పెట్స్‌తో జాగ్రత్త సుమా..! | World junosis Day | Sakshi
Sakshi News home page

పెట్స్‌తో జాగ్రత్త సుమా..!

Published Sun, Jul 5 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

పెట్స్‌తో  జాగ్రత్త సుమా..!

పెట్స్‌తో జాగ్రత్త సుమా..!

కుక్క, పిల్లి, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం, కుందేలు.. ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు నగరవాసులు మక్కువ చూపుతున్నారు. తమ ఆసక్తిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఆయా జంతువులను సంరక్షిస్తున్నారు. కొందరికి ఇవి స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయాయంటే నగరవాసి జంతు ప్రేమ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ మంది శునకాలను పెంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీటిని విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఎంత ఖరీదైన జంతువైనా సరే పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వెటర్నరీ వైద్యులు. పెట్స్ ఆహారం, ఆరోగ్యం విషయంలో కనీస అవగాహన అవసరమంటున్నారు.    - రాజేంద్రనగర్ / సాక్షి, సిటీబ్యూరో
 
 జునోసిస్ అంటే..
జంతువులకు వాటి నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోసిస్ అంటారు. ఈ వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైంది. లూయి పాశ్చర్ 1885 జులై 6న యాంటీ రేబిస్‌ను తొలిసారిగా ఉపయోగించారు. ఈ రోజునే యాంటీ రేబీస్ డేగా కూడా వ్యవహరిస్తుంటారు.
 
 అవగాహన అవసరం..

 పెంపుడు జంతువులకు వేసే వాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది ఖర్చుతో కూడిందని పట్టించుకోరు. పెట్స్‌కు మాములుగా కరిచే గుణం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని రకాల పెట్స్‌కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషికి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరటం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. క్యాట్స్, ర్యాబిట్స్ లాంటివి పెంచుతున్నవారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. మా సంస్థ తరపునవ్యాక్సినేషన్ అవసరంపై అవగాహన చెపడుతున్నాం. వ్యాక్సిన్ వేయించడం పెట్‌కి మాత్రమే కాదు.. పెట్ ఓనర్స్, వారి చుట్టూ ఉన్నవారి రక్షణకు సంబంధించిన విషయం.
 - నిహార్, ఏఆర్‌పీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి
 
వైద్య సలహాలు తప్పనిసరి
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను ‘జునాటిక్ డిసీజెస్’ అంటారు. ఎబోలా, బర్డ్‌ఫ్లూ, రేబిస్, ఆంత్రాక్స్.. వంటివి జునాటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల ఆరోగ్యం, స్కిన్ కేర్ ఎంత ముఖ్యమో, వాటి యజమానులు వారి హెల్త్ కూడా ముఖ్యమని గుర్తించాలి. ముఖ్యంగా ఇంట్లో డాగ్స్ ఉన్నవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. సిటీలో కుక్కలు, పిల్లులు తర్వాత పక్షులను పెంచుతున్నారు. వీటి వల్ల లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాటిని నివారించేందుకు పక్షులకు సంబంధించిన వాటర్ వ్యాక్సిన్స్ ఇప్పించాలి. వైల్డ్ లైఫ్ యానిమల్స్, పెట్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరి.                       - డాక్టర్ మురళీధర్, డాక్టర్ డాగ్ హాస్పిటల్స్
 
 పెట్స్‌ను పిల్లల్లా చూడాలి..
నాకు మూడేళ్ల బాబు. హ్యాపీ, డాలర్, డ్యూక్ పెట్స్ (డాగ్స్) ఉన్నాయి. డాగ్స్‌తో పిల్లలకు ఇన్‌ఫెక్షన్ అనేది నేను ఫేస్ చేయలేదు. సాధారణంగా ఆరు నెలలకు ఓసారి డాగ్స్‌కి పొట్ట క్లీన్ కావడానికి డీవార్మింగ్ చేస్తారు. అయితే, వీధి కుక్కలకు ఇలాంటిది లేకుండా బాగానే ఉంటాయి. నేను డీవార్మింగ్‌కి నాచురల్ రెమిడీస్, హోమియోపతి మందులు ఇస్తుంటా. నెలకోసారి పంప్కిన్, సన్‌ఫ్లవర్, తర్బూజా వంటి డ్రై గింజలు మిక్స్ చేసి ఇస్తుంటా. నా పెట్స్ హెల్దీగా ఉన్నాయి. పెట్స్‌కి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. సోయా, చికెన్, వెజిటేబుల్స్, ఎగ్, రైస్, యాపిల్ ఇలా అన్నీ వేసి వండుతాను. కొద్దిగా సాల్ట్, ఆయిల్ ఉండేలా చూస్తా. వాటికి రెగ్యులర్‌గా బ్రష్, కోంబింగ్, మంత్లీ బాత్ తప్పనిసరి. బాత్ చేసిన తర్వాత బాగా తుడవాలి. తడిగా ఉంచితే ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. - సౌమ్య, పెట్‌లవర్
 
ఒత్తిడి మాయం..
చదువుకునేటప్పుడు నా దగ్గర డాగీస్ ఉండేవి. జాబ్‌లోకి వచ్చాక ప్రస్తుతం హాస్టల్‌లో ఉంటున్నా. ఆరు నెలల క్రితం బర్త్‌డే గిఫ్ట్‌గా బెర్రీ(డాగ్) నా దగ్గరకు వచ్చాడు. మొదటి మూడు నెలలు వరుసగా వ్యాక్సిన్ వేయించాను. తర్వాత వన్ ఇయర్‌కి ఒకటి. డాగ్స్‌కి జనరల్‌గా వామ్స్ వస్తుంటాయి. సిరప్, పౌడర్ వంటి మందులతో ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చాక బెర్రీతో కాసేపు ఆడుకుంటే ఒత్తిడి మొత్తం పోతుంది. వ్యాక్సిన్‌కి వెళ్లినప్పుడు డాక్టర్.. ఫుడ్, మెడికల్, బాతింగ్ ఎలా ఉండాలో చెప్పారు. పెట్స్‌కు కిడ్స్‌లా కేర్‌తో పాటు వ్యాక్సిన్ కూడా తప్పనిసరి.  - స్వాతి, పెట్ లవర్
 
పెంపుడు శునకాలకు  ఉచిత వ్యాక్సిన్ నేడు
 ‘ప్రపంచ జునోసిస్ డే’ను పురస్కరించుకుని సోమవారం నారాయణగూడలోని ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్టు ఆసుపత్రి డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ భగవాన్ రెడ్డి తెలిపారు. పంపుడు శునకాల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
 
 కూకట్‌పల్లిలో..
 
కూకట్‌పల్లిలో బీజేపీ కార్యాలయం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రిలో నేడు కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్టు డాక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తామని, ఈ అవకాశాన్ని పెట్ లవర్స్ వినియోగించుకోవాలన్నారు.
 
కుత్బుల్లాపూర్‌లో..
కుత్బుల్లాపూర్ పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ అనిల్ మురారి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు వేస్తామన్నారు. వివరాలకు 99127 89456 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
 
 మలక్‌పేటలో..
 మలక్‌పేట పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ ఎం.సబిత తెలిపారు. మలక్‌పేట గంజ్ ఆవరణలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన ఉన్న పశు వైద్యశాలలో తిరుమల మెడికల్ హాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వివరాలకు 89789 01658 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
 
చాంద్రాయణగుట్టలో
చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లోని నల్లవాగు హిందూ శ్మశానవాటిక ఎదురుగా గల పశు వైద్యశాలలో కుక్కలు, మేకలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు వైద్యం అందిస్తారు. జంతువుల యజమానులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement