కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడంలో మన జిల్లా ముందువరుసలో నిలిచింది. నూటికి నూరుశాతం శస్త్రచికిత్సలు నిర్వహించి తన సత్తా చాటుతూ వస్తోంది. గతంలో వరుసగా ఏకంగా పదమూడు సంవత్సరాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న ఘనత జిల్లాకే దక్కింది. అదే రీతిలో మూడేళ్లుగా లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తూ జిల్లాకు పూర్వవైభవాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకువస్తోంది.
నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో రాష్ట్ర స్థాయిలో 2012-13 సంవత్సరంలో అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత ఉత్సాహంతో పనిచేస్తూ వస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 24 వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించగా 24,045 ఆపరేషన్లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు దక్కించుకుంది. అదే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అవార్డును పొందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత రెట్టింపు ఉత్సాహంతో మార్చి 31 నాటికి 22,050 శస్త్ర చికిత్సలను నిర్వహించి నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను చేసిన ఘనతను సాధించిన జిల్లాల జా బితాలో చేరింది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో పాటు సంబంధిత అధికారులు ప్రతి నెలా మండలా ల వారిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సమీక్షలను నిర్వహించిన కారణంగానే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. అదే స్ఫూర్తితో పనిచేసిన సిబ్బంది తిరిగి జిల్లాను మూడోసారి కూడా ల క్ష్యానికి మించి శస్త్రచికిత్సలను చేసిన జిల్లాల జాబితాలో చేర్చారు. గతంలో కూడా కుటుంబ నియంత్రణలో జిల్లా 1993-94 ఆర్థిక సంవత్సరం నుంచి 2005-06 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా 13 సంవత్సరాలు నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో వరసగా అవార్డులను సాధించిన ఘనత వైద్య ఆరోగ్య శాఖకు ఉంది.
కుటుంబ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులే
ప్రజలలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులకు తోడు కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా జిల్లా ప్రజలు అత్యధికంగా కుటుంబ నియంత్రణను పాటిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దానికి తోడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కుటుంబ నియంత్రణపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందుకువస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు. ఇక ఉద్యోగస్తులతో పాటు సంపన్నులు ఒక్కరికే సరిపుచ్చుకునే ఆలోచనకు రావడం కలిసివచ్చినట్లు అయ్యింది. కుటుంబ నియంత్రణను పాటించడంలో మగవారికంటే మహిళలే ముందు వరుసలో ఉంటున్నారు. కుటుంబపోషణ, పిల్లల పెంపకం, వారిని స్కూళ్లకు పంపడం, ఇంటి పని, వంట పనులతో పాటు ఉద్యోగం, వ్యవసాయ పనులు, కూలీ పనులతో బిజీబిజీగా ఉండే మహిళలు ఒక్కరు లేక ఇద్దరు చాలు అనే ఆలోచనకు రావడం వల్ల కుటుంబ నియంత్రణలో వారే ముందుకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలు సింహభాగంలో..
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను చేయించుకోవడంలో మహిళలే సింహభాగంలో ఉంటున్నారు. వేళ సంఖ్యలో మహిళలు శస్త్ర చికిత్సలను చేయించుకుంటుంటే మగవారు మాత్రం కేవలం పదుల సంఖ్యలో వేసెక్టమీ ఆపరేషన్‌లను చేయించుకుంటూ కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలదే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. వేసెక్టమీ చేయించుకున్న మగవారి సంఖ్య ఇలా ఉంది. 2008-09 సంవత్సరంలో 162 మంది, 2009-10లో 126, 2010-11లో 73 , 2011-12లో 47, 2012-13లో 45, 2013-14లో 39 , 2014-15లో 28 మంది మగవారు మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్‌లు చేయించుకోవడం గమనార్హం. ఏటేటా సంఖ్య పెరగకుండా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలకు ఎంత ఉంటుందో మగవారికి కూడా అంతే ఉంటుందని గ్రహించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
సమష్టి కృషితో సాధించాం
ఎస్‌పీహెచ్‌ఓలు, వైద్యాధికారులు, సూపర్‌వైజర్‌లు, ఏఎన్‌ఎంలు, టెక్సీషియన్‌లతో పాటు అన్ని తరగతుల అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికి త్సలు నిర్వహించాం. వరుసగామూడేళ్లుగా నూటికి నూరుశాతం మించి శస్త్ర చికిత్సను నిర్వహించడం ఆనందంగా ఉంది. కుటుంబ నియంత్రణపై ప్రజలలో బాగా అవగాహన పెరి గింది. స్వచ్ఛందంగా శస్త్రచికిత్సలను చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మహిళల మాదిరిగా మగవారు కూడా వేసెక్టమీ ఆపరేషన్‌లను చేయించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో అందరం సమష్టిగా పనిచేసి 2015-16 లక్ష్యాన్ని కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతాం.
- డాక్టర్ పి.ఆమోస్,డీఎంహెచ్‌ఓ
ఫ్యామిలీ ‘ప్లానింగ్’
Published Sun, Jul 12 2015 2:42 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement