ప్రతీకాత్మక చిత్రం
నాయుడుపేటటౌన్ (నెల్లూరు జిల్లా): తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళిక వేసుకుని సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో పావురాల రేస్‌కు తెరతీశారు. తాజాగా నాయుడుపేటలో రేస్ నిర్వహించేందుకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు హాజరుపరిచామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ అవీన్ ఫిలిప్స్ తిరుచ్చి, చెన్నై తదితర ప్రాంతాల్లో పందెం పావురాళ్లతో రేస్‌లు నిర్వహిస్తుంటాడు.
రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తుంటారు. ఈక్రమంలో అతను అధిక లాభాలను గడించాడు. తర్ఫీదు పొందిన పందెం పావురాల కాళ్లకు నంబర్లతో కూడిన ట్యాగ్‌ను కడతారు. వాటిని వాహనాల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాలకు తీసుకొచ్చి వదులుతారు. తమిళనాడులోని గమ్యస్థానానికి ముందుగా వెళ్లే పావురాలను విజేతలు ప్రకటించి పందెం కాసిన వారికి నగదు బహుమతులిస్తారు. హార్స్ రేస్‌లాగే పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దఎత్తున పందెం పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నామని నిందితులు విచారణలో చెప్పారు.
పందెం పావురాలతో బెట్టింగ్ రెస్ నిర్వహించేందుకు తమకు చెన్నైలో పోలీసులు, అటవీ ఇతర శాఖల అధికారులు అనుమతి ఇచ్చారని నకిలీ పత్రాలు తమ వద్ద ఉంచుకుని నాయుడుపేటకు ఫిలిప్స్ వచ్చినట్లుగా గుర్తించారు. మినీ లారీలో 521 పందెం పావురాలను 27 ప్లాస్టిక్ బాక్సులో ఉంచి తిరుచ్చి ప్రాంతానికి చెందిన మరో ఆరుగురు సహాయకులను వెంట తీసుకుని బిరదవాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారి వద్దకు ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నాడు.
అక్కడ పావురాలను వదిలి పెడుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు టీవీ కృష్ణయ్య, కె.బాలకృష్ణయ్య సిబ్బంది వెళ్లి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 521 పావురాలను నెల్లూరులోని ఫౌండేషన్ ఆఫ్ యానిమల్స్ కేంద్రానికి తరలించారు. మినీ లారీని సీజ్ చేశారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ కేసులో ఏడుగురిని చాకచాక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన ఇద్దరు ఎస్సైలతోపాటు ఏఎస్సై విజయభాస్కర్, హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్‌రాజు, టి.బాలసుబ్రహ్మణ్యం తదితరులను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment