విలువైన కథ-నేపథ్యం
కథలు రాసేవారికీ కథలు చదివేవారికీ ఫలానా కథ ఎలా పుట్టింది, ఈ రచయితకు ఆ ఆలోచన ఎప్పుడు తట్టింది, తట్టిన ఆలోచనను అతడు కథగా ఎలా మలిచి ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఎటువంటి సాధకబాధకాలు పడి ఉంటాడు అని తెలుసుకోవాలనిపించడం కద్దు. గొప్ప గొప్ప కథలు- అవి కలిగించవలసిన చైతన్యాన్ని కలిగించడమేగాక తమ పుట్టుక గురించి కూడా కుతూహలం కలిగిస్తాయి. అవి తెలుసుకోవడం అంటే ఆ కథలను మరింత అక్కున జేర్చుకోవడమే. అంతే కాదు కథకులు, కొత్త కథకులు కొత్తపాఠాలను అనుభవాలను తెలుసుకోవడమే.
గతంలో కథ-నేపథ్యం మొదటి భాగం వచ్చింది. అందులో అబ్బూరి ఛాయాదేవి, కాళీపట్నం రామారావు, కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు వంటి సుప్రసిద్ధ కథకులు 25 మంది తమ కథల నేపథ్యం చెప్పారు. మరో 34 మంది కథలతో నేపథ్యాలతో ‘కథ నేపథ్యం-2’ వచ్చింది. ఒక పత్రికలో పాత్రికేయుడిగా పని చేస్తున్నప్పుడు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుకు వచ్చిన ఆలోచన వల్ల ఈ శీర్షిక తదనంతరం ఈ విలువైన సంకలనాలు ఇవాళ తానా సహకారంతో పాఠకులకు అందాయి. కథ నేపథ్యం-2లో అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, ఆర్.వసుంధరాదేవి, ఓల్గా, కాట్రగడ్డ దయానంద్, గీతాంజలి, తోలేటి జగన్మోహనరావు, పెద్దింటి అశోక్ కుమార్, మధురాంతకం నరేంద్ర, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, సి.రామచంద్రరావు, పి.చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రసిద్ధ రచయితలు అనేకమంది తమ కథల్లో ఒక కథను ఎంచుకుని అది రాయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. అయితే ఇవి ఒట్టి నేపథ్యాలు కాదు. సాంఘిక ఘటనలు. పరిణామక్రమాలు. తెలుగు సమాజపు ఒడిదుడుకుల్లో కొండగుర్తులు. స్త్రీ-పురుష లేదా మానవ సంబంధాల్లో వచ్చిన వస్తున్న మార్పులకు పెను సూచికలు. ముఖ్యంగా తెలంగాణ రచయితలు అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్ కుమార్; రాయలసీమ కథకులు వి.ఆర్.రాసాని, సన్నపురెడ్డి; స్త్రీ రచయితలు గీతాంజలి, చంద్రలత వీరి నేపథ్యాలు ప్రతి ఒక్కరూ చదవదగ్గవి. తెలుగు ప్రాంతంలోని రచయితలకు మాత్రమే పరిమితం కాకుండా అమెరికా నుంచి రాస్తున్న ఆరి సీతారామయ్య, చంద్ర కన్నెగంటి, వేలూరి వెంకటేశ్వరరావులకు చోటు కల్పించడం సబబుగా ఉంది. వీరిలో వేలూరి రాసిన కథా నేపథ్యం అమెరికా వలస చరిత్రను సూక్ష్మంగా తెలియచేస్తుంది. ఇదొక్కటే కాదు ఓల్గా- ‘అయోని’ కథ నేపథ్యం స్త్రీవాదపు ఒక కోణాన్ని చూపితే, తోలేటి ‘మగోడు’ నేపథ్యం అదే స్త్రీవాదపు మరో కోణాన్ని చూపుతుంది. ఇక రచనకు సంబంధించి రచయితలిచ్చిన టిప్స్ సరేసరి.
అయితే ఇటువంటి ప్రయత్నాల్లో లోపాలు వెదకడం సులువు. అర్హత ఉన్న అందరికీ చోటు కల్పించడం ఎలాగూ వీలు పడదు కనుక ఇటువంటప్పుడు సంపాదకులుగా ఉన్నవారు సాధారణంగా తమ రచనలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. కాని ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు తన కథ ఇందులో వేసుకోవడం వల్ల మా కథ ఎందుకు లేదు అని అడిగే అవకాశం ఇచ్చినవారయ్యారు. ఏ కారణం వల్లనైనాగాని వాడ్రేవు చినవీరభద్రుడు, దాదాహయత్, ముదిగంటి సుజాతరెడ్డి, గోపిని కరుణాకర్‌ల కథలు లేకపోవడం వెలితి. అలాగే పతంజలిశాస్త్రి, జి.ఆర్.మహర్షి, సుంకోజి దేవేంద్రాచారిల కథలు కూడా ఉంటే బాగుండేది. సుంకోజి నేపథ్యానికీ ఆ నేపథ్యంలో నుంచి ఆయన చేసిన సుదీర్ఘ కథా ప్రయాణానికీ తగిన గౌరవం ఇవ్వకపోవడం అసమంజసం. అలాగే 2005 నుంచి కథలు రాస్తున్న అజయ్ ప్రసాద్‌కు చోటు ఇవ్వడం వల్ల అంతకు ముందు నుంచి రాస్తున్న కె.ఎన్.మల్లీశ్వరి, దగ్గుమాటి పద్మాకర్, జి.ఉమామహేశ్వర్, స్కైబాబా, సువర్ణముఖి, కె.వి.కూర్మనాథ్, జి.వెంకటకృష్ణ, ఒమ్మి రమేశ్‌బాబు, డా.ఎం.హరికిషన్... తదితర రచయితలను ఎందుకు మినహాయించారు అనే ప్రశ్న రావచ్చు. ఇక రెండు సంకలనాల్లోని 59 కథల్లో కేవలం 8 మాత్రమే తెలంగాణవారివి. ఈ సంఖ్య వారిని నొప్పించవచ్చు.
ఈ గమనింపులని రాబోయే సంకలనాల్లో స్వీకరిస్తారని ఆశిద్దాం. తెలుగు సాహిత్యంలో కథకు చేయదగ్గ సేవ బహుముఖాలుగా సాగాలని కోరుకుందాం. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి ఈ ముగ్గురూ ఉమ్మడి సంపాదకత్వంలో చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు తెలుపుదాం.రచయితలు, విమర్శకులు, పాఠకులు, ఔత్సాహికులు తప్పని సరిగా పరిశీలించదగ్గ పుస్తకం
కథ నేపథ్యం - 2.
- నెటిజన్ కిశోర్
కథ నేపథ్యం; 34 మంది కథకుల ఉత్తమ కథలు వాటి నేపథ్యాలు
తానా ప్రచురణ; వెల: రూ. 350;
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు
సంపాదకుల నం: 9985425888, 7207210560