Saharki Shan
-
సలామ్ మిర్చీకా సాలన్
షహర్‌కీ షాన్ లండన్‌లో హైదరాబాదీ స్పైసీ హైదరాబాదీ నవాబ్ హోటల్.. కిటకిటలాడుతోంది. అక్కడికొచ్చేవారిలో మూడొంతుల మంది ఒకే వంటకాన్ని ఆర్డర్ చేస్తుండటంతో దానికి కొరతేర్పడింది. అందుకే ముందస్తుగా ఆర్డర్ ఇస్తేగాని సర్వ్ చేయలేని పరిస్థితి. ఆ వంటకం పేరే ‘మిర్చీకా సాలన్’. ఆ హోటల్ ఉన్నది మనహైదరాబాద్లో కాదు.. లండన్‌లో. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తట్టాబుట్టా సర్దుకుని బ్రిటిష్ వెళ్లిపోయిన తెల్లదొరలు వెంట కొన్ని ‘ఘుమఘుమల’నూ మోసుకెళ్లారు. కారం అంటేనే ఆమడదూరం పరుగెత్తే తెల్లోళ్లు బాగా ఇష్టపడి తమ మెనూలో చేర్చుకున్న వంటకాల్లో మిర్చీకా సాలన్ ఒకటి. అందుకే ఈ లోకల్ ఫ్లేవర్ లండన్ వీధుల్లోని ఇండియన్ రెస్టారెంట్లలో అద్భుతః అనిపిస్తుంది. పురానా జమానాసే.. కుతుబ్‌షాహీల రాజప్రాసాదంలో దర్బారు ఎంత బిజీగా ఉండేదో షాహీ దస్తర్‌ఖానా అంతే హడావుడిగా ఉండేది. ఈ పేరు కూడా దర్జాగా ఉంది కదూ. స్వతహాగా భోజన ప్రియులైన కుతుబ్‌షాహీలు డైనింగ్హాల్ను పిలుచుకునే పేరది. అందులో నిత్యం బిర్యానీ ఉండాల్సిందే. ఈ బిర్యానీ రుచికి పరిపూర్ణత రావాలంటే మాత్రం మిర్చీ కా సాలన్ ఉండాల్సిందే. సాధారణంగా మిర్చీని కూరల్లో వేసుకోవడానికో, బజ్జీగా చేసి తినడానికో వాడతారు. కానీ ప్రత్యేకంగా దాన్నే ఓ వంటకంగా తయూరుచేసి ప్రపంచానికి చూపిన ఘనత కుతుబ్‌షాహీ కాలం నాటి బావార్చీలకే దక్కింది. మొఘలారుు వంటకాల్లో ‘చురుక్కు’మనిపించే రుచితో మెనూలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటిష్ సైనికులకూ.. నిజాంల కాలంలో నగరానికి వచ్చే బ్రిటిష్ సైనికాధికారులు, ప్రతినిధులకు ప్రత్యేకంగా మిర్చీకా సాలన్‌ను సిద్ధం చేసేవారట. వారు దివానానికి వచ్చీ రాగానే భోజనశాలలో మిర్చీకా సాలన్ ఘుమఘుమలు మొదలయ్యేవి. ప్రత్యేకంగా వడ్డించుకుని మరీ తినేవారట. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రుచిని ఆస్వాదించటం కోసం హైదరాబాద్ నుంచి చేయి తిరిగిన వంటవారిని వెంట తీసుకెళ్లారంటే దాని ప్రత్యేకత ఏ స్థాయిలో ఉండేదో తెలుస్తోంది. మిర్చీకా సాలన్‌ను అన్నిరకాల మిరపకాయలు సరిపోవు. కారం కాస్త తక్కువగా ఉండే లావుపాటి మిరప ఉంటేనే ఈ వంటకం భలే పసందుగా ఉంటుంది. ఈ వంటకం కోసమే కుతుబ్‌షాహీల హయాంలో ప్రత్యేకంగా మిరపను పండించేవారట. కొందరు రైతులకు దివానంలో ఆవాసం కల్పించారని చరిత్రకారులు చెబుతారు. నగరంలో ఇప్పుడు దీని హవా అంతాఇంతా కాదు. పెళ్లి మెనూలో ఇది తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఇది లేకుంటే బిర్యానీ రుచి దిగదుడుపే. - గౌరీభట్ల నరసింహమూర్తి -
దాణా-ఠికానా
షహర్‌కీ షాన్ ‘పావురాలకు గింజలేస్తే మన భావితరానికి ఆకలి బాధ ఉండదని మా తాత చెప్పాడు. నేను వేసిన గింజలను తృప్తిగా తింటూ పావురాల గుంపు అటూ ఇటూ ఎగురుతూ ఉంటే నా మనసులోని సమస్యలు మటుమాయమైనట్టు అనిపిస్తుంది. 35 ఏళ్లుగా నేను వాటికి గింజలేస్తున్నాను. ఇప్పుడు నా మనవడికి కూడా దాన్ని అలవాటుగా మార్చాను’ పాతనగరంలోని దారుల్‌షిఫాకు చెందిన జాలారామ్ మాటిది. నగరంలోని సైఫాబాద్ టెలిఫోన్ భవన్ సమీపంలో దశాబ్దన్నర క్రితం విశాలమైన మర్రిచెట్టు ఉండేది. ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించాలని తెగ తాపత్రయపడుతున్నట్టు నలుమూల లా విస్తరించి ఉండేది. సాయంత్రం అయ్యిందంటే దానిపై దాదాపు 8 వేల పక్షులు గుంపులుగుంపులుగా చేరుకునేవి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అప్పట్లో నగరంలో పక్షులపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన లెక్కిది. రకరకాల పక్షులకు ప్రధాన ఆవాసాలపై వారు నిర్వహించిన సర్వేలో ఈ చెట్టు కూడా ఓ ఆవాసమనే తేలింది. కానీ అధికారుల అనాలోచిత చర్య ఫలితంగా ఆ వృక్షం ఇప్పుడు మాయమైంది. అదొక్కటే కాదు... అలాంటి ఎన్నో వృక్షాలు కనుమరుగయ్యాయి. ఆ వృక్షాలే ఆవాసంగా ఉన్న పక్షుల ‘గూడు’ చెదిరి ఎటో ఎగిరిపోయాయి. కానీ ఓ ‘పక్షి’ మాత్రం ఎక్కడకూ పోనంటోంది. ఇప్పుడు నగరంలో ఏ మూల చూసినా వాటి రెక్కల సద్దు వినిపిస్తుంది. అదే పావురం. కొన్ని చిన్నచిన్న విశ్వాసాలు పావురాలకు ప్రాణం పోస్తోంది. ఏ పక్షి జాతి ఉనికి ప్రమాదంలో పడ్డా పావురాలకు మాత్రం కష్టకాలం రాలేదు. వాటి మనుగడ ప్రశ్నార్థకంలో పడకూడదనే చైతన్యం ప్రజల్లో ఇప్పటికిప్పుడు రగిలింది కాదు. వందల ఏళ్లుగా వస్తున్న ఓ ఆచారం వాటికి వరంగా మారింది. పావురాలకు గింజలు వేస్తే పుణ్యం వస్తుందనే అభిప్రాయం హిందూ, ముస్లింలలో బలంగా ఉంది. ఈ నమ్మకమే వాటికి శ్రీరామరక్షగా మారింది. ఇక పావురాల రెక్కల నుంచి వచ్చే గాలి సోకితే అనారోగ్యం దూరమవుతుందనే అభిప్రాయం మరికొన్ని వర్గాల్లో ఉంది. దీంతో తమ ఇంటి ఛాయల్లోనే పావురాలు పెరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరభారతదేశానికి చెందిన వారిలో ఈ నమ్మకం ఎక్కువ. వీరు ఇంటి కిటికీలకు చేరువలో కుండలు, డబ్బాలు వేలాడదీసి పావురాలకు ఆవాసం కల్పిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అవి ఎగురుతుంటే వాటి రెక్కల గాలి కిటికీల్లోంచి ఇళ్లలోకి వస్తుందనేది వారి అభిప్రాయం. నగర నిర్మాణానికి ముందు నుంచే.. భాగ్యనగర నిర్మాణానికి ముందునుంచే ఈ ప్రాంతంలో పావురాలు గుంపులుగా ఉండేవని చెబుతారు. గోల్కొండ పట్టణం రూపుదిద్దుకునే సమయంలో దానికి చేరువలో ఉన్న ఊళ్లలో పావురాలకు ప్రాణం పోశారు. ఇక నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలకు పావురాలకు గింజలు వేసే అలవాటు ఉండేది. రాజప్రాసాదాల వద్ద వందల సంఖ్యలో పావురాల గుంపు నిత్యం ఉండేదట. నవాబుల కుటుంబ సభ్యులు పావురాలకు గింజలు వేసి ఆనందించేవారట. ఇందుకోసం వారి నివాసాల సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేది. అసఫ్జాహీలు కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. ఇందుకు పాతనగరంలో నేటికీ నిదర్శనాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దూద్‌బౌలి సమీపంలో పావురాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కబూతర్ ఖానా ఇందులో ముఖ్యమైంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అంతస్తులుగా ఉన్నఈ నిర్మాణంలో వందల సంఖ్యలో పావురాలు ఎగురుతూ ఉంటాయి. ప్రతిరోజూ మతాలకతీతంగా ప్రజలు వచ్చి వాటికి గింజలు వేసి వెళ్తుంటారు. పాతనగరంలోని అలనాటి నిర్మాణాలను నిశితంగా పరిశీలిస్తే పావురాల వేదికలు వాటిలో అంతర్భాగంగా కనిపిస్తాయి. ఇక సుల్తాన్‌బజార్‌లోని కబూతర్‌ఖానా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి మైదానంలో వేల సంఖ్యలో పావురాలు ఉంటాయి. ఒక్కసారిగా అవన్నీ ఎగిరే దృశ్యం కోసం చాలామంది అక్కడికి వస్తుంటారు. ఇక మక్కామసీదు, జూబ్లీహాలు, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలు పావురాలకు నిలయాలుగా నిలిచాయి. మానసిక ప్రశాంతత... పావురాలకు గింజలు వేసే ప్రక్రియ మానసిక ఆనందాన్ని పంచుతోందని నిపుణులు కూడా పేర్కొంటుండటం విశేషం. మనం వేసిన ఆహారం వాటి కడుపు నింపిందనే తృప్తి మనసులో కొత్త ఆనందాన్ని కలిగిస్తుందని వారంటారు. పావురాలకు గింజలు వేసి తదేకంగా వాటిని గమనిస్తుంటే సహజీవనం, సాన్నిహిత్యం, కష్టపడేతత్వం లాంటి మంచి అలవాట్లు కూడా అబ్బుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో పావురాలకు గింజలు వేయిస్తుంటారు. వెరసి ఈ ప్రక్రియ మన సంస్కృతిలో భాగమైంది. -
కుస్తీమే సవాల్
అదో విశాలమైన మైదానం... కొదమ సింహాల్లా కొందరు యోధులు పరస్పరం కలబడుతున్నారు. అలా అందర్నీ ఓడించిన ఓ వస్తాదు.. దూరంగా సింహాసనంపై కూర్చుని ఆ పోరును రెప్ప వాల్చకుండా వీక్షిస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సలామ్ చేశాడు... ఆయన లేచి అతని మెడలో ఓ పతకం వేసి కోటకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ యోధుడు ఔరంగజేబు సైన్యంలో కీలక పదవి పొందాడు. ►నేటి రెజ్లింగ్‌కు ప్రాణం పోసిన క్రీడ ►ఔరంగజేబు ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో పోటీలు ►నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం షహర్‌కీ షాన్ గౌరీభట్ల నరసింహమూర్తి ఆ పోరు సాగిన మైదానం ప్రస్తుత ధూల్‌పేట ప్రాంతంలో ఉంది. పోటీలను వీక్షించిన వ్యక్తి ఖ్వాజా అబిద్ సిద్దిఖీ. నాటి మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన ఔరంగజేబుకు చీఫ్ కమాండర్. గోల్కొండ కోటను మొఘల్ పరం చేయటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. ఆ రోజు అక్కడ జరిగిన కుస్తీ పోటీలు సాధారణంగానో, సరదాగానో జరిగినవి కావు. యుద్ధ విన్యాసాల్లో ఆరితేరిన మెరికల్లాంటి యోధులను సైన్యంలో చేర్చుకునే క్రమంలో ఔరంగజేబు నిర్వహించిన పోటీలవి. ఇది చరిత్ర ! రెజ్లింగ్‌లో రైజింగ్.. 2014 గ్లాస్గో కామన్వెల్త్ పోటీల్లో మన దేశం పరువు నిలిపిన క్రీడ రెజ్లింగ్. ఆ పోటీల్లో మనం 64 పతకాలు సాధిస్తే.. రెజ్లింగ్‌కు వచ్చినవి 14. వాటిల్లోనూ బంగారు పతకాలు ఐదు. మిగతా క్రీడల్లో తడబడే మన దేశం రెజ్లింగ్‌లో మాత్రం గట్టిపోటీ ఇస్తూ వస్తోంది. అందుకు మన చారిత్రక నేపథ్యమే కారణం. ఇప్పుడు రెజ్లింగ్‌గా పిలుచుకుంటున్న క్రీడే నాడు కుస్తీగా విలసి ల్లింది. మన దేశంలో కుస్తీ అనగానే గుర్తొచ్చే నగరం హైదరాబాద్. రాఖీపౌర్ణమి, నాగ పంచమి రోజుల్లో పాతబస్తీలోని ధూల్‌పేట, మంగళ్హాట్లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతుంటాయి. మల్లయోధులు ఉగ్ర సింహాల్లా తలపడుతూ కనిపిస్తారు. అదే కుస్తీ.. పోటీపడేవారే మల్లయోధులు. చందమామ, బాలమిత్రల్లోని చారిత్రక గాథలు చదువుతున్నప్పుడు.. దేశాటనకు వచ్చే యోధులు తమను ఓడించే మొనగాళ్లున్నారా అంటూ సవాల్ విసరటం, వారిని ఓడించలేక ఒక్కొక్కరుగా చతికిలపడుతుంటే అవమానంతో రాజు తల దించుకోవటం, ఇంతలో ఓ వీరుడొచ్చి మల్లయోధుడిని ఓడించి రాజ్యం పరువు నిలపటం.. లాంటి కథలు సహజమే. కానీ ఆ కుస్తీ పోటీల్లోని పౌరుషం కొన్ని ఇలాకాల్లో నేటికీ కన్పిస్తుంది. అలాంటిదే ధూల్‌పేట. సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఔరంగజేబు దక్కన్ ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దఎత్తున సైనిక పటాలం వచ్చి చేరింది. అందులోని సైనికులు అసాధారణ ప్రతిభాపాటవాలను సొంతం చేసుకున్న వారే. తన సైన్యం ఏ దశలోనూ వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతో మెరికల్లాంటి యువకులను ఔరంగజేబు సిద్ధం చేసుకున్నారు. అలాంటి వారిలో నేటి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన లోధీ సామాజిక వర్గానికి చెందినవారూ ఉన్నారు. వీరు యుద్ధవిద్యలో ఆరితేరిన వారు. ఇక మల్లయుద్ధమంటే ప్రాణం. నేటి ధూల్‌పేట ప్రాంతంలో వీరి ఆవాసం ఉండేది. తరచూ మల్లయుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సాధారణ రోజుల్లోనూ అలరించేవారు. ఔరంగజేబు పతనమయ్యాక ఈ ప్రాంతం అసఫ్‌జాహీల పరిధిలోకి చేరింది. క్రీడలు, కళలకు పెద్దపీట వేసి ప్రోత్సహించిన అసఫ్జాహీలు లోధీల మల్లయుద్ధ విన్యాసాలకు ముగ్దులయ్యారు. క్రమంగా వారి నైపుణ్యం ఓ క్రీడగా మారిపోయింది. అసఫ్‌జాహీ రాజ కుటుంబీకులు, ఆస్థాన ప్రతినిధుల కుటుంబసభ్యులు క్రమంగా మల్లయుద్ధ విన్యాసాలను చూసేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ప్రత్యేక సందర్భాల్లో కుస్తీ పోటీలు నిర్వహించే పద్ధతి నగరంలో ఆరంభం అయింది. ఇందుకోసం దంగల్(కుస్తీ ప్రాంగణం)లు వెలిశాయి. పోటీల్లో పాల్గొనేవారికి నజరానాలు ఇస్తుండటంతో బాగా ప్రాచుర్యం పొందింది. అలా ప్రారంభమైన పోటీలు క్రమంగా ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించటం ఆనవాయితీగా మారింది. లోధీలు ఉత్సాహంగా జరుపుకొనే నాగపంచమి, రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా కుస్తీ పోటీలు మారాయి. వందల సంవత్సరాల క్రితం మొగ్గ తొడిగిన ఈ విధానం క్రమంగా వికసించింది. హైదరాబాద్ కుస్తీ పోటీల ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది. పోటీలకు వివిధ ప్రాంతాల యోధులు హాజరవటం విజేతలకు బహుమతులు అందజేయడం ఆనవాయితీ అయింది. దీంతో మల్లయోధులను తయారు చేసే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు మొదలయ్యాయి. నాటి యోధుల పేరుతో దంగల్ కమిటీలూ రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికీ ఏటా రెండు సార్లు ఈ పోటీలు కొనసాగుతూనే ఉన్నాయి. కులమతాలకతీతంగా... హిందూ పర్వదినాలను పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నా అందులో పాల్గొనేవారిపై ఎలాంటి ఆంక్షలు కనిపించవు. ఈ పోటీల్లో ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటమే దీనికి నిదర్శనం. విజేతలకు గదను, ప్రశంసాపత్రాలను, నగదు పురస్కారాలు అందజేస్తారు