Pigeons
-
Mahakumbh 2025: పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నా.. తొమ్మిదేళ్లుగా బాబా తలపై పావురం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. బాబాలు, సాధువులు కూడా కుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. కుంభమేళాకు వచ్చిన సాధువుల్లో కొందరు ప్రత్యేక వేషధారణతో కనిపిస్తున్నారు. వీరు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ‘పావురం బాబా. ఈ యన కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గత 9 సంవత్సరాలుగా ఈయన తలపై పావురం కూర్చుంటోంది. అది ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే ఉంటోంది. దీంతో పావురం బాబాను చూసేందుకు జనం అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా జునా అఖారాకు చెందిన మహంత్ రాజ్ పురి మహారాజ్ తలపైననే ఈ పావురం ఉంటోంది.అందుకే ఈయనను ‘కబూతర్ వాలే బాబా అని పిలుస్తారు. कबूतर वाले बाबा 🤔 pic.twitter.com/DNbVOdDotr— Sanjai Srivastava (@SanjaiS41453342) January 11, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ రాజ్ పురి మహారాజ్ ‘జీవులకు సేవ చేయడమే గొప్ప మతం' అని చెబుతుంటారు. ఈ బాబా నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, తినేటప్పుడు.. ఇలా అనునిత్యం ఆ పావురం బాబాను అంటిపెట్టుకునే ఉంటోంది. కబూతర్ బాబాను చూసి భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. జీవులకు సేవ చేసేవారు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారని కబూతర్ బాబా చెబుతుంటారు. @SanjaiS41453342 అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో కబూతర్ బాబా పావురంతో సమయం గడుపుతున్నట్లు చూడవచ్చు. ఆ క్లిప్‌లో ఆ పావురం బాబా తలపై కూర్చొని ఉండటాన్ని కూడా చూడవచ్చు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభమైన ప్రపంచ అలర్జీ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం డీజీపీ కార్యాలయంలో ప్రముఖ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నేతృత్వంలో ‘పావురాల రెక్కలు – పావురాల విసర్జన– ఎలర్జీ నిర్ధారణ– పరీక్షలు’ క్యాంపెయిన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పావురాలతో ప్రబలే అలర్జీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలర్జీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అశ్వినీ అలర్జీ సెంటర్లో పావురాల వల్ల కలిగే ప్రాణాంతకరమైన వ్యాధి ‘హైపర్ సెన్సిటివిటీ నీమోనైటిస్’ ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెయ్యి మందికి ఉచితంగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఆయన మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడని స్థానిక మీడియాలో వార్తలు వెలుబడుతున్నాయి. మీనా ఫ్యామిలీ మొత్తానికి గతంలో కరోనా సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ... విద్యాసాగర్ కొన్ని నెలలుగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నాడు. (చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?) పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపై ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్ తరచూ దానా వేస్తూ అక్కడే గడిపేవాడట. కోవిడ్ సోకిన సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తులు పాడైపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ..దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మీనా, విద్యాసాగర్‌ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి(పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్) ఈ విధంగా స్పందించారు. -
మూడంతస్తుల మేడలో.. పావురాలతో 'ప్రేమలో'..
పావురం.. ప్రేమకు ప్రతిరూపం.. శాంతికి చిహ్నం. అటువంటి పావురాల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్న ఆయన వాటి కోసం ఏకంగా ఓ ప్రేమ మందిరాన్నే నిర్మించాడు. అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, కంటికి రెప్పలా వాటిని చూసుకుంటున్నాడు. కృష్ణా జిల్లా మానికొండ గ్రామంలో పావురాలకు ఇల్లు కట్టిన ప్రేమికుడు చెరుకువాడ శ్రీనివాసరావు గురించి మీ కోసం ఈ కథనం. – సాక్షి, అమరావతి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గం అది. అక్కడ మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పచ్చని పొలాల నడుమ మూడంతస్తుల భవనం ఒకటి కనిసిస్తుంది. ఆ భవనాన్ని సమీపించే కొద్దీ ఓ వింతైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అది కేవలం ఇల్లు కాదు. అదో పావురాల ప్రపంచం. మూడంతస్తుల ఆ మేడలో ప్రతి అంతస్తులోను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన అరలు.. వాటిల్లో వందల రకాల పావురాలు సందడి చేస్తుంటాయి. పావురాల శత్రు ప్రాణులు కానీ, వాటి భక్షక ప్రాణులు కానీ ఆ భవనంలోకి ప్రవేశించలేవు. అంటే.. పిల్లి, డేగ వంటి జంతువులు బయటి నుంచి జొరబడకుండా ఇనుప కంచెతో కట్టుదిట్టమైన రక్షణ వలయం, ఆఖరికి దోమలు కూడా దూరకుండా దోమల మెష్ సైతం ఏర్పాటు చేసి ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నట్లే వాటికి కూడా ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉంటాయి. 20 రకాల గింజలతో పావురాలకు వేళకు బలమైన ఆహారం, వాటికి సుస్తీ చేస్తే మందులు వంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఉంటాయి. అంతేనా.. మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసి ప్రతి ఉదయం తన ప్రేమ పక్షులకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని కూడా వినిపిస్తున్నాడు పావురాల ప్రేమికుడు శ్రీనివాసరావు. అరుదైన జాతులు.. 1,150కి పైగా పావురాలు పావురాలకు మాత్రమే నిర్మించిన ఈ నిలయంలో అనేక జాతులకు చెందిన దాదాపు 1,150కి పైగా పావురాలు కనువిందు చేస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పావురాలతో పాటు యూరప్, అమెరికా, సింగపూర్, దుబాయ్, బంగ్లాదేశ్, బెల్జియం, చైనా, జర్మనీ తదితర దేశాలకు చెందిన వందకుపైగా అరుదైన జాతులను అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేకరించారు శ్రీనివాసరావు. రూ.5 వేల నుంచి రూ.85 వేలు విలువ చేసే అరుదైన పావురాలను కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు. జెయింట్ హంగేరియన్, అమెరికన్ పాంకెయిన్స్, జాకోబిన్స్, షీల్డ్, వార్లెస్ హ్యుమర్స్, ఓరియంటల్ ఫెరల్, యూరోపియన్ లాహోర్, అమెరికన్ నన్స్, మాల్టీస్, సాండీల్ ముకీస్, చైనీస్ ఓవెల్స్, పెంచ్ మొడెనా, కింగ్స్, షేక్ షెర్లీ, అమెరికన్ ఎలిమెంట్స్, కాప్చినో, జర్మన్ బ్యూటీ హ్యుమర్, వాల్గట్ పౌటర్, హెన్నా పౌటర్, మూన్ మార్క్ పౌటర్, బోటెడ్ ఎల్మెంట్, పెషర్ వంటి అనేక జాతులకు చెందిన పావురాలను మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి వలే పురి విప్పి ఆడేవి, తల నిండా జూలుతో ఆకర్షణీయంగా ఉండేవి, బూట్లు మాదిరిగా కాళ్ల నిండా ఈకలతో విలక్షణమైనవి, రంగు రంగుల రెక్కలు తొడిగినవి.. ఇలా ఇక్కడి విలక్షణమైన పావురాలన్నింటినీ చూసేందుకు మన రెండు కళ్లూ చాలవు. పావురం.. ప్రేమకు ప్రతిరూపం ప్రపంచ వ్యాప్తంగా పావురాలను ప్రేమకు, శాంతికి ప్రతిరూపంగా భావిస్తారు. రెండు పావురాలు జత కడితే ఇక జీవితాంతం ఆ రెండే కలిసి జీవిస్తాయి. జంటలోని ఒక పావురం అనుకోకుండా చనిపోతే మిగిలిన పావురం కూడా బెంగతో చనిపోతుంది లేదా చనిపోయే వరకు ఒంటరిగానే జీవిస్తుంది. అంతే తప్ప వేరొక పావురంతో ఎట్టి పరిస్థితిలోనూ జత కట్టదు. పావురం అంటే ప్రాణం ప్రేమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, జంతువులతోనూ మనకు ప్రేమానుబంధం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పావురాలంటే ప్రాణం. తొలుత కొన్నింటిని ఇంటి వద్దే పెంచేవాడిని. 8 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా వాటి కోసమే ఇల్లు నిర్మించాను. ఉదయాన్నే లేచి వాటిని చూడందే ఆ రోజు మొదలవ్వదు. వాటితో ఉంటే నా వ్యయప్రయాసలు, సమస్యలు అన్నీ మరిచిపోతుంటాను. అన్ని వందల పావురాల్లో ప్రతి పావురం నాకు ప్రత్యేకమే. ఏ ఒక్క పావురాన్ని వేరు చేసినా నేను గుర్తించగలను. నేను లేని సమయాల్లో నా భార్య పద్మావతి, కుమార్తె రవళి చాలా శ్రద్ధతో వాటిని సంరక్షిస్తారు. పావురాలతో నాకున్న అనుబంధాన్ని గౌరవించి నా కుటుంబసభ్యులు అందిస్తున్న సహకారం ఎనలేనిది. – చెరుకువాడ శ్రీనివాసరావు, మానికొండ, కృష్ణా జిల్లా మా నాన్నకు అవి కూడా పిల్లలే.. మేము పుట్టక ముందు నుంచే మా నాన్న పావురాలను పెంచుకుంటున్నారు. నేను, నా సోదరుడు సుధీర్ చదువుకుని స్థిరపడ్డాం. మాకు ఉండటానికి ఇల్లు కట్టినట్టే.. పావురాలకూ ప్రత్యేకంగా ఇల్లు కట్టిన మా నాన్నకు అవి అంటే ప్రాణం. అందుకే నేను వివాహమై అత్తగారింటికి వెళ్లినా, మా నాన్న పెంచుకుంటున్న పావురాలను భవిష్యత్‌లోనూ మేము సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఇదే మా నాన్నకు మేమిచ్చే బహుమానం. – దాసరి రవళి, శ్రీనివాసరావు కుమార్తె -
రూ.లక్షల్లో బెట్టింగ్.. హార్స్ రేసుల్లాగా పావురాల రేస్.. ఇలా తీసుకొచ్చి.. చివరికి..
నాయుడుపేటటౌన్ (నెల్లూరు జిల్లా): తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళిక వేసుకుని సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో పావురాల రేస్‌కు తెరతీశారు. తాజాగా నాయుడుపేటలో రేస్ నిర్వహించేందుకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు హాజరుపరిచామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ అవీన్ ఫిలిప్స్ తిరుచ్చి, చెన్నై తదితర ప్రాంతాల్లో పందెం పావురాళ్లతో రేస్‌లు నిర్వహిస్తుంటాడు. రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తుంటారు. ఈక్రమంలో అతను అధిక లాభాలను గడించాడు. తర్ఫీదు పొందిన పందెం పావురాల కాళ్లకు నంబర్లతో కూడిన ట్యాగ్‌ను కడతారు. వాటిని వాహనాల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాలకు తీసుకొచ్చి వదులుతారు. తమిళనాడులోని గమ్యస్థానానికి ముందుగా వెళ్లే పావురాలను విజేతలు ప్రకటించి పందెం కాసిన వారికి నగదు బహుమతులిస్తారు. హార్స్ రేస్‌లాగే పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దఎత్తున పందెం పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నామని నిందితులు విచారణలో చెప్పారు. పందెం పావురాలతో బెట్టింగ్ రెస్ నిర్వహించేందుకు తమకు చెన్నైలో పోలీసులు, అటవీ ఇతర శాఖల అధికారులు అనుమతి ఇచ్చారని నకిలీ పత్రాలు తమ వద్ద ఉంచుకుని నాయుడుపేటకు ఫిలిప్స్ వచ్చినట్లుగా గుర్తించారు. మినీ లారీలో 521 పందెం పావురాలను 27 ప్లాస్టిక్ బాక్సులో ఉంచి తిరుచ్చి ప్రాంతానికి చెందిన మరో ఆరుగురు సహాయకులను వెంట తీసుకుని బిరదవాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారి వద్దకు ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నాడు. అక్కడ పావురాలను వదిలి పెడుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు టీవీ కృష్ణయ్య, కె.బాలకృష్ణయ్య సిబ్బంది వెళ్లి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 521 పావురాలను నెల్లూరులోని ఫౌండేషన్ ఆఫ్ యానిమల్స్ కేంద్రానికి తరలించారు. మినీ లారీని సీజ్ చేశారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ కేసులో ఏడుగురిని చాకచాక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన ఇద్దరు ఎస్సైలతోపాటు ఏఎస్సై విజయభాస్కర్, హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్‌రాజు, టి.బాలసుబ్రహ్మణ్యం తదితరులను సీఐ అభినందించారు. -
ఈసారి పాలేరులో పావురం
కూసుమంచి: ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు.. కాళ్లకు విదేశీ భాషలతో కూడిన ట్యాగ్‌లతో వస్తున్న పావురాల విషయంలో మిస్టరీ వీడిపోయింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి బుధవారం పావురం రాగా.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన నునావత్ నవీన్ ఇంటి ఆవరణలో గురువారం ఓ పావురం వాలింది. దీని రెండు కాళ్లకు ట్యాగ్లుండగా.. అప్పటికే పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన ఆయన అనుమానపడ్డారు. పావురం కాలికి ఉన్న ట్యాగ్‌పై దాస్ అనే పేరుతో ఫోన్ నంబర్ ఉండగా.. ఆ నంబర్‌కు ఫోన్‌చేసి ఆరా తీశారు. కర్నూలుకు చెందిన వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఆ పావురం తనదేనని, ఇటీవల 50 వరకు పావురాల కాళ్లకు ట్యాగ్లు కట్టి పోటీల్లో భాగంగా వదిలి పెట్టామని వివరించాడు. అవి కరీంనగర్, హైదరాబాద్ చేరుకోవలసి ఉండగా.. కాళ్లకు కట్టిన ట్యాగ్‌పై ఉన్న స్క్రాచ్ కార్డు ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పావురాలతో ప్రమాదం లేదని చెప్పారు. వీలైతే సంరక్షించాలని లేదా రంధ్రాలు కలిగిన బాక్సుల్లో ఉంచి తమ చిరునామాకు బస్సుల ద్వారా పంపించాలని కోరారు. -
కాళ్లకు నంబర్లతో ఆ పావురాలు ఎక్కడివి!
చీమకుర్తి : ప్రకాశం జిల్లా చీమకుర్తి, పేర్నమిట్టల్లోని అపార్ట్మెంట్లపై వచ్చి వాలిన పావురాలు స్థానికుల్లో కలకలం రేపాయి. చీమకుర్తిలోని మన్నం నాగరాజు అపార్ట్‌మెంట్‌పై ఒక పావురం, పేర్నమిట్టలోని లింగా రెడ్డి అపార్ట్‌మెంట్‌పై మరో పావురం బుధవారం వచ్చి వాలాయి. వాటి కాళ్లకు ఏఐఆర్ అనే ఇంగ్లిష్ అక్షరాలతో పాటు 2207, 2019 అనే నంబర్లతో కోడ్లు రాసిన టాగ్లు ఉన్నాయి. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వాలిన పావురాలను చైనా దేశం నిఘా కోసం పంపినట్టుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన స్థానికులు.. చీమకుర్తి, పేర్నమిట్టల్లో ఉన్న పావురాలను చూసి ఆందోళన చెంది మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో అవి చైనా పావురాలు కాదని, చెన్నైకి చెందిన ఆల్ ఇండియా రేసింగ్ పీజియన్ సొసైటీకి చెందిన పావురాలని తేల్చారు. ఆ సొసైటీ వారు పావురాలకు పోటీలు పెడుతుంటారని, వాటికి నంబర్లు ఇచ్చి పంపిస్తుంటారని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
ఒక పావురం రూ.10 కోట్లు, మరొకటి రూ.14 కోట్లు.. సరిపోలేదా ఇంకా ఇస్తాం!
ఎక్కడున్నా వాలిపోతాయి.. ఎక్కడికి వెళ్లినా ఇంటికి చేరిపోతాయి. ప్రేమకు..శాంతికి సంకేతాలు ఈ పావురాలు. ఏ వేడుకలో అయినా ఏ పోటీలో అయినా విజేతగా నిలిచే ఈ పక్షుల కథ అద్యంతం ఆసక్తికరం.. ఆకాశం ఏనాటిదో వీటి అనురాగం కూడా ఆనాటిదే అని మురిసిపోతున్నారు ఆ కుటుంబ సభ్యులు.. గగనపు వీధులలో తిరుగాడుతూ ఊసులు ఊహలు మోసుకువచ్చి విశాఖ వీధులలో నడయాడే ఈ ప్రేమ జీవులపై ప్రత్యేక కథనం.. సాక్షి, విశాఖపట్నం: బెల్జియంలో ఒక పావురం రూ.14 కోట్లు పలికింది. ఇంకొక పావురాన్ని చైనా వాళ్లు రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. పావురాలకు ఇంత ధర ఉందా అని హా..శ్చర్యపోతున్నారా? ఔనండీ అవే రేస్ పావురాలు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ధర ఉంది. ఇటువంటివాటిని హోమింగ్ రేస్ పావురాలంటారు. అటువంటి పావురాలతో బుక్కాసింగ్కు విడదీయరాని బంధం ఏర్పడింది. బుక్కాసింగ్ హైదరాబాద్‌లో ఉండేవాడు. అక్కడే పావురాలను మచ్చిక చేసుకున్నాడు. వాటికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు. ( చదవండి: కాలం మారింది.. ఇక మీ టేబుల్ వద్దకు వెయిటర్స్ రారు, అంతా మీ చేతుల్లోనే! ) బుక్కాసింగ్ చెప్పినట్టే పావురాలు నడుచుకునేవి. సుమారు 40 ఏళ్ల క్రితం ఆ కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం విశాఖ వలస వచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేవారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం కొమ్మాది సమీపంలోని సేవానగర్‌లో కాలనీ కట్టి పేదలకు ఇళ్లు ఇచ్చింది. దీంతో సేవానగర్‌లో స్థిరపడ్డారు. 2016 వరకు రకరకాల రేస్ పావురాలు ఇతని వద్ద ఉండేవి. బుక్కాసింగ్ మృతి చెందిన తరువాత ఆ బాధ్యతను టాంక్ శ్యామ్ సింగ్, హరదీప్ సింగ్ (బుక్కాసింగ్ కుమారులు), రాజ్‌దీప్ సింగ్ (బుక్కా సింగ్ మనుమడు) కంటికి రెప్పలా కాపాడుతూ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో విడిచిపెట్టినా విశాఖ వచ్చేస్తాయి పూనే, ముంబై, చైన్నై వంటి ప్రాంతాలలో వీటిని వదిలి వైజాగ్ వచ్చేలా శిక్షణ ఇచ్చారు. ఒకరోజు ఆర్థిక ఇబ్బందులు కారణంగా రెండు జతల పావురాలు వేరే వాళ్లకు అమ్మాల్సి వచ్చింది. రెండు నెలలు తరువాత అవి తిరిగి వచ్చేశాయి. దాంతో ఇంకెప్పుడూ వీటిని అమ్మకూడదని, ఎంత కష్టమొచ్చినా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దూరాన్ని బట్టీ వర్గీకరణ ఈ పక్షులు ప్రయాణం చేసే దూరాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో షార్ట్, మిడిల్గా ఉంటాయి. 600 కిమీటర్లు ప్రయాణం చేసేది షార్ట్, 1000 కిలో మీటర్లు ప్రయాణం చేసేవి మిడిల్, 1500 నుంచి 3వే కిలో మీటర్లు ప్రయాణం చేసేవి లాంగ్ అని వర్గీకరించారు. డిసెంబర్లో పోటీలు ఈసారి డిసెంబర్లో కోల్‌కతా, బంగ్లాదేశ్‌లు పావురాల పోటీలు ఉంటాయి. అక్కడ వేళ్లేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈసారి కచ్చితంగా విజేతలుగా విశాఖ తిరిగివస్తామని సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన సాయం మర్చిపోలేం మా నాన్నకు పావురాలు అంటే చాలా ఇష్టం. ఆయనకు మిత్రుడైన చక్రవర్తి (పెందుర్తి దగ్గర గుర్రంపాలెం) 2010లో బెల్జియం నుంచి సుమారు రూ.3 లక్షలు వెచ్చించి రేసు పావురాలు బహుమతిగా ఇచ్చారు. వీటి సంతానం తమ వద్ద ఉందని సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉదయం 20–24 రకాల ధాన్యాలు, పప్పులతో తయారు చేసిన ఆల్ మిక్చర్ ఆహారంగా అందిస్తారు. వాతావరణం మార్పులకు అనుగుణంగా ఇవి కూడా అప్పడప్పుడు మారుతాయి. తిన్నాక సుమారు 3గంటలు, ఒక్కోసారి చాలా ఎక్కువ సమయమే కొండలు, కోనలు చూసి వస్తాయి. ముఖ్యంగా కంబాలు కొండ రిజర్వ్ ఫారెస్టు, అప్పుడప్పుడు జూ పార్కు, సీతకొండ, కంబాలు కొండ, విశాఖ బీచ్, ఎర్రమట్టి దిబ్బలు తదితర ప్రాంతాలు చుట్టి వస్తాయి. మధ్యాహ్నం ఇంటికి చేరుకుంటాయి. కాసిన్ని నీరు తాగి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్లీ సాయంత్రం ఆహారం పెట్టాక మళ్లీ అలా సిటీని చుట్టుముట్టివస్తాయి. మా దగ్గర ఉన్న హోమింగ్ రేస్ పావురాలు 600కిలో మీటర్లు 7గంటల్లో ప్రయాణిస్తాయి. ఇంచు మించి గంటకి 90 కిలో మీటర్లు ప్రయాణం చెయ్యగలవు. ఇటీవల పూనేలో వీటిని వదిలితే 3రోజుల్లో ఇంటికి చేరాయి. బెంగళూరు, రాయపూర్, హైదరాబాద్, రాయపూర్, రాజమండ్రి, విజయవాడ, కోల్‌కతా, షొలాపూర్ తదితర ప్రాంతాలలో వదిలిన పావురాలు క్షేమంగా అనుకున్న సమయానికి విశాఖ వచ్చాయి. ( చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. ) నాన్న కల నెరవేరుస్తా వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నాన్నకు చాలా ఇష్టం. పాదయాత్ర చేసేటప్పుడు కలవాలనుకున్నారు. సాధ్యం కాలేదు. మా పావురానికి చీటి కట్టించి ఆయన చేతులు మీదుగా వదలాలి అనుకున్నారు. ఆయన కోరిక తీరకుండానే కాలం చేశారు. నాన్న కల నెరవేర్చేందుకు స్థానిక నాయకుల సాయంతో త్వరలో కలుస్తా. –టాంక్ శ్యామ్ సింగ్ (బుక్కాసింగ్ పెద్ద కుమారుడు) పావురాలు మా ఇంట్లో సభ్యులు మాది మొదటి నుంచి పేద కుటుంబం.. అయినా పావురాలను ఎప్పుడూ వలదలేదు. ఏ లోటు వచ్చినా వాటికి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. నాన్న చనిపోయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయినా వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. –హరదీప్ సింగ్ వీటితో గడపడం చాలా ఆనందం పావురాలతో గడపడం అంటే చాలా ఇష్టం. నాకు స్నేహితులు లేరు. ఇవే నాకు అన్నీ...వాటికి గింజలు వేస్తూ ఆడుకుంటూ ఉంటా. అవి చేసే విన్యాసాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాటితో గడపడానికే ఎక్కువ ఇష్ట పడతా.. –రాజ్‌దీప్ సింగ్, బుక్కా సింగ్ మనుమడు చదవండి: లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్ -
పావురాలను దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కిన యువకుడు
-
కబూతర్ జా..జా
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ఆరోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమించిన పావురాలపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. వీటిని అటవీ ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తుండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనిపై ‘సాక్షి’ ఇటీవల ‘రోగాల రాయబారులు’ పేరుతో కథనం ప్రచురించింది. స్పందించిన బల్దియా కేరళను వణికించిన నిఫా వైరస్ తరహాలో ఉపద్రవం ముంచుకు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని భావించి, నగరంలోని పావురాలను పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీసిబ్బంది శుక్రవారం మోజంజాహీ మార్కెట్లో 500 పావురాలను వలల ద్వారా పట్టుకొన్నారు. అటవీ శాఖ సలహా మేరకు వాటిని శ్రీశైలం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. నగరంలో ఇప్పటికే దాదాపు 6లక్షలకు పైగా పావురాలున్నట్లు అంచనా. వాస్తవానికి ఉద్యాన వనాల్లో పావురాలకు ఫీడింగ్ (ఆహార గింజలు) వేయడాన్ని బల్దియా గతంలోనే నిషేధించింది. ఇందులో భాగంగా శుక్రవారం మోజంజాహీ మార్కెట్లోనూ పావురాల ఫీడింగ్ కోసం విక్రయిస్తున్న గింజలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాదాపు 500 పావురాలను వలల ద్వారా పట్టి, శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలామని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఖైరతాబాద్ డిప్యూటీ డైరెక్టర్ విల్సన్ తెలిపారు. మిగిలిన వాటిని కూడా అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పావురాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని... ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు వెంటనే సోకుతాయని వివరించారు. పావురాలకు ఫీడింగ్ చేయొద్దని... ముఖ్యంగా మార్కెట్లు, ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల వద్ద పావురాలను ప్రోత్సహించవద్దని కోరారు. పావురాలను తరలిస్తున్న సిబ్బంది వ్యాధి కారకాలు... పావురాలు ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటికి ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మల, మూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుంచి ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోతాయి. వీటి రెట్ట చాలా ప్రమాదకరం. రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీల్లోకి చేరిపోతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతినే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆస్పత్రుల పాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలే కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధులు జలుబు, జ్వరంతో మొదలై ప్రాణాంతకంగా మారుతున్నాయి. అందుకే పావురాల రెక్కలు, రెట్టలను ముట్టుకోకూడదు. ఒకవేళ తాకినా చేతులు శుభ్రం చేసుకోకుండా ఏ పనీ చేయకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్లు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. -
నగరంలో పెరుగుతున్న పావురాలతో వ్యాధుల ముప్పు..!
సాక్షి,సిటీబ్యూరో: శాంతికి చిహ్నమై..భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు... ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? ఆహ్లాదం కోసమో లేక పుణ్యం వస్తుందన్న విశ్వాసంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ప్రస్తుతం కేరళను వణికిస్తున్న ప్రాణాంతక ‘నిఫా’ వైరస్ తరహా ఉపద్రవం భవిష్యత్తులో పావురాల వల్ల వచ్చే ప్రమాదం పొంచి ఉందా...? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు వైద్యనిపుణులు, పరిశోధకులు. పావురాల సంఖ్య పెరిగితే భవిష్యత్‌లో రాజధాని గ్రేటర్ హైదరాబాద్ రోగాల అడ్డాగా మారడం తథ్యమని హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయన నివేదిక హెచ్చరిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న పావురాల సంఖ్య ... గ్రేటర్ హైదరాబాద్‌లో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షలకు పైగా ఉండొచ్చని నిపుణుల అంచనా. పావురాలతో ఎదురయ్యే ప్రమాదాలపై ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారి అధ్యయనం చేపట్టింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించకపోతే త్వరలోనే ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వాసుదేవరావు హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనంలోని ప్రాథమిక అంశాలను 2017లో ‘సాక్షి’ తొలిసారి ప్రజల ముందుకు తెస్తోంది. గత రెండేళ్లలో పావురాల సంఖ్య లక్ష వరకు పెరిగిందని, వాటి సంఖ్యను వెంటనే నియంత్రించేందుకు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని వాసుదేవరావు సూచిస్తున్నారు. లేనిపక్షవలో నిఫా వైరస్ కలకలంతో కేరళవాసులు ఎలా భయపడుతున్నారో హైదరాబాద్‌వాసులు సైతం పావురాలను చూసి వణికిపోవాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరలో తమ అధ్యయనాన్ని ముగించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధ్యయనం తుది అంకంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ సాయంతో ప్రత్యేక వివరాలను సేకరించనున్నారు. ప్రాణహాని ఇలా... పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీనిని సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే అది పక్షవాతానికి దారితీసి, చివరకు మృత్యువుకు కారణమవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు పేర్కొన్నారు. అయితే అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించడం లేదన్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉన్నందున ఇప్పుడు మేల్కొనకుంటే నగరం రోగాల అడ్డాగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవీ వాస్తవాలు... ♦ శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ♦ హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పు డు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ♦ భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. విదేశాల్లో నిషేధం... సెంట్రల్ లండన్‌లో పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వేయడాన్ని నిషేధించారు. 2003లోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సెంట్రల్ లండన్ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో దాణా వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి తాజాగా ఆయా ప్రాంతాల్లో నిషేధాన్ని విధించడంతోపాటు నియంత్రణ చర్యల అమలు చేస్తోంది. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పావురాలకు దాణా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. సింగపూర్ తదితర నగరాల్లోనూ జరిమానాలు, హెచ్చరికలతో ప్రజలను కట్టడి చేస్తున్నారు. దాణా వేస్తున్నందునే పావురాల సంఖ్య భారీగా పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటోందని గుర్తించిన పలు అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ ప్రధాన నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు దాణా వేయడంపై నిషేధం విధిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాపం..పావురం..!
సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ :ప్రచండ భానుడి ప్రతాపానికి సకల జీవరాశులు అల్లాడుతున్నాయి. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో పావురాలు ఇలా ప్లాస్టిక్ టబ్‌లో నీటితో దాహార్తి తీర్చుకున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటడంతో ప్రజలంతా డాబాలపై పక్షుల కోసం చిన్న చిన్న టబ్బుల్లో నీరు పోసి పెడితే బాగుంటుంది కదూ..విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ఆవరణలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
పద పదవే వయ్యారి.. పావురమా..!
ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు హవా సాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఒడిశా పోలీసులు రాజుల కాలం నాటి పాత పద్ధతి కనుమరుగుకాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే పావురాళ్లతో సందేశాలు, వర్తమానాలు పంపించడం... మొఘల్ రాజుల కాలంలో ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. యుద్ధక్షేత్రాలతో పాటు అంతఃపురాల్లోకి రహస్యసమాచారాన్ని చేరవేసేందుకు ఈ పద్ధతిని పాటించారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) భువనేశ్వర్ సహకారంతో ఒడిశా పోలీసులు ఇటీవల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన సందేశాలు పంపించేందుకు ఈ ప్రయోగం చేశారు. దీని కోసం భువనేశ్వర్ నుంచి 25 కిలోమీటర్ల దూరమున్న కటక్‌కు 50 పావురాళ్లను పంపించారు. గంటలోపే ఇవన్నీ గమ్యస్థానం కటక్ చేరుకున్నాయి. అయితే ఒడిశాకు ఓ ప్రత్యేకత ఉంది. వైర్లెస్, టెలిఫోన్ లింక్‌లు లేని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 1946లో 200 పావురాళ్లతో కూడిన ‘ఒడిశా పావురాళ్ల సర్వీసు’ ను పోలీసుసిబ్బందికి సైన్యం అందజేసింది. మొదట కొండలతో కూడుకున్న కోరాపుట్ జిల్లా లో దీనిని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు దీనిని విశ్వసనీయమైనదిగా భావించడంతో ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 700 బెల్జియన్ హోమర్ పావురాళ్లతో సందేశాలు పంపించే డ్యూటీని కొనసాగించారు. కొన్నేళ్ల పాటు మారుమూల ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల మధ్య సంబంధాలు, సమాచార మార్పిడికి ఈ విధానం ఉపయోగపడింది. ఒక చిన్న కాగితం ముక్కపై రాసిన సందేశాన్ని ఓ ప్లాస్టిక్ క్యాప్సుల్‌లో పెట్టి ఈ పావురాళ్ల కాళ్లకు కట్టేవారు. ఇవి 15 నుంచి 25 నిమిషాల్లోనే 25 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఈ రకం పావురాళ్ల జీవితకాలం 20 ఏళ్ల వరకు ఉండేది. 1982లో వరదల్లో బాంకీ పట్టణం చిక్కుకున్నపుడు, 1999లో సూపర్ సైక్లోన్, వరదల సందర్భంగా కూడా కటక్ కేంద్రంగా ఈ సర్వీసు ఉపయోగించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు
-
కబూతర్ జా..జా..జా
భారీగా పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు ⇒ జంట నగరాల్లో జయశంకర్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి ⇒ ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణం ⇒ పలు రకాల వైరస్‌లూ విస్తరించే ప్రమాదం ⇒ చర్మ సంబంధిత వ్యాధులూ వచ్చే అవకాశం ⇒ వాటి రెట్టల కారణంగా అపరిశుభ్రత, దుర్వాసన ⇒ జంట నగరాల్లో సుమారు 5 లక్షల కపోతాలు ⇒ పావురాల సంతతి బాగా పెరగడంతో ఇతర పక్షులకు ప్రమాదం ఒహోహో.. పావురమా.. అంటూ ఒకప్పుడు పాటలు పాడుకునేవారు.. వాటితో ప్రేమ లేఖలూ పంపుకొనేవారు.. తెల్లని పావురాలను శాంతికి చిహ్నంగానూ భావిస్తారు. వాటికి దాణా పెడితే చనిపోయిన మన పెద్దల ఆత్మలు సంతృప్తి చెందుతాయనేదీ కొందరి నమ్మకం. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం పావురాలు అశాంతి రేపుతున్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు, కొన్ని రకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు వేసే రెట్టతో అపరిశుభ్రత, దుర్వాసన నెలకొని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ రామారావు విశ్రాంత ఉన్నతాధికారి.. ఆయన మనవరాలు కొంత కాలంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఓరోజు వారి ఇంటికి వచ్చిన స్నేహితుడైన వైద్యుడు ఆ అమ్మాయి బెడ్రూమ్ పరిసరాలు గమనించి.. ఆ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో పావురాలు ఉండటమే ఆస్తమాకు కారణమని తేల్చారు. పావురాలు అక్కడ ఉండకుండా చేయాలని సూచించారు. అలా చేయడంతో మూడు నెలల్లోనే ఆ అమ్మాయి కోలుకుంది. దుమ్ము, కాలుష్యం వంటివి ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పావురాలూ ఈ సమస్యకు కారణమవుతున్నాయి. సాధారణంగా పావురాల రెట్టల వల్ల ఇంటి గోడలు, పైకప్పు పాడవుతున్నాయన్న ఫిర్యాదులేగాని.. వాటి వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందన్న సంగతి చాలామందికి తెలియడం లేదు. జంట నగరాల్లో భారీ సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు అపార్ట్మెంట్లు, ఇతర భవనాలను ఆవాసాలుగా మార్చుకుని.. జనానికి అతి దగ్గరగా మసులుతున్నాయి. దాంతో పావురాల రెక్కల నుంచి వచ్చే ధూళి, రెట్టల్లోని అవశేషాలు ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. కిటికీలు, వెంటిలేటర్లలో మసలే పావురాల నుంచి వ్యాధికారక పదార్థాలు ఇళ్ల గదుల్లోకి చేరుతున్నాయి. ఇటీవల మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి కూడా వైద్యులు ఇదే తరహా సూచనలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడటానికి పావురాలే కారణమని తేలింది. లక్షల సంఖ్యలో పావురాలు కబూతర్ ఖానా.. కుతుబ్‌షాహీల కాలంలో పాత నగరంలో ఏర్పాటైన పావురాల కేంద్రం. 300 గూళ్లతో ఉండే ఆ నిర్మాణంలో వందల సంఖ్యలో కపోతాలు ఉంటాయి. జనం వాటికి తిండి గింజలు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి పావురాల కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, మొత్తంగా ఎన్ని పావురాలు ఉంటాయనే విషయాన్ని తేల్చేందుకు జయశంకర్ విశ్వవిద్యాలయంలోని పక్షి శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో కొంత కాలంగా అధ్యయనం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం జంట నగరాల్లో 490 చోట్ల పావురాలకు తిండి గింజలు వేసే కేంద్రాలు వెలిశాయి. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్కో చోట 200 నుంచి 15 వేల వరకు పావురాలు ఉంటున్నాయి. మొత్తంగా జంట నగరాల్లో దాదాపు 5 లక్షల వరకు పావురాలు ఉన్నట్లు అంచనా. వైరస్, పురుగులు విస్తరించే ప్రమాదం ‘‘పావురాలకు తిండి గింజలు వేసి ఆనందించటం సహజం. కానీ అవి మనకు దగ్గరగా మసలుతుండటంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది ప్రమాదకరమే..’అని వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగాధిపతి వాసుదేవరావు తెలిపారు. పావురాలను ఓ రకమైన నల్లుల వంటి పురుగులు ఆశ్రయిస్తు న్నట్టు తేలింది. పావురాలు ఇళ్ల కిటికీలు, వెంటిలేటర్ల వద్ద ఉన్నప్పుడు అక్కడ పడే పురుగులు.. తర్వాత ఇళ్లలోకి చేరుతున్నాయి. దీంతో పావురాల నుంచి ప్రమాదకర వైరస్ మనుషుల్లోకి చేరే ప్రమాదం ఉందని వాసుదేవరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది వ్యాధులు విస్తరించేందుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఇక చర్మ సంబంధిత వ్యాధులకూ పావురాలు కారణమవుతున్నాయని పలు వురు వైద్యులు చెబుతున్నారు. విమానాలకూ తప్పని ముప్పు... ఎగురుతున్న విమానాలను పక్షులు ఢీకొంటే విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్న సంగతి తెలిసిం దే. ఆ ప్రమాదమే కాదు శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త సమస్య కూడా వచ్చిపడింది. విమానాలు నిలిపేందుకు, మరమ్మతులు చేసేందుకు విమానాశ్రయంలో భారీ హ్యాంగ ర్స్ (షెడ్లు లాంటివి) ఉంటాయి. వంద అడుగుల వరకు ఎత్తుండే ఆ హ్యాంగర్స్పై పావురాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి పావురాలు వేసిన రెట్టలు విమానాలపై పడి కొత్త సమస్యకు కారణమైంది. వాటి రెట్టల్లో ఆమ్ల అవశేషాలుంటాయి. రెట్ట ఎక్కువసేపు విమా నంపై ఉంటే ఆ ప్రాంతంలో మచ్చలేర్పడతాయి. అవి చిన్నపాటి రంధ్రాలకు కారణమై విమానాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయం హ్యాంగర్స్లో పావురాల నిరోధాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. నాణ్యతలేని గింజలతో.. కొందరు పురుగుపట్టిన, ముక్కిన, తడిసి బూజుపట్టిన, పాడైన గింజలను తక్కువ ధరకు సేకరించి పావురాల కేంద్రాల వద్ద అమ్ముతున్నారు. ప్రజలు వాటిని కొని వేస్తుండడంతో పావురాలకు రోగాలు వస్తున్నాయి. అలా కొన్ని సందర్భాల్లో ఇళ్లలోని కిటికీ సందులు, పైకప్పుల్లో చనిపోతున్నాయి. ఇది కూడా అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులకు కారణమవుతోంది. గింజలు వేయటం మానుకోవాలి పక్షులను ఆదరించటం జీవవైవిధ్యానికి ఎంతో అవసరమేనని, పక్షులకు గింజలు వేసినంత మాత్రాన వాటిని ఆదరించినట్టు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇళ్ల పైకప్పులపై పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేస్తే సరిపోతుందని, గింజలు వేయవద్దని సూచిస్తున్నారు. గింజలు దొరకకుంటే పక్షులు వాటికి సహజమైన వేటకు వెళ్లిపోతాయని.. అది పక్షులకు, ప్రజల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. ఇతర పక్షులకూ ప్రమాదం తిండి గింజలకు అలవాటు పడిన పావురాలు వాటి సహజ గుణాలను వదిలేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయమే వేటకు వెళ్లడం పక్షుల లక్షణం. కానీ ప్రజలే తిండి గింజలు వేస్తుండడంతో పావురాలు ఆహారం కోసం వెళ్లకుండా.. ఒకే చోట ఉంటున్నాయి. ఈ క్రమంలో తమ తిండికి పోటీ రాకుండా ఇతర రకాల పక్షులను తరిమేస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇక లక్షల సంఖ్యలో పావురాలు పెరిగిపోతుండడంతో.. నగర శివారు ప్రాంతాలకు, గ్రామాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిచ్చుకలు, కాకులు, చిలుకలు ఇతర పక్షులను తరిమివేస్తున్నాయి. దాణా కోసం రూ.50 కోట్లు! సగటున ఒక్కో పావురం రోజుకు 22 గ్రాముల వరకు గింజలు తింటాయని అంచనా. పావురాల కోసం ఏర్పాటు చేసే కేంద్రాల వద్ద రూ.10, రూ.20 చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో గింజలు అమ్ముతున్నారు. జనం, సందర్శకులు వాటిని కొని పావురాలకు వేస్తున్నారు. దాంతో పావురాల సంఖ్య బాగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న పావురాలకు పెడుతున్న గింజల కోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్లు అధ్యయన బృందం అంచనా వేసింది. పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్! సంతానోత్పత్తి నియంత్రణకు బీఎంసీ యోచన భాగ్యనగరంలోనే కాదు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ పావురాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ పావురాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో వాటి రెట్టలు, ఇతర అవశేషాల వల్ల ఆస్తమా.. క్షయా తదితర వ్యాధుల బారి న ప్రజలు పడుతున్నారు. ముంబైలోని ప్రతి పది ఆస్తమా కేసుల్లో ఒకటి పావురాల వల్ల వచ్చిందే. ముఖ్యంగా చిన్నారుల్లో ఈసమస్య అధికంగా ఉంది. ముంబై అనేకాదు.. పుణే, థానే తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రంగంలోకి దిగాల్సి వచ్చింది. పావురాల సంఖ్యను నియంత్రణకు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేందుకు సిద్ధమవుతోం ది. దశాబ్దం క్రితం వీధి కుక్కలకు సంతా నోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన మాదిరిగానే ఇప్పుడు పావురాలకు కూడా చేయాలని యోచిస్తోంది. తొలుత ఈ ప్రతి పాదనను ఓ ముంబై కార్పొరేటర్ తెరపైకి తెచ్చారు. ఓవిస్టాప్ అనే సంతానోత్పత్తి నియంత్రణ ఔషధం సహాయంతో బీఎంసీ పావురాల విస్ఫోటనాన్ని అరికట్టవచ్చని ఆయన చెపుతున్నారు. ఈ పద్ధతి ప్రకారం.. పక్షుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే నికర్ బాజిన్‌తో మిళితమై మొక్కజొన్న విత్తనాల తో కూడిన ఓవిస్టాప్ ఔషధాన్ని పావురాలకు ఆహారంగా వేస్తారు. ఈ పిల్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్పెయిన్‌లో ని ఒక పట్టణంలో ఇలాగే పావురాల సంతా నోత్పత్తిని నియంత్రించారని, ఈ పిల్ వినియోగంతో వాటి సంఖ్య 80 శాతం తగ్గిందని సదరు కార్పొరేటర్ చెపుతున్నారు. కేంద్రానికి ప్రతిపాదన.. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే బీఎంసీ ఆరోగ్య కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి అను మతి కోసం మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఈ ప్రతిపాదనను పంపించింది. ఇది తమ పరిధిలో లేదని, రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) డైరెక్టర్ చేతిలో ఉందని, దీని అమలుకు అంగీకరించాలని తాము ఎఫ్డీఏని కోరినట్టు ఒక బీఎంసీ అధికారి వెల్లడించారు. దీన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు పంపింది. ఈ పిల్ స్వదేశంలో లభించదు. దిగుమతికి డీసీజీఐ అనుమతి తప్పనిసరి. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఇక పావురాలతో పందేలు
నెల్లూరు జిల్లాలో చెన్నైకి చెందిన జూదరులు.. రూ. లక్షల్లో పందేలు చావలి (పెళ్లకూరు): సంక్రాంతి పండుగ వస్తే కోడి పందేలు నిర్వహించడం చూశాం. అయితే ఇప్పుడు కొందరు జూదరులు పావురాల పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చావలి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో ఎగువచావలి, దిగువచావలి గ్రామాల మధ్యలో చెన్నైకి చెందిన కొందరు రెండు లారీల్లో అక్కడకు చేరుకున్నారు. లారీల్లోని ప్రత్యేక పెట్టెల్లో ఉంచిన పావురాలను కిందకు దించి వాటి కాళ్లకు దారాలు కట్టి వందల కొద్ది పావురాలను గాల్లోకి విడిచిపెట్టారు. అవి గుంపులు గుంపులుగా చెన్నై వైపు ఎగిరిపోయాయి. వెంటనే వాటిని అనుసరిస్తూ జూదరులు వచ్చిన వాహనాల్లో చెన్నైవైపు వెళ్లిపోయారు. కాగా ఎవరి పావురాలు తిరిగి అవి ఉంటున్న ప్రదేశానికి వెళతాయో వారు పందెం గెలిచినట్టని, ఇందుకు సంబంధించి రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారని సమాచారం. -
పావురాలూ పదాలను గుర్తిస్తాయి!
బెర్లిన్: పావురాలు ఇంగ్లిష్ పదాలను నేర్చుకోగలవని పరిశోధనలో తేలింది. ఇలాంటి సంక్లిష్ట పరీక్షల్లో బబూన్ జాతి కోతులతో సమానంగా పక్షులు కూడా ప్రతిభ చూపిస్తాయని న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీ, జర్మనీలోని రుహుర్ వర్సిటీలు అధ్యయనంలో గుర్తించాయి. స్క్రీన్‌పై వచ్చే నాలుగు ఇంగ్లిష్ అక్షరాల పదాలను గుర్తించేలా పావురాలకు శిక్షణ ఇచ్చారు. కొన్ని గుర్తులను కూడా గుర్తించేలా చేశారు. గుర్తుల నుంచి అక్షరాలను పావురాలు వేరు చేసి గుర్తుపడుతున్నాయా అని పరీక్షించారు. 26 నుంచి 58 అక్షరాలతో కూడిన పదాల సముదాయాలను, 8 వేలకు పైగా గుర్తులను చూపించారు. అప్పుడు కొత్తగా చూపిన పదాలను పావురాలు కచ్చితంగా గుర్తించాయి. ఎప్పుడో 30 కోట్ల ఏళ్ల కింద మానవుల నుంచి పావురాలు(పక్షి జాతి) పరిణామం చెంది, వేర్వేరు మెదడు అమరిక ఉన్నా మానవుల్లాగే అక్షరాల్ని గుర్తించే సామర్థ్యం ఒకేలా ఉండటం ఆశ్చర్యమని శాస్త్రవేత్తలు చెప్పారు. -
పావురాలకు తెలివెక్కువే..!
మందలోని ఒక గొర్రె ఎలా వెళితే అలా అన్ని గొర్రెలు గుడ్డిగా ఫాలో అయిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే పావురాలు గొర్రెల్లాగా కాదట.. తాము వెళ్లాల్సిన దారి గురించి తమ నేత తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ఊరుకోవట. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలసి చర్చించుకుని నిర్ణయించుకున్నాకే ముందుకు కదులుతాయ ని లండన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ మోడలిం గ్ ద్వారా తప్పుడు సమాచారంతో నిర్ణయాలు తీసుకునే పావురాల నేతల తప్పులు గుం పులో అట్టడుగున ఉన్న వారికీ చేరిపోతాయని అవి కూడా గొర్రెల మాదిరి గానే ఫాలో అవుతాయని అంచనాకు వచ్చారు. అయితే 5 పావురాలు ఉన్న గుంపులతో 8 సార్లు జరి పిన ప్రయోగం ఈ అంచనాను మార్చేసింది. ఈ గుంపులన్నింటినీ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడంతోపాటు ఒక్కో గుంపులో కొన్ని పావురాళ్లను క్లాక్షిఫ్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ప్రభావితం చేశారు. గుంపులో ‘పెద్ద’ పావురం క్లాక్షిఫ్టింగ్ ప్రభావానికి లోనై తప్పుడు సమాచారం అందించినా.. మిగిలినవి ఆ తప్పులను సరిచేసుకుంటాయని తెలిసింది. -
విజయవాడలో పావురాలతో పందేలు
-
చిన్న చిన్న సంతోషాలకు వందనం
కళింగాంధ్రలో రోడ్లు రక్తసిక్తం. ఫలానా ఈవెంట్లో భారీ అగ్ని ప్రమాదం. ఫలానా పెద్దమనిషి మీద సెక్సువల్ హెరాస్మెంట్ కింద కేసు. బ్యాంకు లూటీ. నమ్మించి ముంచిన ఫలానా సంస్థ. ఈ సీజన్‌కు అంతు లేదు. కాని వీటన్నింటి మధ్య ప్రకృతి కటాక్షిస్తున్న ప్రమోదాలను మిస్ అవుతున్నామా? వాటికి ప్రకటించాల్సినంత కృతజ్ఞత ప్రకటిస్తున్నామా? ప్రభాతం పావురాలది. అవే వేకువ వచ్చిందన్న సంగతిని బాల్కనీలో వాలి కువకువలతో తెలియచేస్తాయి. శ్రీ సూర్యనారాయణుడు... పొల్లు పోడు. వల్ల కాదు అని అనడు. ప్రతి నిత్యం ఉదయిస్తాడు. ఆయన ప్రసరింప చేసే కాంతి. ప్రాణం పోసే వెలుతురు. మరో ఉదయం. మరో ఊపిరి. సంపూర్ణంగా బతకడానికి మరో రోజు. ఎంత కటాక్షం ఇది. దేవుడా నీకు కృతజ్ఞతలు. ఆఫీసుకు టైమ్‌కు వెళ్లాలి. సిగ్నల్ సరిగ్గానే దాటాము. హార్ష్‌గా ఓవర్ టేక్ చేసిన కుర్రాణ్ణి ఏమనకుండానే ఉన్నాము. ఒక కారు మనల్ని ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఒక టూ వీలర్‌ని మనం కూడా ఏమీ చేయకుండానే తప్పించాము. ఆఫీసుకు అలా వెంట్రుకవాసి అపాయం కూడా కలగకుండా చేరిపోయాం. రోజూ దక్కుతున్న వరం ఇది. రోజూ ప్రాణశక్తులు ప్రసాదిస్తున్న వరం. ఆ వరానికి కృతజ్ఞతలు. తినడానికి ఆ పూటకు పప్పుచారు ఉంది. నంజుకోవడానికి అరటికాయ తాలింపు. తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు. తోడుగా కాస్త షేర్ చేసుకుంటారా అని స్నేహంగా పలకరించే కొలీగ్స్. ఒకరు వక్కపొడి ఇస్తారు. మరొకరు పన్ను మెరిసేలా నవ్విస్తారు. అద్భుతమైన మధ్యాహ్నం ఇది. ఎడారిలో ఉంచకుండా, దారుణమైన దుర్భిక్ష ప్రాంతంలో ఉంచకుండా, తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని ప్రదేశంలో ఉంచకుండా, ప్రశాంతంగా కూచుని నాలుగు ముద్దలు తినే పరిస్థితి లేని ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచకుండా దైవం కల్పించిన వరం ఇది. ఇవాళ... మనకు మాత్రమే వరం. కృతజ్ఞతలు. నాలుగ్గంటలప్పుడు ఫోన్ వస్తుంది. ఊళ్లో నుంచి అమ్మ పలకరిస్తుంది. పెరట్లోని జామచెట్టుకు మంచి మంచి కాయలు కాస్తున్నాయట. కోసి మూటగట్టి బస్సుకు వేస్తే ఉదయాన్నే తీసుకుని మనమలకు తినిపించాలట. నాన్న పలకరిస్తాడు. పంపిన డబ్బు సరిపోగా మిగిలిన వాటిని దాచి పెట్టి మనవరాలికి కాలి పట్టీలు కొన్నాడట. ఎందుకు నాన్నా... అంటే వినడు. ఈసారి వచ్చినప్పుడు తనే స్వహస్తాలతో తొడుగుతాడట. పలకరించడానికి అమ్మా నాన్నా ఉన్నారు. సొంత ఊళ్లో హాయిగా ఉన్నారు. అక్కడి నుంచి ఆశీర్వచనం నిత్యం పలుకుతూనే ఉంటారు. వారు ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. మనం ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. ఇరువురూ మాట్లాడుకోవడానికి ఈ సాయంత్రం ఉండటం ఎంతో దయామయమైన మరో కటాక్షం. దానికి వందనం. పచ్చి మిరపకాయ ఆల్రెడీ మన కోసం పండి ఉంది. శనగ పప్పును కూడా మన కోసం ఎవరో పండించారు. ఆ రెంటినీ కలిపి కాసింత ఉప్పు జల్లించి పొయ్యి మీద బాణలి పెట్టి వేడి వేడిగా వేయించి పెట్టడానికి ఒక మనిషిని ఏ పుణ్యాత్ములో కని సిద్ధం చేసి ఉన్నారు. ఈ సాయంత్రం అతను ఉన్నాడు. ఈ సాయంత్రం మనం ఉన్నాం. అతని చేతి మీదుగా నాలుగు బజ్జీలను తినే అదృష్టం చిన్న అదృష్టం కాదు. అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది లేనప్పుడు దాని విలువ అమూల్యం. ప్రకృతి మనల్ని సంతోషపెట్టడానికి స్వాంతన పరచడానికి కాసింత సరదా పడటానికి అను నిత్యం వరాలు అందిస్తూనే ఉంటుంది. ఇదీ ఒకటి. వందనం. ఇంటికి వెళితే భలేగా ఉంటుంది. పక్క ఫ్లాట్ పిల్లవాడి బర్త్ డే అట. వాడు కొత్త బట్టలు కట్టుకొని భలేగా ఉంటాడు. పక్కనున్న పిల్లలందరినీ పిలిచి భలేగా కనిపిస్తాడు. పిల్లలందరూ అద్భుతాలు. నవ్వితే రోగాలు పోతాయి. వారు తాకితే స్వస్థత పడతాము. వారి మాటలు సంగీతం. వారి అల్లరి ఆయుష్షు. అలాంటి పిల్లలతో గడితే ఆ కాస్త సమయం భలే బాగుంటుంది. కేక్ తినొచ్చు. చాక్లెట్ బుగ్గన పెట్టుకోవచ్చు. గొంతు ఏ మాత్రం బాగ లేకపోయినా జంకూ గొంకూ లేకుండా పెద్దగా హ్యాపీ బర్త్ డే టూ యూ పాడొచ్చు. ఈ సాయంత్రాన్ని వెలిగించడానికి ప్రకృతి కల్పించిన ఒక సందర్భం అది. కృతజ్ఞతలు. శ్రీమతి ఆదరంగా మాట్లాడుతుంది. పిల్లలు ఆవేళ స్కూల్లో ఏమేం ఘనకార్యాలు చేశారో పూస గుచ్చుతారు. కొత్త సోఫా కొనడానికి ఇంకా ఎంత డబ్బు పోగేయ్యాలో కాసేపు లెక్కలు. ఈసారి వెచ్చాల్లో చేయవలసిన మార్పులు. డాబరా, పెప్సొడెంటా చిన్న పాటి తగువు. పిల్లల కొత్త షూస్ ప్రపోజల్ మీద సంతకం. అన్నీ అయ్యాక స్కూటర్ మీద అందరూ బజారు దాకా వెళ్లి అరటి పండ్లు, పాపిన్స్, మరుసటి రోజు ఉదయానికి ఆరంజి టిక్ టాక్స్.... తిరిగొచ్చి లిఫ్ట్ ఎక్కబోతుండగా వాచ్మెన్ వచ్చి కూతురి పెళ్లి అనంటే ఉన్నంతలోనే చేయదగ్గ సహాయం చేసేసి అతడు దండం పెడుతుంటే భలే వాడివే అంటూ భుజం మీద చనువుగా చేసే చరుపు.... చాలా చిన్న చిన్న అతి స్వల్పమైన ఆనందాలు... ప్రకృతి ఆ వేళకు సిద్ధం చేసిన అపురూపమైన క్షణాలు.... ఎవరికి దక్కుతాయివి... ఎంతమందికి దక్కుతున్నాయి... మనకే సొంతం... మనకు మాత్రమే సొంతం... దేవుడా నీకు వందనం. రాత్రి వస్తుంది. రోడ్లను నెమ్మదింప చేయడానికి, పరుగును నెమ్మదింప చేయడానికి, వేడిని నెమ్మదింప చేయడానికి రాత్రి వస్తుంది. రిలీవర్‌గా తెల్లటి యూనిఫామ్‌లో చంద్రుడు డ్యూటీ ఎక్కుతాడు. గాలి నిదుర లేస్తుంది. ఉద్యోగం చేసి అలిసొచ్చిన తల్లి తన అలసటనంతా పిల్లలకు అన్నం తినిపించడంలో మరిచిపోతుంది. టీవీలో సంగీతం ప్రోగ్రామ్‌లో ఎవరో కాస్త మంచి పాటలే పాడతారు. మనింట్లో మన కుటుంబంతో మనకిష్టమైన భోజనం చేసే రాత్రి... ఎవరూ గమనించిన అపురూపమైన క్షణాలు... ఎవరూ విలువ ఇవ్వని అమూల్యమైన ఘడియలు... మనల్ని ఉత్సాహపరచి గడిచిపోతాయి. ఇది వాట్సప్పులు కాసిన్ని జోకులు చూసి నవ్వుకునే సమయం. ఇది అయినవారితో కాసేపు చాట్ చేసే సమయం. ఇది ఏవో ఫన్నీ వీడియోలు చూసి కాసింత తెరిపిన పడే సమయం. ప్రకృతి మనల్ని సురక్షితంగా ఇల్లు చేర్చేసింది. తలుపుకు గడియ పెట్టి హాయిగా నిద్ర పొమ్మంటోంది. రోజు ప్రమోదంగా గడిచింది. తెలియకుండానే వరంగా గడిచింది. దేవుడా... వందనాలు. నిద్రేమి తక్కువ కనికరం చూపుతుందా? దయ తలిచి మంచి మంచి కలలు ఇస్తుంది. చూడని ప్రదేశాలు తిప్పుతుంది. తీరని దప్పికలను తీర్చుతుంది. కనపడని మనుషులను కలుపుతుంది. వినపడని రాగాలను వినిపిస్తుంది. ఒక్క నిద్రలో వేయి జన్మలు. ఆ అనుభవాలన్నింటితోనూ దిగ్భ్రమను ప్రసాదిస్తుంది. వాహ్... ఏమి రాత్రి ఇది. భూకంపాలు రాని, బీభత్సాలు కాని, ఎటువంటి ఉత్పాతాలు, యుద్ధాలు, మర ఫిరంగులు చుట్టుముట్టని ప్రశాంతమైన రాత్రి. ఎంతమందికి ఇలాంటి రాత్రులు దొరుకుతున్నాయి. మనకు మాత్రమే సొంతం. మనకే ఈ వరం. దేవుడా ముమ్మాటికి నీకే కృతజ్ఞతలు. మళ్లీ తెల్లారుతుంది. చాలా మామూలుగా అనిపించే ఒక గొప్ప ఉషోదయం పలకరిస్తుంది. ఇలా మామూలుగా గడిచిపోతే చాలు. ఈ సామాన్యమైన అపురూప క్షణాలను ప్రకృతి ప్రసాదిస్తుంటే అదే పది వేలు. - నెటిజన్ కిశోర్ -
హర్యానాలో మరో దారుణం
-
హరియాణాలో మరో దారుణం
చండీఘడ్: హరియాణాలో దళిత కుటుంబంపై దాడి, ఇద్దరు చిన్నారుల హత్య మరవకముందే రాష్ట్రంలో మరో దళిత బాలుడి మరణం కలకలం రేపింది. పావురాలు దొంగిలించాడనే నెపంతో విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ మైనర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గొహనా గ్రామానికి చెందిన గోవింద(14) పై ... యింట్లో పావురాలు ఎత్తుకెళ్లాడని పొరుగువారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ మరునాడు ఉదయానికి గోవింద శవమై తేలాడు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా బాలుడు పోలీస్ స్టేషన్ లో ఉరి వేసుకుని చనిపోయినట్లు కేసు నమోదు అయింది. అయితే పోలీసులే తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని గోవింద కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని విడిచిపెట్టడానికి పదివేల రూపాయల లంచం తీసుకుని, తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతుని బంధువులు నిరసన చేపట్టినా అధికారులెవ్వరూ స్పందించకపోవడంతో తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ పట్టాలపై సుమారు మూడుగంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత పోలీసు అధికారులపై హత్యానేరం కింద నమోదు చేశారు. మృతుని సోదరుని ఫిర్యాదుతో ఎస్ఐ, ఎఎస్ఐలు సుభాష్, అశోక్ లపై కేసు నమోదు చేశామని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. -
పరిపరి శోధన
పావురాల కళాదృష్టి మనుషులకే కాదు, పావురాలకూ కళాదృష్టి ఉంటుందట! బాల కళాకారులు సృష్టించే కళాఖండాలలో బాగున్నవేవో, బాగులేనివేవో అవి ఇట్టే గుర్తు పట్టేస్తాయని జపాన్‌లోని కీయో వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి వాళ్లు కొన్ని పరీక్షలు కూడా చేశారు. చిన్న పిల్లలతో గీయించిన బొమ్మల్లో బాగున్నవి, బాగులేనివి మొదట కొందరు మనుషులతో వేరు చేయించారు. తర్వాత, కాస్త శిక్షణ ఇచ్చిన పావురాలతో అదే పని చేయించారు. ఇలా కొన్నిసార్లు జరిపిన పరీక్షల్లో బొమ్మల్లో బాగున్నవి, బాగులేనివి పావురాలు తేలికగానే గుర్తించాయని ఈ పరిశోధకులు చెబుతున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం
-
కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం
ఏలూరు : కాంగ్రెస్ క్యార్తకర్తల అత్యుత్సాహం రెండు మూగ ప్రాణులను బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తులు అతి ప్రదర్శించారు. శనివారం కొవ్వూరులో రఘువీరా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. బాణాసంచా పేల్చుతూ... తారాజువ్వలకు రెండు పావురాలను కట్టారు. తారాజువ్వలను పేల్చటంతో ఆ పావురాలు మృతి చెందారు. అయితే ఈ సమయంలో రఘువీరారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఆయన ఏమీ మాట్లాడకపోవటంతో ....ఆర్భాటం కోసం పక్షుల ప్రాణాలు తీస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పిడుగుపాటుతో నేలకొరిగిన 200పావురాలు
నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం గూడలిలో పిడుగుపాటుకు 200 పావురాలు చనిపోయాయి. బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గూడలి పడమర వీధిలో ఉన్న జనార్దనస్వామి ఆలయం గాలిగోపురంపై పిడుగుపడింది. దీంతో గాలిపోపురంలో తలదాచుకున్న సుమారు 200 పావురాలు మృత్యువాత పడ్డాయి. గురువారం తెల్లవారే సరికి ఆలయ పరిసరాల్లో పావురాల కళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గ్రామస్తుల గుర్తించారు. గతంలోనూ ఈ ఎత్తైన ఆలయం శిఖరంపై పిడుగులు పడిన సందర్భాలున్నాయి. -
కిలకిలరావాలు కొన్ని నిష్ర్కమణ గీతాలు
సీతాకోకచిలుక ఓ నిత్యకల్యాణి మరి మరి బ్రతిమిలాడినా మచ్చిక్కాని ఆమె లాలిత్యాన్ని ఊహలోకి ఆహ్వానం పలుకుతాను పావురం నా సౌందర్య సఖి ఊదావృత్తాల కళ్లలోంచి ఆ చిప్పిల్లే కరుణని మధిర వలె అనుదినం నేను చిత్తుగా తాగుతాను కోకిల ఆరాధ్యదేవత అజ్ఞాతంగా అవనిని వర్ధిల్లమనే ఆ ఆకుపచ్చని పునరాకాంక్షలో కవి పరంపరగా పాలుపంచుకొన్నాను రామచిలుక జన్మతః వయ్యారి ఉరుముల మెరుపులతో ఊరించే వర్షాగమ వేళ కారు మబ్బులని గమ్మున గమ్మున కురవమని ఆమె కిలకిలవంపుల కలవరంలో రమణీయంగా కోరుకోవడం విన్నాను పిచ్చుక నా ఒక్కగానొక్క గారాల పుత్రిక ప్రతి ఇద్ద్దరి నిస్తంత్రీ సంభాషణలో అంతూ దరీ లేక వీచే వడగాడ్పుకి అదృశ్యమైన ఆ చిన్నారిపొన్నారిని ఎవ్వరైనాగాని ఎక్కడైనా చూశారా అని గడపగడపకూ తిరిగి అడుగుతున్నాను - నామాడి శ్రీధర్ 9396807070 -
దాణా-ఠికానా
షహర్‌కీ షాన్ ‘పావురాలకు గింజలేస్తే మన భావితరానికి ఆకలి బాధ ఉండదని మా తాత చెప్పాడు. నేను వేసిన గింజలను తృప్తిగా తింటూ పావురాల గుంపు అటూ ఇటూ ఎగురుతూ ఉంటే నా మనసులోని సమస్యలు మటుమాయమైనట్టు అనిపిస్తుంది. 35 ఏళ్లుగా నేను వాటికి గింజలేస్తున్నాను. ఇప్పుడు నా మనవడికి కూడా దాన్ని అలవాటుగా మార్చాను’ పాతనగరంలోని దారుల్‌షిఫాకు చెందిన జాలారామ్ మాటిది. నగరంలోని సైఫాబాద్ టెలిఫోన్ భవన్ సమీపంలో దశాబ్దన్నర క్రితం విశాలమైన మర్రిచెట్టు ఉండేది. ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించాలని తెగ తాపత్రయపడుతున్నట్టు నలుమూల లా విస్తరించి ఉండేది. సాయంత్రం అయ్యిందంటే దానిపై దాదాపు 8 వేల పక్షులు గుంపులుగుంపులుగా చేరుకునేవి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అప్పట్లో నగరంలో పక్షులపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన లెక్కిది. రకరకాల పక్షులకు ప్రధాన ఆవాసాలపై వారు నిర్వహించిన సర్వేలో ఈ చెట్టు కూడా ఓ ఆవాసమనే తేలింది. కానీ అధికారుల అనాలోచిత చర్య ఫలితంగా ఆ వృక్షం ఇప్పుడు మాయమైంది. అదొక్కటే కాదు... అలాంటి ఎన్నో వృక్షాలు కనుమరుగయ్యాయి. ఆ వృక్షాలే ఆవాసంగా ఉన్న పక్షుల ‘గూడు’ చెదిరి ఎటో ఎగిరిపోయాయి. కానీ ఓ ‘పక్షి’ మాత్రం ఎక్కడకూ పోనంటోంది. ఇప్పుడు నగరంలో ఏ మూల చూసినా వాటి రెక్కల సద్దు వినిపిస్తుంది. అదే పావురం. కొన్ని చిన్నచిన్న విశ్వాసాలు పావురాలకు ప్రాణం పోస్తోంది. ఏ పక్షి జాతి ఉనికి ప్రమాదంలో పడ్డా పావురాలకు మాత్రం కష్టకాలం రాలేదు. వాటి మనుగడ ప్రశ్నార్థకంలో పడకూడదనే చైతన్యం ప్రజల్లో ఇప్పటికిప్పుడు రగిలింది కాదు. వందల ఏళ్లుగా వస్తున్న ఓ ఆచారం వాటికి వరంగా మారింది. పావురాలకు గింజలు వేస్తే పుణ్యం వస్తుందనే అభిప్రాయం హిందూ, ముస్లింలలో బలంగా ఉంది. ఈ నమ్మకమే వాటికి శ్రీరామరక్షగా మారింది. ఇక పావురాల రెక్కల నుంచి వచ్చే గాలి సోకితే అనారోగ్యం దూరమవుతుందనే అభిప్రాయం మరికొన్ని వర్గాల్లో ఉంది. దీంతో తమ ఇంటి ఛాయల్లోనే పావురాలు పెరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరభారతదేశానికి చెందిన వారిలో ఈ నమ్మకం ఎక్కువ. వీరు ఇంటి కిటికీలకు చేరువలో కుండలు, డబ్బాలు వేలాడదీసి పావురాలకు ఆవాసం కల్పిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అవి ఎగురుతుంటే వాటి రెక్కల గాలి కిటికీల్లోంచి ఇళ్లలోకి వస్తుందనేది వారి అభిప్రాయం. నగర నిర్మాణానికి ముందు నుంచే.. భాగ్యనగర నిర్మాణానికి ముందునుంచే ఈ ప్రాంతంలో పావురాలు గుంపులుగా ఉండేవని చెబుతారు. గోల్కొండ పట్టణం రూపుదిద్దుకునే సమయంలో దానికి చేరువలో ఉన్న ఊళ్లలో పావురాలకు ప్రాణం పోశారు. ఇక నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలకు పావురాలకు గింజలు వేసే అలవాటు ఉండేది. రాజప్రాసాదాల వద్ద వందల సంఖ్యలో పావురాల గుంపు నిత్యం ఉండేదట. నవాబుల కుటుంబ సభ్యులు పావురాలకు గింజలు వేసి ఆనందించేవారట. ఇందుకోసం వారి నివాసాల సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేది. అసఫ్జాహీలు కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. ఇందుకు పాతనగరంలో నేటికీ నిదర్శనాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దూద్‌బౌలి సమీపంలో పావురాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కబూతర్ ఖానా ఇందులో ముఖ్యమైంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అంతస్తులుగా ఉన్నఈ నిర్మాణంలో వందల సంఖ్యలో పావురాలు ఎగురుతూ ఉంటాయి. ప్రతిరోజూ మతాలకతీతంగా ప్రజలు వచ్చి వాటికి గింజలు వేసి వెళ్తుంటారు. పాతనగరంలోని అలనాటి నిర్మాణాలను నిశితంగా పరిశీలిస్తే పావురాల వేదికలు వాటిలో అంతర్భాగంగా కనిపిస్తాయి. ఇక సుల్తాన్‌బజార్‌లోని కబూతర్‌ఖానా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి మైదానంలో వేల సంఖ్యలో పావురాలు ఉంటాయి. ఒక్కసారిగా అవన్నీ ఎగిరే దృశ్యం కోసం చాలామంది అక్కడికి వస్తుంటారు. ఇక మక్కామసీదు, జూబ్లీహాలు, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలు పావురాలకు నిలయాలుగా నిలిచాయి. మానసిక ప్రశాంతత... పావురాలకు గింజలు వేసే ప్రక్రియ మానసిక ఆనందాన్ని పంచుతోందని నిపుణులు కూడా పేర్కొంటుండటం విశేషం. మనం వేసిన ఆహారం వాటి కడుపు నింపిందనే తృప్తి మనసులో కొత్త ఆనందాన్ని కలిగిస్తుందని వారంటారు. పావురాలకు గింజలు వేసి తదేకంగా వాటిని గమనిస్తుంటే సహజీవనం, సాన్నిహిత్యం, కష్టపడేతత్వం లాంటి మంచి అలవాట్లు కూడా అబ్బుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో పావురాలకు గింజలు వేయిస్తుంటారు. వెరసి ఈ ప్రక్రియ మన సంస్కృతిలో భాగమైంది. -
జాతకం చెప్పే మూషికాలు!
రామచిలుకలే కాదు.. ఎలుకలు కూడా జాతకం చెబుతాయి తెలుసా!? అయితే, అవి మన ఎలుకలు కావులేండి. ఆస్ట్రేలియా ఎలుకలు! అయితే ఇప్పుడు వాటితో జాతకం చెప్పించుకోవాలంటే అక్కడిదాకా వెళ్లాలా? అని కదా మీ ప్రశ్న. అక్కర్లేదు.. చెన్నై సమీపంలోని నాగపట్నం జిల్లా శీర్కాళికి దాకా వెళ్తేచాలు. అక్కడ వినోద్ అనే వ్యక్తి వీటిని పెంచుతున్నాడు. పలు రంగుల్లో ఉండే ఈ ఆస్ట్రేలియా మూషికాలు కుందేళ్లలా కనువిందు చేస్తాయి. ఇలా ముచ్చటపడే వినోద్ ఓ జంట ఎలుకలను కొనుక్కుని మరీ కంగారూల దేశం నుంచి తెచ్చి పెంచుతున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ఎలుకలు తమ సంతానాన్ని 50 దాకా పెంచాయి. కిళిపో జాతికి చెందిన వీటిని చూసేందుకు స్థానికంగా జనం తండోపతండాలుగా తన ఇంటికి వస్తున్నారని చెబుతున్నాడు వినోద్. వచ్చిన వారిలో వీటిని కొనుక్నునే వాళ్లూ ఉన్నారన్నాడు. మీరు కూడా చూడ్డమే కాదు కొనుక్కుంటారా? అయితే జంట ఎలుకలు.. జస్ట్ ఆరొందల యాభై రూపాయలే. ట్రై చేయండి. - సాక్షి, చెన్నై -
అరణ్యం: పావురాలు పిల్లలకు పాలిచ్చి పెంచుతాయా?
పూర్తిగా ఎదిగిన పావురం ఒంటిమీద దాదాపు పదివేల ఈకలుంటాయి! పావురాలు దాదాపు ఇరవై ఆరు మైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా గుర్తిస్తాయి. అందుకే యుద్ధాల్లో శత్రు సైన్యాలను గుర్తించేందుకు పావురాలను ఉపయోగించేవారు. అంతేకాదు, వీటికి ఏకాగ్రత ఎక్కువ. ఎలాంటి దారిలోనయినా కన్ఫ్యూజ్ అవకుండా వెళ్లిపోగలవు. అందుకే సందేశాలను వీటితో పంపించేవారు! వీటి గుండె నిమిషానికి ఆరు వందలసార్లు కొట్టుకుంటుంది. ఇవి సెకనుకు పదిసార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. పదహారు గంటలపాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి! తలను పైకి ఎత్తకుండా మింగే శక్తి ఉన్న పక్షి పావురం మాత్రమే. ఇతర పక్షులన్నీ నీటినిగానీ, ఆహారాన్నిగానీ నోటిలోకి తీసుకున్న తర్వాత తలను పెకైత్తి మింగుతాయి! పావురాలు జీవితంలో ఒక్కదానితోనే జతకడతాయి. చాలా పావురాలు తమ జంట పావురం చనిపోతే మరో దానికి దగ్గర కాకుండా అలాగే ఉండిపోతాయని పరిశోధనల్లో తేలింది! వీటి గొంతులో ఓ సంచిలాంటి గ్రంథి ఉంటుంది. అందులో పాలలాంటి తెల్లటి ద్రవం ఉత్పత్తి అవుతుంది. ఈ ద్రవాన్ని పిల్లల నోటిలో వేస్తాయి పావురాలు. కొంతకాలం పాటు తల్లిదండ్రులిచ్చే ఈ పాలతోనే పిల్లలు పెరుగుతాయి! అన్ని పక్షుల పిల్లలూ కనిపిస్తాయి కానీ, పావురాల పిల్లలు సాధారణంగా ఎక్కడా కనిపించవు. దానికి కారణమేంటో తెలుసా? అన్ని పక్షుల పిల్లలూ పుట్టిన పది, పదిహేను రోజులకు ఎగరడం మొదలుపెడతాయి. కానీ పావురాల పిల్లలు మాత్రం రెండు నెలలకు గానీ ఎగరవు! వాటి చెలిమే ఆమెకు ఊరట! బ్రిట్నీ స్పియర్న్ అనగానే... హోరెత్తే సంగీతంతో పాటు వివాదాలు కూడా గుర్తొస్తాయి. సెలెబ్రిటీల జీవితం సెలెబ్రేషన్స్‌తో నిండి ఉండదనడానికి బ్రిట్నీ జీవితమే ఉదాహరణ. ప్రేమ వ్యవహారాలతో పాటు పెళ్లి కూడా ఆమెకు చేదునే మిగిల్చింది. ఓ దశలో మానసిక రోగిగా మారిపోయింది. శోక లోకంలో మునిగి తేలింది. అలాంటప్పుడు ఆమె వెంట ఉన్నవేంటో తెలుసా... ఆమె పెంపుడు జంతువులు! బ్రిట్నీ సన్నిహితులు అంటారు... బ్రిట్నీ మనసును దిగులు కమ్ముకుంటే, ఆమె ఇంట్లోకి ఓ కొత్త జంతువు వస్తుంది అని. కుక్కలు, పిల్లులు, చిలుకల వంటి వాటిని పెంచుకుంటూ... వాటితో ఆడిపాడుతూ ఆమె తన బాధల్ని మర్చిపోతుందట. బ్రిట్నీ చాలాసార్లు చేతిలో పెట్‌తో కనిపిస్తుంది కాబట్టి, వారు చెప్పేది నిజమే కావచ్చు! ఇది ఎవరికి సెక్రెటరీ? ఆఫ్రికా గడ్డిభూముల్లో ఠీవిగా తిరిగే ఈ పక్షి పేరు సెక్రెటరీ బర్డ్. దాదాపు నాలుగడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ పక్షి... మహా చురుకైనది. పాముల్ని ఒడుపుగా వేటాడేస్తుంది. పురుగుల్ని, గుడ్లనీ తెలివిగా పట్టి తినేస్తుంది. పైగా ఇది పక్షి అయివుండి ఇతర చిన్న చిన్న పక్షుల్ని తింటుంది. ఇంతకీ దీనికి సెక్రెటరీ బర్డ్ అని పేరేందుకు వచ్చిందో తెలుసా... నెత్తిమీదున్న ఈ ఈకల వల్ల. పెన్నులు కనిపెట్టకముందు పక్షుల ఈకలను సిరాలో ముంచి, వాటితో రాసేవారు. ముఖ్యంగా ప్రముఖుల సెక్రెటరీలకు ఇలా ఈకలతో రాసే పని ఎక్కువగా ఉండేది. వారు రాస్తూ రాస్తూ గ్యాప్ ఇచ్చినప్పుడు, ఆ ఈకల్ని తలలో గుచ్చుకునేవారు. ఈ పక్షి నెత్తిమీద ఈకలు అలా కనిపించేసరికి సెక్రెటరీ బర్డ్ అని పేరు పెట్టేశారు. అదీ సంగతి!