కుస్తీమే సవాల్
అదో విశాలమైన మైదానం... కొదమ సింహాల్లా కొందరు యోధులు పరస్పరం కలబడుతున్నారు. అలా అందర్నీ ఓడించిన ఓ వస్తాదు.. దూరంగా సింహాసనంపై కూర్చుని ఆ పోరును రెప్ప వాల్చకుండా వీక్షిస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సలామ్ చేశాడు... ఆయన లేచి అతని మెడలో ఓ పతకం వేసి కోటకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ యోధుడు ఔరంగజేబు సైన్యంలో కీలక పదవి పొందాడు.
►నేటి రెజ్లింగ్‌కు ప్రాణం పోసిన క్రీడ
►ఔరంగజేబు ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో పోటీలు
►నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం
షహర్‌కీ షాన్
గౌరీభట్ల నరసింహమూర్తి
ఆ పోరు సాగిన మైదానం ప్రస్తుత ధూల్‌పేట ప్రాంతంలో ఉంది. పోటీలను వీక్షించిన వ్యక్తి ఖ్వాజా అబిద్ సిద్దిఖీ. నాటి మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన ఔరంగజేబుకు చీఫ్ కమాండర్. గోల్కొండ కోటను మొఘల్ పరం చేయటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. ఆ రోజు అక్కడ జరిగిన కుస్తీ పోటీలు సాధారణంగానో, సరదాగానో జరిగినవి కావు. యుద్ధ విన్యాసాల్లో ఆరితేరిన మెరికల్లాంటి యోధులను సైన్యంలో చేర్చుకునే క్రమంలో ఔరంగజేబు నిర్వహించిన పోటీలవి. ఇది చరిత్ర !
రెజ్లింగ్‌లో రైజింగ్..
2014 గ్లాస్గో కామన్‌వెల్త్ పోటీల్లో మన దేశం పరువు నిలిపిన క్రీడ రెజ్లింగ్. ఆ పోటీల్లో మనం 64 పతకాలు సాధిస్తే.. రెజ్లింగ్‌కు వచ్చినవి 14. వాటిల్లోనూ బంగారు పతకాలు ఐదు. మిగతా క్రీడల్లో తడబడే మన దేశం రెజ్లింగ్‌లో మాత్రం గట్టిపోటీ ఇస్తూ వస్తోంది. అందుకు మన చారిత్రక నేపథ్యమే కారణం. ఇప్పుడు రెజ్లింగ్‌గా పిలుచుకుంటున్న క్రీడే నాడు కుస్తీగా విలసి ల్లింది. మన దేశంలో కుస్తీ అనగానే గుర్తొచ్చే నగరం హైదరాబాద్.
రాఖీపౌర్ణమి, నాగ పంచమి రోజుల్లో పాతబస్తీలోని ధూల్‌పేట, మంగళ్‌హాట్‌లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతుంటాయి. మల్లయోధులు ఉగ్ర సింహాల్లా తలపడుతూ కనిపిస్తారు. అదే కుస్తీ.. పోటీపడేవారే మల్లయోధులు. చందమామ, బాలమిత్రల్లోని చారిత్రక గాథలు చదువుతున్నప్పుడు.. దేశాటనకు వచ్చే యోధులు తమను ఓడించే మొనగాళ్లున్నారా అంటూ సవాల్ విసరటం, వారిని ఓడించలేక ఒక్కొక్కరుగా చతికిలపడుతుంటే అవమానంతో రాజు తల దించుకోవటం, ఇంతలో ఓ వీరుడొచ్చి మల్లయోధుడిని ఓడించి రాజ్యం పరువు నిలపటం.. లాంటి కథలు సహజమే. కానీ ఆ కుస్తీ పోటీల్లోని పౌరుషం కొన్ని ఇలాకాల్లో నేటికీ కన్పిస్తుంది.
అలాంటిదే ధూల్‌పేట. సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఔరంగజేబు దక్కన్ ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దఎత్తున సైనిక పటాలం వచ్చి చేరింది. అందులోని సైనికులు అసాధారణ ప్రతిభాపాటవాలను సొంతం చేసుకున్న వారే. తన సైన్యం ఏ దశలోనూ వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతో మెరికల్లాంటి యువకులను ఔరంగజేబు సిద్ధం చేసుకున్నారు. అలాంటి వారిలో నేటి ఉత్తర
ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన లోధీ సామాజిక వర్గానికి చెందినవారూ ఉన్నారు. వీరు యుద్ధవిద్యలో ఆరితేరిన వారు. ఇక మల్లయుద్ధమంటే ప్రాణం. నేటి ధూల్‌పేట ప్రాంతంలో వీరి ఆవాసం ఉండేది. తరచూ మల్లయుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సాధారణ రోజుల్లోనూ అలరించేవారు.
ఔరంగజేబు పతనమయ్యాక ఈ ప్రాంతం అసఫ్‌జాహీల పరిధిలోకి చేరింది. క్రీడలు, కళలకు పెద్దపీట వేసి ప్రోత్సహించిన అసఫ్‌జాహీలు లోధీల మల్లయుద్ధ విన్యాసాలకు ముగ్దులయ్యారు. క్రమంగా వారి నైపుణ్యం ఓ క్రీడగా మారిపోయింది. అసఫ్‌జాహీ రాజ కుటుంబీకులు, ఆస్థాన ప్రతినిధుల కుటుంబసభ్యులు క్రమంగా మల్లయుద్ధ విన్యాసాలను చూసేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ప్రత్యేక సందర్భాల్లో కుస్తీ పోటీలు నిర్వహించే పద్ధతి నగరంలో ఆరంభం అయింది. ఇందుకోసం దంగల్(కుస్తీ ప్రాంగణం)లు వెలిశాయి. పోటీల్లో పాల్గొనేవారికి నజరానాలు ఇస్తుండటంతో బాగా ప్రాచుర్యం పొందింది.
అలా ప్రారంభమైన పోటీలు క్రమంగా ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించటం ఆనవాయితీగా మారింది. లోధీలు ఉత్సాహంగా జరుపుకొనే నాగపంచమి, రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా కుస్తీ పోటీలు మారాయి. వందల సంవత్సరాల క్రితం మొగ్గ తొడిగిన ఈ విధానం క్రమంగా వికసించింది. హైదరాబాద్ కుస్తీ పోటీల ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది. పోటీలకు వివిధ ప్రాంతాల యోధులు హాజరవటం విజేతలకు బహుమతులు అందజేయడం ఆనవాయితీ అయింది. దీంతో మల్లయోధులను తయారు చేసే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు మొదలయ్యాయి. నాటి యోధుల పేరుతో దంగల్ కమిటీలూ రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికీ ఏటా రెండు సార్లు ఈ పోటీలు కొనసాగుతూనే ఉన్నాయి.
కులమతాలకతీతంగా...
హిందూ పర్వదినాలను పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నా అందులో పాల్గొనేవారిపై ఎలాంటి ఆంక్షలు కనిపించవు. ఈ పోటీల్లో ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటమే దీనికి నిదర్శనం. విజేతలకు గదను, ప్రశంసాపత్రాలను, నగదు పురస్కారాలు అందజేస్తారు