The story
-
కథ చెబుతాను... ఊ కొడతారా?
‘అనగనగా ఓ రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, ఆ ఏడుగురు వేటకెళ్లారు’ గుర్తుందా ఈ కథ ప్రతి చిన్నారికి తన నాన్మమ్మ, తాతయ్యలు కచ్చితంగా ఇలాంటి కథలు చెప్పేవాళ్లు. కానీ ఉరుకుల పరుగుల నేటి కాలంలో ఇలాంటి కథలతో పాటు, కథలు చెప్పే వాళ్లు కనిపించడం లేదు. ఇందుకు కారణం ఒక్కటే నగర జీవితంలో కుటుంబాలు చిన్నవైపోతున్నాయి, దీంతో నాన్మమ్మ, తాతయ్యలు పిల్లల దగ్గర ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కెరీర్ పరుగులో పడిపోయిన తల్లిదండ్రులకు తమ పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లల్లో చాలా మందికి వీడియోగేమ్స్, ఇంటర్నెట్లలో మునిగిపోతున్నారు తప్ప కథలంటే ఏమిటో తెలియడం లేదు. వీటి కారణంగానే చాలా మంది పిల్లలు పుస్తకాలకు పరిమితమైపోతున్నారు తప్ప వారిలో ఏమాత్రం సృ జనాత్మక పెరగడం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితిలో కాస్తంత మార్పు వస్తోంది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో స్టోరీ టెల్లింగ్ విభాగంలో నిపుణులు తయారవుతున్నారు. స్టోరీ టెల్లింగ్ క్లాసులకు కూడా ఉద్యాననగరిలో ఆదరణ పెరుగుతోంది. - సాక్షి, బెంగళూరు ‘స్టోరీ టెల్లింగ్’కి పెరుగుతున్న క్రేజ్.... ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు, వీడియోగేమ్‌లు, ఇంటర్నెట్లతో కా లం గడిపే చిన్నారుల్లో సృ జనాత్మక శక్తి పూర్తిగా తగ్గిపోవడం తో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించా యి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే, చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్ధం అవుతుంది. అందుకే ప్రస్తుతం బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని తల్లిదండ్రుల్లో ఇప్పుడిప్పుడే కాస్తంత మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కధలు చెప్పే సమయం దొరక్కపోయినా వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళుతున్నారు. అంతేకాదు పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండే లా చూడాలని పాఠశాల యాజమాన్యాలకు తల్లిదండ్రుల వద్ద నుండి అభ్యర్థనలు కూడా వస్తున్నాయి. దీంతో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులకు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజు కూ ఆదరణ పెరుగుతోంది. నగరంలోని రంగోలి మెట్రో ఆర్ట్ సెంటర్లో ప్రతి వారాంతంలో స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయంటే ఈ తరహా కార్యక్రమాలు ఏ విధంగా క్రేజ్ పెరుగుతోందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రయోజనాలెన్నెన్నో.... కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతు ల్లో చెప్ప పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఒక కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. ఇక ప్రతి రోజూ చిన్నారులకు కథలు చె ప్పడం వల్ల చిన్నారుల్లో ఊహాశక్తి పెరుగుతుందని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు. ఇదే వారి మానసిక ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సం బంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సం స్కృతి, సాంప్రదాయాలను పిల్ల లకు తెలియజేయవచ్చు. పం చతంత్ర కథల ద్వారా బుద్ధికుశలత వల్ల ఎలాంటి అపాయం నుండైనా తప్పించుకోవచ్చని పిల్లలు తెలుసుకుంటారు. ఇక మాతృభాషతో పాటు ఇంగ్లీష్, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా... శ్రోతలను ఆకట్టుకునేలా కథలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ అంటారు నగరానికి చెందిన ప్రముఖ స్టోరీ టెల్లర్ ‘దీప్త’. కథల్లోని అంశాలకు తగ్గట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కథలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కథలో పూర్తి గా నిమగ్నమవుతారు. ఇందుకోసం ఇప్పటి స్టోరీ టెల్లర్స్ చా లా మంది వారి హావభావాలను కథలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారని దీప్త చెబుతున్నారు. ‘ఎంచుకున్న కథతో పాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఒక స్టోరీ టెల్లర్ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఇక కథలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కథకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. అమెరికా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల్లో ఇప్పటికే స్టోరీ టెల్లింగ్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక మన దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ స్టోరీ టెల్లింగ్‌కి ఆదరణ పెరుగుతోంది. స్టోరీ టెల్లింగ్‌లో నైపుణ్యాన్ని సాధించగలిగితే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు దీప్త. ఫిలిం ఫెస్టివల్స్‌లో అవకాశాలు కూడా.... స్టోరీ టెల్లింగ్‌లో నైపుణ్యాన్ని సాధించగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయి ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అదెలాగంటే...సాధారణంగా ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యే సినిమాల కథను ముందుగా ప్రేక్షకులకు క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. స్టోరీ టెల్లింగ్‌లో శిక్షణ పొందిన వారికి ఇలా కథలను క్లుప్తంగా చెప్పడం అనేది చాలా సులువు. ఇక ఉద్యాననగరి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు వేదికవుతూ ఉంటుంది కాబట్టి స్టోరీ టెల్లింగ్ నిపుణులు వీటిలో కూడా తమ ప్రతిభను చాటుకునేందుకు అవకాశం ఉంది. -
దహనం
కథ - వేంపల్లె షరీఫ్ కథారచయిత పులిరాజును ఆ మాయాగోవు వదలడం లేదు. ఎక్కడికెళ్తే అక్కడికి హచ్ కుక్కలా వస్తోంది. తన కథ రాయమని పోరుతోంది. పులిరాజుకు చిరాకొచ్చేసింది. ‘‘నీ కథ నేనెందుకు రాయాలి? నాకేం పని లేదా?’’ అన్నాడోరోజు. గోవు దీనంగా బతిమాలింది. తన కథ రాయకపోతే చచ్చిపోతానంది. పులిరాజు కరగలేదు. ‘‘నువ్వేమైపోయినా పర్వాలేదు. నేను అనుకున్నదే రాస్తాను. ఇలా మధ్యలో ఎవరు పడితే వాళ్లొచ్చి డిస్టర్బ్ చేస్తే కరిగిపోయి వేరేవాళ్ల కథలు రాసే రకం కాదు నేను. నాకొక పంథా ఉంది. వాదం ఉంది, వాదన ఉంది. నాకు కొంతమంది పాఠకులు ఉన్నారు. నేను వాళ్ల గురించే రాస్తాను. వాళ్ల కోసమే రాస్తాను. అసలు మనుషులే సవాలక్ష సమస్యలతో చచ్చీ చెడుతుంటే వాళ్ల గురించి వదిలేసి తగుదునమ్మా అని నీవంటి గోవు గురించి రాయడానికి నాకేమైనా పిచ్చా’’ అన్నాడు పుల్లవిరుపుగా. గోవు నొచ్చుకుంది. అక్కడ్నుంచి మాయమైంది. పులిరాజుకు తెలుసు. అది మళ్లీ వస్తుంది. ఇలాగే దేబరిస్తుంది. అది ఎన్నిసార్లు వచ్చినా తాను మాత్రం కరగకూడదనుకున్నాడు. తాను అనుకున్న కథ రాశాకే అప్పుడు కూడా తనకు బుద్ధి పుడితేనే గోవు కథ రాసేది. బలవంతంగా రాయమని అడగటానికి గోవు ఎవరు? తన ఇష్టాన్ని అడ్డుకునే హక్కు దానికేముంది? టైం చూశాడు. అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. కలం కాగితం బల్లమీద పెట్టి లైట్ ఆఫ్ చేసి మంచమ్మీద పడుకున్నాడు. రాత్రంతా గోవుకు సంబంధించిన కలే. ‘‘అరరే... బాగైపోయిందే దీని పీడ...’’ తిట్టుకుంటూనే నిద్ర లేచాడు. కడుపు ఉబ్బరంగా ఉంది. రాత్రి పెళ్లాం వద్దు వద్దంటున్నా వినకుండా బేకరి నుంచి తెచ్చుకుని తిన్న పిజ్జా, బర్గర్ గుర్తుకువచ్చింది. అర్జంటుగా బాత్రూంలోకి దూరాడు. ఎంత వేగంగా వెళ్లాడో... అంతే వేగంగా వెనక్కి వచ్చాడు. బాత్రూం నిండా గోవు... తెల్లటి గోవు. దేదీప్యమానంగా వెలుగుతున్న గోవు... అడ్డంగా పడుకుని చూస్తోంది... తోక ఊపుతూ. ‘‘ఛ... ఇక్కడ కూడా దాపురించావూ...’’ తిట్టుకుంటూనే మరో గదిలోని బాత్రూమ్లోకి దూరాడు. కడుపు ఖాళీ చేసుకుని హాయిగా బయటికొచ్చాడు. తర్వాత పళ్లు తోముకున్నాడు. ఇందాక లెట్రిన్కెళ్లిన బాత్రూమ్లోనే స్నానమూ కానిచ్చాడు. చక్కగా డ్రస్ వేసుకుని ఆఫీసుకు బయల్దేరుతుంటే దారికి అడ్డంగా నిలబడింది గోవు. ‘‘ఎందుకిలా నా ప్రాణం తీస్తావు...’’ అన్నాడు పులిరాజు. గోవు మౌనంగా ఉంది. ఏ పాపమూ ఎరుగని పసిపాపలా ఉంది. దానిమీద ఎంత విపరీతమైన కోపమొస్తుందో అంత ప్రేమ, జాలి కూడా కలుగుతున్నాయి అతనికి. కానీ అదేమి బయటకు కనిపించకుండా... ‘‘దారికి అడ్డం జరుగుతావా... లేక కారును నేరుగా నీమీదికే తోలమంటావా?’’ అన్నాడు కఠినంగా. అది కదల్లేదు. కారు గేరు మార్చి ముందుకు ఉరికించాడు. గోవు మాయమైంది. వచ్చి ఆఫీస్‌లో పడ్డాడు. ఆ ఆఫీస్ అతనిదే. అతనికి ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. అసలే జమిందారీ వంశం. పూర్వీకులంతా బక్క జీవుల్ని కొట్టి బతికినవాళ్లే. ఇతనొక్కడే కాస్త సాహిత్యం, జనం అంటూ తిరుగుతున్నాడు. ఆఫీసుకెళ్లి సంతకాల పనులన్నీ చూశాడు. ఎంత రచయితైనా ఆఫీసులో మాత్రం బాసే కదా... అందుకే ‘ఉద్యోగులంతా సక్రమంగా పనిచేస్తున్నారా, లేదా’ అని ఒక కన్నేశాడు. సాయంత్రంగా సరాసరి ఇంటికొచ్చేశాడు. కారు పార్కింగ్‌లో పెట్టి... ‘‘ఎక్కడా గోవు లేదు కదా’’ అని అనుమానిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతానికి దాని జాడ కనపడకపోయేసరికి ‘హమ్మయ్యా’ అనుకున్నాడు. పెళ్లాం తెచ్చిచ్చిన వేడి వేడి కాఫీ తాగి కథ రాద్దామని కలం కాగితం అందుకున్నాడో లేదో... అంతలోకే వచ్చేసింది మళ్లీ గోవు... ‘‘నా మీద కథ రాయవూ’’ అంటూ. పులిరాజుకు మండింది. ‘‘నీకెన్ని సార్లు చెప్పాలి. నీకు కాసింతైనా సిగ్గూ, శరం లేవా? అసలు నీవు మనిషి జన్మ ఎత్తావా? గోవు జన్మ ఎత్తావా?’’ గోవుకు కోపమొచ్చింది. ‘‘నువ్వు నన్ను ఏమైనా అను. కానీ మనిషితో మాత్రం పోల్చొద్దు. మనిషి స్వార్థపరుడు. ఎప్పుడూ తన కోసమే ఆలోచిస్తాడు నీలాగ. ఆ వాదం ఈ వాదం అంటూ ఉన్మాదంలో కొట్టుకుపోతాడు. ఈ భూమ్మీద తనతో పాటు సకల జీవరాశులూ ఉన్నాయని ఎప్పుడూ గుర్తెరగడు. తన ఉనికికి అడ్డమొస్తే దేన్నయినా అంతమొందిస్తాడు’’ ‘‘ఇంకేం, బాగానే తెలుసుకున్నావే... జాగ్రత్తగా ఉండు మరి. నా జోలికి రాకు’’ గోవు వినలేదు. అక్కడే నిలబడి ఉంది. ‘‘నిలబడితే నిలబడు... నేను మాత్రం కరగను. నాకు తోచింది నేను రాసుకుపోతాను’’ అంటూ కాగితమ్మీద గబగబా రెండు ముక్కలు రాశాడు. తర్వాత కలం ముందుకు కదలడం లేదు. ‘‘నువ్విక్కడ దెయ్యం మాదిరుంటే నేను కథ రాయలేను. దయచేసి వెళ్లిపో...’’ పిచ్చిపట్టినట్టుగా అరిచాడు. అది మాత్రం అలాగే నిలబడింది ఉలుకుపలుకు లేకుండా. తల పట్టుకున్నాడు పులిరాజు. విసుగొచ్చి పెన్ను కాగితం దాని మొహమ్మీదికి విసిరికొట్టాడు. అది మాయమైంది. వెంటనే సోఫాలో వెనక్కి కూలబడి ఆలోచనలో పడ్డాడు. పులిరాజు అసలు పేరు సందివేముల రాజబాబు. ఆ తర్వాత ఏదో ఒక తోక. ఆ తోకతో మనకు పనిలేదు కాబట్టి చెప్పడం లేదు. అసలే జమిందారు వంశం కదా. రాజబాబుకు ఒక రోజు మెళ్లో పులిగోరు వేసుకోవాలని కోరిక కలిగింది. కొంతకాలం కథలు రాసేపని పక్కనపెట్టి పులిగోరు కోసం వెతికాడు. అక్కడ ఇక్కడా తిరిగాడు. సింహరాశిలో పుట్టిన తనకు పులిగోరు వేసుకుంటే ఇంకాస్త రాజసం వస్తుందని ఎవరో ఒక పెద్దమనిషి సలహా ఇచ్చాడు. దీంతో అతనిలో ఆ కోరిక రెండింతలైంది. వాస్తవానికి రాజబాబు అన్నీ సెంటిమెంట్లకు వ్యతిరేకమైన కథలు రాస్తాడు. కానీ నిజజీవితంలో ఒకలాగ, రచనల్లో ఒకలాగ ఉండే రచయితల సంప్రదాయానికి అతను భంగం కలిగించదల్చుకోలేదు. అందుకే పులిగోరు మీద విపరీతమైన వ్యామోహం పెంచుకున్నాడు. దానికి తగ్గట్టే అన్వేషణ మొదలుపెట్టాడు. రకరకాల వ్యక్తుల్ని కలిశాడు. చాలా చోట్ల అతనికి పులిగోర్లు కనబడ్డప్పటికీ అవెందుకో అతనికి నచ్చలేదు. చివరికి పడమటి పట్నంలో ఒక చోట ఒక శ్రీమంతుడి దగ్గర బంగారు వర్ణంలో మెరిసే పులిగోరు ఉందని తెలిసింది. ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు. ఆ శ్రీమంతుడు అంపశయ్య మీదున్నాడు. రేపో మాపో చనిపోతాడని అతని కొడుకులు చెప్పారు. అతని వైద్యం కోసం ఎంతో ఖర్చుచేశామని, చివరికి డబ్బుకోసం పులిగోరు అమ్మేస్తున్నామని చెప్పారు. తన పంట పండిందనుకున్న పులిరాజు అడిగినంత చెక్కు రాసిచ్చి పులిగోరుతో ఇల్లు చేరాడు. తెల్లవారుజామున ఓ మంచి ముహూర్తాన తలస్నానం చేసి తన ఇష్టదైవం కృష్ణుడ్ని మొక్కి మెళ్లో పులిగోరు వేసుకున్నాడు. ఇక అక్కడ్నుంచి అతని ఆనందానికి అంతులేదు. అయినవాళ్లింటికి, కానివాళ్లింటికి అవసరమున్నా లేకున్నా తిరిగాడు. తోటి రచయితల్ని కలిశాడు. అడిగినా, అడక్కపోయినా పులిగోరు గురించి, దాని ధర గురించి, అది సాధించడానికి పడ్డ కష్టం గురించి కథలు కథలుగా చెప్పాడు. అదంతా విన్న తోటి రచయితలు ‘‘నువ్వు కథల్లో పులిరాజు’’వని అతన్ని అమితంగా పొగిడారు. అతను పోయించిన మందు తాగి ఒకట్రెండు పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. దీంతో అతని పేరు ‘పులిరాజు’గా స్థిరపడిపోయింది. ఆ పేరు అతనిక్కూడా బాగా నచ్చింది. దీంతో అతను ఆ పేరుతోనే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనికి పులిగోరు మీద కూడా కథ రాయాలనిపించింది. ఇలా అందరినీ వ్యక్తిగతంగా కలసి పులిగోరు గురించి చెప్పడం కన్నా కథ రాసి అచ్చెయ్యడమే ఉత్తమంగా తోచింది. తోచిందే తడవుగా పులిగోరుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాడు. చుట్టుపక్కల ఉన్న కొండజాతి మనుషులందరినీ కలిశాడు. గూగుల్‌లో సెర్చ్ కొట్టాడు. లైబ్రరీలో పుస్తకాలన్నీ తిరగేశాడు. ఎలాగోలాగ అక్కడింత ఇక్కడింత సమాచారాన్నంతా రాబట్టాడు. ఈలోపు విషయం పత్రికల వాళ్లకు లీకైంది. వాళ్లు ఇతని ‘కథానిబద్ధత’ గురించి గొప్పగా రాశారు. దీంతో పులిగోరు కథ మీద పాఠకుల్లో ఒక తెలియని ఆసక్తి ఏర్పడిపోయింది. ఇప్పుడెలాగైనా ఆ కథ రాసి మంచి పేరు సంపాదించాలనేది అతని కోరిక. గోవు ముందు ‘వాదం...నాదం...’ అని ఏదో డబ్బా కొట్టాడు తప్పితే అతని మనసంతా ఇప్పుడు ‘పులిగోరు రాజసం’ అనే కథ రాయడం మీదే ఉంది. ఆ రోజు కూడా ఇదిగో ఇలాగే ఓ సాయంత్రం చక్కగా సోఫాలో కూర్చుని కథ రాస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో గోవు అచ్చం ఇప్పుడొచ్చినట్టే వచ్చి తగులుకుంది. ఇక వదలకుండా సాధించుకుని తింటోంది. ఎలాగైనా దాన్నుంచి విరుగుడు పొందాలనుకున్నాడు పులిరాజు. మరుసటి రోజు ఉదయానే లేచి దగ్గర్లోని ఓ మంత్రగాడిని కలిశాడు. అతనికి చిరాకొచ్చింది. ‘‘గోవు కనిపిస్తే మంచిదే కదా. దానికి మంత్రమెందుకు... తంత్రమెందుకు? అదేమైనా నిన్ను పొడవటానికొస్తోందా, చంపడానికి వస్తోందా? కథే కదా రాయరాదూ. పోయిపోయి గోవుతో పెట్టుకోవడం ఎందుకు? సూటిగా నీకో మాట చెప్పనా? మనిషి తనకు తాను కొన్ని తేడాలు పెట్టుకున్నట్టే జంతువుల్లో కూడా తేడాలు పెట్టాడు. కొన్నింటిని చంపితే పుణ్యం. మరికొన్నింటిని చంపితే పాపం. అర్థమైంది కదా, అందుకే గోవు జోలికి వెళ్లకు.’’ పులిరాజు కంగుతిన్నాడు. ‘‘నీకేమైనా మెంటలా? గోవుకు విరుగుడు చెప్పమంటే వేదాంతం చెబుతున్నావ్’’ అంటూ కసిరాడు. మంత్రగాడు ‘‘నేను మందివ్వలేను పో’’ అన్నాడు. పులిరాజు ఆలోచించాడు. చివరికి పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. తనకిలా మాయాగోవు కనబడుతోందని... దానికి విరుగుడు చెప్పిన వాళ్లకి పదివేల రూపాయల బహుమానమని ప్రకటించాడు. ఆ ప్రకటన అచ్చయిన మరుసటి రోజు ఓ మనిషి తన ఇంటికి వెతుక్కుంటూ వచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు పులిరాజు. ‘‘నువ్వా...’’ అన్నాడు. ‘‘అవును నేనే...’’ ‘‘నువ్వింకా చచ్చిపోలేదా...?’’ ‘‘లేదు... భేషుగ్గా ఉన్నాను. నీకు పులిగోరు అమ్మేశాక సుఖంగా ఉన్నాను’’ ‘‘అంటే...’’ ‘‘అర్థం కాలేదా? పులిగోరు నా దగ్గర ఉన్నంతవరకు ఆ గోవు నన్ను కూడా ‘కథరాయవూ...’ అని వెంటాడింది. నాకెక్కడ కథలు రాయడం వస్తుంది... నా బొంద. నేను చెప్పినా అది వినలేదు. ఎక్కడికెళ్తే అక్కడ కనబడింది. ఓ రోజు కారు స్పీడుగా డ్రైవ్ చేస్తుంటే అడ్డంగా వచ్చి నింపాదిగా నిలబడింది. నిజమైన గోవేమో అనుకుని సడన్‌గా బ్రేక్ వేశాను. ఇంకేముంది కారు గాల్లోకి ఎగిరి ముప్పై రెండు పల్టీలు కొట్టి కిందపడింది. చూసుకుంటే ఏముంది, నా ముప్పై రెండు పళ్లూ రాలిపోయాయి. అంతేనా... ఒంట్లో అక్కడక్కడా పుల్లలిరిగినట్టు ఎముకలు పుటుక్కుమన్నాయి. మంచం ఎక్కాను. ఆరోగ్యం బాగవడం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగించాను. ఇదేం విచిత్రమో కానీ ఎప్పుడైతే నేను నీకు పులిగోరు అమ్మేశానో... అప్పటి నుంచి సుఖంగా ఉన్నాను. ఒంట్లో తిరిగి సత్తువ వచ్చి ఇప్పుడిప్పుడే మెల్లగా తిరగ్గలుగుతున్నాను. నీ మంచి కోరి చెబుతున్నా... ఆ మెళ్లోని పులిగోరు తీసేయ్... ఆ గోవు తర్వాత నీకు కనబడదు. హాయిగా నీకు నచ్చిన కథ రాసుకో...’’ పులిరాజు ఆలోచనలో పడ్డాడు. దాని వెనుక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నందుకు ఒకింత ఆశ్చర్యపోయాడు. ఏమైతేనేమి మళ్లీ ఈ పడమటి పట్నం శ్రీమంతుడి రూపంలోనే సమాధానం దొరికినందుకు సంతోషపడ్డాడు. చెప్పిన మాట ప్రకారం పదివేల బహుమానం ఇవ్వబోతుంటే వద్దని సున్నితంగా తిరస్కరించి, వచ్చిన దారిపట్టి వెళ్లిపోయాడు. ఇక పులిరాజు ఆనందం పట్టలేక వికటాట్టహాసం అంటారే అది చేశాడు. అర్జంటుగా గోవును పిలిచి వెక్కిరించాలనుకున్నాడు. కలం కాగితం తీసుకోగానే గోవొచ్చింది. ‘‘నాకు తెలుసు. నీవు వస్తావని. ఇదే నీకు చివరి చూపు. నీ విరుగుడు నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను నిన్ను శాశ్వతంగా దూరం చేసి నాకు నచ్చిన కథ రాయబోతున్నాను’’ అన్నాడు. గోవు భయపడిపోయింది. కాళ్లు పట్టుకుని తనను దూరం చేయొద్దని బతిమాలింది. పులిరాజు వినలేదు. దాని కళ్లముందే మెళ్లోని పులిగోరు తెంపి గూట్లోకి విసిరికొట్టాడు. అంతే... ఇక మాయాగోవు కనబడలేదు. ఇక హాయిగా పులిరాజు కథ రాయడంలో మునిగిపోయాడు. రాశాడు. రెండు రోజులు ఏకధాటిగా రాశాడు. సరిగ్గా అన్నం, నీళ్లు కూడా తీసుకోలేదు. తన అభిమానులను తల్చుకుని... తల్చుకుని... రాశాడు. కథ అద్భుతంగా వచ్చింది. పులిగోరు ప్రాశస్త్యం గురించి అది ధరిస్తే కలిగే ఆనందం, అందం గురించి శాస్త్రీయంగా సాధించి, శోధించిన విషయాన్నంతా రాశాడు. రాశాక తనలో తానే విజయగర్వంతో నవ్వుకున్నాడు. ఈ కథ అచ్చయ్యాక తనకొచ్చే ప్రశంసలను తల్చుకుని మురిసిపోయాడు. అంతలోనే అతనికి మళ్లీ ఓసారి గోవు గుర్తుకొచ్చింది. తాను అనుకున్న కథ రాసేసిన ఆనందాన్ని దాంతో పంచుకోవాలనిపించింది. వెంటనే గూట్లోంచి పులిగోరు తీసి మెళ్లో వేసుకున్నాడు. గోవు ప్రత్యక్షమైంది. ‘‘నా గురించి కథ రాయవూ’’ అంటూ. పకపకా నవ్వాడు పులిరాజు. ‘‘చూశావా... నేను నిన్ను గెలిచాను. ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. నేను అనుకున్న కథ రాసేశాను. ఇప్పటికైనా నా సత్తా తెలుసుకో. పదే పదే వచ్చి డిస్ట్రబ్ చేసినంత మాత్రాన నేను నీ దారికి వస్తానని అనుకోకు. అందరు రచయితలూ ఒకేలా ఉండరు...’’ ఇలా నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్లాడు. బొటబొటా కన్నీళ్లు కార్చింది గోవు. ‘‘సరే... ఏడవద్దు.. నీ కథ కూడా రాస్తాన్లే...! కానీ ఒక మాట - అది నాకు నచ్చితేనే రాస్తాను. లేకుంటే లేదు. తర్వాత నన్నాడిపోసుకోవద్దు. కథ నచ్చకుండా ఏది పడితే అది రాసే రకం కాదు నేను. నాక్కొన్ని విలువలున్నాయి’’ అన్నాడు. గోవు ‘‘సరే’’ అంది. ‘‘అయితే చెప్పు’’ అన్నాడతను. గోవు చెప్పుకుంటూ పోతోంది. ‘‘నీకు ‘ఆవు-పులి’ కథ తెలుసుకదా’’ ‘‘తెలుసు’’ ‘‘అచ్చం అలాంటిదే నా కథ కూడా. రోజులాగే మేతకెళ్లి ఓ రోజు అడవిలో పులి కంటపడ్డాను. పులి తినేస్తానంది. ఇంటి దగ్గర దూడ ఉందని... పాలిచ్చి వస్తానని దీనంగా చెప్పాను. పులి కరిగిపోయింది. ఇంటికెళ్లి రావడానికి అనుమతినిచ్చింది. అంతటి ఆకలిలోనూ పులి చూపిన కరుణలో నాకు దైవం కనబడింది. సృష్టిలోని జీవులన్నింటికన్నా పులిగొప్పదిలా తోచింది. వీలైనంత తొందరగా తిరిగి రావాలని ఇంటికెళ్లాను. బిడ్డకు కడుపారా పాలిచ్చాను. ఇరుగుపొరుగువారితో ఎలా నడచుకోవాలో బుద్ధులు చెప్పాను. తిరిగి ఆదరబాదరగా అడవికొచ్చాను. కానీ అడవిలో పులి లేదు. దాని కళేబరం ఉంది. బాగా చూస్తే దాని కాళ్లకు గోళ్లు లేవు. ఇదే నా కథ’’ అని కన్నీళ్లతో చెప్పి గోవు మాయమైంది. పులిరాజుకు ఏడుపొచ్చేసింది. వెంటనే మెళ్లోని పులిగోరును తెంపి తాను కథరాసిన కాగితాల్లో వేసి నిప్పంటించాడు. నిప్పు దగద్ధాయమానంగా వెలుగుతోంది. అది ఈ లోకంలోని జనారణ్యాలన్నింటినీ దహించేస్తున్నట్టుగా ఉంది. ఆ పేరు అతనిక్కూడా బాగా నచ్చింది. దీంతో అతను ఆ పేరుతోనే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనికి పులిగోరు మీద కూడా కథ రాయాలనిపించింది. నీ మంచి కోరి చెబుతున్నా... ఆ మెళ్లోని పులిగోరు తీసేయ్... ఆ గోవు తర్వాత నీకు కనబడదు. హాయిగా నీకు నచ్చిన కథ రాసుకో... -
సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’
మంచి పుస్తకం మంచి కథ ఒక్కటి చాలు, ఒక రచయిత ప్రతిభా కౌశలాన్ని పాఠకుడి ముందుంచటానికి. వల్లూరి శివప్రసాద్ కథా సంపుటి ‘నాగేటి చాలు’ను తిరగేయండి. మొత్తం 22 కధలుంటే ప్రతి కథలోనూ అలాంటి ప్రతిభా కౌశలం చూస్తారు. శివప్రసాద్ కథలన్నీ వర్తమాన సమస్యలను స్వీకరిస్తాయి. ముఖ్యంగా రైతు సమస్యలని. పాత్రలన్నీ చాలా సహజంగా గంటూరు జిల్లా రైతు భాషను మాట్లాడతాయి. ఎక్కడా భావోద్వేగాల్ని అసహజంగా పలికించవు. ‘నాగేటి చాలు’లోని చలమయ్య అయినా, ‘పురుగు’ కథలోని అమరయ్య అయినా, ‘గిట్టుబాటు’ కథలోని కోటేశ్వరరావు అయినా ,‘పగ’ కథలోని ముత్తయ్య అయినా వీరందరిదీ మట్టిభాష. ఈ కథల్లోని విషాదం, బీభత్సం మన గుండేల్ని తాకుతుంది. అలాగే ‘గుండెలోతు’ ‘వానప్రస్థం’ కథల్లో వయసు పైబడిన తల్లిదండ్రుల సంఘర్షణను ఆయన కళ్ళకు కట్టిస్తారు. మైనారిటీ వర్గాలకు చెందిన కథలు రెండు ఉన్నాయి. రెండూ కంటతడి పెట్టించేవే. ‘దొరకోటు’లో ముసలి పాలేరు ‘ఆదాం’ది చిన్న కోరిక. పొలానికి కాపలా కాసే సమయంలో చలి నుంచి అతనికి కొంత ఊరట కావాలి. ఏ ధర్మప్రభువైనా ఒక కోటు యివ్వకపోతాడా అన్న చిన్న కోరిక అతనిది. క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు అతనికో దొరలు వాడిన కోటును దానంగా యిస్తారు. ఆ ప్రభువే యిచ్చాడని పొంగిపోతాడు. చివరికి జ్వరానికి తట్టుకోలేకపోతున్న మనవడి వైద్యం కోసం ఆ కోటును అమ్మేస్తాడు. సరే ఇలాంటి వితరణ సంస్థల్లో వుండే రాజకీయాల్ని ప్రశ్నిస్తాడు రచయిత. అది సెకండరీ. ఆదాం దోరకోటుతో ఊళ్ళో తిరిగినప్పుడు అతన్ని ఎకసెక్కమాడిన వాళ్ళు, సానుభూతి చూపించిన వాళ్ళు, నయానా భయానా బెదిరించిన వాళ్ళూ అందరూ రైతులే. రైతుల్లో వుండే మరో కోణాన్ని చూపిస్తాడు యిక్కడ రచయిత. ఆదాం లాంటి వాళ్ళ జీవితాల్లోని దుర్భరతను మనమూ చూస్తాం. ఆదాంను ఒక పట్టాన మర్చిపోలేం. ఇక రెండవ కథ ఎండమావి. ముస్లిం జీవితాల పేదరికం ఎంత భయంకరంగా వుంటుందో చూపే కథ. వృద్ధాప్య పింఛను ఇస్తున్నారని తెలిసిన అరవైయేళ్ళ బూబమ్మ దాని కోసం ప్రయత్నిస్తుంది. అనేక చీత్కారాలను దాటుకుని ఫోటోదిగడం కోసం డబ్బు కూడపెట్టుకుని చివరకు ఫోటో దిగుతుంది. ఆమె తపన మనలో టెన్షన్ పుట్టించి ఎట్లయినా ఆ ముసలి బూబమ్మకు పింఛను దక్కాలి అని భావిస్తుండగానే ఊరి రాజకీయాల లాలూచీతో ఆ ముసల్దాని దరఖాస్తు ఫారాన్ని చించేస్తాడు మునసబు. ఆ మునసబుని కొట్టాలనిపించేంత కోపం పాఠకుడికి కలుగుతుంది. ఈ రెండు కథల్లోనూ పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సంభాషణలు వేటికవే సాటి. ఈ రచయితకు రైతులంటే గౌరవముంది. రిటైరయిపోయిన తల్లిదండ్రులంటే జాలి వుంది. ఆడవాళ్ళను స్వంతంగా ఆలోచించనివ్వరన్న ఆక్రోశం వుంది. వ్యవసాయాన్ని నాశనం చేసిన పాలకులంటే తీవ్రమయిన కోపం వుంది. అందుకే సందిగ్ధావస్థలో, సంక్షోభిత దశలో వున్న ఒక సమాజపు ప్రతీకలు ‘నాగేటి చాలు’ కధలన్నీ. - సి.ఎస్.రాంబాబు 94904 01005 నాగేటి చాలు- వల్లూరి శివప్రసాద్; వెల: రూ.140; ప్రతులకు- విశాలాంధ్ర -
పేరులోనే ఉంది అసలు కథంతా!
కథ రాసి ఒక రచయిత ఒక పత్రిక్కి పంపాడు. సాధారణ ప్రచురణకి. కొంతకాలం ఎదురు చూశాడు. వెనక్కు వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. కథ బాగానే ఉన్నట్టు అనిపించింది. అది రైతు కథ. రైతుకు వ్యవసాయం మీద ఉండే ప్రేమ... మట్టి అంటే ఉండే మమకారం... కరువు... వలస... వీటి వల్ల వచ్చే నలుగుబాటు.... వీటిని రాసి పంపాడు. పేరు కూడా మంచిదే పెట్టాడు. ‘భూమమ్మ’. కాని తిరిగి వచ్చింది. ఈలోపు సంవత్సరం గడిచిపోయింది. అదే పత్రిక ఈసారి కథల పోటీ పెట్టింది. కథ పంపాలి. పాత కథే మళ్లీ తీశాడు. ఊళ్లో ఉన్న సీనియర్ రచయితకు చూపించాడు. ఆ సీనియర్ రచయిత కథంతా చదివి, గతంలో పెట్టిన పేరు కొట్టేసి ‘మన్ను తిన్న మనిషి’ అని పెట్టి- ఇప్పుడు పంపు అన్నాడు. పంపాడు. కొన్నాళ్లు గడిచాయి. ఫలితాలు వచ్చాయి. గతంలో సాధారణ ప్రచురణకు ఎన్నిక కాని కథ ఇప్పుడు ప్రైజ్ కొట్టింది. ఆ రచయిత పేరు- చిలుకూరి దేవపుత్ర. పేరు సరి చేసిన రచయిత పేరు - సింగమనేని నారాయణ. గతంలోనూ ఇలాగే జరిగింది. ఒక రచయిత మంచి కథ రాసి పత్రిక్కి పంపాడు. సంపాదకుడు దానిని చదివాడు. బాగున్నట్టో బాగలేనట్టో అర్థం కాలేదు. కథ పేరు - ‘విపణి వీధి’. తిప్పి పంపాడు. మళ్లీ కొన్నాళ్లకు అదే రచయిత అదే కథను ఇంకో పత్రిక్కి పంపాడు. ఆ పత్రికలో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు స్వయంగా రచయిత. కథను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయనదే. కథను చదివాడు. బాగుంది. కొంచెం కత్తిరించాలి. రచయితకు చెప్పి ఆ పని చేశాడు. పేరు కూడా మార్చాలి. మార్చాడు. ‘కువైట్ సావిత్రమ్మ’. అచ్చయ్యింది. తెలుగు నేలంతా ఆ కథ మోగిపోయింది.రచయిత - చక్రవేణు. పేరు సరి చేసిన రచయిత- పి. రామకృష్ణ. సెప్టెంబర్ 11 జరిగింది. ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. అక్కడే ఉంటున్న రచయిత అక్కిరాజు భట్టిప్రోలు ఒక కథ రాశాడు. ఒక విధ్వంస చర్య ఒక జాతి మీదున్న నమ్మకాన్ని కుప్పకూల్చరాదు. కొందరి పని అందరి మీదా విద్వేషాన్ని రగల్చరాదు. అంతే కథ. ఒక్క ఊపులో రాశాడు. పేరేం పెట్టాలో తెలియలేదు. సాటి రచయిత- చంద్ర కన్నెగంటికి పంపాడు. అతనికి కవిత్వం తెలుసు. కథ చదవగానే బైరాగి కవితేదో గుర్తొచ్చింది. టైటిల్ తట్టింది- నాక్కొంచెం నమ్మకమివ్వు. ఇలా జరుగుతుంటుంది చాలాసార్లు. వంటంతా అద్భుతంగా చేసిన చీఫ్ చెఫ్ కూడా ఆఖరులో ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని వాళ్ల దగ్గరా వీళ్ల దగ్గరా గరిటె పట్టుకొని తిరుగుతాడు. రుచి చూసి చెప్తే ఇంకొంచెం వేయడమో ఎక్కువైందని తెలిస్తే రిపేరు చేయడమో... ఇదొక ప్రాసెస్. కథంతా రాశాక పేరు పెట్టడం తెలియదు మనలో చాలామందికి. కొందరు ముందే పేరు అనుకొని కథ మొదలుపెడతారు. అంటే కథ, కథతో పాటు పేరూ ఒకేసారి తడతాయి. ఇది నయం. కాని కథ మొదట తట్టి తర్వాత పేరంటేనే కష్టం. నిజాయితీతో రాసిన కథకు నిజాయితీతో కూడిన మకుటమే పెట్టాలి ఎప్పుడూ. కథలో మోసం ఉన్నా టైటిల్లో మోసం ఉన్నా పాఠకుడు మూచూడడు. చూసినా హృదయానికి పులుముకోడు. గురజాడ టైటిల్స్ చూడండి... దిద్దుబాటు... మీ పేరేమిటి... మెటిల్డా. సూటిగా ఉంటాయి. మల్లాది, శ్రీపాద టైటిల్స్? వేరే చెప్పాలా? మల్లాది ఒక కథకు ‘ఏలేలో’ అని పెట్టారు. మధురం. శ్రీపాద ‘అరికాళ్ల కింద మంటలు’... అనగానే మరి ఆ కథను వదలం. ఎవరి అరికాళ్ల కింద మంటలు అవి? ఏ మంటలు? దాని వల్ల ఏమైంది? కథ చదవడం మొదలెట్టి రెండు మూడు పేజీలు దాటేసరికి మనకు మెల్లగా తెలుస్తుంది మంటలు ఉన్నది మన అరికాళ్ల కిందే అని. కథ గడిచే కొద్దీ ఆ సెగ అంటుకుంటుంది. ఆఖరులో పంటి బిగువు మీద జట్కా పరిగెత్తి పోయి మలుపు తిరిగితే తప్ప మనం తెరిపిన పడం. నీళ్ల బకెట్టులో కాళ్లు పెట్టుకున్నట్టుగా చల్లబడం. అయితే ఆ తర్వాత మన టైటిల్స్ కొంచెం మారాయి. జంట పదాలతో మూస పోశాయి. ఈ ధోరణి బహుశా బుచ్బిబాబు తెచ్చారనుకుంటాను. ‘ఊడిన చక్రం వాడిన పుష్పం’, ‘కాగితం ముక్కలు గాజు పెంకులు’, ‘మర మేకులు చీర మడతలు’, ‘వెనుక చూపు ముందు నడక’.... ఇవన్నీ ఆయన కథల పేర్లే. సామాన్యుణ్ణి దృష్టిలో పెట్టుకుందాం ఒక క్షణం. ఏం కథ చదివారు అనంటే ‘మర మేకులు చీర మడతలు’ అంటాడా? ఆ పేరు అతనికి గుర్తే ఉండదు. దాంతో పాటే కథ కూడా. కాని ఈ ధోరణి కొంత కాలం పాటు తెలుగు కథను పట్టి పీడించింది. ‘భవదీయుడు బంతిపూలు’, ‘పూర్ణము నిరంతమూ’, ‘బింబం ప్రతిబింబం’, ‘ధ్వని ప్రతిధ్వని’, ‘పయనం పలాయనం’, ‘పరిధులూ ప్రమేయాలూ’... ఆఖరుకు బాపుగారు తన జీవితంలో రాసిన ఒకటి రెండు కథల్లో ఒక కథ పేరు ‘మబ్బువానా మల్లెవాసనా’. ఈ వ్యవహారం చూసి చూసి ముళ్లపూడి వెంకట రమణ ఒక హాస్యకథ రాసి దానికి ‘భగ్నవీణలూ బాష్పకణాలూ’ అని పేరు పెట్టి వెక్కిరించారు. అయినా మార్పు లేదు. కాలం అలాంటిది. ప్రభావాలూ అలాంటివే. మధురాంతకం నరేంద్ర ఒక చాలా మంచి కథ రాశారు. ఇంట్లో బాధలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఆడవాళ్ల మీదే ఆ బరువంతా వేసి బలాదూరు తిరిగే మగవాళ్ల కథ అది. పేరు ‘నిత్యమూ నిరంతమూ’. కాని ‘ఎప్పటిలాగే’ అనే పేరు కూడా ఎంత బాగుండేదో కదా అనిపిస్తుంది. మూసలో కొట్టుకుపోవడం అంటే పులివేషగాళ్ల మధ్య పులేషం వేసుకొని తిరగడం. ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. మందతో పాటు తప్పెట్ల మోతలో పోతూ ఉండటమే. కొన్నాళ్లు ఇంకో వింత జరిగింది. ‘రాధమ్మ పెళ్లి (లేక) బంగారుగాజులు’, ‘గడ్డిమోపు (లేక) వీరిగాడి పెళ్లాం’ ఇలాంటి పేర్లు పెట్టారు చాలా మంది. ఈ లేక ఏమిటి? రచయితకు తెలియదా ఇదో లేక అదో. అతడికే తెలియనప్పుడు పాఠకుడికి ఎందుకు? ఆ తర్వాత ‘అను’ అనే ఇంకో వైపరీత్యం వచ్చింది. దీనికి ఆద్యులు రావిశాస్త్రి గారా? ‘ది స్మోకింగ్ టైగర్ అను పులిపూజ’ అనే కథ రాశాడాయన. ఆ తర్వాత కథల పేర్లు- ‘న్యాయం అను టిప్పు సుల్తాన్ కతి’్త, ‘నల్లబజార్ అను సుబ్బారావు పాతబాకీ’... ఇలాంటివి వచ్చాయి. ఈ ధోరణి ఎంత ప్రభావం రేపిందంటే అనంతపురంలో ఉంటూ తమ స్వంత ధోరణిలో కథలు రాసుకునే బండి నారాయణ స్వామి, సింగమనేని నారాయణ వంటి కథకులు కూడా వరుసగా- ‘తెల్లదయ్యం అను గ్రామవివక్ష కథ’, ‘సెప్టెంబర్ 11 అను ఫిరంగిలో జ్వరం’... అనే అను కథలు రాశారు. చెప్పుకోవడానికి ఏమీ లేని వ్యక్తి ఉంగరాలు తొడుక్కుని, బ్రాస్లెట్ పెట్టుకొని, మెళ్లో చైను దిగేసుకొని వీటిని చూసైనా మర్యాదివ్వండి అని చెప్పడం ఎలాగో కథలో ఏమీ లేకపోతే ఒక ఆర్భాటమైన టైటిల్ పెట్టి ఇందులో ఏదో ఉంది అని మోసం చేయడం అలాగ. - ఖదీర్ -
కుక్క చెప్పిన దేవుని కథ
కథ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది. నేను సరుకుల కోసం మార్కెట్‌కి వెళ్లాను. రోడ్డంతా వాహనాలతో, నడిచే జనంతో రద్దీగా ఉంది. నడుచుకుంటూ షాప్‌కి వెళ్లి అన్నీ కొన్నాను. వెనక్కి వస్తూ బస్‌స్టాప్‌లో బస్‌కోసం ఎదురుచూస్తున్నా. ఈలోగా ఒక వీధికుక్క అటుగా వెళుతూ నా దగ్గరకొచ్చి ఆగింది. ఏమనుకుందో ఏమో? నాకేసి, నా సంచీకేసి చూస్తూ, నాలుక తాటిస్తూ, నా కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తూ తన రెండు కాళ్లమీద కూర్చుండిపోయింది. అసలే రోజులు బాలేవు. పైగా ఇది వీధికుక్క. పెద్దపెద్ద కోరలు, చెదిరి దుమ్ముపట్టిన బొచ్చు. కొంచెం భయం కలిగింది. ఆ మధ్య ఇలాగే ఒకతను... నాకు తెలిసిన వ్యక్తే... ఇలాంటి వీధికుక్క కరవడం వల్లే పాపం వ్యాధిన పడి, పోయాడు. కదిలితే అరుస్తుందేమో! ఉన్నట్టుండి పిక్క పట్టుకుంటే? అలాగే బిగుసుకుపోయి, తదేకంగా దాని కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తున్నా. ఏమేమో ఆలోచనలు తెరలుతెరలుగా నాలో మెదలసాగాయి. చేతిలో ఇంత సంచీ ఉంది. దానికి ఈ సంచీలో ఏముందో తెలీదు. నేను అందులోంచి ఏ బండరాయో తీస్తే? ఏ కత్తో, సుత్తో, కర్రో తీసి కొడితే? ఈ ఆలోచన ఈ కుక్కకి రాదా? ఏంటి దీనికి నామీద ఇంతటి గుడ్డి నమ్మకం? నేనేం చేయను అని దానికి అంత ధీమా ఎందుకు? అసలు ఆ కోణంలో అది ఆలోచించదా? ఇదివరకు ఎవరో ఒకరు తరిమో? ఛీ... ఫో..! అనో, చాలారకాలుగా అనే ఉంటారుగా! సరే! ఏదేమైనా ఫర్లేదు, వాడు తినేదేదో అందులో ఉంచుతాడు అని పసిగట్టింది అనుకుందాం! అది నేను దానికి పెడతానన్న నమ్మకం ఏమిటి? ఒకవేళ నాపట్ల అలాంటి నమ్మకమే ఉంటే, ఆ నమ్మకానికి హేతువేంటి? హు! అయినా నా పిచ్చిగానీ అసలు జంతువులు సహేతుకంగా ఎందుకు ఆలోచిస్తాయి? వాటికి అసలు పరిపూర్ణ జ్ఞానమే ఉండదు. ఏదో జీవం ఉన్నంతవరకూ జీవితం ఉంటుంది. దాన్ని నడపటానికి తెలియకుండా దొరికిన తిండి, కొంచెం రక్షణ... ఆ అనుభూతులకి నిర్వచనం తెలియకుండానే బతికేస్తాయి అంతే! అనుకున్నాను. చిన్నప్పుడు పూజ చేస్తున్న మా అమ్మ, ‘దేవుడికి దణ్నం పెట్టుకో’ అని అన్నప్పుడు, నేను అడిగిన ప్రశ్న ఈ సందర్భంలో మెరుపులా మెరిసింది. ‘‘అమ్మా! మరి జంతువులకి దేవుడు ఉండడా? అవి గుడికి వెళ్లవా? వాటికి పూజలు, ప్రార్థనలు ఉండవా?’’ మనుషులు ఆ భగవంతుణ్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో చదవాలి, ఎన్నో చేయాలి... వేదాలు, శాస్త్రాలు, దర్శనాలు, వేదాంత సూత్రాలు, సత్ సంఘాలు, 9 భక్తి మార్గాలు, వ్రతాలు, పూజలు, ప్రార్థనలు.... ప్రపంచంలో నేటికీ 108కి పైచిలుకు మతాలు ఉన్నాయి. ఆ భగవత్ తత్త్వాన్ని మనకు విశదీకరించడానికి ఎన్నో సిద్ధాంతాలూ ఉన్నాయి, కొత్తగా వస్తున్నాయి. అంతరిక్షం దగ్గరనుంచీ దైవ పదార్థం వరకు అన్నింటా అంతటా మనం శోధించగలుగుతున్నాం. (ఇంకా అన్ని మూలలకీ చేరుకోలేకపోయాం అనుకోండి). ఇవన్నీ మనకు ఏర్పడిన లేదా సంక్రమించిన (మనం ముద్దుగా పిలుచుకునే) విజ్ఞానం అనే మానసిక స్థితి వల్ల సాధించిన విషయాలు. మరి ఇంకా దేవుని ఉనికి మనకు ఎందుకు పూర్తిగా కనబడటం లేదు? అనుకోకుండా మన పూర్వీకులు దొరకబుచ్చుకున్న ఒక ఫలమే ఈ జ్ఞానం అని బైబిల్ మహాగ్రంథం చెబుతోంది. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ‘ఎంత శోధింతురో వారు అంత దూరం నాకు’ అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వాటి సారాంశం... అజ్ఞానంలో ఉండే ఆనందం...ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అనవచ్చు. ఉదాహరణకు, మన చిన్నతనంలో ఆ చంద్రుడి మీద కుందేలు మామ కథలు విన్నప్పుడు, ఇంటికప్పు మీంచి ఆ చంద్రుడిని ఒక అందమైన లోకంగా, అందులో అందమైన కుందేలును ఊహించిన ఒక చిన్నారి ఎదిగి విజ్ఞానం ద్వారా అవి కేవలం పెద్ద పెద్ద గుంటలు అని తెలుసుకుంటాడు. ఎదిగిన పిల్లాడు మళ్లీ ఆ చందమామలోని కుందేలు అందాలను చూడగలడా? ఇకపై గుంటలే కనిపిస్తాయి. మనకు సంక్రమించే జ్ఞానం కూడా అక్షరాలా అలాంటిదేనా? అంటే, అనుకోకుండా మనకు ఏర్పడిన ఈ జ్ఞానం వెనక్కి తిప్పలేనిది. చందమామ కథలోలాగా, మనం అబ్బో అనుకునే విజ్ఞానం ఒకవిధంగా మన దురదృష్టం కావొచ్చు. ఎందుకంటే, ఈ విజ్ఞానం అనే తెరే మనల్ని విశ్వవ్యాప్తమైన పరమ తత్వానికి దూరం చేస్తున్నది కావొచ్చు. ఇలా చూస్తే అసలు భగవంతుడు అంటూ మనం నిర్వచించే ప్రయత్నమే అవివేకం కదా మరి. ఎప్పుడైతే అలా నిర్వచించ ప్రయత్నిస్తామో అప్పుడే స్పర్థలు సృష్టిస్తాం. అదంతా అవివేకమే అన్న విషయం నాకు తట్టింది. అంటే అసలు భగవంతుడు ఉన్నాడో లేడో అన్న ప్రశ్న అసలు లేదన్నమాట. అందుకే ఆనందమయ స్థితి అనేది ‘అజ్ఞానం’తోనే ముడిపడివుంది అని చెప్పుకోవచ్చేమో! పసిపిల్లలు, జంతువులు అందుకే దేవుని తత్వాన్ని చాలా దగ్గరగా చూపగలుగుతారనుకుంటాను.ఆ కుక్కను చూస్తూ, ఏదేదో ఆలోచిస్తున్న నేను ఆ క్షణంలో తీర్మానించుకున్నాను. అంటే ఈ కుక్క కూడా తన ఇంద్రియాలతో ఆ పరమాత్మను చూడగలదన్నమాట? అచ్ఛ! ఈ కుక్క ఎంత అదృష్టవంతురాలు అనుకుంటూ, ఇంకా అలాగే దాని కళ్లలోకి చూస్తూ, నా సంచీలోంచి ఇందాక కొన్న బిస్కెట్స్ కొన్ని తీసి, దాని ముందర వేశాను. ఎంతో శ్రద్ధగా ఆ కుక్క అవన్నీ తిని తృప్తిగా నాకేసి చూసింది. నేను మళ్లీ దానికేసి చూస్తూ... హమ్మయ్య! ఏదైతేనేం... అది నన్ను కరవలేదు అనుకున్నా. ఏమాత్రం దానికి సహాయం చేయాలన్న ఆలోచన లేని నానుంచి, దాని ఆహారం ఇప్పించుకున్న ఆ కుక్క ప్రవర్తనకు నవ్వుకున్నాను మనసులో. ‘నీ కళ్లు ఆ పరమాత్మను చూస్తాయి అని నేను గ్రహించాను కదా! మరి ఆ స్వరూపం ఎలా ఉంటుందో నాకు కాస్త చెప్పవూ?’ అని వేడుకోలుగా ఆ కుక్కను అడిగాను. వెంటనే అది లేచి, అటు తిరిగి, మళ్లీ ఒక్కసారి నాకేసి చూసి వెళ్లిపోయింది. నా ప్రశ్న విని పకాపకా నవ్వినట్లనిపించింది నాకు. ణువణువు నించి విశ్వాంతరాళం వరకు అనిర్వచనీయమైన వేల లక్షల కోట్ల పరమాత్మలు... సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి, మన ప్రవర్తనల్ని బట్టి... మారుతూ, మెరుపులా కనిపిస్తూ, అంతలోనే మాయమవుతాయేమో! కరిచే అవకాశం ఉన్నా కరవని ఆ కుక్కలో ఆ క్షణం నాకు భగవంతుడు కనిపించాడు. ఇచ్చే ఆలోచనగానీ, ఇవ్వాలన్న ఉద్దేశంగానీ లేకపోయినా... ఆ పూటకి దానికి ఆహారం ఇచ్చినందుకు, కుక్కకు నాలో తన దయామూర్తి కనిపించి ఉండొచ్చు గాక! దే నాకు ఆ కుక్క చెప్పిన కథ! - కాంత్ యర్రమిల్లి -
విలువైన కథ-నేపథ్యం
కథలు రాసేవారికీ కథలు చదివేవారికీ ఫలానా కథ ఎలా పుట్టింది, ఈ రచయితకు ఆ ఆలోచన ఎప్పుడు తట్టింది, తట్టిన ఆలోచనను అతడు కథగా ఎలా మలిచి ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఎటువంటి సాధకబాధకాలు పడి ఉంటాడు అని తెలుసుకోవాలనిపించడం కద్దు. గొప్ప గొప్ప కథలు- అవి కలిగించవలసిన చైతన్యాన్ని కలిగించడమేగాక తమ పుట్టుక గురించి కూడా కుతూహలం కలిగిస్తాయి. అవి తెలుసుకోవడం అంటే ఆ కథలను మరింత అక్కున జేర్చుకోవడమే. అంతే కాదు కథకులు, కొత్త కథకులు కొత్తపాఠాలను అనుభవాలను తెలుసుకోవడమే. గతంలో కథ-నేపథ్యం మొదటి భాగం వచ్చింది. అందులో అబ్బూరి ఛాయాదేవి, కాళీపట్నం రామారావు, కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు వంటి సుప్రసిద్ధ కథకులు 25 మంది తమ కథల నేపథ్యం చెప్పారు. మరో 34 మంది కథలతో నేపథ్యాలతో ‘కథ నేపథ్యం-2’ వచ్చింది. ఒక పత్రికలో పాత్రికేయుడిగా పని చేస్తున్నప్పుడు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుకు వచ్చిన ఆలోచన వల్ల ఈ శీర్షిక తదనంతరం ఈ విలువైన సంకలనాలు ఇవాళ తానా సహకారంతో పాఠకులకు అందాయి. కథ నేపథ్యం-2లో అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, ఆర్.వసుంధరాదేవి, ఓల్గా, కాట్రగడ్డ దయానంద్, గీతాంజలి, తోలేటి జగన్మోహనరావు, పెద్దింటి అశోక్ కుమార్, మధురాంతకం నరేంద్ర, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, సి.రామచంద్రరావు, పి.చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రసిద్ధ రచయితలు అనేకమంది తమ కథల్లో ఒక కథను ఎంచుకుని అది రాయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. అయితే ఇవి ఒట్టి నేపథ్యాలు కాదు. సాంఘిక ఘటనలు. పరిణామక్రమాలు. తెలుగు సమాజపు ఒడిదుడుకుల్లో కొండగుర్తులు. స్త్రీ-పురుష లేదా మానవ సంబంధాల్లో వచ్చిన వస్తున్న మార్పులకు పెను సూచికలు. ముఖ్యంగా తెలంగాణ రచయితలు అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్ కుమార్; రాయలసీమ కథకులు వి.ఆర్.రాసాని, సన్నపురెడ్డి; స్త్రీ రచయితలు గీతాంజలి, చంద్రలత వీరి నేపథ్యాలు ప్రతి ఒక్కరూ చదవదగ్గవి. తెలుగు ప్రాంతంలోని రచయితలకు మాత్రమే పరిమితం కాకుండా అమెరికా నుంచి రాస్తున్న ఆరి సీతారామయ్య, చంద్ర కన్నెగంటి, వేలూరి వెంకటేశ్వరరావులకు చోటు కల్పించడం సబబుగా ఉంది. వీరిలో వేలూరి రాసిన కథా నేపథ్యం అమెరికా వలస చరిత్రను సూక్ష్మంగా తెలియచేస్తుంది. ఇదొక్కటే కాదు ఓల్గా- ‘అయోని’ కథ నేపథ్యం స్త్రీవాదపు ఒక కోణాన్ని చూపితే, తోలేటి ‘మగోడు’ నేపథ్యం అదే స్త్రీవాదపు మరో కోణాన్ని చూపుతుంది. ఇక రచనకు సంబంధించి రచయితలిచ్చిన టిప్స్ సరేసరి. అయితే ఇటువంటి ప్రయత్నాల్లో లోపాలు వెదకడం సులువు. అర్హత ఉన్న అందరికీ చోటు కల్పించడం ఎలాగూ వీలు పడదు కనుక ఇటువంటప్పుడు సంపాదకులుగా ఉన్నవారు సాధారణంగా తమ రచనలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. కాని ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు తన కథ ఇందులో వేసుకోవడం వల్ల మా కథ ఎందుకు లేదు అని అడిగే అవకాశం ఇచ్చినవారయ్యారు. ఏ కారణం వల్లనైనాగాని వాడ్రేవు చినవీరభద్రుడు, దాదాహయత్, ముదిగంటి సుజాతరెడ్డి, గోపిని కరుణాకర్ల కథలు లేకపోవడం వెలితి. అలాగే పతంజలిశాస్త్రి, జి.ఆర్.మహర్షి, సుంకోజి దేవేంద్రాచారిల కథలు కూడా ఉంటే బాగుండేది. సుంకోజి నేపథ్యానికీ ఆ నేపథ్యంలో నుంచి ఆయన చేసిన సుదీర్ఘ కథా ప్రయాణానికీ తగిన గౌరవం ఇవ్వకపోవడం అసమంజసం. అలాగే 2005 నుంచి కథలు రాస్తున్న అజయ్ ప్రసాద్‌కు చోటు ఇవ్వడం వల్ల అంతకు ముందు నుంచి రాస్తున్న కె.ఎన్.మల్లీశ్వరి, దగ్గుమాటి పద్మాకర్, జి.ఉమామహేశ్వర్, స్కైబాబా, సువర్ణముఖి, కె.వి.కూర్మనాథ్, జి.వెంకటకృష్ణ, ఒమ్మి రమేశ్‌బాబు, డా.ఎం.హరికిషన్... తదితర రచయితలను ఎందుకు మినహాయించారు అనే ప్రశ్న రావచ్చు. ఇక రెండు సంకలనాల్లోని 59 కథల్లో కేవలం 8 మాత్రమే తెలంగాణవారివి. ఈ సంఖ్య వారిని నొప్పించవచ్చు. ఈ గమనింపులని రాబోయే సంకలనాల్లో స్వీకరిస్తారని ఆశిద్దాం. తెలుగు సాహిత్యంలో కథకు చేయదగ్గ సేవ బహుముఖాలుగా సాగాలని కోరుకుందాం. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి ఈ ముగ్గురూ ఉమ్మడి సంపాదకత్వంలో చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు తెలుపుదాం.రచయితలు, విమర్శకులు, పాఠకులు, ఔత్సాహికులు తప్పని సరిగా పరిశీలించదగ్గ పుస్తకం కథ నేపథ్యం - 2. - నెటిజన్ కిశోర్ కథ నేపథ్యం; 34 మంది కథకుల ఉత్తమ కథలు వాటి నేపథ్యాలు తానా ప్రచురణ; వెల: రూ. 350; ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు సంపాదకుల నం: 9985425888, 7207210560