
నేల మీద ఇల్లు కట్టుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా స్థలాల ధరలు చుక్కలను తాకే నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే, నేల మీద కాకుండా నీటిలో తేలియాడే ఇల్లుకు చైనీస్ ఆర్కిటెక్ట్‌లు రూపకల్పన చేశారు. బీజింగ్‌కు చెందిన ‘క్రాస్‌బౌండరీస్ ఆర్కిటెక్చర్ స్టూడియో’కు చెందిన నిపుణులు సాధారణమైన ఇంటికి కావలసిన అన్ని వసతులతో కూడిన పడవలాంటి ఈ ఇంటిని తయారు చేశారు.
నదుల్లోను, సముద్రంలోనూ తేలుతూ ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దారు. పడవలాంటి ఈ ఇంటికి ‘ఫాంగ్ సాంగ్’ అని పేరు పెట్టారు. పడవలు నడవాలంటే ఇంధనం కావాలి. పడవలాంటి ఈ 667 చదరపు అడుగుల ఇంటికి మాత్రం ఇంధనం అక్కర్లేదు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. దీని పైకప్పుల మీద అమర్చిన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ ఇంటి అవసరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. ఈ ఇంటి ధర 26 వేల డాలర్లు (రూ.21.85 లక్షలు). ఈ తేలే ఇంటిని కొనేందుకు యూరోపియన్లు సైతం ఎగబడుతుండటం విశేషం.