దాణా-ఠికానా
షహర్‌కీ షాన్
‘పావురాలకు గింజలేస్తే మన భావితరానికి ఆకలి బాధ ఉండదని మా తాత చెప్పాడు. నేను వేసిన గింజలను తృప్తిగా తింటూ పావురాల గుంపు అటూ ఇటూ ఎగురుతూ ఉంటే నా మనసులోని సమస్యలు మటుమాయమైనట్టు అనిపిస్తుంది. 35 ఏళ్లుగా నేను వాటికి గింజలేస్తున్నాను. ఇప్పుడు నా మనవడికి కూడా దాన్ని అలవాటుగా మార్చాను’ పాతనగరంలోని దారుల్‌షిఫాకు చెందిన జాలారామ్ మాటిది.
నగరంలోని సైఫాబాద్ టెలిఫోన్ భవన్ సమీపంలో దశాబ్దన్నర క్రితం విశాలమైన మర్రిచెట్టు ఉండేది. ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించాలని తెగ తాపత్రయపడుతున్నట్టు నలుమూల లా విస్తరించి ఉండేది. సాయంత్రం అయ్యిందంటే దానిపై దాదాపు 8 వేల పక్షులు గుంపులుగుంపులుగా చేరుకునేవి. ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అప్పట్లో నగరంలో పక్షులపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన లెక్కిది.
రకరకాల పక్షులకు ప్రధాన ఆవాసాలపై వారు నిర్వహించిన సర్వేలో ఈ చెట్టు కూడా ఓ ఆవాసమనే తేలింది. కానీ అధికారుల అనాలోచిత చర్య ఫలితంగా ఆ వృక్షం ఇప్పుడు మాయమైంది. అదొక్కటే కాదు... అలాంటి ఎన్నో వృక్షాలు కనుమరుగయ్యాయి.
ఆ వృక్షాలే ఆవాసంగా ఉన్న పక్షుల ‘గూడు’ చెదిరి ఎటో ఎగిరిపోయాయి. కానీ ఓ ‘పక్షి’ మాత్రం ఎక్కడకూ పోనంటోంది. ఇప్పుడు
నగరంలో ఏ మూల చూసినా వాటి రెక్కల సద్దు వినిపిస్తుంది. అదే పావురం. కొన్ని చిన్నచిన్న విశ్వాసాలు పావురాలకు ప్రాణం పోస్తోంది.
ఏ పక్షి జాతి ఉనికి ప్రమాదంలో పడ్డా పావురాలకు మాత్రం కష్టకాలం రాలేదు.
వాటి మనుగడ ప్రశ్నార్థకంలో పడకూడదనే చైతన్యం ప్రజల్లో ఇప్పటికిప్పుడు రగిలింది కాదు. వందల ఏళ్లుగా వస్తున్న ఓ ఆచారం వాటికి వరంగా మారింది. పావురాలకు గింజలు వేస్తే పుణ్యం వస్తుందనే అభిప్రాయం హిందూ, ముస్లింలలో బలంగా ఉంది. ఈ నమ్మకమే వాటికి శ్రీరామరక్షగా మారింది. ఇక పావురాల రెక్కల నుంచి వచ్చే గాలి సోకితే అనారోగ్యం దూరమవుతుందనే అభిప్రాయం మరికొన్ని వర్గాల్లో ఉంది. దీంతో తమ ఇంటి ఛాయల్లోనే పావురాలు పెరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరభారతదేశానికి చెందిన వారిలో ఈ నమ్మకం ఎక్కువ.
వీరు ఇంటి కిటికీలకు చేరువలో కుండలు, డబ్బాలు వేలాడదీసి పావురాలకు ఆవాసం కల్పిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అవి ఎగురుతుంటే వాటి రెక్కల గాలి కిటికీల్లోంచి ఇళ్లలోకి వస్తుందనేది వారి అభిప్రాయం. నగర నిర్మాణానికి ముందు నుంచే..
భాగ్యనగర నిర్మాణానికి ముందునుంచే ఈ ప్రాంతంలో పావురాలు గుంపులుగా ఉండేవని చెబుతారు. గోల్కొండ పట్టణం రూపుదిద్దుకునే సమయంలో దానికి చేరువలో ఉన్న ఊళ్లలో పావురాలకు ప్రాణం పోశారు. ఇక నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలకు పావురాలకు గింజలు వేసే అలవాటు ఉండేది. రాజప్రాసాదాల వద్ద వందల సంఖ్యలో పావురాల గుంపు నిత్యం ఉండేదట.
నవాబుల కుటుంబ సభ్యులు పావురాలకు గింజలు వేసి ఆనందించేవారట. ఇందుకోసం వారి నివాసాల సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేది. అసఫ్‌జాహీలు కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. ఇందుకు పాతనగరంలో నేటికీ నిదర్శనాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దూద్‌బౌలి సమీపంలో పావురాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కబూతర్ ఖానా ఇందులో ముఖ్యమైంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అంతస్తులుగా ఉన్నఈ నిర్మాణంలో వందల సంఖ్యలో పావురాలు ఎగురుతూ ఉంటాయి.
ప్రతిరోజూ మతాలకతీతంగా ప్రజలు వచ్చి వాటికి గింజలు వేసి వెళ్తుంటారు. పాతనగరంలోని అలనాటి నిర్మాణాలను నిశితంగా పరిశీలిస్తే పావురాల వేదికలు వాటిలో అంతర్భాగంగా కనిపిస్తాయి. ఇక సుల్తాన్‌బజార్‌లోని కబూతర్‌ఖానా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి మైదానంలో వేల సంఖ్యలో పావురాలు ఉంటాయి. ఒక్కసారిగా అవన్నీ ఎగిరే దృశ్యం కోసం చాలామంది అక్కడికి వస్తుంటారు. ఇక మక్కామసీదు, జూబ్లీహాలు, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలు పావురాలకు నిలయాలుగా నిలిచాయి.
మానసిక ప్రశాంతత...
పావురాలకు గింజలు వేసే ప్రక్రియ మానసిక ఆనందాన్ని పంచుతోందని నిపుణులు కూడా పేర్కొంటుండటం విశేషం. మనం వేసిన ఆహారం వాటి కడుపు నింపిందనే తృప్తి మనసులో కొత్త ఆనందాన్ని కలిగిస్తుందని వారంటారు. పావురాలకు గింజలు వేసి తదేకంగా వాటిని గమనిస్తుంటే సహజీవనం, సాన్నిహిత్యం, కష్టపడేతత్వం లాంటి మంచి అలవాట్లు కూడా అబ్బుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో పావురాలకు గింజలు వేయిస్తుంటారు. వెరసి ఈ ప్రక్రియ
మన సంస్కృతిలో భాగమైంది.