
సాక్షి, హైదరాబాద్: మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభమైన ప్రపంచ అలర్జీ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం డీజీపీ కార్యాలయంలో ప్రముఖ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నేతృత్వంలో ‘పావురాల రెక్కలు – పావురాల విసర్జన– ఎలర్జీ నిర్ధారణ– పరీక్షలు’ క్యాంపెయిన్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పావురాలతో ప్రబలే అలర్జీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలర్జీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అశ్వినీ అలర్జీ సెంటర్‌లో పావురాల వల్ల కలిగే ప్రాణాంతకరమైన వ్యాధి ‘హైపర్ సెన్సిటివిటీ నీమోనైటిస్’ ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెయ్యి మందికి ఉచితంగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.