ముందే సినిమా చూపిస్త మామా.. | Actors before the dup | Sakshi
Sakshi News home page

ముందే సినిమా చూపిస్త మామా..

Published Sun, Jul 5 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

ముందే సినిమా చూపిస్త మామా..

ముందే సినిమా చూపిస్త మామా..

బొమ్మను చేసి.. ప్రాణం పోసి ఎందరికో ప్రాణప్రదంగా మార్చిన రోజుల నుంచి ప్రాణమున్న మనిషి నుంచే బొమ్మను పుట్టించే రోజులొచ్చాయి. వ్యక్తి కదలికల నుంచి యానిమేషన్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడమనే ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతూ.. సినిమాకి ముందు ‘నమూనా’ సినిమాని పుట్టించడానికి సిద్ధమైంది. మరోవైపు మార్కర్‌లెస్ మోషన్ క్యాప్చరింగ్‌తో సిటీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.
- తీయబోయే చిత్రాన్ని ముందే చూడొచ్చు
- తెరకెక్కబోయే నటులకు ముందే డూప్‌లు
- చిత్ర విచిత్రం.. మార్కర్‌లెస్ మోషన్ క్యాప్చరింగ్


మార్కర్‌లెస్‌లో మనమే ఫస్ట్
సాధారణంగా మోషన్ క్యాప్చరింగ్‌లో మార్కర్స్ వినియోగిస్తారు. వ్యక్తుల్ని చలింపజేసే కీళ్ల భాగాల్లో, బోన్స్ రొటేషన్ ఉన్న  ప్రతి చోటా మార్కర్ పెట్టి వర్చువల్ ఫీల్డ్‌లో క్యారెక్టర్‌ని నిలబెట్టి.. కెమెరాతో ఆ సెన్సస్‌ని క్యాప్చర్ చేస్తారు. దీని కోసం స్పెషల్ సూట్ వేసుకుని శరీరంలో పలు చోట్ల మార్కర్స్ పెట్టుకుంటారు (ఆటల్లో కూడా దీనిని వాడుతున్నారు. ఉదాహరణకి క్రికెట్‌లో త్రో బౌలింగ్ వస్తుందంటే మోషన్ క్యాప్చర్స్ ద్వారానే పరీక్షిస్తారు) అయితే, ఈ మార్కర్స్, సూట్ ధరించాల్సిన అవసరం లేకుండానే కదలికల్ని క్యాప్చర్ చేసే వినూత్న ప్రక్రియను ఆసియాలోనే ప్రథమంగా నగరంలో అందుబాటులోకి తెచ్చింది క్రియేటివ్ మెంటర్స్.

‘మేం ఉపయోగించే టెక్నాలజీతో మార్కర్స్, సూట్ అవసరం లేకుండానే ఇన్‌స్టంట్‌గా మోషన్ క్యాప్చరింగ్ చేస్తాం. ఈ టెక్నాలజీని అమెరికన్ ఆర్మీ కోసం వినియోగిస్తారు. ఆసియాలోనే మార్కర్ లెస్ శైలి ఫస్ట్ టైమ్. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. దాదాపు రూ.20 వేల ఖరీదుండే సూట్‌లు, అలాగే మార్కర్స్, ట్రాకర్స్ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు’ అంటున్నారు మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఉన్న క్రియేటివ్ మెంటర్స్ నిర్వాహకులు.
 
‘మోషన్ క్యాప్చరింగ్’ అనే సాంకేతిక అద్భుతం.. హాలీవుడ్ ‘అవతార్’, తమిళ సినిమా ‘కొచ్చాడియాన్’ తర్వాత క్రేజీగా మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో నటులకు మాత్రమే కాదు.. సినిమాకి కూడా డూప్‌ని సైతం సృష్టిస్తోంది. యానిమేషన్ ప్రక్రియ అనేది పేపర్ పెన్సిల్ నుంచి మొదలై.. గేమింగ్, సినిమా ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. దాని మీడియం మార్పు చేర్పులకు గురవుతూ సాఫ్ట్‌వేర్‌కి చేరుకుని 2డీ, 3డీ యానిమేషన్ సాఫ్ట్‌వేర్ సైతం అందుబాటులోకి వచ్చేశాయి. ఆ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం పరిచయమైంది ఈ మోషన్ క్యాప్చరింగ్. బొమ్మని చేసి దానికి నడకలు నేర్పి నటింపజేసే బదులు, నిజమైన నటుడి అభినయాన్ని కెమెరా ద్వారా క్యాప్చరింగ్ చేసి యానిమేటెడ్ క్యారెక్టర్‌గా యూజ్ చేసే ఈ ప్రక్రియ ఇప్పుడు సినిమాల ప్రీ విజువలైజేషన్‌కు సరికొత్త మార్గంగా మారింది.
 
‘నమూనా’ సినిమా..
స్కెచ్‌లు, బొమ్మల సహితంగా సినిమా స్టోరీ బోర్డ్ తయారు చేయడం రూపకర్తలకు అలవాటే. దీని ద్వారా తీయబోయే సినిమా మీద యూనిట్‌కు అవగాహన కల్పిస్తారు. ఈ స్టోరీబోర్డ్ పూర్తిగా మాన్యువల్. అయితే మోషన్  క్యాప్చరింగ్ ప్రక్రియ పుణ్యమాని ఇప్పుడు ఏకంగా ‘అడ్వాన్స్‌డ్ ప్రీ విజువలైజేషన్ మూవీ’ అందుబాటులోకి వచ్చేసింది.

ఈ ప్రక్రియ ద్వారా తీసే చిత్రం మొత్తాన్ని ముందే కళ్లకు కట్టినట్టు విజువలైజ్ చేయవచ్చు. కథకు అనుగుణంగా నటులను వినియోగించి వారి కదలికల ద్వారా యానిమేటెడ్ క్యారెక్టర్స్‌ని సృష్టిస్తూ షూటింగ్ తరహాలోనే ఈ విజువలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సినిమా మొత్తం ‘ప్రీ విజువలైజ్’ చేయించుకుంటే డెరైక్టర్ సెట్స్‌కి కూడా వెళ్లక్కర్లేదు. దీని వల్ల ప్రొడ్యూసర్‌కి సరైన బడ్జెట్ అంచనా వీలవుతుంది. పెద్ద హీరోని, ప్రొడ్యూసర్‌ని కన్విన్స్ చేయాలన్నా.. కథ మీద నమ్మకం ఉన్న డెరైక్టర్, స్టోరీ రైటర్లు ఈ డూప్ మూవీ తయారు చేయించుకొంటున్నారు.

సాంగ్స్ ఉండని ఈ డూప్ మూవీ సుమారు 90 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కూడా కంపోజ్ చేస్తారు. సుమారు 45 రోజులు సమయం పడుతుంది. దీనికి కనీసం రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని యానిమేషన్ ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అయితే ఒక పెద్ద హీరో చిత్రం సగటు వ్యయం రూ.25 కోట్లు అనుకుంటే, ఈ ప్రీ విజువలైజేషన్ వల్ల ఆదా అయ్యే వేస్టేజ్‌తో పోల్చుకుంటే ఈ వ్యయం ఎక్కువేం కాదంటున్నారు నిపుణులు. మొత్తం సినిమా లేదా కొన్ని ప్రధానమైన యాక్షన్ సీన్స్ మాత్రమే తీయవచ్చు. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలకు ఈ తరహాలోనే ప్రీ విజువలైజేషన్ చేసినట్టు సమాచారం.
 
‘నమూనా’ నటులకు డిమాండ్.
పూర్తిస్థాయి మూవీ మేకింగ్, గేమింగ్ ఇండస్ట్రీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ, ప్రీ విజువలైజేషన్, మెడికల్ -స్పోర్స్ సైన్స్ ఫీల్డ్‌లో కూడా ఈ మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఊపందుకుంటోంది. దాంతో దీని కోసం నటీనటుల అవసరం ఏర్పడుతోంది. అయితే యానిమేషన్ క్యారెక్టర్‌కు కొంతయినా వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ నప్పాలి. అలాగే నటన కూడా వచ్చి ఉండాలి. ఇలా నటించేవాళ్లకి మంచి రెమ్యునరేషన్ కూడా అందుతోంది.
 
మార్కర్‌లెస్‌తో మ్యాజిక్..
నగరంలోని సిట్ అండ్ మల్టీ మీడియాతో అసోసియేట్ అయి యానిమేషన్ రంగంలో గేమింగ్ డిజైన్ చేస్తున్నాం. జేఎన్‌ఏ ఎఫ్‌ఎల్ సర్టిఫికేషన్‌తో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఇప్పటికీ ఇండియాలో కేవలం నాలుగైదు సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. అయితే మేం అందిస్తున్న మార్కర్ లెస్ మోషన్ క్యాప్చరింగ్ మాత్రం ఆసియాలో మరెక్కడా లేదు. మూవీ ప్రీ విజువలైజేషన్‌కి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాదు దీని ద్వారా గేమ్స్, యానిమేషన్ కంటెంట్‌ను డొమెస్టిక్ మార్కెట్‌కి సప్లయ్ చేయవచ్చు.
 - కె. సురేష్‌రెడ్డి. క్రియేటివ్ మెంటర్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement