కిలకిలరావాలు కొన్ని నిష్ర్కమణ గీతాలు
సీతాకోకచిలుక
ఓ నిత్యకల్యాణి మరి మరి బ్రతిమిలాడినా మచ్చిక్కాని ఆమె లాలిత్యాన్ని ఊహలోకి ఆహ్వానం పలుకుతాను
పావురం
నా సౌందర్య సఖి ఊదావృత్తాల కళ్లలోంచి ఆ చిప్పిల్లే కరుణని మధిర వలె అనుదినం నేను చిత్తుగా తాగుతాను
కోకిల
ఆరాధ్యదేవత అజ్ఞాతంగా అవనిని వర్ధిల్లమనే ఆ ఆకుపచ్చని పునరాకాంక్షలో కవి పరంపరగా పాలుపంచుకొన్నాను
రామచిలుక
జన్మతః వయ్యారి ఉరుముల మెరుపులతో ఊరించే వర్షాగమ వేళ కారు మబ్బులని గమ్మున గమ్మున కురవమని ఆమె కిలకిలవంపుల కలవరంలో రమణీయంగా కోరుకోవడం విన్నాను
పిచ్చుక
నా ఒక్కగానొక్క గారాల పుత్రిక ప్రతి ఇద్ద్దరి నిస్తంత్రీ సంభాషణలో అంతూ దరీ లేక వీచే వడగాడ్పుకి అదృశ్యమైన ఆ చిన్నారిపొన్నారిని
ఎవ్వరైనాగాని ఎక్కడైనా చూశారా అని గడపగడపకూ తిరిగి అడుగుతున్నాను
- నామాడి శ్రీధర్
9396807070