వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ | Their slogan .. Nature devobhava | Sakshi
Sakshi News home page

వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ

Published Tue, Jul 7 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ

వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ

పండ్లతోట.. పూలబాట
 
రాయదుర్గం: మన సిటీలో ఇంటి వెనుక కాస్త స్థలం ఉంటే అందులో రెండు గదుల ఇల్లు కట్టి అద్దెకిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. కానీ పచ్చని చెట్లు ఉంటే అదే పెద్ద ఆస్తి అని భావించారాయన. అందుకే పెరట్లోనే పండ్లు, పూల మొక్కలను పెంచుతూ పన్నెండేళ్ల క్రితమే హరితహారానికి శ్రీకారం చుట్టారు జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అనంతయ్య. గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి తండాలో నివసించే ఈయన తన ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూలు, పండ్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి పెద్దవై ఇంటి మొత్తాన్ని కప్పేసి.. చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని, పూలు, పండ్లను ఇస్తున్నాయి. ఇంటి పెరట్లో మామిడి, సపోటా, ఆల్ బుకార్, బొప్పాయి, సీతాఫలం, పనస, జామ చెట్లున్నాయి. వీటితో పాటు పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. అనంతయ్య కుమారులు శివకుమార్, చంద్రశేఖర్ కూడా వీటి సంరక్షణలో పాలుపంచుకుంటూ.. సీజన్ల వారీగా ఆయా మొక్కలను నుంచి వచ్చే పండ్లను ఆస్వాదిస్తారు.  
 
ఉపాధి వేటలో పెరుగుతున్న వలసలు.. ఖాళీ అవుతున్న గ్రామాలు.. ఊపిరి సలపనంతగా కిక్కిరిసిపోతున్న పట్టణాలు.. ఉన్న అడవులను నరికేసి మౌలిక సదుపాయాల కల్పన. జనం పెరుగుతున్నారని భూమి విస్తీర్ణం పెరగదు కదా..! పచ్చని వనాలు కనుమరుగైపోయి.. కాంక్రీట్ భవంతులు భూతాల్లా భయపెడుతున్నాయి. కాలుష్యపు కోరలు చాస్తూ కర్మాగారాలు జీవన ప్రమాణాలను కాలరాస్తున్నాయి. కరెన్సీ కట్టల లెక్క సరిపోక.. పెరట్లో మొక్కలు పీకేసి.. ఇరుకు గదుల్లో ఆదాయం బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు ప్రాణవాయువును సైతం కొనుక్కునే పరిస్థితి. దేహం రోగాల పుట్టగా మారిపోయింది. ‘చెట్టు’ తోడు లేకే కదా ఇన్ని అనర్థాలు..!! అందుకే పచ్చని హారం నిర్మాణ ం కోసం కొందరు పరితపిస్తున్నారు. భాగ్యనగరి  సౌభాగ్యం వనాలతోనే ఉందని తమ చుట్టూ నందనవనాలు సృష్టిస్తున్నారు.
 
ప్రకృతి రక్షణే పరమావధిగా..
జూబ్లిహిల్స్: ఇప్పటికైనా చెట్లను నరకడం ఆపేయాలి. లక్షల సంఖ్యలో మొక్కలు నాటి చెట్లుగా చూడాలి. పర్యావరణాన్ని ప్రాణంలా కాపాడాలి.. ఇదీ సాప్ట్‌వేర్ ఇంజినీర్ జయప్రకాశ్ నంబూరు స్వప్నం. ఈ స్వప్నాన్ని ఆచరణలో పెట్టేందుకు ఆరేళ్ల కిందట ఆయన నడుంబిగించారు. ఐదంకెల జీతాన్ని, అందమైన జీవితాన్ని వదిలేసి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన జయప్రకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో పలు ఉద్యోగాలు చేశారు. ఆ దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను, ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని గమనించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేసి పర్యావరణ పరిరక్షణకే అంకితమయ్యారు. ఇందుకోసం ‘ఐ గోగ్రీన్ ఫౌండేషన్’ను స్థాపించారు.

 ఠీఠీఠీ.జీజౌజట్ఛ్ఛజౌఠఛ్చ్టీజీౌ.ౌటజ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విసృ్తత స్థాయిలో పర్యావరణంపై ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలను ఎంపిక చేసుకొని నీరు, విద్యుత్ ఆదా, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం నిషేధం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశాలను పాఠశాల, ఇళ్లల్లో అమలు చేసేలా వారిని ఒప్పిస్తున్నారు. రోటరీక్లబ్ సహకారంతో పలు జిల్లాల్లోని 200కు పైగా రోటరీ భవనాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించారు. విస్తృతంగా మొక్కలు నాటించారు. ‘పర్యావరణ చైతన్య రథం’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా చెట్లను నరికేస్తున్నట్టు గుర్తిస్తే 1800 4255364 (టోల్ ఫ్రీ) నంబర్‌కు సమాచార ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడన్నా చెట్లు తొలగిస్తుంటే వాటిని మరోచోట నాటుతున్నారు. కాలనీలు, డంపింగ్ యార్డ్‌ల్లో చెత్తను తగలబెడుతుంటే అడ్డుకునేందుకు ఓ ప్రత్యేక కార్యకర్తల బృందాన్ని నియమించారు. అంతేగాకుండా 040- 21111111 నెంబర్‌కు ఎవరన్నా ఫోన్ చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ‘దేశంలోని వంద కోట్ల మందిలో ప్రతి ఒక్కరు చిన్న పర్యావరణ అనుకూల పనిచేసినా దాని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. ఒక్క మొక్కను నాటినా అది మహా వృక్షమై మనకు ఎంతో మేలు చేస్తుంది’ అని చెబుతున్నారు జయప్రకాష్.
 
‘చిగురించిన’ ఆదర్శం
బంజారాహిల్స్: ఇంటి నిర్మాణానికి అడ్డు వస్తుందని చెట్లు నరికేస్తారు. ఇంటి ప్రహరీకి పగుళ్లు వస్తాయని గోడ పక్కన చెట్లను సైతం తొలగించే వారూ ఉన్నారు. చెట్టు నరికేస్తుంటే మనకెందుకులే.. అని పట్టించుకోనివారికీ నగరంలో కొదవలేదు. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఫార్చూన్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ నివాసితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడివారు పచ్చదనం అంటే ప్రాణం పెడతారు. ఎక్కడో చెట్లను కొట్టేస్తున్నారని తెలుసుకుని ఆ చెట్లను తలా కొంత డబ్బు పోగు చేసి కొనుగోలు చేశారు. తమ అపార్ట్‌మెంట్ ఆవరణలో అప్పటికే ఉన్న వందలాది చెట్లతో స్థలం లేకపోతే ఎదురుగా ఉన్న రోడ్డులో వాటిని తెచ్చి నాటుకున్నారు. మెట్రోరైలు పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న భారీ చెట్లను జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫార్చూన్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న 43 కుటుంబాలు చెట్టు ప్రాముఖ్యం తెలుసు కాబట్టి వాటి రక్షణకు నడుం బిగించారు. నివాసితులంతా తలా కొంత డబ్బు పోగుచేసి తొలగించే చెట్లను ట్రీ రీలొకేట్ పద్ధతిలో తీసుకొచ్చి నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 10 వేలకు పైగా ఖర్చు చేశారు. ఈ చెట్లను అపార్ట్‌మెంట్ ఎదురు మార్గంలో నాటి వదిలేయలేదు.. అవి చక్కగా ఎదిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం నీళ్లు పోయడం, ఎరువు వేయడం వంటివి చేశారు. తలా ఒక రోజు చొప్పున చెట్టు రక్షణకు నిఘా ఉంచారు. ప్రస్తుతం అవి పచ్చగా ఎదిగి నీడనిస్తున్నాయి.
 
పచ్చందాల కాలనీ..
శేరిలింగంపల్లి: పచ్చదనంతో ఆ కాలనీ కళకళలాడుతోంది. దీని సంరక్షణ కోసం స్థానికులు నిత్యం కొంత సమయం వెచ్చిస్తారు. కాలనీ చిన్నదే అయినా ఎటుచూసినా పచ్చదనమే. పక్షుల కిలకిల రావాలతో ఉదయం, సాయంత్రం సమయాల్లో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్-2 కాలనీ. ఇక్కడ నివసించే వారంతా విద్యాధికులు కావడంతో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ఇక్కడ 30 వేలకు పైగా మొక్కలు, చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. కాలనీ ప్రధాన గేటు లోపల భాగంలో వేప, మామిడి, జామ, సపోటా, మల్లె, ఉసిరి, టేకు, అశోక, పనస చెట్లు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఎగ్జోరా, అలమండ, జాత్రోపా సింగపూర్ ఎగ్జోరా, ఎల్కోనియా, స్వాతి పైలం, నైట్‌క్వీన్, ముసుండ తదితర మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏటా వీరు ‘ప్రకృతి దేవోభవ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ‘మా కాలనీలో పచ్చదనానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. వేసవిలో మిగతా కాలనీలతో పోలిస్తే ఇక్కడ రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంద’ని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే తెలిపారు. తమ కాలనీలో పచ్చదనంతో పాటు ఇంకుడు గుంతలను తవ్వించడం వల్ల నీటి సమస్య కూడా లేదని, సీవరేజ్ నీటిని శుద్ధి చేసి గ్రీనరీకి వినియోగిస్తున్నామని కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాంమూర్తి తెలిపారు.
 
అతిథులకు మొక్కలు..

ఉప్పల్ : పచ్చదనమన్నా.. పక్షులన్నా ఆయనకు పంచ ప్రాణాలు. దీంతో తన ఇంటిని రకరకాల మొక్కలతో నింపి నందనవనంగా తీర్చిదిద్దారు. దీనిలో 40 రకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఆవాసం ఏర్పరచుకున్నాయి. కర్ణాటకలోని కార్వార్ ప్రాంతానికి చెందిన ఎన్‌ఎఫ్‌సీ రిటైర్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సావంత్.. హబ్సిగూడ స్నేహనగర్ వీధి నెంబర్-8లో నివాసం ఉంటున్నారు. 1980లో ఇల్లు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. ఉదయం 6 అయ్యిందంటే చాలు వేలాది పావురాలు సావంత్ అందించే ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. మొక్కలను పెంచడమే కాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు వాటి ప్రాముఖ్యతను వివరించి మొక్కలను పంచడం ఇతని హాబీ.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement