సలామ్ మిర్చీకా సాలన్
షహర్‌కీ షాన్
లండన్‌లో హైదరాబాదీ స్పైసీ
హైదరాబాదీ నవాబ్ హోటల్.. కిటకిటలాడుతోంది. అక్కడికొచ్చేవారిలో మూడొంతుల మంది ఒకే వంటకాన్ని ఆర్డర్ చేస్తుండటంతో దానికి కొరతేర్పడింది. అందుకే ముందస్తుగా ఆర్డర్ ఇస్తేగాని సర్వ్ చేయలేని పరిస్థితి. ఆ వంటకం పేరే ‘మిర్చీకా సాలన్’. ఆ హోటల్ ఉన్నది మనహైదరాబాద్‌లో కాదు.. లండన్‌లో.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తట్టాబుట్టా సర్దుకుని బ్రిటిష్ వెళ్లిపోయిన తెల్లదొరలు వెంట కొన్ని ‘ఘుమఘుమల’నూ మోసుకెళ్లారు. కారం అంటేనే ఆమడదూరం పరుగెత్తే తెల్లోళ్లు బాగా ఇష్టపడి తమ మెనూలో చేర్చుకున్న వంటకాల్లో మిర్చీకా సాలన్ ఒకటి. అందుకే ఈ లోకల్ ఫ్లేవర్ లండన్ వీధుల్లోని ఇండియన్ రెస్టారెంట్లలో అద్భుతః అనిపిస్తుంది.
పురానా జమానాసే..
కుతుబ్‌షాహీల రాజప్రాసాదంలో దర్బారు ఎంత బిజీగా ఉండేదో షాహీ దస్తర్‌ఖానా అంతే హడావుడిగా ఉండేది. ఈ పేరు కూడా దర్జాగా ఉంది కదూ. స్వతహాగా భోజన ప్రియులైన కుతుబ్‌షాహీలు డైనింగ్‌హాల్‌ను పిలుచుకునే పేరది. అందులో నిత్యం బిర్యానీ ఉండాల్సిందే. ఈ బిర్యానీ రుచికి పరిపూర్ణత రావాలంటే మాత్రం మిర్చీ కా సాలన్ ఉండాల్సిందే. సాధారణంగా మిర్చీని కూరల్లో వేసుకోవడానికో, బజ్జీగా చేసి తినడానికో వాడతారు. కానీ ప్రత్యేకంగా దాన్నే ఓ వంటకంగా తయూరుచేసి ప్రపంచానికి చూపిన ఘనత కుతుబ్‌షాహీ కాలం నాటి బావార్చీలకే దక్కింది. మొఘలారుు వంటకాల్లో ‘చురుక్కు’మనిపించే రుచితో మెనూలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది.
బ్రిటిష్ సైనికులకూ..
నిజాంల కాలంలో నగరానికి వచ్చే బ్రిటిష్ సైనికాధికారులు, ప్రతినిధులకు ప్రత్యేకంగా మిర్చీకా సాలన్‌ను సిద్ధం చేసేవారట. వారు దివానానికి వచ్చీ రాగానే భోజనశాలలో మిర్చీకా సాలన్ ఘుమఘుమలు మొదలయ్యేవి. ప్రత్యేకంగా వడ్డించుకుని మరీ తినేవారట. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రుచిని ఆస్వాదించటం కోసం హైదరాబాద్ నుంచి చేయి తిరిగిన వంటవారిని వెంట తీసుకెళ్లారంటే దాని ప్రత్యేకత ఏ స్థాయిలో ఉండేదో తెలుస్తోంది. మిర్చీకా సాలన్‌ను అన్నిరకాల మిరపకాయలు సరిపోవు. కారం కాస్త తక్కువగా ఉండే లావుపాటి మిరప ఉంటేనే ఈ వంటకం భలే పసందుగా ఉంటుంది. ఈ వంటకం కోసమే కుతుబ్‌షాహీల హయాంలో ప్రత్యేకంగా మిరపను పండించేవారట. కొందరు రైతులకు దివానంలో ఆవాసం కల్పించారని చరిత్రకారులు చెబుతారు. నగరంలో ఇప్పుడు దీని హవా అంతాఇంతా కాదు. పెళ్లి మెనూలో ఇది తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఇది లేకుంటే బిర్యానీ రుచి దిగదుడుపే.
- గౌరీభట్ల నరసింహమూర్తి