పేరులోనే ఉంది అసలు కథంతా!
కథ రాసి ఒక రచయిత ఒక పత్రిక్కి పంపాడు. సాధారణ ప్రచురణకి. కొంతకాలం ఎదురు చూశాడు. వెనక్కు వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. కథ బాగానే ఉన్నట్టు అనిపించింది. అది రైతు కథ. రైతుకు వ్యవసాయం మీద ఉండే ప్రేమ... మట్టి అంటే ఉండే మమకారం... కరువు... వలస... వీటి వల్ల వచ్చే నలుగుబాటు.... వీటిని రాసి పంపాడు. పేరు కూడా మంచిదే పెట్టాడు. ‘భూమమ్మ’. కాని తిరిగి వచ్చింది. ఈలోపు సంవత్సరం గడిచిపోయింది. అదే పత్రిక ఈసారి కథల పోటీ పెట్టింది. కథ పంపాలి. పాత కథే మళ్లీ తీశాడు. ఊళ్లో ఉన్న సీనియర్ రచయితకు చూపించాడు. ఆ సీనియర్ రచయిత కథంతా చదివి, గతంలో పెట్టిన పేరు కొట్టేసి ‘మన్ను తిన్న మనిషి’ అని పెట్టి- ఇప్పుడు పంపు అన్నాడు. పంపాడు. కొన్నాళ్లు గడిచాయి. ఫలితాలు వచ్చాయి. గతంలో సాధారణ ప్రచురణకు ఎన్నిక కాని కథ ఇప్పుడు ప్రైజ్ కొట్టింది. ఆ రచయిత పేరు- చిలుకూరి దేవపుత్ర. పేరు సరి చేసిన రచయిత పేరు - సింగమనేని నారాయణ.
గతంలోనూ ఇలాగే జరిగింది. ఒక రచయిత మంచి కథ రాసి పత్రిక్కి పంపాడు. సంపాదకుడు దానిని చదివాడు. బాగున్నట్టో బాగలేనట్టో అర్థం కాలేదు. కథ పేరు - ‘విపణి వీధి’. తిప్పి పంపాడు. మళ్లీ కొన్నాళ్లకు అదే రచయిత అదే కథను ఇంకో పత్రిక్కి పంపాడు. ఆ పత్రికలో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు స్వయంగా రచయిత. కథను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయనదే. కథను చదివాడు. బాగుంది. కొంచెం కత్తిరించాలి. రచయితకు చెప్పి ఆ పని చేశాడు. పేరు కూడా మార్చాలి. మార్చాడు. ‘కువైట్ సావిత్రమ్మ’. అచ్చయ్యింది. తెలుగు నేలంతా ఆ కథ మోగిపోయింది.రచయిత - చక్రవేణు. పేరు సరి చేసిన రచయిత- పి. రామకృష్ణ.
సెప్టెంబర్ 11 జరిగింది. ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. అక్కడే ఉంటున్న రచయిత అక్కిరాజు భట్టిప్రోలు ఒక కథ రాశాడు. ఒక విధ్వంస చర్య ఒక జాతి మీదున్న నమ్మకాన్ని కుప్పకూల్చరాదు. కొందరి పని అందరి మీదా విద్వేషాన్ని రగల్చరాదు. అంతే కథ. ఒక్క ఊపులో రాశాడు. పేరేం పెట్టాలో తెలియలేదు. సాటి రచయిత- చంద్ర కన్నెగంటికి పంపాడు. అతనికి కవిత్వం తెలుసు. కథ చదవగానే బైరాగి కవితేదో గుర్తొచ్చింది. టైటిల్ తట్టింది- నాక్కొంచెం నమ్మకమివ్వు.
ఇలా జరుగుతుంటుంది చాలాసార్లు. వంటంతా అద్భుతంగా చేసిన చీఫ్ చెఫ్ కూడా ఆఖరులో ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని వాళ్ల దగ్గరా వీళ్ల దగ్గరా గరిటె పట్టుకొని తిరుగుతాడు. రుచి చూసి చెప్తే ఇంకొంచెం వేయడమో ఎక్కువైందని తెలిస్తే రిపేరు చేయడమో... ఇదొక ప్రాసెస్. కథంతా రాశాక పేరు పెట్టడం తెలియదు మనలో చాలామందికి. కొందరు ముందే పేరు అనుకొని కథ మొదలుపెడతారు. అంటే కథ, కథతో పాటు పేరూ ఒకేసారి తడతాయి. ఇది నయం. కాని కథ మొదట తట్టి తర్వాత పేరంటేనే కష్టం.
నిజాయితీతో రాసిన కథకు నిజాయితీతో కూడిన మకుటమే పెట్టాలి ఎప్పుడూ. కథలో మోసం ఉన్నా టైటిల్‌లో మోసం ఉన్నా పాఠకుడు మూచూడడు. చూసినా హృదయానికి పులుముకోడు. గురజాడ టైటిల్స్ చూడండి... దిద్దుబాటు... మీ పేరేమిటి... మెటిల్డా. సూటిగా ఉంటాయి. మల్లాది, శ్రీపాద టైటిల్స్? వేరే చెప్పాలా? మల్లాది ఒక కథకు ‘ఏలేలో’ అని పెట్టారు. మధురం. శ్రీపాద ‘అరికాళ్ల కింద మంటలు’... అనగానే మరి ఆ కథను వదలం. ఎవరి అరికాళ్ల కింద మంటలు అవి? ఏ మంటలు? దాని వల్ల ఏమైంది? కథ చదవడం మొదలెట్టి రెండు మూడు పేజీలు దాటేసరికి మనకు మెల్లగా తెలుస్తుంది మంటలు ఉన్నది మన అరికాళ్ల కిందే అని. కథ గడిచే కొద్దీ ఆ సెగ అంటుకుంటుంది. ఆఖరులో పంటి బిగువు మీద జట్కా పరిగెత్తి పోయి మలుపు తిరిగితే తప్ప మనం తెరిపిన పడం. నీళ్ల బకెట్టులో కాళ్లు పెట్టుకున్నట్టుగా చల్లబడం.
అయితే ఆ తర్వాత మన టైటిల్స్ కొంచెం మారాయి. జంట పదాలతో మూస పోశాయి. ఈ ధోరణి బహుశా బుచ్బిబాబు తెచ్చారనుకుంటాను. ‘ఊడిన చక్రం వాడిన పుష్పం’, ‘కాగితం ముక్కలు గాజు పెంకులు’, ‘మర మేకులు చీర మడతలు’, ‘వెనుక చూపు ముందు నడక’.... ఇవన్నీ ఆయన కథల పేర్లే. సామాన్యుణ్ణి దృష్టిలో పెట్టుకుందాం ఒక క్షణం. ఏం కథ చదివారు అనంటే ‘మర మేకులు చీర మడతలు’ అంటాడా? ఆ పేరు అతనికి గుర్తే ఉండదు. దాంతో పాటే కథ కూడా. కాని ఈ ధోరణి కొంత కాలం పాటు తెలుగు కథను పట్టి పీడించింది. ‘భవదీయుడు బంతిపూలు’, ‘పూర్ణము నిరంతమూ’, ‘బింబం ప్రతిబింబం’, ‘ధ్వని ప్రతిధ్వని’, ‘పయనం పలాయనం’, ‘పరిధులూ ప్రమేయాలూ’... ఆఖరుకు బాపుగారు తన జీవితంలో రాసిన ఒకటి రెండు కథల్లో ఒక కథ పేరు ‘మబ్బువానా మల్లెవాసనా’. ఈ వ్యవహారం చూసి చూసి ముళ్లపూడి వెంకట రమణ ఒక హాస్యకథ రాసి దానికి ‘భగ్నవీణలూ బాష్పకణాలూ’ అని పేరు పెట్టి వెక్కిరించారు. అయినా మార్పు లేదు. కాలం అలాంటిది. ప్రభావాలూ అలాంటివే. మధురాంతకం నరేంద్ర ఒక చాలా మంచి కథ రాశారు. ఇంట్లో బాధలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఆడవాళ్ల మీదే ఆ బరువంతా వేసి బలాదూరు తిరిగే మగవాళ్ల కథ అది. పేరు ‘నిత్యమూ నిరంతమూ’. కాని ‘ఎప్పటిలాగే’ అనే పేరు కూడా ఎంత బాగుండేదో కదా అనిపిస్తుంది.
మూసలో కొట్టుకుపోవడం అంటే పులివేషగాళ్ల మధ్య పులేషం వేసుకొని తిరగడం. ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. మందతో పాటు తప్పెట్ల మోతలో పోతూ ఉండటమే. కొన్నాళ్లు ఇంకో వింత జరిగింది. ‘రాధమ్మ పెళ్లి (లేక) బంగారుగాజులు’, ‘గడ్డిమోపు (లేక) వీరిగాడి పెళ్లాం’ ఇలాంటి పేర్లు పెట్టారు చాలా మంది. ఈ లేక ఏమిటి? రచయితకు తెలియదా ఇదో లేక అదో. అతడికే తెలియనప్పుడు పాఠకుడికి ఎందుకు? ఆ తర్వాత ‘అను’ అనే ఇంకో వైపరీత్యం వచ్చింది. దీనికి ఆద్యులు రావిశాస్త్రి గారా? ‘ది స్మోకింగ్ టైగర్ అను పులిపూజ’ అనే కథ రాశాడాయన. ఆ తర్వాత కథల పేర్లు- ‘న్యాయం అను టిప్పు సుల్తాన్ కతి’్త, ‘నల్లబజార్ అను సుబ్బారావు పాతబాకీ’... ఇలాంటివి వచ్చాయి. ఈ ధోరణి ఎంత ప్రభావం రేపిందంటే అనంతపురంలో ఉంటూ తమ స్వంత ధోరణిలో కథలు రాసుకునే బండి నారాయణ స్వామి, సింగమనేని నారాయణ వంటి కథకులు కూడా వరుసగా- ‘తెల్లదయ్యం అను గ్రామవివక్ష కథ’, ‘సెప్టెంబర్ 11 అను ఫిరంగిలో జ్వరం’... అనే అను కథలు రాశారు.
చెప్పుకోవడానికి ఏమీ లేని వ్యక్తి ఉంగరాలు తొడుక్కుని, బ్రాస్‌లెట్ పెట్టుకొని, మెళ్లో చైను దిగేసుకొని వీటిని చూసైనా మర్యాదివ్వండి అని చెప్పడం ఎలాగో కథలో ఏమీ లేకపోతే ఒక ఆర్భాటమైన టైటిల్ పెట్టి ఇందులో ఏదో ఉంది అని మోసం చేయడం అలాగ.
- ఖదీర్