
17 మంది పిల్లలకు జన్మనిచ్చాక..
అహ్మదాబాద్: నేటి సమాజంలో చాలామంది ఒకరు లేదా ఇద్దరు బిడ్డలు కావాలని కోరుకుంటారు. గుజరాత్‌లో మాత్రం ఓ దంపతులు ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో 16 మంది కుమార్తెలు కాగా, ఓ కొడుకు ఉన్నాడు. గ్రామస్తులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు.
గుజరాత్‌లోని దహోడ్ జిల్లా జరిబుజర్గ్ గ్రామంలో రామ్ సిన్హ్ (44), కను సంగోత్ (40) అనే దంపతులు నివసిస్తున్నారు. కొడుకు కావాలనే కోరికతో ఇంతమంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వీరికి వరుసగా ఆడపిల్లలు పుట్టారు. 2013లో ఓ మగబిడ్డ జన్మించాడు. కాగా మరో కొడుకు కావాలన్న వారి కోరిక నెరవేరలేదు. 2015, 2016లో ఆడపిల్లలు పుట్టారు. చివరకు గ్రామస్తులు వారికి నచ్చజెప్పడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు అంగీకరించారు.
16 మంది ఆడపిల్లల్లో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి వివాహం కాగా, ఇద్దరు ఉపాధికోసం రాజ్‌కోట్ వెళ్లారు. వృద్ధాప్యంలో బాగోగులు చూసుకునేందుకు కొడుకు అవసరమని, కొడుకు కావాలని కోరుకుంటే చాలామంది ఆడపిల్లలు పుట్టారని రామ్ సిన్హ్ చెప్పాడు. రామ్ సిన్హ్ దంపతులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.