బూర్జువా కుక్క... షోకు పిల్లి... కమ్యూనిస్టు గాడిద... | Bourgeois show dog ... cat ... Communist ass | Sakshi
Sakshi News home page

బూర్జువా కుక్క... షోకు పిల్లి... కమ్యూనిస్టు గాడిద...

Published Fri, Dec 26 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

బూర్జువా కుక్క... షోకు పిల్లి... కమ్యూనిస్టు గాడిద...

బూర్జువా కుక్క... షోకు పిల్లి... కమ్యూనిస్టు గాడిద...

బుచ్చిబాబు కథలను ప్రస్తావించేవారు తప్పకుండా ‘ఎల్లోరాలో ఏకాంతసేవ’, ‘అరకులో కూలిన శిఖరం’... కథలను ప్రస్తావిస్తారు. ఈ రెంటినీ నేను చదవలేదు. చదవను కూడా.
 ‘ఎల్లోరాలో ఏకాంతసేవ’ ఏమిటి?
 ‘ఎల్లోరా’ కాబట్టి ‘ఏకాంత సేవా’?
 అదే ‘అజంతా’ అయితే ‘అందమైన ఊహా’ అనేవాడా?
 పాఠకునికి అలా అనిపించిన మరుక్షణం కథ హాస్యాస్పదం అయిపోతుంది. కథ నుంచి పాఠకుణ్ణి విముఖం చేసేస్తుంది. కనుక ‘ఎల్లోరా’ చాలు. ‘కూలిన శిఖరం’ చాలు. పాఠకులను ఆకర్షించడానికి ఇలాంటి గంభీరమైన టైటిల్స్ పెడుతుంటారు మనలో చాలామంది. సాదాసీదా టైటిల్స్ సరిపోవా? ‘నన్ను గురించి కథ రాయవూ’ ఎంత హాయిగా ఉంది. కుర్రకారు ఫ్యాషన్ రంధి మీద అప్పుడెప్పుడో కాళోజి ‘ఫేస్ పౌడర్’ అనే కథ రాశారు. ఎంత బాగుందీ టైటిల్. కథ స్వభావాన్ని చెబుతోంది. అలాగే క్లుప్తంగా సూటిగా కూడా ఉంది. కేతు విశ్వనాథరెడ్డి ఒక మంచికథ రాసి ‘గడ్డి’ అని ఊరుకున్నారు. అవార్డు ఇవ్వాలి అలాంటి టైటిల్‌కి. పాలగుమ్మి పద్మరాజు చాలా బీభత్సమైన కథ రాసి ‘గాలివాన’ అని అతి సరళమైన పేరు పెట్టారు. అంతేతప్ప ‘తుఫానులో చిక్కిన కెరటాలు’ అనలేదు. తుఫాను ఆల్రెడీ కథలో ఉంది. మళ్లీ టైటిల్‌లో ఎందుకు?

 చాలా పెద్దవాళ్ల కథల్లో కూడా ఇలాంటి వింతల్ని గమనిస్తాం. చెహోవ్ ఒక కథ రాశాడు. ఒక పోలీసువాడు. దార్లో పోతుంటే ఏదో గలాటా కనిపించింది. చూస్తే ఒక బార్బర్‌ను ఒక కుక్క కరిచేసింది. పాపం అతడి చిటికినవేలు నుజ్జునుజ్జు అయ్యింది. అది చూసిన పోలీసువాడికి కోపం వచ్చి ఈ కుక్కను ఇలా రోడ్డు మీద వదిలేసిన వాణ్ణి అది చేస్తాను ఇది చేస్తాను అని ఎగురుతాడు. ఇంతలో ఆ కుక్క డబ్బున్నవాళ్లదని తెలుస్తుంది. తగ్గుతాడు. ఆ తర్వాత పోలీసు అధికారిదని తెలుస్తుంది. ఇంకా తగ్గుతాడు. కాదు వీధికుక్కే అని తేలుతుంది. మళ్లీ లేస్తాడు. కాదు- పోలీసు అధికారి ఇంటికొచ్చిన అతడి తమ్ముడిది అని చెప్తారు. ఆ సంగతి తేలాక పోలీసువాడు పూర్తిగా మారిపోతాడు. కుక్కను చేతపట్టుకొని- ఏంట్రా నాన్నా... ఆ బార్బర్ వెధవ వేలు కొరకాలనిపించిందా నీకు... చిచ్చీ... బుజ్జీ... అని గారం చేసి దానిని పైఅధికారి ఇంట అప్పజెప్పడానికి బయల్దేరి కుక్కకాటుతో కుయ్యో మొర్రో అంటున్న బార్బర్‌ని నీ సంగతి చూస్తా అన్నట్టుగా హెచ్చరించి వెళ్లిపోతాడు. దీనికి చెహోవ్ ‘ఊసరవెల్లి’ అని పేరు పెట్టాడు. కథంతా వాడు ఊసరవెల్లే అని చెప్తోంది. మళ్లీ ‘ఊసరవెల్లి’ అని నామకరణం ఎందుకు? దీనికి ‘న్యాయం’ అని పెట్టాలి యదార్థానికి. అవసరాన్ని బట్టి న్యాయం ఎటువైపు మొగ్గుతుందో తెలిసింది అని పాఠకుడు అనుకుంటాడు. అంటే నెరేషన్ కొంత కథ చెప్తే టైటిల్ మరికొంత కథ చెప్పిందన్నమాట. మంచి కథకు పేరు ఇలా కొంత ముసుగువేసి ఉంచాలిగాని తేటతెల్లం చేసేయకపోవడమే ఉత్తమం అని అంటారు. నిజమే. ‘కాటేసిన కరువు’ అంటే ఇంక దాన్ని చదవడం ఎందుకు? గొరుసు జగదీశ్వరరెడ్డి ‘గజ ఈతరాలు’ అనే కథ రాశారు. కుతూహలం రేపే పేరు అది. ఏంటిది.. భలే ఉందే అని చదువుతాం. కాని ఆయనే ‘జలగల వార్డు’ అనే కథ రాశారు. చదవడం ఎందుకు? గవర్నమెంటాస్పత్రి. పేషంట్లని పీక్కుని తింటారు. టైటిలే కథంతా చెప్పేసింది. రచయిత ఉద్దేశం కూడా చెప్పేసింది. అబ్బూరి ఛాయాదేవి ఇలాంటి కథనే రాసి ‘ఆఖరకు అయిదు నక్షత్రాలు’ అనే పేరు పెట్టారు. చాలా మంచి పేరు. అది కథేమీ చెప్పేయడం లేదు. కనుక ఆసక్తి పోదు. కథలకు ‘కుంకుడాకు’ వంటి చాలా మంచి పేర్లు పెట్టిన చాసో కూడా ‘బూర్జువా కుక్క’ అని టైటిల్ పెట్టి కథ రాశారు. టైటిల్‌లోనే రచయిత ఉద్దేశం తెలిసిపోయింది. చదవడం ఎందుకు? రావిశాస్త్రి- ‘షోకుపిల్లి’, నందిగం కృష్ణారావు- ‘కమ్యూనిస్టు గాడిద’... ఈ పేర్లలో ఉన్న కుతూహలం, వ్యంగ్యం... బూర్జువా కుక్కలో లేవు. ఆ గాంభీర్యం పాఠకుణ్ణి కథలో దాదాపుగా అడుగుపెట్టనివ్వదు. చాసో గొప్ప కథల్లో బూర్జువా కుక్కను ప్రస్తావించేవారు ఉన్నారా?

 చాలా మంచి కథలు ఏవంటే కథ కొంత చెప్పి మిగిలింది కథ మకుటం చెప్పడం. చింతా దీక్షితులు రాసిన ‘అభిప్రాయ భేదం’ కథ చూస్తే కథ- టైటిల్ రెండూ ఒక యూనిట్‌గా ఉంటాయి. శ్రీరమణ ‘మిథునం’ అంతే. గోపిని కరుణాకర్ ‘కానుగపూల వాన’లో కథ- టైటిల్ పెనవేసుకు ఉంటాయి.  ఎంత గొప్ప ఊహ అది. పైవర్ణాల మీద పారిజాత వర్షం కురుస్తుంది. నిమ్నవర్ణాల మీద కురిసేది కానుగపూల వానే కదా! మరో క్లాసిక్ ఉదాహరణ ‘నల్లతోలు’.  బ్రిటిష్‌వారి చేతిలో అవమానానికి గురైన ఒక భారతీయుడి కథను సి.రామచంద్రరావు ఆ మకుటంతో రాశారు. నువ్వు ఎంత పైఅధికారివైనా నీకు ఎంత డబ్బూ హోదా ఉన్నా నువ్వు ఎంత బ్రిటిష్‌వారిని అనుకరణ చేసినా నీ రంగు వల్ల నిన్ను అధముడుగా చూడక తప్పదు అని తాహతు తెలిపే కథ అది. దీనికి ‘నల్లతోలు’ అని పెట్టడంలోనే జరగబోయే తీవ్ర అవమానాన్ని సూచిస్తున్నాడు రచయిత. ‘నల్లరంగు’ అంటే మర్యాద ఉంది. ‘వర్ణభేదం’ అంటే అదేమిటో! కాని ‘నల్లతోలు’లో ఉండే రూడ్‌నెస్సే కథంతా. మాస్టర్‌స్ట్రోక్.

 కొన్ని కథలకు- కథలు జరిగే ప్రదేశమే టైటిల్‌గా బాగుంటుంది. మధురాంతకం నరేంద్ర ‘నాలుక్కాళ్ల మంటపం’ క్లాసిక్ ఎగ్జాంపుల్. కొన్ని కథల్లో పాత్రే కథైతే అదే కథ పేరవుతుంది. ‘బల్లకట్టు పాపయ్య’. ఇదీ క్లాసిక్ ఎగ్జాంపులే. ఇంకోటి ఏం చెప్తారంటే  మనం  పెడుతున్న పేరు ఏ కథకైనా పెట్టుకోవచ్చా లేదా ఈ కథకు మాత్రమే ఒప్పుతుందా అనేది చూసుకోవడం. ‘విపణి వీథి’ అనే పేరు ఏ కథకైనా పెట్టొచ్చు. కాని ‘కువైట్ సావిత్రమ్మ’ మాత్రం ఫలానా కథకు తప్ప వేరే దేనికీ పనికి రాదు. మంచి టైటిల్ అంటే ఈ లక్షణం కొంత పాటించాలి. కొందరు కథ రాసి, కోట్స్‌లో టైటిల్ పెడతారు. ‘చెడ్డవాడు’. ఇలా అన్నమాట. దీనర్థం ఏంటంటే అతడు నిజంగా చెడ్డవాడు కాదు సుమా, కథంతా చదివాక నీకే తెలుస్తుందిగా అని చెప్పడం. పాఠకులను తక్కువ చేయడం ఇది. కథ సరిగ్గా రాసి కోట్స్ లేకుండా చెడ్డవాడు అని పెట్టినా వాళ్లకు అర్థం అవుతుంది ఏ ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌ను పెట్టారో. మళ్లీ పాఠకుణ్ణి గుర్తు చేసుకోండి. ఏం కథ చదివావు అనంటే కోట్స్‌లో ఉన్న చెడ్డవాడు అనే కథ చదివాను అనంటాడా? ఇదంతా ఏమిటంటే పాఠకుడికి దగ్గరవ్వాల్సింది పోయి దూరంగా జరిగి కథను లిఖిత స్వభావానికి దగ్గరగా  మౌఖిక స్వభావానికి దూరంగా ఉంచడం. ఇలాంటి రచయితల్ని పాఠకులు మనవాడు అనుకోరు. అనుకుందామనుకున్నా రచయిత అనుకోనిస్తే గదా.
 - ఖదీర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement