Mental calm
-
జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం
మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ భారత్‌లో ఇలా.. ►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు ► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. ►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. ►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. ►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. ►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. ►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. – డాక్టర్ బి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
ఎన్ని ఉన్నా ఏం లాభం?
‘‘మనం హాయిగా బతకడానికి ఏవేవో కావాలనుకుంటాం. కానీ అంతిమంగా కావాల్సింది మానసిక ప్రశాంతతే. అది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాళ్లను ఆరాధనాభావంతో చూసేదాన్ని. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైనది అని అర్థం అయింది. ఎటువంటి ఒత్తిడిలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే ఏం లాభం?’’ అన్నారు కాజల్. అలాగే కరోనా వైరస్‌పై పోరాడేందుకు తన వంతు సహాయాన్ని అందించారు. ‘కరోనా క్రైసిస్ చారిటీ కోసం’ (సీసీసీ మనకోసం)కు 2 లక్షల రూపాయిల విరాళం ప్రకటించారు కాజల్. -
మీలో మానసిక బలం ఎంత?
అనారోగ్యం శారీరకమైనదే కాదు. మానసికమైనది కూడా. కొంతమంది శారీరక రుగ్మతలతో బాధపడుతున్నా మానసికంగా వాటన్నింటినీ జయిస్తుంటారు. మరికొందరేమో శారీరకంగా బాగున్నా, లేనిపోని భయాలతో అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. మరి మీ సంగతేమిటి? మీలో మానసిక బలం ఎంత? ఒకసారి విశ్లేషించుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్. 1. ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వివిధ వ్యాధుల గురించి తెలుసుకోవాలని అమిత ఆసక్తి చూపుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. మీ ఆరోగ్యం గురించి నిత్యం ఆందోళనకు గురవుతుంటారు. ఎ. అవును బి. కాదు 3. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదన్న చింత మిమ్మల్ని వేధిస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 4. వయసుకు తగిన బరువు, ఎత్తు లేనన్న సంశయం మనసును తొలిచేస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 5. వైద్యపరంగా సరైన నిర్ధారణలు లేని వ్యాధులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయనే దిగులు మీలో ఎక్కువవుతోంది. ఎ. అవును బి. కాదు 6. ఒంట్లో బాగుండటం లేదని తరచుగా ఆఫీసుకు సెలవు పెడుతుంటారు. ఎ. అవును బి. కాదు 7. ఒత్తిళ్లు ఎదురైనప్పుడు మీ గుండె చాలా వేగంగా కొట్టుకుని గుండెపోటు వచ్చేలా ఉందని భయపడుతుంటారు. ఎ. అవును బి. కాదు 8. పెరుగుతున్న వయసు, మృత్యుభయం తరచూ మీపై స్వైరవిహారం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువ వస్తే మీలో విపరీతమైన ఆందోళనలు ఉన్నాయని చెప్పవచ్చు. చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేరు. మీది సానుభూతి కోరుకునే తత్వం. ఈ లక్షణాలను మీరు ఇలాగే పెంచి పోషించుకుంటే భవిష్యత్తులో మీరు అన్నింటికీ అవస్థలు పడాల్సిందే. ‘ఎ’లు కన్నా ‘బి’ ఎక్కువగా వస్తే మానసిక సంబంధమైన సమస్యలకు మీరు చాలావరకు దూరంగా ఉన్నట్లే లెక్క. మీ గురించి మీకు ఆందోళనలు కాస్తోకూస్తో ఉన్నా అవి సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు భావించవచ్చు. -
మౌనంగా ఒక పూట
సాయంత్రమైంది. పొద్దు గుంకింది. నిశ్శబ్దంగా చీకటి ఆవరిస్తోంది. బయట కీచురాళ్ల చప్పుడు మొదలవుతోంది. ఒక ఆశ్రమ పాఠశాలలో ఆ రోజు మౌనం గొప్పతనం గురించి బోధించాడు గురువు. వారానికి ఒక రోజైనా మౌనంగా ఉండటం వల్ల ఎంత మానసిక ప్రశాంతత దొరుకుతుందో వివరించాడు. పాఠం విన్న నలుగురు యువ విద్యార్థులు ఆరోజు నుంచే దాన్ని అమలు చేయాలనుకున్నారు. వాళ్లు అలిఖితంగా సంజ్ఞల ద్వారానే ఆ రోజంతా పెదవి విప్పకూడదని ఒప్పందం చేసుకున్నారు. నలుగురూ తమ బసకు వెళ్లారు. మౌనంగా వారి పొద్దు గడిచింది. ఒక్క మాటా మాట్లాడకుండానే వారి వారి పనులు చేసుకున్నారు. సాయంత్రమైంది. పొద్దు గుంకింది. నిశ్శబ్దంగా చీకటి ఆవరిస్తోంది. బయట కీచురాళ్ల చప్పుడు మొదలవుతోంది. ‘ఎవరైనా లాంతరు వెలిగిస్తే బాగుంటుంది’ అన్నాడు ఒక యువకుడు.అంతసేపూ వున్న మౌన వాతావరణం ఆ మాటతో భంగపడింది.మొదటి యువకుడి మాటకు ఆశ్చర్యపోతూ, ‘మనం ఈరోజంతా ఒక్క మాట కూడా మాట్లాడకూడదని అనుకున్నాం కదా!’ అని గుర్తు చేశాడు మరో యువకుడు.ఈ ఇద్దరి సంభాషణ వల్ల మూడో యువకుడికి కోపమొచ్చింది. ‘మీ ఇద్దరూ మూర్ఖుల్లా వున్నారు. ఎందుకు మాట్లాడారు?’ అని అడిగాడు.‘అయితే నేనొక్కడినే అన్నమాట ఇంతసేపూ మాట్లాడకుండా వున్నది’ అని ముగించాడు నాలుగో యువకుడు. -
దాణా-ఠికానా
షహర్‌కీ షాన్ ‘పావురాలకు గింజలేస్తే మన భావితరానికి ఆకలి బాధ ఉండదని మా తాత చెప్పాడు. నేను వేసిన గింజలను తృప్తిగా తింటూ పావురాల గుంపు అటూ ఇటూ ఎగురుతూ ఉంటే నా మనసులోని సమస్యలు మటుమాయమైనట్టు అనిపిస్తుంది. 35 ఏళ్లుగా నేను వాటికి గింజలేస్తున్నాను. ఇప్పుడు నా మనవడికి కూడా దాన్ని అలవాటుగా మార్చాను’ పాతనగరంలోని దారుల్‌షిఫాకు చెందిన జాలారామ్ మాటిది. నగరంలోని సైఫాబాద్ టెలిఫోన్ భవన్ సమీపంలో దశాబ్దన్నర క్రితం విశాలమైన మర్రిచెట్టు ఉండేది. ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించాలని తెగ తాపత్రయపడుతున్నట్టు నలుమూల లా విస్తరించి ఉండేది. సాయంత్రం అయ్యిందంటే దానిపై దాదాపు 8 వేల పక్షులు గుంపులుగుంపులుగా చేరుకునేవి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అప్పట్లో నగరంలో పక్షులపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన లెక్కిది. రకరకాల పక్షులకు ప్రధాన ఆవాసాలపై వారు నిర్వహించిన సర్వేలో ఈ చెట్టు కూడా ఓ ఆవాసమనే తేలింది. కానీ అధికారుల అనాలోచిత చర్య ఫలితంగా ఆ వృక్షం ఇప్పుడు మాయమైంది. అదొక్కటే కాదు... అలాంటి ఎన్నో వృక్షాలు కనుమరుగయ్యాయి. ఆ వృక్షాలే ఆవాసంగా ఉన్న పక్షుల ‘గూడు’ చెదిరి ఎటో ఎగిరిపోయాయి. కానీ ఓ ‘పక్షి’ మాత్రం ఎక్కడకూ పోనంటోంది. ఇప్పుడు నగరంలో ఏ మూల చూసినా వాటి రెక్కల సద్దు వినిపిస్తుంది. అదే పావురం. కొన్ని చిన్నచిన్న విశ్వాసాలు పావురాలకు ప్రాణం పోస్తోంది. ఏ పక్షి జాతి ఉనికి ప్రమాదంలో పడ్డా పావురాలకు మాత్రం కష్టకాలం రాలేదు. వాటి మనుగడ ప్రశ్నార్థకంలో పడకూడదనే చైతన్యం ప్రజల్లో ఇప్పటికిప్పుడు రగిలింది కాదు. వందల ఏళ్లుగా వస్తున్న ఓ ఆచారం వాటికి వరంగా మారింది. పావురాలకు గింజలు వేస్తే పుణ్యం వస్తుందనే అభిప్రాయం హిందూ, ముస్లింలలో బలంగా ఉంది. ఈ నమ్మకమే వాటికి శ్రీరామరక్షగా మారింది. ఇక పావురాల రెక్కల నుంచి వచ్చే గాలి సోకితే అనారోగ్యం దూరమవుతుందనే అభిప్రాయం మరికొన్ని వర్గాల్లో ఉంది. దీంతో తమ ఇంటి ఛాయల్లోనే పావురాలు పెరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరభారతదేశానికి చెందిన వారిలో ఈ నమ్మకం ఎక్కువ. వీరు ఇంటి కిటికీలకు చేరువలో కుండలు, డబ్బాలు వేలాడదీసి పావురాలకు ఆవాసం కల్పిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అవి ఎగురుతుంటే వాటి రెక్కల గాలి కిటికీల్లోంచి ఇళ్లలోకి వస్తుందనేది వారి అభిప్రాయం. నగర నిర్మాణానికి ముందు నుంచే.. భాగ్యనగర నిర్మాణానికి ముందునుంచే ఈ ప్రాంతంలో పావురాలు గుంపులుగా ఉండేవని చెబుతారు. గోల్కొండ పట్టణం రూపుదిద్దుకునే సమయంలో దానికి చేరువలో ఉన్న ఊళ్లలో పావురాలకు ప్రాణం పోశారు. ఇక నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలకు పావురాలకు గింజలు వేసే అలవాటు ఉండేది. రాజప్రాసాదాల వద్ద వందల సంఖ్యలో పావురాల గుంపు నిత్యం ఉండేదట. నవాబుల కుటుంబ సభ్యులు పావురాలకు గింజలు వేసి ఆనందించేవారట. ఇందుకోసం వారి నివాసాల సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేది. అసఫ్జాహీలు కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. ఇందుకు పాతనగరంలో నేటికీ నిదర్శనాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దూద్‌బౌలి సమీపంలో పావురాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కబూతర్ ఖానా ఇందులో ముఖ్యమైంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అంతస్తులుగా ఉన్నఈ నిర్మాణంలో వందల సంఖ్యలో పావురాలు ఎగురుతూ ఉంటాయి. ప్రతిరోజూ మతాలకతీతంగా ప్రజలు వచ్చి వాటికి గింజలు వేసి వెళ్తుంటారు. పాతనగరంలోని అలనాటి నిర్మాణాలను నిశితంగా పరిశీలిస్తే పావురాల వేదికలు వాటిలో అంతర్భాగంగా కనిపిస్తాయి. ఇక సుల్తాన్‌బజార్‌లోని కబూతర్‌ఖానా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి మైదానంలో వేల సంఖ్యలో పావురాలు ఉంటాయి. ఒక్కసారిగా అవన్నీ ఎగిరే దృశ్యం కోసం చాలామంది అక్కడికి వస్తుంటారు. ఇక మక్కామసీదు, జూబ్లీహాలు, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలు పావురాలకు నిలయాలుగా నిలిచాయి. మానసిక ప్రశాంతత... పావురాలకు గింజలు వేసే ప్రక్రియ మానసిక ఆనందాన్ని పంచుతోందని నిపుణులు కూడా పేర్కొంటుండటం విశేషం. మనం వేసిన ఆహారం వాటి కడుపు నింపిందనే తృప్తి మనసులో కొత్త ఆనందాన్ని కలిగిస్తుందని వారంటారు. పావురాలకు గింజలు వేసి తదేకంగా వాటిని గమనిస్తుంటే సహజీవనం, సాన్నిహిత్యం, కష్టపడేతత్వం లాంటి మంచి అలవాట్లు కూడా అబ్బుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో పావురాలకు గింజలు వేయిస్తుంటారు. వెరసి ఈ ప్రక్రియ మన సంస్కృతిలో భాగమైంది.