
కబూతర్ జా..జా..జా
భారీగా పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు
⇒ జంట నగరాల్లో జయశంకర్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
⇒ ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణం
⇒ పలు రకాల వైరస్‌లూ విస్తరించే ప్రమాదం
⇒ చర్మ సంబంధిత వ్యాధులూ వచ్చే అవకాశం
⇒ వాటి రెట్టల కారణంగా అపరిశుభ్రత, దుర్వాసన
⇒ జంట నగరాల్లో సుమారు 5 లక్షల కపోతాలు
⇒ పావురాల సంతతి బాగా పెరగడంతో ఇతర పక్షులకు ప్రమాదం
ఒహోహో.. పావురమా.. అంటూ ఒకప్పుడు పాటలు పాడుకునేవారు.. వాటితో ప్రేమ లేఖలూ పంపుకొనేవారు.. తెల్లని పావురాలను శాంతికి చిహ్నంగానూ భావిస్తారు. వాటికి దాణా పెడితే చనిపోయిన మన పెద్దల ఆత్మలు సంతృప్తి చెందుతాయనేదీ కొందరి నమ్మకం. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం పావురాలు అశాంతి రేపుతున్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు, కొన్ని రకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు వేసే రెట్టతో అపరిశుభ్రత, దుర్వాసన నెలకొని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
రామారావు విశ్రాంత ఉన్నతాధికారి.. ఆయన మనవరాలు కొంత కాలంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఓరోజు వారి ఇంటికి వచ్చిన స్నేహితుడైన వైద్యుడు ఆ అమ్మాయి బెడ్‌రూమ్ పరిసరాలు గమనించి.. ఆ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో పావురాలు ఉండటమే ఆస్తమాకు కారణమని తేల్చారు. పావురాలు అక్కడ ఉండకుండా చేయాలని సూచించారు. అలా చేయడంతో మూడు నెలల్లోనే ఆ అమ్మాయి కోలుకుంది.
దుమ్ము, కాలుష్యం వంటివి ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పావురాలూ ఈ సమస్యకు కారణమవుతున్నాయి. సాధారణంగా పావురాల రెట్టల వల్ల ఇంటి గోడలు, పైకప్పు పాడవుతున్నాయన్న ఫిర్యాదులేగాని.. వాటి వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందన్న సంగతి చాలామందికి తెలియడం లేదు. జంట నగరాల్లో భారీ సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు అపార్ట్‌మెంట్లు, ఇతర భవనాలను ఆవాసాలుగా మార్చుకుని.. జనానికి అతి దగ్గరగా మసులుతున్నాయి. దాంతో పావురాల రెక్కల నుంచి వచ్చే ధూళి, రెట్టల్లోని అవశేషాలు ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. కిటికీలు, వెంటిలేటర్లలో మసలే పావురాల నుంచి వ్యాధికారక పదార్థాలు ఇళ్ల గదుల్లోకి చేరుతున్నాయి. ఇటీవల మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి కూడా వైద్యులు ఇదే తరహా సూచనలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ బారిన పడటానికి పావురాలే కారణమని తేలింది.
లక్షల సంఖ్యలో పావురాలు
కబూతర్ ఖానా.. కుతుబ్‌షాహీల కాలంలో పాత నగరంలో ఏర్పాటైన పావురాల కేంద్రం. 300 గూళ్లతో ఉండే ఆ నిర్మాణంలో వందల సంఖ్యలో కపోతాలు ఉంటాయి. జనం వాటికి తిండి గింజలు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి పావురాల కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, మొత్తంగా ఎన్ని పావురాలు ఉంటాయనే విషయాన్ని తేల్చేందుకు జయశంకర్ విశ్వవిద్యాలయంలోని పక్షి శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో కొంత కాలంగా అధ్యయనం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
ప్రస్తుతం జంట నగరాల్లో 490 చోట్ల పావురాలకు తిండి గింజలు వేసే కేంద్రాలు వెలిశాయి. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్కో చోట 200 నుంచి 15 వేల వరకు పావురాలు ఉంటున్నాయి. మొత్తంగా జంట నగరాల్లో దాదాపు 5 లక్షల వరకు పావురాలు ఉన్నట్లు అంచనా.
వైరస్, పురుగులు విస్తరించే ప్రమాదం
‘‘పావురాలకు తిండి గింజలు వేసి ఆనందించటం సహజం. కానీ అవి మనకు దగ్గరగా మసలుతుండటంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది ప్రమాదకరమే..’అని వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగాధిపతి వాసుదేవరావు తెలిపారు. పావురాలను ఓ రకమైన నల్లుల వంటి పురుగులు ఆశ్రయిస్తు న్నట్టు తేలింది. పావురాలు ఇళ్ల కిటికీలు, వెంటిలేటర్ల వద్ద ఉన్నప్పుడు అక్కడ పడే పురుగులు.. తర్వాత ఇళ్లలోకి చేరుతున్నాయి. దీంతో పావురాల నుంచి ప్రమాదకర వైరస్ మనుషుల్లోకి చేరే ప్రమాదం ఉందని వాసుదేవరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది వ్యాధులు విస్తరించేందుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఇక చర్మ సంబంధిత వ్యాధులకూ పావురాలు కారణమవుతున్నాయని పలు వురు వైద్యులు చెబుతున్నారు.
విమానాలకూ తప్పని ముప్పు...
ఎగురుతున్న విమానాలను పక్షులు ఢీకొంటే విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్న సంగతి తెలిసిం దే. ఆ ప్రమాదమే కాదు శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త సమస్య కూడా వచ్చిపడింది. విమానాలు నిలిపేందుకు, మరమ్మతులు చేసేందుకు విమానాశ్రయంలో భారీ హ్యాంగ ర్స్ (షెడ్లు లాంటివి) ఉంటాయి. వంద అడుగుల వరకు ఎత్తుండే ఆ హ్యాంగర్స్‌పై పావురాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి పావురాలు వేసిన రెట్టలు విమానాలపై పడి కొత్త సమస్యకు కారణమైంది. వాటి రెట్టల్లో ఆమ్ల అవశేషాలుంటాయి. రెట్ట ఎక్కువసేపు విమా నంపై ఉంటే ఆ ప్రాంతంలో మచ్చలేర్పడతాయి. అవి చిన్నపాటి రంధ్రాలకు కారణమై విమానాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయం హ్యాంగర్స్‌లో పావురాల నిరోధాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
నాణ్యతలేని గింజలతో..
కొందరు పురుగుపట్టిన, ముక్కిన, తడిసి బూజుపట్టిన, పాడైన గింజలను తక్కువ ధరకు సేకరించి పావురాల కేంద్రాల వద్ద అమ్ముతున్నారు. ప్రజలు వాటిని కొని వేస్తుండడంతో పావురాలకు రోగాలు వస్తున్నాయి. అలా కొన్ని సందర్భాల్లో ఇళ్లలోని కిటికీ సందులు, పైకప్పుల్లో చనిపోతున్నాయి. ఇది కూడా అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులకు కారణమవుతోంది.
గింజలు వేయటం మానుకోవాలి
పక్షులను ఆదరించటం జీవవైవిధ్యానికి ఎంతో అవసరమేనని, పక్షులకు గింజలు వేసినంత మాత్రాన వాటిని ఆదరించినట్టు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇళ్ల పైకప్పులపై పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేస్తే సరిపోతుందని, గింజలు వేయవద్దని సూచిస్తున్నారు. గింజలు దొరకకుంటే పక్షులు వాటికి సహజమైన వేటకు వెళ్లిపోతాయని.. అది పక్షులకు, ప్రజల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు.
ఇతర పక్షులకూ ప్రమాదం
తిండి గింజలకు అలవాటు పడిన పావురాలు వాటి సహజ గుణాలను వదిలేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయమే వేటకు వెళ్లడం పక్షుల లక్షణం. కానీ ప్రజలే తిండి గింజలు వేస్తుండడంతో పావురాలు ఆహారం కోసం వెళ్లకుండా.. ఒకే చోట ఉంటున్నాయి. ఈ క్రమంలో తమ తిండికి పోటీ రాకుండా ఇతర రకాల పక్షులను తరిమేస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇక లక్షల సంఖ్యలో పావురాలు పెరిగిపోతుండడంతో.. నగర శివారు ప్రాంతాలకు, గ్రామాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిచ్చుకలు, కాకులు, చిలుకలు ఇతర పక్షులను తరిమివేస్తున్నాయి.
దాణా కోసం రూ.50 కోట్లు!
సగటున ఒక్కో పావురం రోజుకు 22 గ్రాముల వరకు గింజలు తింటాయని అంచనా. పావురాల కోసం ఏర్పాటు చేసే కేంద్రాల వద్ద రూ.10, రూ.20 చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో గింజలు అమ్ముతున్నారు. జనం, సందర్శకులు వాటిని కొని పావురాలకు వేస్తున్నారు. దాంతో పావురాల సంఖ్య బాగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న పావురాలకు పెడుతున్న గింజల కోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్లు అధ్యయన బృందం అంచనా వేసింది.
పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్!
సంతానోత్పత్తి నియంత్రణకు బీఎంసీ యోచన
భాగ్యనగరంలోనే కాదు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ పావురాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ పావురాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో వాటి రెట్టలు, ఇతర అవశేషాల వల్ల ఆస్తమా.. క్షయా తదితర వ్యాధుల బారి న ప్రజలు పడుతున్నారు. ముంబైలోని ప్రతి పది ఆస్తమా కేసుల్లో ఒకటి పావురాల వల్ల వచ్చిందే. ముఖ్యంగా చిన్నారుల్లో ఈసమస్య అధికంగా ఉంది. ముంబై అనేకాదు.. పుణే, థానే తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రంగంలోకి దిగాల్సి వచ్చింది. పావురాల సంఖ్యను నియంత్రణకు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేందుకు సిద్ధమవుతోం ది. దశాబ్దం క్రితం వీధి కుక్కలకు సంతా నోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన మాదిరిగానే ఇప్పుడు పావురాలకు కూడా చేయాలని యోచిస్తోంది. తొలుత ఈ ప్రతి పాదనను ఓ ముంబై కార్పొరేటర్ తెరపైకి తెచ్చారు.
ఓవిస్టాప్ అనే సంతానోత్పత్తి నియంత్రణ ఔషధం సహాయంతో బీఎంసీ పావురాల విస్ఫోటనాన్ని అరికట్టవచ్చని ఆయన చెపుతున్నారు. ఈ పద్ధతి ప్రకారం.. పక్షుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే నికర్ బాజిన్‌తో మిళితమై మొక్కజొన్న విత్తనాల తో కూడిన ఓవిస్టాప్ ఔషధాన్ని పావురాలకు ఆహారంగా వేస్తారు. ఈ పిల్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్పెయిన్‌లో ని ఒక పట్టణంలో ఇలాగే పావురాల సంతా నోత్పత్తిని నియంత్రించారని, ఈ పిల్ వినియోగంతో వాటి సంఖ్య 80 శాతం తగ్గిందని సదరు కార్పొరేటర్ చెపుతున్నారు.
కేంద్రానికి ప్రతిపాదన..
ఈ ప్రతిపాదనకు ఇప్పటికే బీఎంసీ ఆరోగ్య కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి అను మతి కోసం మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఈ ప్రతిపాదనను పంపించింది. ఇది తమ పరిధిలో లేదని, రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) డైరెక్టర్ చేతిలో ఉందని, దీని అమలుకు అంగీకరించాలని తాము ఎఫ్‌డీఏని కోరినట్టు ఒక బీఎంసీ అధికారి వెల్లడించారు. దీన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు పంపింది. ఈ పిల్ స్వదేశంలో లభించదు. దిగుమతికి డీసీజీఐ అనుమతి తప్పనిసరి. – సాక్షి, తెలంగాణ డెస్క్