చిన్న చిన్న సంతోషాలకు వందనం
కళింగాంధ్రలో రోడ్లు రక్తసిక్తం. ఫలానా ఈవెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం. ఫలానా పెద్దమనిషి మీద సెక్సువల్ హెరాస్‌మెంట్ కింద కేసు. బ్యాంకు లూటీ. నమ్మించి ముంచిన ఫలానా సంస్థ. ఈ సీజన్‌కు అంతు లేదు. కాని వీటన్నింటి మధ్య ప్రకృతి కటాక్షిస్తున్న ప్రమోదాలను మిస్ అవుతున్నామా? వాటికి ప్రకటించాల్సినంత కృతజ్ఞత ప్రకటిస్తున్నామా?
ప్రభాతం పావురాలది. అవే వేకువ వచ్చిందన్న సంగతిని బాల్కనీలో వాలి కువకువలతో తెలియచేస్తాయి. శ్రీ సూర్యనారాయణుడు... పొల్లు పోడు. వల్ల కాదు అని అనడు. ప్రతి నిత్యం ఉదయిస్తాడు. ఆయన ప్రసరింప చేసే కాంతి. ప్రాణం పోసే వెలుతురు. మరో ఉదయం. మరో ఊపిరి. సంపూర్ణంగా బతకడానికి మరో రోజు. ఎంత కటాక్షం ఇది. దేవుడా నీకు కృతజ్ఞతలు.
ఆఫీసుకు టైమ్‌కు వెళ్లాలి. సిగ్నల్ సరిగ్గానే దాటాము. హార్ష్‌గా ఓవర్ టేక్ చేసిన కుర్రాణ్ణి ఏమనకుండానే ఉన్నాము. ఒక కారు మనల్ని ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఒక టూ వీలర్‌ని మనం కూడా ఏమీ చేయకుండానే తప్పించాము. ఆఫీసుకు అలా వెంట్రుకవాసి అపాయం కూడా కలగకుండా చేరిపోయాం. రోజూ దక్కుతున్న వరం ఇది. రోజూ ప్రాణశక్తులు ప్రసాదిస్తున్న వరం. ఆ వరానికి కృతజ్ఞతలు.
తినడానికి ఆ పూటకు పప్పుచారు ఉంది. నంజుకోవడానికి అరటికాయ తాలింపు. తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు. తోడుగా కాస్త షేర్ చేసుకుంటారా అని స్నేహంగా పలకరించే కొలీగ్స్. ఒకరు వక్కపొడి ఇస్తారు. మరొకరు పన్ను మెరిసేలా నవ్విస్తారు. అద్భుతమైన మధ్యాహ్నం ఇది. ఎడారిలో ఉంచకుండా, దారుణమైన దుర్భిక్ష ప్రాంతంలో ఉంచకుండా, తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని ప్రదేశంలో ఉంచకుండా, ప్రశాంతంగా కూచుని నాలుగు ముద్దలు తినే పరిస్థితి లేని ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచకుండా దైవం కల్పించిన వరం ఇది. ఇవాళ... మనకు మాత్రమే వరం. కృతజ్ఞతలు.
నాలుగ్గంటలప్పుడు ఫోన్ వస్తుంది. ఊళ్లో నుంచి అమ్మ పలకరిస్తుంది. పెరట్లోని జామచెట్టుకు మంచి మంచి కాయలు కాస్తున్నాయట. కోసి మూటగట్టి బస్సుకు వేస్తే ఉదయాన్నే తీసుకుని మనమలకు తినిపించాలట. నాన్న పలకరిస్తాడు. పంపిన డబ్బు సరిపోగా మిగిలిన వాటిని దాచి పెట్టి మనవరాలికి కాలి పట్టీలు కొన్నాడట. ఎందుకు నాన్నా... అంటే వినడు. ఈసారి వచ్చినప్పుడు తనే స్వహస్తాలతో తొడుగుతాడట. పలకరించడానికి అమ్మా నాన్నా ఉన్నారు.
సొంత ఊళ్లో హాయిగా ఉన్నారు. అక్కడి నుంచి ఆశీర్వచనం నిత్యం పలుకుతూనే ఉంటారు. వారు ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. మనం ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. ఇరువురూ మాట్లాడుకోవడానికి ఈ సాయంత్రం ఉండటం ఎంతో దయామయమైన మరో కటాక్షం. దానికి వందనం.
పచ్చి మిరపకాయ ఆల్రెడీ మన కోసం పండి ఉంది. శనగ పప్పును కూడా మన కోసం ఎవరో పండించారు. ఆ రెంటినీ కలిపి కాసింత ఉప్పు జల్లించి పొయ్యి మీద బాణలి పెట్టి వేడి వేడిగా వేయించి పెట్టడానికి ఒక మనిషిని ఏ పుణ్యాత్ములో కని సిద్ధం చేసి ఉన్నారు. ఈ సాయంత్రం అతను ఉన్నాడు. ఈ సాయంత్రం మనం ఉన్నాం. అతని చేతి మీదుగా నాలుగు బజ్జీలను తినే అదృష్టం చిన్న అదృష్టం కాదు. అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది లేనప్పుడు దాని విలువ అమూల్యం. ప్రకృతి మనల్ని సంతోషపెట్టడానికి స్వాంతన పరచడానికి కాసింత సరదా పడటానికి అను నిత్యం వరాలు అందిస్తూనే ఉంటుంది. ఇదీ ఒకటి. వందనం.
ఇంటికి వెళితే భలేగా ఉంటుంది. పక్క ఫ్లాట్ పిల్లవాడి బర్త్ డే అట. వాడు కొత్త బట్టలు కట్టుకొని భలేగా ఉంటాడు. పక్కనున్న పిల్లలందరినీ పిలిచి భలేగా కనిపిస్తాడు. పిల్లలందరూ అద్భుతాలు. నవ్వితే రోగాలు పోతాయి. వారు తాకితే స్వస్థత పడతాము. వారి మాటలు సంగీతం. వారి అల్లరి ఆయుష్షు. అలాంటి పిల్లలతో గడితే ఆ కాస్త సమయం భలే బాగుంటుంది. కేక్ తినొచ్చు. చాక్లెట్ బుగ్గన పెట్టుకోవచ్చు. గొంతు ఏ మాత్రం బాగ లేకపోయినా జంకూ గొంకూ లేకుండా పెద్దగా హ్యాపీ బర్త్ డే టూ యూ పాడొచ్చు. ఈ సాయంత్రాన్ని వెలిగించడానికి ప్రకృతి కల్పించిన ఒక సందర్భం అది. కృతజ్ఞతలు.
శ్రీమతి ఆదరంగా మాట్లాడుతుంది. పిల్లలు ఆవేళ స్కూల్లో ఏమేం ఘనకార్యాలు చేశారో పూస గుచ్చుతారు. కొత్త సోఫా కొనడానికి ఇంకా ఎంత డబ్బు పోగేయ్యాలో కాసేపు లెక్కలు. ఈసారి వెచ్చాల్లో చేయవలసిన మార్పులు. డాబరా, పెప్సొడెంటా చిన్న పాటి తగువు. పిల్లల కొత్త షూస్ ప్రపోజల్ మీద సంతకం. అన్నీ అయ్యాక స్కూటర్ మీద అందరూ బజారు దాకా వెళ్లి అరటి పండ్లు, పాపిన్స్, మరుసటి రోజు ఉదయానికి ఆరంజి టిక్ టాక్స్....
తిరిగొచ్చి లిఫ్ట్ ఎక్కబోతుండగా వాచ్‌మెన్ వచ్చి కూతురి పెళ్లి అనంటే ఉన్నంతలోనే చేయదగ్గ సహాయం చేసేసి అతడు దండం పెడుతుంటే భలే వాడివే అంటూ భుజం మీద చనువుగా చేసే చరుపు.... చాలా చిన్న చిన్న అతి స్వల్పమైన ఆనందాలు... ప్రకృతి ఆ వేళకు సిద్ధం చేసిన అపురూపమైన క్షణాలు.... ఎవరికి దక్కుతాయివి... ఎంతమందికి దక్కుతున్నాయి... మనకే సొంతం... మనకు మాత్రమే సొంతం... దేవుడా నీకు వందనం.
రాత్రి వస్తుంది. రోడ్లను నెమ్మదింప చేయడానికి, పరుగును నెమ్మదింప చేయడానికి, వేడిని నెమ్మదింప చేయడానికి రాత్రి వస్తుంది. రిలీవర్‌గా తెల్లటి యూనిఫామ్‌లో చంద్రుడు డ్యూటీ ఎక్కుతాడు. గాలి నిదుర లేస్తుంది. ఉద్యోగం చేసి అలిసొచ్చిన తల్లి తన అలసటనంతా పిల్లలకు అన్నం తినిపించడంలో మరిచిపోతుంది. టీవీలో సంగీతం ప్రోగ్రామ్‌లో ఎవరో కాస్త మంచి పాటలే పాడతారు. మనింట్లో మన కుటుంబంతో మనకిష్టమైన భోజనం చేసే రాత్రి... ఎవరూ గమనించిన అపురూపమైన క్షణాలు...
ఎవరూ విలువ ఇవ్వని అమూల్యమైన ఘడియలు... మనల్ని ఉత్సాహపరచి గడిచిపోతాయి. ఇది వాట్సప్పులు కాసిన్ని జోకులు చూసి నవ్వుకునే సమయం. ఇది అయినవారితో కాసేపు చాట్ చేసే సమయం. ఇది ఏవో ఫన్నీ వీడియోలు చూసి కాసింత తెరిపిన పడే సమయం. ప్రకృతి మనల్ని సురక్షితంగా ఇల్లు చేర్చేసింది. తలుపుకు గడియ పెట్టి హాయిగా నిద్ర పొమ్మంటోంది. రోజు ప్రమోదంగా గడిచింది. తెలియకుండానే వరంగా గడిచింది. దేవుడా... వందనాలు.
నిద్రేమి తక్కువ కనికరం చూపుతుందా? దయ తలిచి మంచి మంచి కలలు ఇస్తుంది. చూడని ప్రదేశాలు తిప్పుతుంది. తీరని దప్పికలను తీర్చుతుంది. కనపడని మనుషులను కలుపుతుంది. వినపడని రాగాలను వినిపిస్తుంది. ఒక్క నిద్రలో వేయి జన్మలు. ఆ అనుభవాలన్నింటితోనూ దిగ్భ్రమను ప్రసాదిస్తుంది. వాహ్... ఏమి రాత్రి ఇది. భూకంపాలు రాని, బీభత్సాలు కాని, ఎటువంటి ఉత్పాతాలు, యుద్ధాలు, మర ఫిరంగులు చుట్టుముట్టని ప్రశాంతమైన రాత్రి. ఎంతమందికి ఇలాంటి రాత్రులు దొరుకుతున్నాయి. మనకు మాత్రమే సొంతం. మనకే ఈ వరం. దేవుడా ముమ్మాటికి నీకే కృతజ్ఞతలు.
మళ్లీ తెల్లారుతుంది. చాలా మామూలుగా అనిపించే ఒక గొప్ప ఉషోదయం పలకరిస్తుంది. ఇలా మామూలుగా గడిచిపోతే చాలు. ఈ సామాన్యమైన అపురూప క్షణాలను ప్రకృతి ప్రసాదిస్తుంటే అదే పది వేలు.
- నెటిజన్ కిశోర్