‘కు.ని’ చేయించుకున్నాం.. ఒట్టు.. | rtc employees cheeting to management on family planning fake documents | Sakshi
Sakshi News home page

‘కు.ని’ చేయించుకున్నాం.. ఒట్టు..

Published Fri, May 13 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

‘కు.ని’ చేయించుకున్నాం.. ఒట్టు..

‘కు.ని’ చేయించుకున్నాం.. ఒట్టు..

ఆర్టీసీలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల దందా
నకిలీ పత్రాలతో ఖజానాకు కన్నం

 సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంక్రిమెంటు... వారం రోజుల సెలవు.... ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను బాగా ఆకట్టుకొంటున్న అంశాలు. ఈ ‘డబుల్ బెనిఫిట్’ కోసం కొందరు ఉద్యోగులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నట్టు నకిలీ పత్రాలతో నమ్మిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రభుత్వ పర్యవేక్షణ పడకేయటం, ఎవరేం చేసినా అడిగేవారే లేకపోవటంతో ప్రస్తుతం ఎవరి ఇష్టం వారిదిగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తాజాగా వెలుగు చూసిన అడ్డగోలు వ్యవహారమిది.

 డొంక కదిలిందిలా...
కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ సిబ్బందికి సంస్థ ప్రోత్సాహకాలను అందిస్తోంది. శస్త్రచికిత్స చేసుకున్న సమయంలో వారికి వారం రోజుల సెలవు, అదనంగా ఓ ఇంక్రిమెంటు జత చేస్తున్నారు. అర్హులైన వారు దీన్ని పొందుతుండగా, కొందరు దొడ్డిదారిన ఈ బెనిఫిట్లను సొంతం చేసుకోవటం తాజాగా వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం నిర్లిప్త ధోరణిని అలుసుగా చేసుకుని సిబ్బంది బోగస్ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తూ పలు రకాల బెనిఫిట్లు పొందుతున్నారు.

తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని పేర్కొంటూ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి జారీ చేసినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి విధులకు హాజరు కాకుండా అడ్డదారిలో సెలవులు పొంది సొంత పనులు చూసుకొంటున్నారు. ఆ కాలానికి ఠంచన్‌గా వేతనం పొందున్నారు. అలాగే కొందరు డ్రైవర్లు కష్టతరమైన డ్రైవింగ్ విధుల నుంచి తప్పుకుని అంతగా కష్టపడాల్సిన పనిలేని శ్రామిక్‌లాంటి పనులు చేసుకునేలా తప్పుడు అన్‌ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. శ్రామిక్‌లాంటి అతి తక్కువ వేతనం ఉండే పోస్టులో ఉంటూ డ్రైవర్ స్కేలు ప్రకారం వేతనం పొందుతున్నారు.

 అన్ని డిపోల్లో విజిలెన్స్ తనిఖీలు...
ఎవరేంచేసినా చెల్లిపోతున్న నేపత్యంలో కొందరు ‘కు.ని.’ ఆపరేషన్లను అవకాశంగా చేసుకున్నారు. ఈక్రమంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో కొందరు సిబ్బంది అక్రమంగా బెనిఫిట్లు పొందారంటూ ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఒకే ఆసుపత్రి పేరుతో జారీ అయిన పత్రాలను తనిఖీ చేశారు. అవి నకిలీవని తేలడంతో సదరు సిబ్బందిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరందరికీ అదే డిపోలో పనిచేసే ఓ డ్రైవర్ ఆ నకిలీ పత్రాలు జారీ చేయించినట్టు పోలీసు దర్యాప్తులో తేలటంతో అతడిని అరెస్టు చేశారు.

అప్రమత్తమైన యాజమాన్యం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో తనిఖీ చేసేందుకు విజిలెన్సు విభాగాన్ని రంగంలోకి దింపింది. ఇందులో చిత్రవిచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు 15-20 ఏళ్ల వయస్సు పిల్లలున్నవారు కూడా ఇప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నట్టు పత్రాలు దాఖలు చేస్తున్నారని, గతంలోనే ఆ చికిత్స చేయించుకున్నవారు ఇప్పుడు చేయించుకున్నట్టు పేర్కొంటున్నారని తేలినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ విచారణ సాగుతోంది. రెండేళ్లుగా దాఖలైన పత్రాలన్నింటినీ పరిశీలించి నకిలీల నివేదిక అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement