కాసుల వేటలో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమిళనాడులో చికెన్ వ్యర్థాలుగా పడేసే లివర్, కందనకాయలతో పాటు నిల్వ చికెన్‌ను వేస్ట్‌గా కొనుగోలు చేసి నెల్లూరులో ఫ్రెష్ చికెన్‌గా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో సర్దుమణిగిన నిల్వ చికెన్ వ్యాపారం మళ్లీ ఇటీవల కాలంలో పుంజుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై పరిసరాల నుంచి కొనుగోలు చేసిన ఇలాంటి వ్యర్థాలను హోటల్స్‌కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సాక్షి, నెల్లూరు: తమిళనాడులో చికెన్ లివర్, కందనకాయలకు డిమాండ్ తక్కువ. ఇక్కడ చికెన్ కేజీ ధరలతోనే లివర్, కందనకాయలను కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేస్తున్నారు. నగరంలోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్‌లకు విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా జరుగుతోంది. గతంలో ఇప్పటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు దుకాణాలపై దాడులు చేసి గుర్తించిన విషయం తెలిసిందే. తిరిగి వెంకటరమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ ముఠా ఆగడాలకు మరోసారి అడ్డుకట్టవేశారు.
కేజీ రూ.100లకే విక్రయం
తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రతి వారం భారీగా నిల్వ చికెన్, లివర్, కందనకాయల మాంసాన్ని రూ.40లకే కొనుగోలు చేసి ట్రక్కుల ద్వారా నెల్లూరుకు తరలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమ ఇళ్లలో నిల్వ చేసి చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్‌లకు రూ.100లకు విక్రయిస్తున్నారు. తమిళనాడులో లివర్, కందనకాయలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని వాటిని కొనుగోలు చేయరు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చికెన్ ధరతో సమానంగా లివర్, కందనకాయలను విక్రయిస్తుంటారు. తమిళనాడులో నిల్వ ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది.
విస్తృత తనిఖీలు అవసరం
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వెంకటరమణ గతంలో విధులు నిర్వహించిన సమయంలో నగరంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. బోడిగాడితోట వద్ద కుళ్లిన మాంసం నిల్వలపై, చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్‌లు, బేకరీలపై వరుస దాడులతో విక్రయదారుల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఆయన మరో విభాగానికి బదిలీ కావడంతో కొంత కాలం ఈ ముఠా ఆగడాలు మళ్లీ చెలరేగాయి. తిరిగి ఎంహెచ్‌ఓగా వెంకటరమణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మళ్లీ విస్తృత స్థాయిలో దాడులు చేస్తే ఇలాంటి నిల్వ మాంసం విక్రయాలు గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది.
400 కేజీల నిల్వ మాంసం పట్టివేత
►నోటీసులు జారీ, రూ.25 వేల జరిమానా
నగరంలోని మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్ స్టాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 27వ తేదీ నాటి నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. 400 కేజీల చెడిపోయిన మాంసాన్ని గుర్తించారు. దీంతో ఫినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. మాంసాన్ని చెత్త వాహనాల్లో డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ప్రజలు నాణ్యమైన ఆహారం కొనుగోలు చేసేందుకు వస్తారని, ఇలా చెడిపోయిన ఆహారాన్ని విక్రయించడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. ప్రజలకు అనారోగ్య కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య మాట్లాడుతూ 27వ తేదీనాటి మాంసాన్ని నెల్లూరుకు తరలించి దిగుమతి చేయడాన్ని వెంకటరమణ బృందం దాడులు చేసి పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారా న్ని మాత్రమే విక్రయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment