నగరాల్లో సుమారు 5 లక్షల కపోతాలు ⇒ పావురాల సంతతి బాగా పెరగడంతో ఇతర పక్షులకు ప్రమాదం ఒహోహో.. పావురమా.. అంటూ ఒకప్పుడు పాటలు పాడుకునేవారు.. వాటితో ప్రేమ లేఖలూ పంపుకొనేవారు.. తెల్లని పావురాలను శాంతికి చిహ్నంగానూ భావిస్తారు. వాటికి దాణా పెడితే చనిపోయిన మన పెద్దల ఆత్మలు సంతృప్తి చెందుతాయనేదీ కొందరి నమ్మకం. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం పావురాలు అశాంతి రేపుతున్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు, కొన్ని రకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు వేసే రెట్టతో అపరిశుభ్రత, దుర్వాసన నెలకొని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ రామారావు విశ్రాంత ఉన్నతాధికారి.. ఆయన మనవరాలు కొంత కాలంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఓరోజు వారి ఇంటికి వచ్చిన స్నేహితుడైన వైద్యుడు ఆ అమ్మాయి బెడ్రూమ్ పరిసరాలు గమనించి.. ఆ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో పావురాలు ఉండటమే ఆస్తమాకు కారణమని తేల్చారు. పావురాలు అక్కడ ఉండకుండా చేయాలని సూచించారు. అలా చేయడంతో మూడు నెలల్లోనే ఆ అమ్మాయి కోలుకుంది. దుమ్ము, కాలుష్యం వంటివి ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పావురాలూ ఈ సమస్యకు కారణమవుతున్నాయి. సాధారణంగా పావురాల రెట్టల వల్ల ఇంటి గోడలు, పైకప్పు పాడవుతున్నాయన్న ఫిర్యాదులేగాని.. వాటి వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందన్న సంగతి చాలామందికి తెలియడం లేదు. జంట నగరాల్లో భారీ సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు అపార్ట్మెంట్లు, ఇతర భవనాలను ఆవాసాలుగా మార్చుకుని.. జనానికి అతి దగ్గరగా మసులుతున్నాయి. దాంతో పావురాల రెక్కల నుంచి వచ్చే ధూళి, రెట్టల్లోని అవశేషాలు ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. కిటికీలు, వెంటిలేటర్లలో మసలే పావురాల నుంచి వ్యాధికారక పదార్థాలు ఇళ్ల గదుల్లోకి చేరుతున్నాయి. ఇటీవల మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి కూడా వైద్యులు ఇదే తరహా సూచనలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడటానికి పావురాలే కారణమని తేలింది. లక్షల సంఖ్యలో పావురాలు కబూతర్ ఖానా.. కుతుబ్‌షాహీల కాలంలో పాత నగరంలో ఏర్పాటైన పావురాల కేంద్రం. 300 గూళ్లతో ఉండే ఆ నిర్మాణంలో వందల సంఖ్యలో కపోతాలు ఉంటాయి. జనం వాటికి తిండి గింజలు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి పావురాల కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, మొత్తంగా ఎన్ని పావురాలు ఉంటాయనే విషయాన్ని తేల్చేందుకు జయశంకర్ విశ్వవిద్యాలయంలోని పక్షి శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో కొంత కాలంగా అధ్యయనం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం జంట నగరాల్లో 490 చోట్ల పావురాలకు తిండి గింజలు వేసే కేంద్రాలు వెలిశాయి. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్కో చోట 200 నుంచి 15 వేల వరకు పావురాలు ఉంటున్నాయి. మొత్తంగా జంట నగరాల్లో దాదాపు 5 లక్షల వరకు పావురాలు ఉన్నట్లు అంచనా. వైరస్, పురుగులు విస్తరించే ప్రమాదం ‘‘పావురాలకు తిండి గింజలు వేసి ఆనందించటం సహజం. కానీ అవి మనకు దగ్గరగా మసలుతుండటంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది ప్రమాదకరమే..’అని వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగాధిపతి వాసుదేవరావు తెలిపారు. పావురాలను ఓ రకమైన నల్లుల వంటి పురుగులు ఆశ్రయిస్తు న్నట్టు తేలింది. పావురాలు ఇళ్ల కిటికీలు, వెంటిలేటర్ల వద్ద ఉన్నప్పుడు అక్కడ పడే పురుగులు.. తర్వాత ఇళ్లలోకి చేరుతున్నాయి. దీంతో పావురాల నుంచి ప్రమాదకర వైరస్ మనుషుల్లోకి చేరే ప్రమాదం ఉందని వాసుదేవరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది వ్యాధులు విస్తరించేందుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఇక చర్మ సంబంధిత వ్యాధులకూ పావురాలు కారణమవుతున్నాయని పలు వురు వైద్యులు చెబుతున్నారు. విమానాలకూ తప్పని ముప్పు... ఎగురుతున్న విమానాలను పక్షులు ఢీకొంటే విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్న సంగతి తెలిసిం దే. ఆ ప్రమాదమే కాదు శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త సమస్య కూడా వచ్చిపడింది. విమానాలు నిలిపేందుకు, మరమ్మతులు చేసేందుకు విమానాశ్రయంలో భారీ హ్యాంగ ర్స్ (షెడ్లు లాంటివి) ఉంటాయి. వంద అడుగుల వరకు ఎత్తుండే ఆ హ్యాంగర్స్పై పావురాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి పావురాలు వేసిన రెట్టలు విమానాలపై పడి కొత్త సమస్యకు కారణమైంది. వాటి రెట్టల్లో ఆమ్ల అవశేషాలుంటాయి. రెట్ట ఎక్కువసేపు విమా నంపై ఉంటే ఆ ప్రాంతంలో మచ్చలేర్పడతాయి. అవి చిన్నపాటి రంధ్రాలకు కారణమై విమానాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయం హ్యాంగర్స్లో పావురాల నిరోధాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. నాణ్యతలేని గింజలతో.. కొందరు పురుగుపట్టిన, ముక్కిన, తడిసి బూజుపట్టిన, పాడైన గింజలను తక్కువ ధరకు సేకరించి పావురాల కేంద్రాల వద్ద అమ్ముతున్నారు. ప్రజలు వాటిని కొని వేస్తుండడంతో పావురాలకు రోగాలు వస్తున్నాయి. అలా కొన్ని సందర్భాల్లో ఇళ్లలోని కిటికీ సందులు, పైకప్పుల్లో చనిపోతున్నాయి. ఇది కూడా అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులకు కారణమవుతోంది. గింజలు వేయటం మానుకోవాలి పక్షులను ఆదరించటం జీవవైవిధ్యానికి ఎంతో అవసరమేనని, పక్షులకు గింజలు వేసినంత మాత్రాన వాటిని ఆదరించినట్టు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇళ్ల పైకప్పులపై పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేస్తే సరిపోతుందని, గింజలు వేయవద్దని సూచిస్తున్నారు. గింజలు దొరకకుంటే పక్షులు వాటికి సహజమైన వేటకు వెళ్లిపోతాయని.. అది పక్షులకు, ప్రజల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. ఇతర పక్షులకూ ప్రమాదం తిండి గింజలకు అలవాటు పడిన పావురాలు వాటి సహజ గుణాలను వదిలేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయమే వేటకు వెళ్లడం పక్షుల లక్షణం. కానీ ప్రజలే తిండి గింజలు వేస్తుండడంతో పావురాలు ఆహారం కోసం వెళ్లకుండా.. ఒకే చోట ఉంటున్నాయి. ఈ క్రమంలో తమ తిండికి పోటీ రాకుండా ఇతర రకాల పక్షులను తరిమేస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇక లక్షల సంఖ్యలో పావురాలు పెరిగిపోతుండడంతో.. నగర శివారు ప్రాంతాలకు, గ్రామాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిచ్చుకలు, కాకులు, చిలుకలు ఇతర పక్షులను తరిమివేస్తున్నాయి. దాణా కోసం రూ.50 కోట్లు! సగటున ఒక్కో పావురం రోజుకు 22 గ్రాముల వరకు గింజలు తింటాయని అంచనా. పావురాల కోసం ఏర్పాటు చేసే కేంద్రాల వద్ద రూ.10, రూ.20 చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో గింజలు అమ్ముతున్నారు. జనం, సందర్శకులు వాటిని కొని పావురాలకు వేస్తున్నారు. దాంతో పావురాల సంఖ్య బాగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న పావురాలకు పెడుతున్న గింజల కోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్లు అధ్యయన బృందం అంచనా వేసింది. పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్! సంతానోత్పత్తి నియంత్రణకు బీఎంసీ యోచన భాగ్యనగరంలోనే కాదు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ పావురాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ పావురాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో వాటి రెట్టలు, ఇతర అవశేషాల వల్ల ఆస్తమా.. క్షయా తదితర వ్యాధుల బారి న ప్రజలు పడుతున్నారు. ముంబైలోని ప్రతి పది ఆస్తమా కేసుల్లో ఒకటి పావురాల వల్ల వచ్చిందే. ముఖ్యంగా చిన్నారుల్లో ఈసమస్య అధికంగా ఉంది. ముంబై అనేకాదు.. పుణే, థానే తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రంగంలోకి దిగాల్సి వచ్చింది. పావురాల సంఖ్యను నియంత్రణకు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేందుకు సిద్ధమవుతోం ది. దశాబ్దం క్రితం వీధి కుక్కలకు సంతా నోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన మాదిరిగానే ఇప్పుడు పావురాలకు కూడా చేయాలని యోచిస్తోంది. తొలుత ఈ ప్రతి పాదనను ఓ ముంబై కార్పొరేటర్ తెరపైకి తెచ్చారు. ఓవిస్టాప్ అనే సంతానోత్పత్తి నియంత్రణ ఔషధం సహాయంతో బీఎంసీ పావురాల విస్ఫోటనాన్ని అరికట్టవచ్చని ఆయన చెపుతున్నారు. ఈ పద్ధతి ప్రకారం.. పక్షుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే నికర్ బాజిన్‌తో మిళితమై మొక్కజొన్న విత్తనాల తో కూడిన ఓవిస్టాప్ ఔషధాన్ని పావురాలకు ఆహారంగా వేస్తారు. ఈ పిల్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్పెయిన్‌లో ని ఒక పట్టణంలో ఇలాగే పావురాల సంతా నోత్పత్తిని నియంత్రించారని, ఈ పిల్ వినియోగంతో వాటి సంఖ్య 80 శాతం తగ్గిందని సదరు కార్పొరేటర్ చెపుతున్నారు. కేంద్రానికి ప్రతిపాదన.. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే బీఎంసీ ఆరోగ్య కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి అను మతి కోసం మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఈ ప్రతిపాదనను పంపించింది. ఇది తమ పరిధిలో లేదని, రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) డైరెక్టర్ చేతిలో ఉందని, దీని అమలుకు అంగీకరించాలని తాము ఎఫ్డీఏని కోరినట్టు ఒక బీఎంసీ అధికారి వెల్లడించారు. దీన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు పంపింది. ఈ పిల్ స్వదేశంలో లభించదు. దిగుమతికి డీసీజీఐ అనుమతి తప్పనిసరి. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
17 మంది పిల్లలకు జన్మనిచ్చాక..
అహ్మదాబాద్: నేటి సమాజంలో చాలామంది ఒకరు లేదా ఇద్దరు బిడ్డలు కావాలని కోరుకుంటారు. గుజరాత్లో మాత్రం ఓ దంపతులు ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో 16 మంది కుమార్తెలు కాగా, ఓ కొడుకు ఉన్నాడు. గ్రామస్తులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. గుజరాత్‌లోని దహోడ్ జిల్లా జరిబుజర్గ్ గ్రామంలో రామ్ సిన్హ్ (44), కను సంగోత్ (40) అనే దంపతులు నివసిస్తున్నారు. కొడుకు కావాలనే కోరికతో ఇంతమంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వీరికి వరుసగా ఆడపిల్లలు పుట్టారు. 2013లో ఓ మగబిడ్డ జన్మించాడు. కాగా మరో కొడుకు కావాలన్న వారి కోరిక నెరవేరలేదు. 2015, 2016లో ఆడపిల్లలు పుట్టారు. చివరకు గ్రామస్తులు వారికి నచ్చజెప్పడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు అంగీకరించారు. 16 మంది ఆడపిల్లల్లో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి వివాహం కాగా, ఇద్దరు ఉపాధికోసం రాజ్‌కోట్ వెళ్లారు. వృద్ధాప్యంలో బాగోగులు చూసుకునేందుకు కొడుకు అవసరమని, కొడుకు కావాలని కోరుకుంటే చాలామంది ఆడపిల్లలు పుట్టారని రామ్ సిన్హ్ చెప్పాడు. రామ్ సిన్హ్ దంపతులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. -
సమయం కావాలి...
- పెళ్లయిన వెంటనే బిడ్డలు వద్దు అనుకుంటున్న మహిళలు - బిడ్డ బిడ్డకూ మధ్య కూడా గ్యాప్ కోరుకుంటున్నారు - దాని కోసం ఓరల్ పిల్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు - ‘కు.ని’ ఆపరేషన్ అంటే మగాళ్లకు భయం - సర్కారు తాజా గణాంకాల్లో వెల్లడి సాక్షి, అమరావతి: అత్యాధునిక వైద్య పద్ధతులు.. ఆధునిక జీవన విధానంతో పెళ్లరుున మహిళల ఆలోచనల్లోనూ మార్పువస్తోంది. గర్భధారణ విషయంలో అది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పాత పద్ధతులను కాదని.. తాత్కాలిక పద్ధతులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల్లో స్పష్టమైంది. గతంలో పెళ్లరుున మూడేళ్లలో ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం, ఆ వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేరుుంచుకోవడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఆ విధానానికి మహిళలు స్వస్తి పలికారు. పెళ్లరుున వెంటనే బిడ్డలను కోరుకోవడంలేదని, కొంత సమయాన్ని కోరుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని గణాంకాల్లో తేలింది. అంతేకాదు బిడ్డకూ బిడ్డకూ మధ్య సమయాన్ని కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డకు కనీసం నాలుగేళ్లు సమయం కావాలని కోరుకునే వారి సంఖ్య 50 శాతం పైనే ఉన్నట్టు తేలింది. పిల్స్ వాడకం ఎక్కువగా ఉంది పెళ్లరుున జంటలు వెంటనే సంతానం కలగకుండా ఉండటానికి, లేదంటే బిడ్డకూ బిడ్డకూ మధ్య సమయాన్ని కోరుకునే వారు ఎక్కువగా ఓరల్ పిల్స్ (మాత్రలను) ఆశ్రరుుస్తున్నారు. పెళ్లరుున జంటల్లో ఏటా సగటున 1.50 లక్షల మంది ఆ మాత్రలు వాడుతున్నట్టు తేలింది. ఇక సగటున లక్షా నలభై వేల మంది ఏటా నిరోధ్ను వాడుతున్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాల్లో స్పష్టమైంది. అమ్మో ఆపరేషనా.. కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లంటే మగాళ్లు తెగ భయపడిపోతున్నారు. అత్యాధునిక వైద్య పద్ధతుల్లో, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిముషాల వ్యవధిలోనే శస్త్రచికిత్స చేస్తున్నా సరే మగాళ్లు ముందుకు రావడం లేదు. కు.ని విషయంలో మహిళలతో పోల్చుకుంటే మగాళ్లు 0.7 శాతం కూడా లేరు. దీనికి కారణం చాలామంది మగాళ్లలో భయం ఉండటమే. పైగా చాలామంది మగాళ్లకు వ్యాసెక్టమీ ఆపరేషన్‌పై సరైన అవగాహన లేకపోవడంతో ఆడాళ్లనే ఆపరేషన్ చేరుుంచుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. -
ఆపరేషన్ వికటించి.. మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన భర్త మైసూరు: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన బుధవారం మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని గాయత్రిపురకు చెందిన శివకుమార్ భార్య ప్రతిభా(38) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మంగళవారం నగరంలోని కృష్ణమూర్తి నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకెళ్లిన శివకుమార్‌కు తన భార్య కనిపించకపోయే సరికి వైద్యలను ఆరా తీశాడు. ఆరోగ్యం విషమించడంతో కే.ఆర్.ఆసుపత్రికి తరలించామని బదులిచ్చారు. దీంతో కే.ఆర్.అసుపత్రికి వెళ్లిన శివకుమార్‌కు తన భార్య విగతజీవిగా కనిపించింది. వైద్యలను అడగ్గా ఇక్కడికి తీసుకొచ్చేలోపు ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. తన భార్య మృతికి వైద్యులే కారణమని, శస్త్ర చికిత్స చేసేటపుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని శివకుమార్ ఆరోపించారు. తన భార్య మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. -
కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్!
ఆగ్రా: స్వల్ప వ్యవధిలోనే కోతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వాసులకు సమస్యగా మారింది. పట్టణంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న దేవాలయాలు, భక్తుల ఉదార స్వభావం కోతుల పాలిట వరంగా మారింది. ఇప్పటికే పట్టణంలో సుమారు 8,000 కోతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని అలాగే వదిలేస్తే రానున్న ఆరేళ్లలో వీటి సంఖ్య 2.16 లక్షలకు చేరుతుందని అంచనా వేసిన.. అధికారులు, వైల్డ్ లైఫ్ ఎన్జీవోలు కోతుల్లో ఫ్యామిలీ ప్లానింగ్(కుటుంబ నియంత్రణ) అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 317 కోతుల్లో వ్యాక్సిన్ల ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్‌ను అమలు చేశారు. దీని ద్వారా రానున్న ఆరేళ్లలో 7,200 కోతుల సంఖ్య పెరగకుండా నిర్మూలించినట్లు వైల్డ్ లైఫ్ ఎన్జీవో 'ఎస్ఓఎస్' సహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ వెల్లడించారు. అయితే మరికొన్ని కోతుల్లో సైతం ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. రీసస్ మకాక్స్ సంతతికి చెందిన ఈ కోతుల్లో.. ప్రతీ ఆడకోతి 18 నెలలకు ఒకసారి మూడు పిల్లలకు జన్మనిస్తుందని తెలిపారు. -
‘కు.ని’ చేయించుకున్నాం.. ఒట్టు..
♦ ఆర్టీసీలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల దందా ♦ నకిలీ పత్రాలతో ఖజానాకు కన్నం సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంక్రిమెంటు... వారం రోజుల సెలవు.... ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను బాగా ఆకట్టుకొంటున్న అంశాలు. ఈ ‘డబుల్ బెనిఫిట్’ కోసం కొందరు ఉద్యోగులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నట్టు నకిలీ పత్రాలతో నమ్మిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రభుత్వ పర్యవేక్షణ పడకేయటం, ఎవరేం చేసినా అడిగేవారే లేకపోవటంతో ప్రస్తుతం ఎవరి ఇష్టం వారిదిగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తాజాగా వెలుగు చూసిన అడ్డగోలు వ్యవహారమిది. డొంక కదిలిందిలా... కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ సిబ్బందికి సంస్థ ప్రోత్సాహకాలను అందిస్తోంది. శస్త్రచికిత్స చేసుకున్న సమయంలో వారికి వారం రోజుల సెలవు, అదనంగా ఓ ఇంక్రిమెంటు జత చేస్తున్నారు. అర్హులైన వారు దీన్ని పొందుతుండగా, కొందరు దొడ్డిదారిన ఈ బెనిఫిట్లను సొంతం చేసుకోవటం తాజాగా వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం నిర్లిప్త ధోరణిని అలుసుగా చేసుకుని సిబ్బంది బోగస్ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తూ పలు రకాల బెనిఫిట్లు పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని పేర్కొంటూ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి జారీ చేసినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి విధులకు హాజరు కాకుండా అడ్డదారిలో సెలవులు పొంది సొంత పనులు చూసుకొంటున్నారు. ఆ కాలానికి ఠంచన్‌గా వేతనం పొందున్నారు. అలాగే కొందరు డ్రైవర్లు కష్టతరమైన డ్రైవింగ్ విధుల నుంచి తప్పుకుని అంతగా కష్టపడాల్సిన పనిలేని శ్రామిక్‌లాంటి పనులు చేసుకునేలా తప్పుడు అన్‌ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. శ్రామిక్‌లాంటి అతి తక్కువ వేతనం ఉండే పోస్టులో ఉంటూ డ్రైవర్ స్కేలు ప్రకారం వేతనం పొందుతున్నారు. అన్ని డిపోల్లో విజిలెన్స్ తనిఖీలు... ఎవరేంచేసినా చెల్లిపోతున్న నేపత్యంలో కొందరు ‘కు.ని.’ ఆపరేషన్లను అవకాశంగా చేసుకున్నారు. ఈక్రమంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో కొందరు సిబ్బంది అక్రమంగా బెనిఫిట్లు పొందారంటూ ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఒకే ఆసుపత్రి పేరుతో జారీ అయిన పత్రాలను తనిఖీ చేశారు. అవి నకిలీవని తేలడంతో సదరు సిబ్బందిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరందరికీ అదే డిపోలో పనిచేసే ఓ డ్రైవర్ ఆ నకిలీ పత్రాలు జారీ చేయించినట్టు పోలీసు దర్యాప్తులో తేలటంతో అతడిని అరెస్టు చేశారు. అప్రమత్తమైన యాజమాన్యం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో తనిఖీ చేసేందుకు విజిలెన్సు విభాగాన్ని రంగంలోకి దింపింది. ఇందులో చిత్రవిచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు 15-20 ఏళ్ల వయస్సు పిల్లలున్నవారు కూడా ఇప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నట్టు పత్రాలు దాఖలు చేస్తున్నారని, గతంలోనే ఆ చికిత్స చేయించుకున్నవారు ఇప్పుడు చేయించుకున్నట్టు పేర్కొంటున్నారని తేలినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ విచారణ సాగుతోంది. రెండేళ్లుగా దాఖలైన పత్రాలన్నింటినీ పరిశీలించి నకిలీల నివేదిక అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది. -
'ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి'
విజయవాడ: నేటి తరం కుటుంబ నియంత్రణ పద్ధతులను పక్కన పెట్టి.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో శనివారం క్రీడా అవగాహణ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంఖ్య తగ్గుతోందని... రాష్ట్రంలో కూడా జనాభా పెరగాల్సిన అవసరముందన్నారు. కుటుంబ నియంత్రణను పద్ధతులను పక్కనపెట్టి పిల్లలను కనాలని బాబు చెప్పారు. స్కూల్ స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి క్రీడలపై అవగాహన క్యాలెండర్ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. రెండు నెలల కిందట చంద్రబాబు కాపు రుణమేళా సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో జనన మరణాల రేటు సమానంగా ఉంది. దీంతో రాబోయే కాలంలో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని.. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు చెప్పారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి సంతరించుకున్నాయి. -
కు.ని. పరే షాన్
చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు అవస్థలు పడ్డారు. డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో శుక్రవారం చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాలకు చెందిన 104 మంది మహిళలు ఆపరేషన్లకు హాజరయ్యారు. కాగా.. వీరిలో ఇద్దరు వివిధ కార ణాలతో వెనక్కివెళ్లగా.. 102 మంది ఆపరేషన్లు నిర్వహించారు. అయితే ఆస్పత్రి 25 పడకలే కావడంతో కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు నేలపైనే పడకున్నారు. వీరికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం గమనార్హం. - చేవెళ్ల రూరల్ -
15వ కాన్పులో అబ్బాయి..!
అయినా సంతృప్తి పడని గుజరాతీ జంట 16వ సారి గర్భం ధరించిన కానూ సంగోద్ వడోదర: పుత్రసంతానం కోసం తపించి పోయే భారతీయ దంపతుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. తమకు మగపిల్లాడు పుట్టాలనే కోరికతో పూజలు చేస్తూ, మొక్కుబడులు పెట్టుకునే వాళ్ల దగ్గర నుంచి ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యకు పాల్పడే వాళ్లు, పుట్టాకా పసిపాపను వదిలించుకునే వాళ్లు కూడా అనునిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మరి అలాంటి వారికి భిన్నంగా పుత్ర సంతానం తపనలో ఏకంగా 14 కాన్పుల్లో 14 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఈ గుజరాతీ మహిళ. పిల్లాడు పుట్టే వరకూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరించిన ఆ భార్యాభర్తల పేర్లు కానూ సంగోద్, రామ్సిన్హా. గుజరాత్‌లోని ఝరీభుజ్హీ అనే ఒక మారుమూల గ్రామానికి చెందిన వీళ్ల కథ ఆసక్తికరంగా ఉంది. 20 యేళ్ల కిందట వీళ్ల వివాహం జరిగింది. అప్పటి నుంచి వీళ్ల తపన, ఇంట్లో వాళ్ల కోరిక ఒకటే... తొలి కాన్పులోనే అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. అయితే అది జరగక పాప పుట్టింది. తనకు సారంగన అని పేరు పెట్టుకున్నారు. రెండోసారి అయినా బాబు అనుకుంటే.. మళ్లీ పాప. అయినా వీళ్లు రాజీపడలేదు. అలా ఒకసారి కాదు. ఆ తర్వాత పన్నెండు సార్లు కానూ గర్భం దాలిస్తే ప్రతిసారీ అమ్మాయే పుట్టింది. ‘చివరకు దేవుడు మా ప్రార్థనను ఆలకించాడు...’ 15 వ ప్రసవం తర్వాత కానూ, రామ్ దంపతుల మాట ఇది. రెండేళ్ల క్రితం కానూ ఒక బాబుకు జన్మనిచ్చింది. ఈ విజయానికి గుర్తుగా వారు తనకు ‘విజయ్’ అని పేరు పెట్టుకుని మురిసిపోయారు. అయితే సంతృప్తి మాత్రం లేదు. మరో అబ్బాయి పుడితే బాగుంటుందనే కోరిక... కానూ ఇప్పుడు మళ్లీ గర్భవతి. ఈసారి మరో అబ్బాయి పుడతాడు అనే ఆశాభావంతో ఉన్నారు ఆ దంపతులు. కుటుంబ నియంత్రణ అనేదాన్ని ఏ మాత్రం ఖాతరు చేయని ఈ దంపతుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తమ 14 మంది అమ్మాయిల్లో ఐదుమందినే వీళ్లు స్కూల్‌కు పంపుతున్నారు, మిగిలిన వాళ్లు వ్యవసాయపనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. తాము గిరిజన జాతికి చెందిన వాళ్లం అని.. తమ కుటుంబాల్లో అబార్షన్ నిషిద్ధమని దీంతో అబ్బాయి కోసం తపనలో ఇలా జరిగిపోయిందని కానూ దంపతులు చెబుతున్నారు. అయితే కుటుంబ పోషణ చాలా భారమైందని కూడా పెద్దకుటుంబంతో ఉండే బాధలను ఏకరువు పెడుతున్నారు. -
ఫ్యామిలీ ‘ప్లానింగ్’
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడంలో మన జిల్లా ముందువరుసలో నిలిచింది. నూటికి నూరుశాతం శస్త్రచికిత్సలు నిర్వహించి తన సత్తా చాటుతూ వస్తోంది. గతంలో వరుసగా ఏకంగా పదమూడు సంవత్సరాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న ఘనత జిల్లాకే దక్కింది. అదే రీతిలో మూడేళ్లుగా లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తూ జిల్లాకు పూర్వవైభవాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకువస్తోంది. నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో రాష్ట్ర స్థాయిలో 2012-13 సంవత్సరంలో అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత ఉత్సాహంతో పనిచేస్తూ వస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 24 వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించగా 24,045 ఆపరేషన్లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు దక్కించుకుంది. అదే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అవార్డును పొందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత రెట్టింపు ఉత్సాహంతో మార్చి 31 నాటికి 22,050 శస్త్ర చికిత్సలను నిర్వహించి నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను చేసిన ఘనతను సాధించిన జిల్లాల జా బితాలో చేరింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో పాటు సంబంధిత అధికారులు ప్రతి నెలా మండలా ల వారిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సమీక్షలను నిర్వహించిన కారణంగానే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. అదే స్ఫూర్తితో పనిచేసిన సిబ్బంది తిరిగి జిల్లాను మూడోసారి కూడా ల క్ష్యానికి మించి శస్త్రచికిత్సలను చేసిన జిల్లాల జాబితాలో చేర్చారు. గతంలో కూడా కుటుంబ నియంత్రణలో జిల్లా 1993-94 ఆర్థిక సంవత్సరం నుంచి 2005-06 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా 13 సంవత్సరాలు నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో వరసగా అవార్డులను సాధించిన ఘనత వైద్య ఆరోగ్య శాఖకు ఉంది. కుటుంబ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులే ప్రజలలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులకు తోడు కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా జిల్లా ప్రజలు అత్యధికంగా కుటుంబ నియంత్రణను పాటిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దానికి తోడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కుటుంబ నియంత్రణపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందుకువస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు. ఇక ఉద్యోగస్తులతో పాటు సంపన్నులు ఒక్కరికే సరిపుచ్చుకునే ఆలోచనకు రావడం కలిసివచ్చినట్లు అయ్యింది. కుటుంబ నియంత్రణను పాటించడంలో మగవారికంటే మహిళలే ముందు వరుసలో ఉంటున్నారు. కుటుంబపోషణ, పిల్లల పెంపకం, వారిని స్కూళ్లకు పంపడం, ఇంటి పని, వంట పనులతో పాటు ఉద్యోగం, వ్యవసాయ పనులు, కూలీ పనులతో బిజీబిజీగా ఉండే మహిళలు ఒక్కరు లేక ఇద్దరు చాలు అనే ఆలోచనకు రావడం వల్ల కుటుంబ నియంత్రణలో వారే ముందుకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు సింహభాగంలో.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను చేయించుకోవడంలో మహిళలే సింహభాగంలో ఉంటున్నారు. వేళ సంఖ్యలో మహిళలు శస్త్ర చికిత్సలను చేయించుకుంటుంటే మగవారు మాత్రం కేవలం పదుల సంఖ్యలో వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకుంటూ కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలదే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. వేసెక్టమీ చేయించుకున్న మగవారి సంఖ్య ఇలా ఉంది. 2008-09 సంవత్సరంలో 162 మంది, 2009-10లో 126, 2010-11లో 73 , 2011-12లో 47, 2012-13లో 45, 2013-14లో 39 , 2014-15లో 28 మంది మగవారు మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. ఏటేటా సంఖ్య పెరగకుండా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలకు ఎంత ఉంటుందో మగవారికి కూడా అంతే ఉంటుందని గ్రహించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సమష్టి కృషితో సాధించాం ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, టెక్సీషియన్లతో పాటు అన్ని తరగతుల అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికి త్సలు నిర్వహించాం. వరుసగామూడేళ్లుగా నూటికి నూరుశాతం మించి శస్త్ర చికిత్సను నిర్వహించడం ఆనందంగా ఉంది. కుటుంబ నియంత్రణపై ప్రజలలో బాగా అవగాహన పెరి గింది. స్వచ్ఛందంగా శస్త్రచికిత్సలను చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మహిళల మాదిరిగా మగవారు కూడా వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో అందరం సమష్టిగా పనిచేసి 2015-16 లక్ష్యాన్ని కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతాం. - డాక్టర్ పి.ఆమోస్,డీఎంహెచ్ఓ -
అవేం మాటలు!
ఒక్కరు ముద్దు. ఇద్దరు హద్దు. ఆపై వద్దు.. జనాభా నియంత్రణకు గతంలో సర్కారు ప్రచారం చేసిన స్లోగన్ ఇది. ఏటికేడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభాతో భారతావని జనసందాన్ని తలపిస్తోంది. పాపులేషన్ లో చైనా తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న ఇండియా మరో పదేళ్లలో అగ్రస్థానానికి చేరుతుందని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా మన పాలకుల చెవికెక్కడం లేదు. నానాటికీ ఎగబాకుతున్న జనాభాతో సమస్యలు చుట్టుముడుతున్నా సంకుచిత నేతలకు చీమ కుట్టినట్టైనా లేకపోవడం శోచనీయం. పిల్లల్ని కనండి.. జనాభాను పెంచండి అంటూ స్లో'గన్స్' గురిపెడుతున్నారు. ఒకరిద్దరితో ఆపొద్దని చంద్రబాబు సెలవిస్తే.. ఇంటికి నలుగురు పిల్లలను కనాలని స్వామిగౌడ్ సూచించారు. కుటుంబ నియంత్రణకు టాటా చెప్పేసి జనాభా పెరుగుదలకు బాటలు వేయాలని హైటెక్ బాబు ఆ మధ్యన పిలుపునిచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవ్వాలని మొదట్లో చెప్పిన మాటను వెనక్కు తీసుకుంటున్నానని జనం సాక్షిగా చేపట్టిన పాదయాత్రలో ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఫ్యామిలీ ప్లానింగ్‌తో ప్రయోజనం లేదని కుండబద్దలు కొట్టారు. హిందూ మత ఉద్ధరణకు పెద్ద ఎత్తున పిల్లలను కనాలని స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. కషాయి పార్టీ నేతలదీ ఇదే మాట. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లలను కనాలని బీజేపీ సాక్షి మహరాజ్ సలహాయిచ్చారు. నలుగురు పిల్లల్లో ఒకరిని సైన్యానికి పంపాలని, మరొకరిని ఆధ్యాత్మిక గురువులకు ఇవ్వాలని, మిగిలిన వాళ్లను టీచర్లుగా చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు మన నేతాశ్రీల హస్వదృష్టికి దృష్టాంతాలు. అధిక జనాభాతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతి సతమవుతుంటే ఇంకా పాపులేషన్ పెంచాలంటూ పాలకులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మనదేశంలో ఏటా పెరిగే జనాభా ఆస్ట్రేలియా మొత్తం జనాభా కంటే ఎక్కువగా ఉందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు. స్వాత్రంత్యం సిద్ధించిన నాటికి 30 కోట్లు ఉన్న ఇండియా పాపులేషన్ ప్రస్తుతం 130 కోట్లకు చేరింది. జనాభా పెరుగుదలతో సమస్యలు హెచ్చుతున్నాయి. దారిద్ర్యం, నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. సమస్యల నుంచి దేశాన్ని బయటపడేయాల్సిన పాలకులు పాపులేషన్ పెంచాలంటూ చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. -
సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు
ఉన్నావ్(యూపీ): వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన మార్కు ప్రకటన చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అలా పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. హిందువుల మాదిరే ముస్లింలు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ''నేను ముస్లింలు, క్రిస్టియన్లు తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలనడం లేదు. జనాభా పెరుగుదలను అడ్డుకోవాలంటే దీనిని పాటించాల్సిందే. హిందువులు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నట్టే ముస్లింలు కూడా పాటించాలి. హిందువులు నలుగురు పిల్లల్ని కనాలంటే ఎంతో గొడవ చేశారు. అదే కొందరు నలుగురు భార్యల ద్వారా 40 మంది పిల్లల్ని కంటుంటే ఎవరూ ఏమీ అనరు''అని అన్నారు. జనాభా పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు. ''దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన జనాభా 30 కోట్లు. ఇప్పుడు 130 కోట్లు. దీనికి ఎవరు బాధ్యులు? హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. .. ఎవరైనా కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఎందరు పిల్లలైనా సమాజంలోని అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండేలా చూడాలి. అందరికీ వర్తించేలా ఉమ్మడి చట్టం తేకుంటే దేశానికే నష్టం. ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ముందుకు రావాలి. ఈ చట్టాన్ని పాటించనివారి ఓటు హక్కును రద్దు చేయాలి'' అని పేర్కొన్నారు. వర్గాలను బట్టి మహిళల పట్ల వివక్ష పాటించడం తగదన్నారు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని గతంలో సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించి, తర్వాత పార్లమెంట్లో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
జపానూ.. జనాభా లెక్కలూ
ఇప్పటికే భారతదేశంలో వందకోట్లకు పైగా జనాభా పెరిగిపోయి, ఉన్న వారికే సరైన తిండి, బట్ట లేక కోట్లాది మంది అభాగ్యులు అడుక్కుతింటుంటే, మరో వంక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరు, లేక ఇద్దరు మించి పిల్లలొద్దని అందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రక టించి కుటుంబ నియంత్రణను ఉధృత పరుస్తుంటే చంద్రబాబు నాయుడేమిటి ఒకరిద్దరుతో ఆపేయవద్దు కుటుంబ నియంత్రణ పాటించొద్దు గంపెడు పిల్లలను కని తనకు ఓటర్లను పెంచమంటున్నట్లున్నారు. అలాంటి పిలుపునివ్వడం బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఆయనకు తగునా? ఇప్పటికే ఉన్న పిల్లలకే కూడు, గుడ్డ లేక ఆకలితో అలమటిస్తూ రాలిపోతుంటే ఇంకా పిల్లల్ని కనాలా? ఉద్యోగాలు దొరకని ఎంతో మంది యువత పెడమార్గాలు పట్టి ప్రభు త్వాన్నే ఎదిరించే పరిస్థితి ఉంది. పిల్లలను కంటే వారిని ప్రభుత్వం పోషించి చదువు చెప్పించి ఉద్యోగాలిస్తుందా? మరి తనెందుకు ఎక్కువ మందిని కనలేదు. జపాన్‌లో వృద్ధులు ఎక్కువ, యువత తక్కువగా ఉన్నారట. ఈయన వెళ్లింది జనాభా లెక్కల తయారీకా! ఒక వంక రైతుల్ని డ్వాక్రా మహిళలను, ఉద్యోగాలివ్వకుండా యువతను ఉసూరు పెట్టినందుకు, అటు రాజధాని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగినందుకు మైండ్‌సెట్ ఏమైనా తేడా వచ్చిందా అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి విమర్శ లకు తావివ్వకుండా నమ్మిన ప్రజలకు మేలు చేయండి. - ఎం.సుగుణకుమారి, కేశవరం, తూ.గో. జిల్లా -
'చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుటుంబ నియంత్రణపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్లు ఉందేమో అనే అనుమానం కలుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడం సమంజసం కాదన్నారు. ఎక్కువమంది పిల్లల్ని కనాలని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు... రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసేలా ఉన్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. యువ దంపతులు బాబు మాటలు విని మోసపోవద్దని ఆయన సూచించారు. నాగార్జున యూనివర్సిటీలో అడుగుపడితే పదవి పోతుందన్న చంద్రబాబు నమ్మకం మూఢ విశ్వాసాలను పెంపొందించేలా ఉందని అంబటి విమర్శించారు. వెంకటేశ్వర స్వామితో ఎన్టీఆర్‌ను పోల్చడం సరైంది కాదని ఆయన అన్నారు. ల్యాండ్ పూలింగ్‌పై ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో సీఎం ఉన్న సమయంలో చేసిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధి బయపడుతుందని అంబటి అన్నారు. -
'చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు'
-
ఆపరేషన్ కష్టాలు
⇒ చేవెళ్ల ఆస్పత్రిలో పడకల సంఖ్య 20 ⇒ కు.ని. శస్త్రచికిత్సలు చేసింది 96 మందికి ⇒ బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు ⇒ వసతుల కల్పనలో విఫలమైన యంత్రాంగం చేవెళ్ల రూరల్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒకవైపు భారీగా ప్రచారం చేస్తున్నా.. అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తరచూ ఇబ్బందుల మధ్యే ఆపరేషన్లు జరుగుతున్న విషయం జిల్లా వైద్యాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనడానికి చేవెళ్లలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళల అవస్థలే నిదర్శనం. ఆస్పత్రిలో ఉన్నవి 20 పడకలే అయినా 96 మంది మహిళలకు శస్త్రచికిత్సలు చేశారు. అందరికీ బెడ్లు సరిపోక కొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టడంతో మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలోని పీహెచ్‌సీల నుంచి 96 మంది మహిళలు కు.ని. ఆపరేషన్ల కోసం ఉదయాన్నే పస్తులతో వచ్చారు. కానీ ఆపరేషన్లను మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం వరకు చేశారు. దీంతో మహిళలు చాలా నీరసించిపోయారు. దీనికి తోడు ఆస్పత్రి వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవటంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న 20 మంచాలపై ఇద్దరు చొప్పున 40 మందిని పడుకోబెట్టారు. మిగిలినవారిని వరండాలోని నేలపైనే విశ్రాంతి తీసుకున్నారు. మహిళల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఆరుబయట వేసిన చిన్న టెంటు సరిపోకపోవటంతో చెట్ల కిందనే నిరీక్షించారు. తాగునీరు, బాత్రూంలు లేక అవస్థల పాలయ్యారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో వచ్చేవారికి ఆస్పత్రిలోని బెడ్లు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు. మొదట ఆపరేషన్ పూర్తయినవారిని పంపిస్తూ.. ఆ తర్వాత చేసేవారికి బెడ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కు.ని. ఆపరేషన్లలో వైద్యులు జయమాలిని, క్యాంపు ఇన్చార్జి కరీమున్నీషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స... మహిళలతో పోలిస్తే పురుషులకే సులభం!
ఈజీ ‘ప్లానింగ్’ అనాదిగా మనలో చాలా అపోహలున్నాయి. పైగా సామాజికంగా పురుషత్వం ఒక గౌరవ, గర్వ సూచికగానూ ఉంటూ వస్తోంది. అందుకే ఈ అపోహలూ, ఈ వివక్షలూ కలసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎక్కువగా స్త్రీలకే పరిమితమయ్యేలాంటి సాంఘిక పరిస్థితులు మన సమాజంలో ఏర్పడ్డాయి. నిజానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మహిళలకు చేయడం కంటే పురుషులకు నిర్వహించడం చాలా సులభం. ట్యూబెక్టమీ అని పిలిచే మహిళలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌తో పోలిస్తే పురుషులకు చేసే వ్యాసెక్టమీ చాలా చిన్నదీ, సులభమైనది. దీనితో పోలిస్తే మహిళలకు చేసే ట్యూబెక్టమీయే పెద్ద (మేజర్) ఆపరేషన్. ఇందులో ఫెలోపియన్ ట్యూబులను కత్తిరించడమో లేదా క్లిప్ చేయడమో చేసి, యుటెరస్లోని అండాలతో పురుషుల వీర్యకణాలు కలవకుండా చేయడమో చేస్తారు. ఫలితంగా ఫలదీకరణ ప్రక్రియ జరగదు. కాబట్టి పిల్లలు పుట్టడం సాధ్యం కాదు. వ్యాసెక్టమీలో ఏం జరుగుతుంది? పురుషుల్లోని వీర్యకణాలు వృషణాల్లో తయారవుతాయి. ఇలా తయారైన ఈ వీర్యకణాలు వ్యాస్ అనే సన్నటి ట్యూబ్స్ ద్వారా ప్రయాణం చేస్తాయి. కాబట్టి వాటిని కత్తిరించి వీర్యకణాలు, వీర్యంతో పాటు బయటకు రాకుండా చేస్తారు. నిజానికి మనం వీర్యంగా భావించే ద్రవం ప్రోస్టేట్ గ్రంథిలో తయారవుతుంది. ఈ ద్రవంలో వీర్యకణాల పాళ్లు కేవలం ఒక శాతం కంటే తక్కువే. అపోహలు ఎన్నో... వ్యాసెక్టమీ చేయించుకుంటే మగతనం తగ్గిపోతుందనేది ప్రధాన అపోహ. కానీ పురుషత్వానికి కారణమైన ఏ అంశాన్నీ ఈ శస్త్రచికిత్స ప్రక్రియలో ముట్టుకోరు. కేవలం వీర్యకణాలు ప్రయాణం చేసే వ్యాస్ అనే ట్యూబ్‌లను మాత్రమే కత్తిరిస్తారు. కాబట్టి ఈ శస్త్రచికిత్స చేయించుకున్న పురుషుల మగతనానికి వచ్చే లోపమేమీ ఉండదు. ఇక ఈ ఆపరేషన్‌పై ఉండే మరో అపోహ ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత వీర్యం రాదనేది ఒక దురభిప్రాయం. కానీ ఈ ఆపరేషన్ తర్వాత కూడా పురుషుడు సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ముందులాగే వీర్యం విడుదల అవుతుంది. కాకపోతే అందులో వీర్యకణాలు/శుక్రకణాలు ఉండవు కాబట్టి... సెక్స్ తర్వాత గర్భం వచ్చేందుకు ఆస్కారం ఉండదు. ‘నో స్కాల్పెల్’ ప్రక్రియతో ఇప్పుడు మరింత సులువు మహిళల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మేజర్ శస్త్రచికిత్స కాగా... పురుషుల్లో చేసే వ్యాసెక్టమీ ఇప్పుడు మరింత సులువయ్యింది. ‘నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ’ (ఎన్ఎస్బవీ) ప్రక్రియ ద్వారా వృషణాలకు చిన్న గాటు పెట్టడం ద్వారా ఈ వ్యాసెక్టమీ ఇప్పుడు మరింత సులువయ్యింది. ఈ గాటుకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిరోజుల్లో చిన్నగాయం ఎలా మానిపోతుందో, ఈ గాట్లూ అలాగే మానిపోతాయి. - డాక్టర్ చంద్రమోహన్, యూరో సర్జన్, ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
ఐ వాంట్ మోర్!
ప్రపంచమంతా ఫ్యామిలీ ప్లానింగ్ వైపు అడుగులు వేస్తుంటే... హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్మన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నా... తనకు ఇంకా పిల్లలు కావాలంటోందీ తార. ఉన్న నలుగురులో ఇద్దరు మాజీ భర్త టామ్ క్రూజ్‌కు సంబంధించిన సంతానం. మిగిలిన ఇద్దరినీ దత్తత తీసుకుంది. ‘నా సంతానాన్ని ఎనిమిదికి పెంచాలని కోరుకుంటున్నా. మా అమ్మ లాగా నా సోదరికి ఆరుగురు పిల్లలు. అలాగే నాకూ మరో నలుగురు కావాలి’ అని ఎంతో ముచ్చటగా చెప్పింది నలభై ఏడేళ్ల నికోల్ కిడ్మన్. -
కు.ని. ఆపరేషన్లపై తప్పు కప్పిపుచ్చే యత్నం: రాహుల్ గాంధీ
బిలాస్పూర్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో మహిళల మరణాలకు సంబంధించి, ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్లు వికటించి అస్వస్థతతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. శస్త్రచికిత్స శిబిరాల నిర్వహ ణలో తప్పిదాలకు, అవకతవలకు బాధ్యతను ఒప్పుకోవడానికి బదులుగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకునే ందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకోసం వినియోగించిన మందులను తగులబెడుతున్నారని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. మొత్తం వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలన్నారు. -
కడుపు కోతలు మహిళలకేనా..?
* కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో మహిళలదే అగ్రస్థానం * వెసెక్టమీకి ఆసక్తి చూపని పురుషులు * అవగహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు నల్లగొండ టౌన్: కుటుంబం బాధ్యత భార్యాభర్తలిద్దరిది. అలాగే కుటుంబ నియంత్రణలో కూడా మహిళలతో పాటు పురుషుల బాధ్యత కూడా ఉంది. కానీ కుటుంబ నియంత్రణ అనగానే వైద్య ఆరోగ్యశాఖతో పాటు కుటుంబ సభ్యులకు గుర్తు వచ్చేది మహిళలే. కుటుంబ నియంత్రణ కోసం పురుషులకు వెసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీతో పాటు డీపీఎల్ ఆపరేషన్లు చేస్తుంటారు. అయినా వెసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడానికి పురుషులు ముందుకు రావడం లేదు. జిల్లాలో 2010 నుంచి 2014 అక్టోబర్ వరకు 1,16,707 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే కేవలం 368 మంది పురుషులు మాత్రమే వెసెక్టమీ చేయించుకున్నారు. దీనిని బట్టే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలలో పురుషులు మహిళల పట్ల ఎంత వివక్షత చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అపోహలతో అనాసక్తి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళలకంటే పురుషులకు చేయడం ఎంతో సులభం..సురక్షితం. కానీ పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిం చుకుంటే కష్టం చేయడానకి ఇబ్బందులు ఏర్పాడతాయని, సంసారజీవితానికి కూడా ఆటంకం కలుగుతుందనే అపోహ, మూఢ నమ్మకాలు ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. దీంతో మహిళలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం పరిపాటిగా మారింది. అయితే వెసెక్టమీ చేయించుకున్న పురుషుడు అదే రోజు తన రోజువారి పనులను యథావిధిగా చేసుకోవచ్చు. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే కనీసం ఇరువై రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అవగాహన కల్పించడంలో విఫలం వెసెక్టమీ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. వెసెక్టమీపై ఉన్న అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ముందుకు రావడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం క్షేత్ర స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మహిళలనే ప్రోత్సహిస్తున్నారే తప్ప వెసెక్టమీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
ప్రాణాంతక శస్త్రచికిత్సలు
దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో కుటుంబ నియంత్రణ కోసం నిర్దేశిస్తున్న లక్ష్యాలు పేద జనాలకూ, మరీ ముఖ్యంగా ఆ వర్గంలోని మహిళలకూ ప్రాణాంతకంగానే ఉంటున్నాయని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శిబిరంలో జరిగిన విషాదకర ఉదంతం రుజువు చేస్తున్నది. ఆ రాష్ట్రంలోని బిలాస్పూర్లో 85 మంది మహిళలకు నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించి సోమవారం 10మంది మరణించగా, వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 40 మంది మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని అక్కడినుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. శిబిరం నిర్వహించిన నలుగురు వైద్యులు కేవలం ఆరు గంటల వ్యవధిలో ఈ 85మందికీ ఆపరేషన్లు చేయడం, దాదాపు ఈ ఆపరేషన్లన్నిటికీ ఒకసారి వాడిన కత్తెరలు, సూదులు, బ్లేడ్లవంటి సామగ్రిని మళ్లీ మళ్లీ ఉపయోగించడం దిగ్భ్రాంతిగొలిపే విషయాలు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి అమర్ అగర్వాల్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఉదంతం చోటు చేసుకున్నదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బాధితులంతా వెనకబడిన ప్రాంతంలోని గ్రామాలకు చెందినవారు కావడం, వారంతా దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారే కావడం యాదృచ్ఛికం కాదు. నానాటికీ పెరుగుతున్న జనాభాను అదుపుచేయడం కోసం అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మొదటినుంచీ పేద వర్గాలను లక్ష్యంగా చేసుకునే సాగుతున్నాయి. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశమంతా...మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ శస్త్ర చికిత్సలు విచ్చలవిడిగా సాగాయి. పెళ్లికాని యువతీ యువకులను సైతం బలవంతంగా శిబిరాలకు రప్పించి, వారికి శస్త్రచికిత్సలు చేశారని వెల్లడైనప్పుడు అందరూ నిర్ఘాంత పోయారు. నిర్దిష్ట గడువు విధించి అధికార యంత్రాంగానికి లక్ష్య నిర్దేశం చేయడంవల్లనే ఈ దారుణాలన్నీ చోటుచేసుకున్నాయని, ఇకపై దీన్ని మారుస్తామని అనంతర కాలంలో పాలకులు హామీ ఇచ్చారు. ‘కుటుంబ నియంత్రణ’ కాస్తా ‘కుటుంబ సంక్షేమం’ అయింది. ప్రజల్ని చైతన్యవంతులను చేయడంద్వారా, వారికి చిన్న కుటుంబంవల్ల కలిగే లాభాలను వివరించడం ద్వారా, వారి స్వచ్ఛంద అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని చేపడతామన్న మాటలూ వినిపించాయి. కానీ క్షేత్రస్థాయిలో అప్పటినుంచీ పెద్దగా మారిందేమీ లేదని అడపా దడపా వస్తున్న వార్తలు చెబుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు టార్గెట్లు విధించడం ఆగలేదు. ఆ టార్గెట్లు అక్కడినుంచి మళ్లీ కింది స్థాయికి వెళ్లడమూ మానలేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకయ్యే వ్యయాన్నంతా భరిస్తున్న కేంద్రం...అందుకోసం రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారో సరిగా పర్యవేక్షిస్తున్నట్టులేదు. బలప్రయోగం చేయకపోవచ్చుగానీ... శస్త్ర చికిత్స చేయించుకున్నపక్షంలో డబ్బు ముట్టజెబుతామని, వారిని తీసుకొచ్చే ఆరోగ్య కార్యకర్తలకు మరికొంత ఇస్తామని చెబుతూ సాగించే ఈ తతంగం నిరుపేద ల జీవితాల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. బిలాస్పూర్ ఆరోగ్య శిబిరం విషయమే తీసుకుంటే ఆ శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వచ్చిన మహిళకు రూ. 1,400, ఆమెను తీసుకొచ్చిన ఆరోగ్య కార్యకర్తకు రూ. 200 చొప్పున అందజేశారు. ఆకలి, అనారోగ్యం, పోషకాహారలేమితో ఇబ్బందులు పడే నిరుపేద గ్రామీణుల దగ్గరకెళ్లి ఇంత డబ్బు వస్తుందని ఆశపెడితే సహజంగానే ఇళ్లల్లోని మహిళలపై ఒత్తిళ్లు మొదలవుతాయి. ఇలాంటి శస్త్ర చికిత్సలు పురుషులు చేయించుకోవడమే ఉత్తమమని, వారైతే కొన్ని గంటల వ్యవధిలోనే తమ పనులు తాము యథావిథిగా చేసుకునే వీలుంటుందని నచ్చజెప్పేవారుండరు. చెప్పినా వినే పరిస్థితీ ఉండదు. చివరకు ఈ భారం మహిళలపైనే పడుతుంది. పదిహేనేళ్ల క్రితం రూపొందించిన జాతీయ జనాభా విధానం... పునరుత్పత్తికి సంబంధించిన సేవలు పురుషులకు ‘చాలా తక్కువ’గా అందుతున్నాయని తేల్చింది. దీన్ని సరిచేస్తే ఆ మేరకు మహిళల ఆరోగ్యం కుదుటపడుతుందని అభిప్రాయపడింది. కానీ, ఇన్నేళ్లు గడిచినా ఆ పరిస్థితి కాస్త కూడా మారలేదు. హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఇతర శారీరక సమస్యల కారణంగా అసలే ఇబ్బందులు పడే మహిళలు అపరిశుభ్ర వాతావరణంలో జరిగే ఇలాంటి ఆపరేషన్లవల్ల మృత్యువుకు చేరువవుతున్నారు. బిలాస్పూర్లో శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలకు రక్తహీనత ఉన్నదని, శస్త్ర చికిత్స సమయంలో అయిన గాయాలు సెప్టిక్ అయి వారి ఆరోగ్యం క్షీణించి మరణించారని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఇంటిల్లిపాదికీ వండివార్చే మహిళ పౌష్టికాహార లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నదని యునిసెఫ్ నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 70 శాతంమంది మహిళలు భారత్‌లో ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారని, అందువల్లే నిరుడు గర్భధారణ, ప్రసవ సమయాల్లో 50,000మంది మహిళలు మరణించారని ఐక్యరాజ్యసమితి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాము శస్త్ర చికిత్సలు చేయబోయే నిరుపేద మహిళల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో చూడవలసిన కనీస బాధ్యత వైద్యులపై ఉంటుంది. లక్ష్యాలను త్వరగా సాధించాలన్న తొందరో, మరేమోగానీ బిలాస్పూర్లో ఇలాంటి ప్రాథమిక జాగ్రత్తలేవీ తీసుకోలేదని అర్థమవుతున్నది. ఈ ఉదంతానికి కారకులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేశామని ఛత్తీస్‌గఢ్ సర్కారు చెబుతోంది. బాధిత కుటుంబాలకు పరిహారమూ ప్రకటించింది. మరి పాలకుల నైతిక బాధ్యత మాటేమిటి? స్వచ్ఛందంగా సాగుతున్నదనుకుంటున్న ఈ కార్యక్రమంలోని లొసుగులను గుర్తించి, జనాభా నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను పునస్సమీక్షించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. -
టార్గెట్ పూర్తయింది..వెళ్లండి!
వర్గల్: నిన్న మొన్నటి దాకా రివార్డులు, అవార్డులంటూ మహిళలను బతిమాలి కుటుంబ నియంత్రణ శిబిరానికి తరలించిన వైద్యులు తమ వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది. మంగళవారం వర్గల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వచ్చిన సగానికి పైగా మహిళలను టార్గెట్ పూర్తయిందని, మలి విడత క్యాంపులో ఆపరేషన్లు చేయించుకోవాలని తిప్పి పంపారు. ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట పసిపాపలతో పడిగాపులు గాసిన మహిళలు వైద్యాధికారుల వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఉసూరుమంటు వెళ్లిపోయారు. సాధారణంగా వర్గల్లో నిర్వహించే కుటుంబ నియంత్రణ ప్రత్యేక శిబిరానికి మండలంతోపాటు, ములుగు, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల నుంచి కూడా మహిళలు వస్తుంటారు. లక్ష్యాన్ని సాధించేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలకు నగదు పారితోషికాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేస్తోంది. మరోవైపు శిబిరానికి మహిళలను తరలించే విధంగా ఏఎన్ఎం, ఆశాజ్యోతి వర్కర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అర్హులైన తల్లులకు నచ్చచెప్పి, బతిమాలి శిబిరాలకు తరలిస్తుండడం ఏఎన్ఎం, ఆశ వర్కర్ల విధిలో ప్రధానమైంది. ఈ క్రమంలో మంగళవారం వర్గల్ శిబిరానికి 150 మందికి పైగా మహిళలు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్టీసీ బస్సు సౌకరం లేకపోవడంతో తెల్లవారే సరికి ఆటోల్లో చంటిపిల్లలతో వర్గల్ చేరుకున్నారు. వారిలో 75 మందికి మాత్రమే ఆపరేషన్లు చేసేందుకు రిజిష్టర్ చేసుకున్నారు. క్యాంపునకు సరిపడిన సంఖ్య పూర్తయిందని, ఇక ఖాళీలు లేవని, తరువాత నిర్వహించే క్యాంపునకు రావాలని వైద్యులు వారితో కరాఖండిగా చెప్పారు. దీంతో జగదేవ్‌పూర్, గజ్వేల్ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు కొద్దిసేపు వైద్య సిబ్బందితో వాదనకు దిగారు. ఉదయం నుంచి పడిగాపులు గాశామన్నారు. వారి బాధలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. గింత అన్యాలమా..పద్మ (ఎర్రవల్లి) వర్గల్ క్యాంపుల ఆపరేషన్ చేస్తరంటె పొద్దుగాల పొద్దుగాలనే ఆటోల వర్గల్‌కు వచ్చినం. పగటాల్దాక దవాఖాన ముందర నిర్ర నీలిగినం. ఆపరేషన్లకు ఎక్కువ మంది ఒచ్చిన్రని నన్ను పట్టించుకోలె. చంటి పిల్లను పట్టుకుని గింత దూరం ఈడ్సుకుంట వస్తె మల్ల క్యాంపునకు రమ్మని ఎల్లగొట్టిండ్రు. పైసల్ ఖర్సాయే..కష్టం తప్పకపాయె. ఊరుగాని ఊరునుంచి వస్తే తమాం గింత అన్యాలమా. ముందే చెపితె గింత తిప్పల పడకపోతుంటిమి. గరీబోల్లను గిట్ల పరేషాన్ చేయకుండ్రి. అధికారుల ఆదేశాల మేరకే... - డాక్టర్ సిల్వియా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళలను తిప్పిపంపిన మాట వాస్తవమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కు.ని. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి గతంలో 150కి పైగా శస్త్ర చికిత్సలు జరిపిన సందర్భాలున్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సంఖ్యను 80కి మించకుండా జిల్లా అధికారులు కుదించారు. వారి ఆదేశాలకు అనుగుణంగానే వర్గల్ శిబిరంలో 75 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరిపాం. మిగతా వారు తరువాతి శిబిరంలో శస్త్ర చికిత్స జరిపించుకోవాలని నచ్చచెప్పి పంపించాం. -
ఈ ఆపరేషన్ మాకొద్దు
ఘట్కేసర్: కుటుంబ నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించే ప్రభుత్వం ఆ ఆపరేషన్లు చేయించుకోవడానికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. దీంతో ఆపరేషన్లు చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన మహిళలు అక్కడి పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వస్తామంటూ ఆపరేషన్లు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మండలంలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల వ్యాప్తంగా మహిళలకు కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమి) ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన 12 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి తమ పేర్లను నమోదు చేయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు సదరు 12 మంది మహిళలు ఆస్పత్రికి చేరుకున్నారు. మొదట ఆరుమంది మహిళలకు ఆపరేషన్లు చేసి అందుబాటులో ఉన్న 6 మంచాలపై పడుకోబెట్టారు. అనంతరం వచ్చిన ఇద్దరు మహిళలను ఆపరేషన్ తర్వాత బెంచీలు, టేబుళ్లపై పడుకోబెట్టారు. ఈ పరిస్థితి గమనించిన మిగితా నలుగురు మహిళలు నివ్వెరపోయారు. ఆస్పత్రిలో ఇక బెంచీలు, టేబుళ్లు కూడా లేకపోవడంతో ఆపరేషన్ తర్వాత తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. మళ్లీ వచ్చి ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పి అక్కడినుంచి వెనుదిరిగారు. కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతోనే తాము భయపడి వెనుదిరిగినట్లు వారు విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. వైద్యులు నారాయణ రావు, సతీష్ చందర్ల నేతృత్వంలో కు.ని ఆపరేషన్లు కొనసాగాయి. -
‘కు.ని’కి పాట్లు
సాక్షి, ఒంగోలు : జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నుంచి జిల్లాకు ఏటా రూ.20 కోట్లకు పైగా నిధులు వస్తున్నాయి. ఇందులో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు కుటుంబ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో నాలుగు రకాలుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు సంతానం పుట్టాక కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేయడం ఒకటి కాగా, పిల్లల మధ్య ఎడమ కోసం తాత్కాలిక ఆపరేషన్లైన కాపర్ టీ వేయించడం, గర్భం దాల్చకుండా నోటిమాత్రలు పంపిణీ చేయడం, కండోమ్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇందులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మినహా అన్ని కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో కానరాని ప్రగతిని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం గణాంకాల్లో ఘనంగా చూపుతుండటం గమనార్హం. వేసెక్టమీలు ఏడు మాత్రమే... కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ఏటా భారీ స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని అధిగమించే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చతికిలపడటం రివాజవుతోంది. ఏటా రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. లక్ష్యాలు నెరవేరడం లేదు. జిల్లావ్యాప్తంగా పురుషులకు చేసే వేసెక్టమీ ఆపరేషన్లు ఈఏడాది మొత్తంలో కేవలం ఏడు మాత్రమే నమోదవడం తాజా ఉదాహరణ. వాస్తవ పరిస్థితులిలా.. జనాభా నియంత్రణలో కుటుంబ నియంత్రణ అనేది ఒక భాగం. తల్లులు, పిల్లల ఆరోగ్యం విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల తర్వాత తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు దంపతులను ప్రోత్సహించాలి. చిన్న కుటుంబంతో కలిగే లాభాలను వివరించే అవగాహన సమావేశాలు నిర్వహించాలి. కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయాల్సిన ‘డెమో’ విభాగం మూలనపడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు పనిచేస్తున్నాయి. యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో అక్కడక్కడా తప్ప అధిక చోట్ల ప్రత్యేక శిబిరాల ఊసే లేదు. ఆయాప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. గైనిక్, అనస్థీషియా (మత్తు) వైద్యులు కొరత కారణంగా తొందరపడి ఆపరేషన్ల జోలికి వెళ్లలేకపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేనందున చాలామంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నెరవేరని లక్ష్యం.. జిల్లావైద్య, ఆరోగ్యశాఖ 2013-14 సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకుగాను కేవలం 7 వేల ఆపరేషన్లు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు కంటే ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు అధికంగా జరిగాయి. పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులందుతున్నాయి. ఒంగోలు రిమ్స్‌కు పంపుతూ కొన్ని నియోజకవర్గాల్లో వైద్యసిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. -
జనాభా స్థిరీకరణపై దృష్టి
కర్నూలు(హాస్పిటల్): జనాభా స్థిరీకరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజేసీ మాట్లాడుతూ జనాభా స్థిరీకరణ కోసం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంభించాలన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు. రాజాసుబ్బారావు మాట్లాడుతూ అధిక జనాభా వల్ల ఇటు కుటుంబం, అటు దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందన్నారు. ఆడ, మగ ఎవరైనా సరే ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని దేశ సౌభాగ్యానికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పీసీపీఎన్డీటీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ధనుంజయ, డెమో రమాదేవి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.