Netijan Kishore
-
చిన్న చిన్న సంతోషాలకు వందనం
కళింగాంధ్రలో రోడ్లు రక్తసిక్తం. ఫలానా ఈవెంట్లో భారీ అగ్ని ప్రమాదం. ఫలానా పెద్దమనిషి మీద సెక్సువల్ హెరాస్మెంట్ కింద కేసు. బ్యాంకు లూటీ. నమ్మించి ముంచిన ఫలానా సంస్థ. ఈ సీజన్‌కు అంతు లేదు. కాని వీటన్నింటి మధ్య ప్రకృతి కటాక్షిస్తున్న ప్రమోదాలను మిస్ అవుతున్నామా? వాటికి ప్రకటించాల్సినంత కృతజ్ఞత ప్రకటిస్తున్నామా? ప్రభాతం పావురాలది. అవే వేకువ వచ్చిందన్న సంగతిని బాల్కనీలో వాలి కువకువలతో తెలియచేస్తాయి. శ్రీ సూర్యనారాయణుడు... పొల్లు పోడు. వల్ల కాదు అని అనడు. ప్రతి నిత్యం ఉదయిస్తాడు. ఆయన ప్రసరింప చేసే కాంతి. ప్రాణం పోసే వెలుతురు. మరో ఉదయం. మరో ఊపిరి. సంపూర్ణంగా బతకడానికి మరో రోజు. ఎంత కటాక్షం ఇది. దేవుడా నీకు కృతజ్ఞతలు. ఆఫీసుకు టైమ్‌కు వెళ్లాలి. సిగ్నల్ సరిగ్గానే దాటాము. హార్ష్‌గా ఓవర్ టేక్ చేసిన కుర్రాణ్ణి ఏమనకుండానే ఉన్నాము. ఒక కారు మనల్ని ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఒక టూ వీలర్‌ని మనం కూడా ఏమీ చేయకుండానే తప్పించాము. ఆఫీసుకు అలా వెంట్రుకవాసి అపాయం కూడా కలగకుండా చేరిపోయాం. రోజూ దక్కుతున్న వరం ఇది. రోజూ ప్రాణశక్తులు ప్రసాదిస్తున్న వరం. ఆ వరానికి కృతజ్ఞతలు. తినడానికి ఆ పూటకు పప్పుచారు ఉంది. నంజుకోవడానికి అరటికాయ తాలింపు. తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు. తోడుగా కాస్త షేర్ చేసుకుంటారా అని స్నేహంగా పలకరించే కొలీగ్స్. ఒకరు వక్కపొడి ఇస్తారు. మరొకరు పన్ను మెరిసేలా నవ్విస్తారు. అద్భుతమైన మధ్యాహ్నం ఇది. ఎడారిలో ఉంచకుండా, దారుణమైన దుర్భిక్ష ప్రాంతంలో ఉంచకుండా, తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని ప్రదేశంలో ఉంచకుండా, ప్రశాంతంగా కూచుని నాలుగు ముద్దలు తినే పరిస్థితి లేని ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచకుండా దైవం కల్పించిన వరం ఇది. ఇవాళ... మనకు మాత్రమే వరం. కృతజ్ఞతలు. నాలుగ్గంటలప్పుడు ఫోన్ వస్తుంది. ఊళ్లో నుంచి అమ్మ పలకరిస్తుంది. పెరట్లోని జామచెట్టుకు మంచి మంచి కాయలు కాస్తున్నాయట. కోసి మూటగట్టి బస్సుకు వేస్తే ఉదయాన్నే తీసుకుని మనమలకు తినిపించాలట. నాన్న పలకరిస్తాడు. పంపిన డబ్బు సరిపోగా మిగిలిన వాటిని దాచి పెట్టి మనవరాలికి కాలి పట్టీలు కొన్నాడట. ఎందుకు నాన్నా... అంటే వినడు. ఈసారి వచ్చినప్పుడు తనే స్వహస్తాలతో తొడుగుతాడట. పలకరించడానికి అమ్మా నాన్నా ఉన్నారు. సొంత ఊళ్లో హాయిగా ఉన్నారు. అక్కడి నుంచి ఆశీర్వచనం నిత్యం పలుకుతూనే ఉంటారు. వారు ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. మనం ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. ఇరువురూ మాట్లాడుకోవడానికి ఈ సాయంత్రం ఉండటం ఎంతో దయామయమైన మరో కటాక్షం. దానికి వందనం. పచ్చి మిరపకాయ ఆల్రెడీ మన కోసం పండి ఉంది. శనగ పప్పును కూడా మన కోసం ఎవరో పండించారు. ఆ రెంటినీ కలిపి కాసింత ఉప్పు జల్లించి పొయ్యి మీద బాణలి పెట్టి వేడి వేడిగా వేయించి పెట్టడానికి ఒక మనిషిని ఏ పుణ్యాత్ములో కని సిద్ధం చేసి ఉన్నారు. ఈ సాయంత్రం అతను ఉన్నాడు. ఈ సాయంత్రం మనం ఉన్నాం. అతని చేతి మీదుగా నాలుగు బజ్జీలను తినే అదృష్టం చిన్న అదృష్టం కాదు. అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది లేనప్పుడు దాని విలువ అమూల్యం. ప్రకృతి మనల్ని సంతోషపెట్టడానికి స్వాంతన పరచడానికి కాసింత సరదా పడటానికి అను నిత్యం వరాలు అందిస్తూనే ఉంటుంది. ఇదీ ఒకటి. వందనం. ఇంటికి వెళితే భలేగా ఉంటుంది. పక్క ఫ్లాట్ పిల్లవాడి బర్త్ డే అట. వాడు కొత్త బట్టలు కట్టుకొని భలేగా ఉంటాడు. పక్కనున్న పిల్లలందరినీ పిలిచి భలేగా కనిపిస్తాడు. పిల్లలందరూ అద్భుతాలు. నవ్వితే రోగాలు పోతాయి. వారు తాకితే స్వస్థత పడతాము. వారి మాటలు సంగీతం. వారి అల్లరి ఆయుష్షు. అలాంటి పిల్లలతో గడితే ఆ కాస్త సమయం భలే బాగుంటుంది. కేక్ తినొచ్చు. చాక్లెట్ బుగ్గన పెట్టుకోవచ్చు. గొంతు ఏ మాత్రం బాగ లేకపోయినా జంకూ గొంకూ లేకుండా పెద్దగా హ్యాపీ బర్త్ డే టూ యూ పాడొచ్చు. ఈ సాయంత్రాన్ని వెలిగించడానికి ప్రకృతి కల్పించిన ఒక సందర్భం అది. కృతజ్ఞతలు. శ్రీమతి ఆదరంగా మాట్లాడుతుంది. పిల్లలు ఆవేళ స్కూల్లో ఏమేం ఘనకార్యాలు చేశారో పూస గుచ్చుతారు. కొత్త సోఫా కొనడానికి ఇంకా ఎంత డబ్బు పోగేయ్యాలో కాసేపు లెక్కలు. ఈసారి వెచ్చాల్లో చేయవలసిన మార్పులు. డాబరా, పెప్సొడెంటా చిన్న పాటి తగువు. పిల్లల కొత్త షూస్ ప్రపోజల్ మీద సంతకం. అన్నీ అయ్యాక స్కూటర్ మీద అందరూ బజారు దాకా వెళ్లి అరటి పండ్లు, పాపిన్స్, మరుసటి రోజు ఉదయానికి ఆరంజి టిక్ టాక్స్.... తిరిగొచ్చి లిఫ్ట్ ఎక్కబోతుండగా వాచ్మెన్ వచ్చి కూతురి పెళ్లి అనంటే ఉన్నంతలోనే చేయదగ్గ సహాయం చేసేసి అతడు దండం పెడుతుంటే భలే వాడివే అంటూ భుజం మీద చనువుగా చేసే చరుపు.... చాలా చిన్న చిన్న అతి స్వల్పమైన ఆనందాలు... ప్రకృతి ఆ వేళకు సిద్ధం చేసిన అపురూపమైన క్షణాలు.... ఎవరికి దక్కుతాయివి... ఎంతమందికి దక్కుతున్నాయి... మనకే సొంతం... మనకు మాత్రమే సొంతం... దేవుడా నీకు వందనం. రాత్రి వస్తుంది. రోడ్లను నెమ్మదింప చేయడానికి, పరుగును నెమ్మదింప చేయడానికి, వేడిని నెమ్మదింప చేయడానికి రాత్రి వస్తుంది. రిలీవర్‌గా తెల్లటి యూనిఫామ్‌లో చంద్రుడు డ్యూటీ ఎక్కుతాడు. గాలి నిదుర లేస్తుంది. ఉద్యోగం చేసి అలిసొచ్చిన తల్లి తన అలసటనంతా పిల్లలకు అన్నం తినిపించడంలో మరిచిపోతుంది. టీవీలో సంగీతం ప్రోగ్రామ్‌లో ఎవరో కాస్త మంచి పాటలే పాడతారు. మనింట్లో మన కుటుంబంతో మనకిష్టమైన భోజనం చేసే రాత్రి... ఎవరూ గమనించిన అపురూపమైన క్షణాలు... ఎవరూ విలువ ఇవ్వని అమూల్యమైన ఘడియలు... మనల్ని ఉత్సాహపరచి గడిచిపోతాయి. ఇది వాట్సప్పులు కాసిన్ని జోకులు చూసి నవ్వుకునే సమయం. ఇది అయినవారితో కాసేపు చాట్ చేసే సమయం. ఇది ఏవో ఫన్నీ వీడియోలు చూసి కాసింత తెరిపిన పడే సమయం. ప్రకృతి మనల్ని సురక్షితంగా ఇల్లు చేర్చేసింది. తలుపుకు గడియ పెట్టి హాయిగా నిద్ర పొమ్మంటోంది. రోజు ప్రమోదంగా గడిచింది. తెలియకుండానే వరంగా గడిచింది. దేవుడా... వందనాలు. నిద్రేమి తక్కువ కనికరం చూపుతుందా? దయ తలిచి మంచి మంచి కలలు ఇస్తుంది. చూడని ప్రదేశాలు తిప్పుతుంది. తీరని దప్పికలను తీర్చుతుంది. కనపడని మనుషులను కలుపుతుంది. వినపడని రాగాలను వినిపిస్తుంది. ఒక్క నిద్రలో వేయి జన్మలు. ఆ అనుభవాలన్నింటితోనూ దిగ్భ్రమను ప్రసాదిస్తుంది. వాహ్... ఏమి రాత్రి ఇది. భూకంపాలు రాని, బీభత్సాలు కాని, ఎటువంటి ఉత్పాతాలు, యుద్ధాలు, మర ఫిరంగులు చుట్టుముట్టని ప్రశాంతమైన రాత్రి. ఎంతమందికి ఇలాంటి రాత్రులు దొరుకుతున్నాయి. మనకు మాత్రమే సొంతం. మనకే ఈ వరం. దేవుడా ముమ్మాటికి నీకే కృతజ్ఞతలు. మళ్లీ తెల్లారుతుంది. చాలా మామూలుగా అనిపించే ఒక గొప్ప ఉషోదయం పలకరిస్తుంది. ఇలా మామూలుగా గడిచిపోతే చాలు. ఈ సామాన్యమైన అపురూప క్షణాలను ప్రకృతి ప్రసాదిస్తుంటే అదే పది వేలు. - నెటిజన్ కిశోర్ -
విలువైన కథ-నేపథ్యం
కథలు రాసేవారికీ కథలు చదివేవారికీ ఫలానా కథ ఎలా పుట్టింది, ఈ రచయితకు ఆ ఆలోచన ఎప్పుడు తట్టింది, తట్టిన ఆలోచనను అతడు కథగా ఎలా మలిచి ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఎటువంటి సాధకబాధకాలు పడి ఉంటాడు అని తెలుసుకోవాలనిపించడం కద్దు. గొప్ప గొప్ప కథలు- అవి కలిగించవలసిన చైతన్యాన్ని కలిగించడమేగాక తమ పుట్టుక గురించి కూడా కుతూహలం కలిగిస్తాయి. అవి తెలుసుకోవడం అంటే ఆ కథలను మరింత అక్కున జేర్చుకోవడమే. అంతే కాదు కథకులు, కొత్త కథకులు కొత్తపాఠాలను అనుభవాలను తెలుసుకోవడమే. గతంలో కథ-నేపథ్యం మొదటి భాగం వచ్చింది. అందులో అబ్బూరి ఛాయాదేవి, కాళీపట్నం రామారావు, కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు వంటి సుప్రసిద్ధ కథకులు 25 మంది తమ కథల నేపథ్యం చెప్పారు. మరో 34 మంది కథలతో నేపథ్యాలతో ‘కథ నేపథ్యం-2’ వచ్చింది. ఒక పత్రికలో పాత్రికేయుడిగా పని చేస్తున్నప్పుడు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుకు వచ్చిన ఆలోచన వల్ల ఈ శీర్షిక తదనంతరం ఈ విలువైన సంకలనాలు ఇవాళ తానా సహకారంతో పాఠకులకు అందాయి. కథ నేపథ్యం-2లో అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, ఆర్.వసుంధరాదేవి, ఓల్గా, కాట్రగడ్డ దయానంద్, గీతాంజలి, తోలేటి జగన్మోహనరావు, పెద్దింటి అశోక్ కుమార్, మధురాంతకం నరేంద్ర, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, సి.రామచంద్రరావు, పి.చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రసిద్ధ రచయితలు అనేకమంది తమ కథల్లో ఒక కథను ఎంచుకుని అది రాయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. అయితే ఇవి ఒట్టి నేపథ్యాలు కాదు. సాంఘిక ఘటనలు. పరిణామక్రమాలు. తెలుగు సమాజపు ఒడిదుడుకుల్లో కొండగుర్తులు. స్త్రీ-పురుష లేదా మానవ సంబంధాల్లో వచ్చిన వస్తున్న మార్పులకు పెను సూచికలు. ముఖ్యంగా తెలంగాణ రచయితలు అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్ కుమార్; రాయలసీమ కథకులు వి.ఆర్.రాసాని, సన్నపురెడ్డి; స్త్రీ రచయితలు గీతాంజలి, చంద్రలత వీరి నేపథ్యాలు ప్రతి ఒక్కరూ చదవదగ్గవి. తెలుగు ప్రాంతంలోని రచయితలకు మాత్రమే పరిమితం కాకుండా అమెరికా నుంచి రాస్తున్న ఆరి సీతారామయ్య, చంద్ర కన్నెగంటి, వేలూరి వెంకటేశ్వరరావులకు చోటు కల్పించడం సబబుగా ఉంది. వీరిలో వేలూరి రాసిన కథా నేపథ్యం అమెరికా వలస చరిత్రను సూక్ష్మంగా తెలియచేస్తుంది. ఇదొక్కటే కాదు ఓల్గా- ‘అయోని’ కథ నేపథ్యం స్త్రీవాదపు ఒక కోణాన్ని చూపితే, తోలేటి ‘మగోడు’ నేపథ్యం అదే స్త్రీవాదపు మరో కోణాన్ని చూపుతుంది. ఇక రచనకు సంబంధించి రచయితలిచ్చిన టిప్స్ సరేసరి. అయితే ఇటువంటి ప్రయత్నాల్లో లోపాలు వెదకడం సులువు. అర్హత ఉన్న అందరికీ చోటు కల్పించడం ఎలాగూ వీలు పడదు కనుక ఇటువంటప్పుడు సంపాదకులుగా ఉన్నవారు సాధారణంగా తమ రచనలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. కాని ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు తన కథ ఇందులో వేసుకోవడం వల్ల మా కథ ఎందుకు లేదు అని అడిగే అవకాశం ఇచ్చినవారయ్యారు. ఏ కారణం వల్లనైనాగాని వాడ్రేవు చినవీరభద్రుడు, దాదాహయత్, ముదిగంటి సుజాతరెడ్డి, గోపిని కరుణాకర్ల కథలు లేకపోవడం వెలితి. అలాగే పతంజలిశాస్త్రి, జి.ఆర్.మహర్షి, సుంకోజి దేవేంద్రాచారిల కథలు కూడా ఉంటే బాగుండేది. సుంకోజి నేపథ్యానికీ ఆ నేపథ్యంలో నుంచి ఆయన చేసిన సుదీర్ఘ కథా ప్రయాణానికీ తగిన గౌరవం ఇవ్వకపోవడం అసమంజసం. అలాగే 2005 నుంచి కథలు రాస్తున్న అజయ్ ప్రసాద్‌కు చోటు ఇవ్వడం వల్ల అంతకు ముందు నుంచి రాస్తున్న కె.ఎన్.మల్లీశ్వరి, దగ్గుమాటి పద్మాకర్, జి.ఉమామహేశ్వర్, స్కైబాబా, సువర్ణముఖి, కె.వి.కూర్మనాథ్, జి.వెంకటకృష్ణ, ఒమ్మి రమేశ్‌బాబు, డా.ఎం.హరికిషన్... తదితర రచయితలను ఎందుకు మినహాయించారు అనే ప్రశ్న రావచ్చు. ఇక రెండు సంకలనాల్లోని 59 కథల్లో కేవలం 8 మాత్రమే తెలంగాణవారివి. ఈ సంఖ్య వారిని నొప్పించవచ్చు. ఈ గమనింపులని రాబోయే సంకలనాల్లో స్వీకరిస్తారని ఆశిద్దాం. తెలుగు సాహిత్యంలో కథకు చేయదగ్గ సేవ బహుముఖాలుగా సాగాలని కోరుకుందాం. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి ఈ ముగ్గురూ ఉమ్మడి సంపాదకత్వంలో చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు తెలుపుదాం.రచయితలు, విమర్శకులు, పాఠకులు, ఔత్సాహికులు తప్పని సరిగా పరిశీలించదగ్గ పుస్తకం కథ నేపథ్యం - 2. - నెటిజన్ కిశోర్ కథ నేపథ్యం; 34 మంది కథకుల ఉత్తమ కథలు వాటి నేపథ్యాలు తానా ప్రచురణ; వెల: రూ. 350; ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు సంపాదకుల నం: 9985425888, 7207210560