సముద్రంలో రెస్టారెంట్
సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్‌లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు.
విగ్గుతో గిన్నిస్ రికార్డ్
విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment