Qadeer
-
ముఖం ఉన్న నటుడు
-
ముఖం ఉన్న నటుడు
ప్రఖ్యాత దూరదర్శన్ టెలివిజన్ ఫిల్మ్ ‘తమస్’ ఓంపురితోనే ప్రారంభం అవుతుంది. పందులు మేపుకునే ఓంపురిని ఒక బ్రిటిష్‌వాడు పందిని చంపి ఇవ్వమంటాడు. కారణం తెలియని ఓంపురి చంపి ఇస్తాడు. మరుసటి రోజు దాని కళేబరం మసీదు ముందు ప్రత్యక్షమవుతుంది. ఇది హిందువులు చేసిన పనే అని ముస్లిమ్‌లు భావిస్తారు. కలహాలు మొదలవుతాయి. తప్పు ఎక్కడ మొదలైందో తెలిసిన ఓంపురి నలిగిపోతాడు. ఆ కలహాల్లో గర్భిణి అయిన తన భార్యతో అతడు పడే కష్టాలు ఎవరూ మర్చిపోరు. ‘బాబీ’ సినిమా (1973) వచ్చిన రోజు ల్లోనే ఓంపురి కూడా ముంబైలో అవకాశాల కోసం వెతుకు తున్నాడని గుర్తు చేసుకోవడం మనకు ముఖ్యం. అందమైన ముఖాలు, రిషి కపూర్ వంటి చాక్లెట్బాయ్లు చెల్లుబాటు అవుతున్న రోజుల్లో ముఖం నిండా స్ఫోటకపు మచ్చలున్న ఒక నటుడు అవకాశాల కోసం వెతకడం చాలా విడ్డూరం– వింత– హాస్యాస్పదమైన విషయం. కానీ ఓంపురి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (న్యూఢిల్లీ) స్టూడెంట్. నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (పూనా)లో నటనను అభ్యసించిన విద్యార్థి. ముక్కు పెద్దగా ఉందని, పళ్లు వంకరగా ఉన్నాయని, నడుము లావుగా ఉందని ప్రపంచ సినిమాలో నటులు కాకుండా పోయిన వాళ్లు లేరు. వాళ్లు ఎలా ఉన్నారో అలానే గొప్ప నటులయ్యారు. ఓంపురి కూడా తాను ఎలా ఉన్నానో అలానే నటుడుగా రాణించగలనని నమ్మాడు. అదే ముఖంతో రాణించాడు. యాక్టింగ్ స్కూళ్లలో తన సహధ్యాయి అయిన నసీరుద్దీన్ షా, సినిమాల్లోకి వచ్చాక పరిచయమైన షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, అమ్రిష్ పురి, దీప్తీ నావల్, దీపా సాహి వంటి పారలల్ తారాగణంతో కమర్షియల్ సినిమాలను ఒరుసుకుంటూ ఒక పెద్ద సమాంతర ఆవరణం ఏర్పడటానికి కారణమైనవారిలో ఓంపురి చాలా కీలకమైన పాత్ర పోషించాడు. టేక్లోకి వెళ్లే ముందు జుట్టు సరి చేసుకునే హీరోలు ఉన్న రోజుల్లో పాత్రను చేసే ముందు హోంవర్క్ ముఖ్యమని చూపించిన నటుల్లో ఓంపురి ఉంటాడు. అంతవరకూ ‘ఫిల్మీ’గా ఉండే పోలీస్ ఆఫీసర్లను చూసిన ప్రేక్షకులకు ఓంపురి ‘అర్ధ్ సత్య’లో నిజమైన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపించాడు. అందుకోసం ముంబై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. ఆఫీసర్లను పరిశీలించాడు. ఆ పరిశీలనతో రాణించాడు. ‘సిటీ ఆఫ్ జాయ్’ సినిమాలో రిక్షావాడిగా నటించడానికి పదిహేను రోజుల పాటు కలకత్తాలో రిక్షా నడిపిన నటుడు ఓంపురియే. కాని అతడి బాల్యం, యౌవనం, వైవాహిక జీవితం కూడా అంత సుఖంగా సాగలేదు. తల్లికి బాల్యంలోనే మతిస్థిమితం తప్పింది. తండ్రి పట్టించుకోలేదు. ఆరేళ్ల వయసులో టీ అంగళ్లలో కప్పులు కడిగాడు. ధాబాలలో పని చేశాడు. రాత్రి పదింటికి కూడా పని చేయమంటే చిన్న పిల్లాడు కనుక నిద్ర వచ్చి ఆ పని పోగొట్టుకున్నాడు. దగ్గరి బంధువు కొన్నాళ్లు అన్నం పెట్టి ఆ తర్వాత వెళ్లగొట్టాడు. ముంబైకి చేరుకున్నాక కూడా చాలారోజులు సంఘర్షణ చేయాల్సి వచ్చింది. అయితే ఇవేవీ నటుడు కావాలనే అతడి తపనను చల్లార్చలేకపోయాయి. నటుడు కావాలనుకున్నాడు. అయ్యాడు. నసీరుద్దీన్ షా, ఫరూక్ షేక్, అమోల్ పాలేకర్... వీరంతా పారలల్ సినిమాలకు హీరోలుగా నిలదొక్కుకున్నారు. కాని ఓంపురి అతి త్వరగా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చింది. పాత్రే అతని ఉనికి. పాత్రే అతని ఆహారం. శ్యాం బెనగళ్, గోవింద్ నిహలానీ, కేతన్ మెహతా, సయీద్ మిర్జా.. ఇలాంటి దర్శకులంతా ఓంపురికి ఆకలి తీర్చే పాత్రలు ఇచ్చి తమ సినిమాలను శక్తిమంతం చేసుకున్నారు. సత్యజిత్ రే వంటి దర్శకుడు ప్రేమ్‌చంద్ రాసిన ‘సద్గతి’ కథను దూరదర్శన్‌కు తీస్తూ దళితుడి పాత్రను ఓంపురికి ఇచ్చాడు. కూతురి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని పురోహితుడి ఇంటికి వెళితే అతడు నానా పనులు చెప్పి కట్టెలు కొట్టమంటాడు. అసలే జ్వరంతో ఉన్న ఓంపురి కట్టెలు కొట్టీ కొట్టీ ప్రాణం లేని కట్టెపేడుగా మారే సన్నివేశానికి దుఃఖం ముంచుకొస్తుంది. హిందీ సినిమాలలో దళితుడంటే ఓంపురియే. తెలుగులో ఆ మర్యాద చాలాకాలం తర్వాత పి.ఎల్. నారాయణకు దక్కింది. తెలుగులో సి.ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘అంకురం’ సినిమాలో ఓంపురి పోషించిన నక్సలైట్ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా వేసే ముద్ర పెద్దది. గొప్ప నటులంతా సీరియస్ పాత్రలను ఎంత బాగా చేయగలరో హాస్యాన్ని కూడా అంతే బాగా చేస్తారు. ‘ఆక్రోశ్’లో సీరియస్‌గా చేసిన ఓంపురియే ‘జానే భిదో యారో’లో నవ్వులు పూయించడం చాలామంది గమనించారు. కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ హిందీలో ‘చాచీ 420’గా తీసినప్పుడు దొంగ మేనేజర్‌గా ఓంపురి నవ్వులు చిందిస్తాడు. ఓంపురి కెరీర్‌లోని చివరి దశ అంతా ఈ కామిక్ టైమింగ్ మీదే ఆధారపడింది. ముఖ్యంగా దర్శకుడు ప్రియదర్శన్ ఓంపురి చేత లెక్కలేననన్ని కామెడీ వేషాలు వేయించాడు. ఓంపురికి సంబంధించి మనకు ఇటీవలి జ్ఞాపకం ‘బజరంగి భాయ్ జాన్’లో ఆయన వేసిన పాకిస్తానీ మౌల్వీసాబ్ వేషం. దారి తప్పిన పసిపిల్లను తీసుకుని సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ వస్తే మౌల్వీ అయిన ఓంపురి ఆశ్రయం ఇస్తాడు. ఎటువైపు వెళ్లాలో దారి చూపించి ‘ఈ పిల్ల కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తాను. ఖుదా హఫీస్’ అంటాడు. ఆంజనేయస్వామి భక్తుడైన సల్మాన్ ‘ఖుదా హఫీస్’ అనడానికి సంశయిస్తే ‘మీరేం అంటారు?’ అని అడుగుతాడు. ‘జైశ్రీరాం’ అని సల్మాన్ అనగానే ‘జైశ్రీరాం’ అని మౌల్వీ కూడా అంటాడు. హృద్యమైన సీన్ అది. ఓంపురికి మన రాజకీయ నాయకుల మీద గౌరవం లేదు. వాళ్లను ‘అన్పడ్’ (వేలిముద్రగాళ్లు) అని తిట్టి ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఓంపురి జీవితం మీద అతడి భార్య నందితా పురి రాసిన జీవితకథ వివాదాస్పదం అయ్యింది. అందులో ఆమె అత్యుత్సాహం కొద్దీ అతడి లైంగిక సంబంధాలు ప్రస్తావించడంతో ఓంపురి మనసు కష్టపెట్టుకున్నాడు. ఈ గొడవ వారిద్దరి విడాకులకు దారి తీసింది. ‘బీహార్ రోడ్లు ఓంపురి చెంపల్లా గరుకుగా ఉన్నాయి. వీటిని త్వరలో హేమమాలిని బుగ్గల్లా నునుపుగా చేస్తాను’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అనడం ఓంపురి విలోమ ప్రాచుర్యానికి ఒక నమూనా. ఓంపురికి చాలా అవార్డులు వచ్చాయి. బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్’తో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అవన్నీ అదనపు అలంకారాలే. అతడి అసలు అలంకారం సినిమాలో చేసే పాత్ర. దానిని నిర్వహించే తీరు. ఇన్నాళ్లూ... ఓంపురి ఉన్నాడన్న ధైర్యం ఉండేది. అతడి పోకడతో అది సగం అయ్యింది. నటనతో నిండిన అతడి గరుకు ముఖాన్ని ఇప్పుడప్పట్లో మనం మర్చిపోలేము. – ఖదీర్ -
గాలివానకు ముందు తర్వాత....
కథలు పుట్టించే కథలు తెలుగు కథకు ఖ్యాతి తెచ్చి పెట్టిందని భావిస్తున్న ‘గాలివాన’కు మాతృక వంటి కథలు ఇంతకు ముందు ఉన్నాయి. వాటి ప్రభావం గాలివాన మీద ఉంది. అంత మాత్రం చేత గాలివాన ఘనతకు వచ్చిన లోటేమీ లేదు. పట్టాల మీద రైలు వెళుతున్నప్పుడు మనింట్లో కిటికీ ఊగినట్టు ఒక మంచి కథ చదివినప్పుడు కలిగే అనునాదంతో గొప్పగొప్ప కథలు రాసినవాళ్లు చాలామంది ఉన్నారు. నిజానికి మూలకథ కంటే మెరుగైన కథలు రాసినవాళ్లు ఉన్నారు. గాలివాన! దీనికి మొదట బీజం వేసినవాడు గుస్తావ్ ఫ్లోబేర్. ‘మదాం బావరి’ ఫేమ్. ఆయన కూడా సొంతంగా రాయలేదు. అసలు అంత ఉన్నతమైన మానవ ఘటనను ఎవరూ ఊహించలేరు. ఎవరి జీవితంలో అయినా జరిగితే ఆ నోటా ఈ నోటా విని కథనం చేయడం తప్ప. ఇంతకూ ఆ కథ ఏమిటి? ఒకడు హంతకుడు. ఆ తర్వాత మారాలనుకుంటాడు. మంచి పనులు చేసి ‘సెయింట్’ కావాలనుకుంటాడు. కాని మంచి పని అంటే ఏమిటి? ఆచి తూచి చేసేది మంచి పనా? అప్రయత్నంగా చేయగలగాలి. అప్పుడే అది దైవానికి దగ్గరగా ఉంటుంది. అలాంటి పని ఇతడు ఏమి చేశాడు గనుక. ఇలాంటి సమయంలోనే భయంకరమైన శీతాకాలం వచ్చింది. మంచు- పేనినతాళ్ల వలే కురుస్తోంది. ఉష్ణం కావాలి ప్రతిఒక్కరికి ఉష్ణం. అది లేకపోతే చచ్చిపోతారు. అలాంటి శీతలంలోనే దారిన సెయింట్ పోతుంటే ఒక దిమ్మరి తారసపడ్డాడు. గోడ దగ్గర పడి ఉండి, ముణగ దీసుకొని, చలి... చలి అని వణుకుతున్నాడు. కాపాడండి... కాపాడండి.. రోదిస్తున్నాడు. సెయింట్ చూశాడు. క్షణం కూడా ఆలోచించలేదు. కోటు విప్పి ఇచ్చాడు. చాల్లేదు. ఇంకేదో బట్ట తెచ్చి కప్పాడు. సరిపోలేదు. దిమ్మరి పెనుబాధతో అరుస్తున్నాడు. ‘దేవుడా... నా ఎముకల్లో చలి దూరిపోయింది... కాపాడు తండ్రీ’... సెయింట్ మరేమీ ఆలోచించలేదు. తన బట్టలన్నీ విప్పి నగ్నంగా మారి ఆ దిమ్మరిని కావలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే తన శరీరంలోని ఉష్ణమంతా అతడిలోకి ప్రవహించాలి. కాని అప్పుడు తెలిసింది. అతడు దిమ్మరి కాదు. కుష్టువాడు. దేహమంతా కృశించి... వ్రణాలతో స్రవించి... సెయింట్ ఆగలేదు. మరింత కౌగలించుకున్నాడు. తన పాపాలకు ఇదే నిష్కృతి ఏమో అన్నట్టుగా మరింత గట్టిగా కావలించుకున్నాడు. దైవం ఎలాగైతే కావలించుకుంటుందో అలా కావలించుకున్నాడు. వాస్తవంలో జరిగిన ఈ ఘటనను..... ఖీజ్ఛి ఔ్ఛజ్ఛఛీ ౌజ ్చజ్టీ ఒఠజ్చీ ఖీజ్ఛి ఏౌటఞజ్ట్చ్చీట పేరుతో ఫ్లోబేర్ రాశాడు. అచ్చయ్యింది. లక్షల మంది చదివారు. కాని ఒకడు జవాబు పలికాడు. ఫ్లోబేర్తో సమానంగా కంపించాడు. గోర్కి! ఈ కథకు అతడి ప్రతిస్పందనే ‘మరపురాని రాత్రి’ కథ . ఏమిటా కథ? దివాలా తీసిన ఒక నగరంలో ఒక దిక్కుమాలిన చలికాలం. రాత్రి... పైగా వానా... ఆకలితో నకనకలాడుతున్న కుర్రాడొకడు ఒక బిచ్చెగత్తెకు తారసపడ్డాడు. ఇద్దరి దగ్గరా కాణీ లేదు. రాత్రి గడిపే దారీ లేదు. బిచ్చగత్తె దొంగ. ఆమె అతడితో కలిసి ఒక బంకును పెళ్లగిస్తుంది. కొంచెం రొట్టె ముక్కలాంటిది దొరుకుతుంది. రాత్రి మరింత చిక్కబడుతుంది. చలి- దాపున ఉన్న పులిలా గాండ్రిస్తూ ఉంటుంది. ఇద్దరూ సముద్రం ఒడ్డున బోర్లించిన పడవలోకి చేరారు. ఏమిటిది? ఈ రాత్రి.. ఈ బీభత్సం.. ఈ నైరాశ్యం... కుర్రవాడికి లోకం కొట్టే దెబ్బలు ఇంకా తెలియలేదు. ఇప్పుడిప్పుడే తెలిసి వణుకుతున్నాడు. చలికి కూడా. అయితే ఇలాంటి ప్రతి సందర్భాన్ని ఒక మనిషి సాటిమనిషి సాయంతో దాటిపోయాడు. ఆ కుర్రవాడికి కూడా ఈ క్షణంలో ఒక భరోసా కావాలి. బిచ్చగత్తె అది గమనించింది. మెల్లగా అతడిని దగ్గరకు తీసుకుంది. కావలించుకుంది. వెచ్చదనం. చలి నుంచి- వర్షపు చినుకుల నుంచి- ఆకలి నుంచి- సకల భవిష్యత్ భయాల నుంచి కాసింత వెచ్చదనం. అంతే. పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ వెనుక ఈ నేపథ్యమంతా ఉంది. ముఖ్యంగా ‘మరపురాని రాత్రి’కీ ‘గాలివాన’కూ దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మరపురాని రాత్రిలో కుర్రవాడికి వ్యవస్థ మీద నమ్మకం కూలిపోయింది. గాలివానలో రావుగారికి తన కల్పిత తాత్త్విక విశ్వాసాల మీద ఉన్న భేషజం కూలిపోయింది. రెండు కథల్లోనూ అట్టడుగున మిగిలేది ఉన్నత మానవ స్పందనలే. గోర్కి కుష్టువాడికి బదులు బిచ్చగత్తెను తీసుకున్నాడు. పద్మరాజుగారు అదే బిచ్చగత్తెకు విరాట్ రూపం ఇచ్చి తీర్చి దిద్దారు. ఇరువురి కథల్లోనూ ఆమె దొంగే. అయితే మన నేపథ్యానికి చలి కుదర్దు. మనది అంత చలి ఉండే ప్రాంతమూ లేదు. కనుక గాలివాన అవసరమైంది. వానకు తడిస్తే, తడిసి ముద్దయితే మరి చలి తప్పదు. రాయడమే కష్టం అనుకుంటే దాని కంటే బాగా రాయాలనుకోవడం ఎంత కష్టం. మూలం కంటే గోర్కి, గోర్కి కంటే పద్మరాజు ఆ కథకు అమరత్వం తీసుకువచ్చారు. అవి వారి సొంత కథలే. మూలం ఒక మిష. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. ఇదే కథ మన భారతీయాంగ్ల సాహిత్యంలో ఇంకోలా అనునాదం చెందింది. ఏమిటా కథ? ఢిల్లీ. గడ్డ కట్టే చలికాలం. భయంకరమైన శీతగాలులు. అలాంటి సమయంలో బాగా స్థితిమంతుడైన కుర్రాడొకడు తండ్రితో మాట పొసగక మీరట్‌లోని తన ఇంటి నుంచి బయటపడి ఢిల్లీ చేరుకున్నాడు. సాయంత్రమైంది. వాళ్లింటికీ వీళ్లింటికీ వెళ్లాడు. కాని ఆదుకుంటారన్న నమ్మకముంచిన ప్రతి ఒక్కరూ ముంచారు. తండ్రి సంపదను వదిలి వచ్చిన పనికిమాలినవాడితో పనేంటి? రాత్రయ్యింది. ఒకవైపు చలి. మరోవైపు ఆకలి. ఇంకోవైపు జ్వరం. నిలువ నీడలేదు. చలి పెరిగింది. ఎముకల్లో దూరిపోతోంది. ఒళ్లు ఎగిరెగిరి పడుతోంది. చచ్చిపోతాడా ఏం? కాని- ఇంతలో- మినుకుమినుకుమంటూ సూది మొనంత వెలుగు కనిపించింది. బీడీ రవ్వ. ఒక బిచ్చగత్తె. ఇతణ్ణి చూసింది. ఎవరతడు? బంధువు కాదు. పెనిమిటి కాదు. తోబుట్టువూ కాదు. సాటి మనిషి! చలికి ఒణుకుతున్నాడు. చచ్చిపోయేలా ఉన్నాడు. బిచ్చగత్తె ఆలోచించలేదు. తల్లిలాగా కదిలింది. రండి బాబూ రండి... దగ్గర కూచోబెట్టుకుంది. ఒణికిపోతున్నాడు. అయ్యో... దగ్గరకు తీసుకొంది. గట్టిగా కౌగలించుకుంది. ఇంకా గట్టిగా. ఆ క్షణంలో అక్కడ ఒక మనిషి నుంచి మరో మనిషిలోకి ప్రవహిస్తున్నది వేడి కాదు. నమ్మకం. మనుషుల మీద నమ్మకం. అతడిలో నాగరీకులందరూ పోగొట్టిన ఆ నమ్మకాన్ని ఒక ఛీకొట్టాల్సిన మనిషి- దిక్కుమాలిన మనిషి- బిచ్చగత్తె- ఆ శీతవేళ నిలబెట్టింది. దీనిని కె.ఎ.అబ్బాస్ రాశాడు. శ్రీ 420 రైటర్. ‘బ్లిట్జ్’ జర్నలిస్ట్. అబ్బాస్ బతికినంత కాలం ముంబైలో ఉన్నాడు. కాని ముంబైలో ఇంత చలి ఉండదు. అందుకే కథను ఢిల్లీకి మార్చాడు. అయినా సరే కథ శవాన్ని పరుండబెట్టే ఐస్‌లా ఉండదు. కొండ చరియను సహజంగా పెనవేసే హిమధారలా ఉంటుంది. అబ్బాస్ చాలా కథలు రాశాడు. ఇది మణిమకుటం. ఎవరూ దీనిని తప్పించుకోలేరు. మహామహులైనా సరే తప్పించుకోవాల్సిన అవసరమూ లేదు. ఓ.హెన్రీ- గిఫ్ట్ ఆఫ్ మేగీ స్పర్శ చా.సో- వాయులీనంలో కనిపించలేదా? హెమింగ్వే- ‘ఓల్డ్ మేన్ అండ్ సీ’ కేశవరెడ్డి- అతడు అడవిని జయించాడుగా రూపాంతరం చెందలేదా? మనందరం ఆరాధించే త్రిపుర- జేమ్స్ థర్బర్ రాసిన ‘ది సీక్రెట్ ఆఫ్ వాల్టర్ మిట్టీ’ కథను ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’ పేరుతో సృజించలేదా? నిన్న మొన్న- ప్రేమ్‌చంద్ ‘షత్రంజ్ కే ఖిలాడీ’ కథ స్ట్రక్చర్‌లో వాడ్రేవు చినవీరభద్రుడు ‘పాఠాంతరం’ అనే మంచి కథను రాయలేదా? కంపనం తాకేంత వరకే జడత్వం. తాకిన వెంటనే కథ. ప్లాస్టిక్ బిడ్డకు నొప్పులక్కర్లేదు. కాని ప్రాణమున్న బిడ్డకు అంత కష్టమూ పడాల్సిందే. ప్రభావాల చేత అయినా సరే అలాంటి ప్రాణమున్న కథలు రాసిన వారికి వందనాలు. వేయి లైకులు. - ఖదీర్. -
బూర్జువా కుక్క... షోకు పిల్లి... కమ్యూనిస్టు గాడిద...
బుచ్చిబాబు కథలను ప్రస్తావించేవారు తప్పకుండా ‘ఎల్లోరాలో ఏకాంతసేవ’, ‘అరకులో కూలిన శిఖరం’... కథలను ప్రస్తావిస్తారు. ఈ రెంటినీ నేను చదవలేదు. చదవను కూడా. ‘ఎల్లోరాలో ఏకాంతసేవ’ ఏమిటి? ‘ఎల్లోరా’ కాబట్టి ‘ఏకాంత సేవా’? అదే ‘అజంతా’ అయితే ‘అందమైన ఊహా’ అనేవాడా? పాఠకునికి అలా అనిపించిన మరుక్షణం కథ హాస్యాస్పదం అయిపోతుంది. కథ నుంచి పాఠకుణ్ణి విముఖం చేసేస్తుంది. కనుక ‘ఎల్లోరా’ చాలు. ‘కూలిన శిఖరం’ చాలు. పాఠకులను ఆకర్షించడానికి ఇలాంటి గంభీరమైన టైటిల్స్ పెడుతుంటారు మనలో చాలామంది. సాదాసీదా టైటిల్స్ సరిపోవా? ‘నన్ను గురించి కథ రాయవూ’ ఎంత హాయిగా ఉంది. కుర్రకారు ఫ్యాషన్ రంధి మీద అప్పుడెప్పుడో కాళోజి ‘ఫేస్ పౌడర్’ అనే కథ రాశారు. ఎంత బాగుందీ టైటిల్. కథ స్వభావాన్ని చెబుతోంది. అలాగే క్లుప్తంగా సూటిగా కూడా ఉంది. కేతు విశ్వనాథరెడ్డి ఒక మంచికథ రాసి ‘గడ్డి’ అని ఊరుకున్నారు. అవార్డు ఇవ్వాలి అలాంటి టైటిల్‌కి. పాలగుమ్మి పద్మరాజు చాలా బీభత్సమైన కథ రాసి ‘గాలివాన’ అని అతి సరళమైన పేరు పెట్టారు. అంతేతప్ప ‘తుఫానులో చిక్కిన కెరటాలు’ అనలేదు. తుఫాను ఆల్రెడీ కథలో ఉంది. మళ్లీ టైటిల్లో ఎందుకు? చాలా పెద్దవాళ్ల కథల్లో కూడా ఇలాంటి వింతల్ని గమనిస్తాం. చెహోవ్ ఒక కథ రాశాడు. ఒక పోలీసువాడు. దార్లో పోతుంటే ఏదో గలాటా కనిపించింది. చూస్తే ఒక బార్బర్‌ను ఒక కుక్క కరిచేసింది. పాపం అతడి చిటికినవేలు నుజ్జునుజ్జు అయ్యింది. అది చూసిన పోలీసువాడికి కోపం వచ్చి ఈ కుక్కను ఇలా రోడ్డు మీద వదిలేసిన వాణ్ణి అది చేస్తాను ఇది చేస్తాను అని ఎగురుతాడు. ఇంతలో ఆ కుక్క డబ్బున్నవాళ్లదని తెలుస్తుంది. తగ్గుతాడు. ఆ తర్వాత పోలీసు అధికారిదని తెలుస్తుంది. ఇంకా తగ్గుతాడు. కాదు వీధికుక్కే అని తేలుతుంది. మళ్లీ లేస్తాడు. కాదు- పోలీసు అధికారి ఇంటికొచ్చిన అతడి తమ్ముడిది అని చెప్తారు. ఆ సంగతి తేలాక పోలీసువాడు పూర్తిగా మారిపోతాడు. కుక్కను చేతపట్టుకొని- ఏంట్రా నాన్నా... ఆ బార్బర్ వెధవ వేలు కొరకాలనిపించిందా నీకు... చిచ్చీ... బుజ్జీ... అని గారం చేసి దానిని పైఅధికారి ఇంట అప్పజెప్పడానికి బయల్దేరి కుక్కకాటుతో కుయ్యో మొర్రో అంటున్న బార్బర్‌ని నీ సంగతి చూస్తా అన్నట్టుగా హెచ్చరించి వెళ్లిపోతాడు. దీనికి చెహోవ్ ‘ఊసరవెల్లి’ అని పేరు పెట్టాడు. కథంతా వాడు ఊసరవెల్లే అని చెప్తోంది. మళ్లీ ‘ఊసరవెల్లి’ అని నామకరణం ఎందుకు? దీనికి ‘న్యాయం’ అని పెట్టాలి యదార్థానికి. అవసరాన్ని బట్టి న్యాయం ఎటువైపు మొగ్గుతుందో తెలిసింది అని పాఠకుడు అనుకుంటాడు. అంటే నెరేషన్ కొంత కథ చెప్తే టైటిల్ మరికొంత కథ చెప్పిందన్నమాట. మంచి కథకు పేరు ఇలా కొంత ముసుగువేసి ఉంచాలిగాని తేటతెల్లం చేసేయకపోవడమే ఉత్తమం అని అంటారు. నిజమే. ‘కాటేసిన కరువు’ అంటే ఇంక దాన్ని చదవడం ఎందుకు? గొరుసు జగదీశ్వరరెడ్డి ‘గజ ఈతరాలు’ అనే కథ రాశారు. కుతూహలం రేపే పేరు అది. ఏంటిది.. భలే ఉందే అని చదువుతాం. కాని ఆయనే ‘జలగల వార్డు’ అనే కథ రాశారు. చదవడం ఎందుకు? గవర్నమెంటాస్పత్రి. పేషంట్లని పీక్కుని తింటారు. టైటిలే కథంతా చెప్పేసింది. రచయిత ఉద్దేశం కూడా చెప్పేసింది. అబ్బూరి ఛాయాదేవి ఇలాంటి కథనే రాసి ‘ఆఖరకు అయిదు నక్షత్రాలు’ అనే పేరు పెట్టారు. చాలా మంచి పేరు. అది కథేమీ చెప్పేయడం లేదు. కనుక ఆసక్తి పోదు. కథలకు ‘కుంకుడాకు’ వంటి చాలా మంచి పేర్లు పెట్టిన చాసో కూడా ‘బూర్జువా కుక్క’ అని టైటిల్ పెట్టి కథ రాశారు. టైటిల్లోనే రచయిత ఉద్దేశం తెలిసిపోయింది. చదవడం ఎందుకు? రావిశాస్త్రి- ‘షోకుపిల్లి’, నందిగం కృష్ణారావు- ‘కమ్యూనిస్టు గాడిద’... ఈ పేర్లలో ఉన్న కుతూహలం, వ్యంగ్యం... బూర్జువా కుక్కలో లేవు. ఆ గాంభీర్యం పాఠకుణ్ణి కథలో దాదాపుగా అడుగుపెట్టనివ్వదు. చాసో గొప్ప కథల్లో బూర్జువా కుక్కను ప్రస్తావించేవారు ఉన్నారా? చాలా మంచి కథలు ఏవంటే కథ కొంత చెప్పి మిగిలింది కథ మకుటం చెప్పడం. చింతా దీక్షితులు రాసిన ‘అభిప్రాయ భేదం’ కథ చూస్తే కథ- టైటిల్ రెండూ ఒక యూనిట్‌గా ఉంటాయి. శ్రీరమణ ‘మిథునం’ అంతే. గోపిని కరుణాకర్ ‘కానుగపూల వాన’లో కథ- టైటిల్ పెనవేసుకు ఉంటాయి. ఎంత గొప్ప ఊహ అది. పైవర్ణాల మీద పారిజాత వర్షం కురుస్తుంది. నిమ్నవర్ణాల మీద కురిసేది కానుగపూల వానే కదా! మరో క్లాసిక్ ఉదాహరణ ‘నల్లతోలు’. బ్రిటిష్‌వారి చేతిలో అవమానానికి గురైన ఒక భారతీయుడి కథను సి.రామచంద్రరావు ఆ మకుటంతో రాశారు. నువ్వు ఎంత పైఅధికారివైనా నీకు ఎంత డబ్బూ హోదా ఉన్నా నువ్వు ఎంత బ్రిటిష్‌వారిని అనుకరణ చేసినా నీ రంగు వల్ల నిన్ను అధముడుగా చూడక తప్పదు అని తాహతు తెలిపే కథ అది. దీనికి ‘నల్లతోలు’ అని పెట్టడంలోనే జరగబోయే తీవ్ర అవమానాన్ని సూచిస్తున్నాడు రచయిత. ‘నల్లరంగు’ అంటే మర్యాద ఉంది. ‘వర్ణభేదం’ అంటే అదేమిటో! కాని ‘నల్లతోలు’లో ఉండే రూడ్నెస్సే కథంతా. మాస్టర్‌స్ట్రోక్. కొన్ని కథలకు- కథలు జరిగే ప్రదేశమే టైటిల్‌గా బాగుంటుంది. మధురాంతకం నరేంద్ర ‘నాలుక్కాళ్ల మంటపం’ క్లాసిక్ ఎగ్జాంపుల్. కొన్ని కథల్లో పాత్రే కథైతే అదే కథ పేరవుతుంది. ‘బల్లకట్టు పాపయ్య’. ఇదీ క్లాసిక్ ఎగ్జాంపులే. ఇంకోటి ఏం చెప్తారంటే మనం పెడుతున్న పేరు ఏ కథకైనా పెట్టుకోవచ్చా లేదా ఈ కథకు మాత్రమే ఒప్పుతుందా అనేది చూసుకోవడం. ‘విపణి వీథి’ అనే పేరు ఏ కథకైనా పెట్టొచ్చు. కాని ‘కువైట్ సావిత్రమ్మ’ మాత్రం ఫలానా కథకు తప్ప వేరే దేనికీ పనికి రాదు. మంచి టైటిల్ అంటే ఈ లక్షణం కొంత పాటించాలి. కొందరు కథ రాసి, కోట్స్‌లో టైటిల్ పెడతారు. ‘చెడ్డవాడు’. ఇలా అన్నమాట. దీనర్థం ఏంటంటే అతడు నిజంగా చెడ్డవాడు కాదు సుమా, కథంతా చదివాక నీకే తెలుస్తుందిగా అని చెప్పడం. పాఠకులను తక్కువ చేయడం ఇది. కథ సరిగ్గా రాసి కోట్స్ లేకుండా చెడ్డవాడు అని పెట్టినా వాళ్లకు అర్థం అవుతుంది ఏ ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌ను పెట్టారో. మళ్లీ పాఠకుణ్ణి గుర్తు చేసుకోండి. ఏం కథ చదివావు అనంటే కోట్స్‌లో ఉన్న చెడ్డవాడు అనే కథ చదివాను అనంటాడా? ఇదంతా ఏమిటంటే పాఠకుడికి దగ్గరవ్వాల్సింది పోయి దూరంగా జరిగి కథను లిఖిత స్వభావానికి దగ్గరగా మౌఖిక స్వభావానికి దూరంగా ఉంచడం. ఇలాంటి రచయితల్ని పాఠకులు మనవాడు అనుకోరు. అనుకుందామనుకున్నా రచయిత అనుకోనిస్తే గదా. - ఖదీర్ -
పేరులోనే ఉంది అసలు కథంతా!
కథ రాసి ఒక రచయిత ఒక పత్రిక్కి పంపాడు. సాధారణ ప్రచురణకి. కొంతకాలం ఎదురు చూశాడు. వెనక్కు వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. కథ బాగానే ఉన్నట్టు అనిపించింది. అది రైతు కథ. రైతుకు వ్యవసాయం మీద ఉండే ప్రేమ... మట్టి అంటే ఉండే మమకారం... కరువు... వలస... వీటి వల్ల వచ్చే నలుగుబాటు.... వీటిని రాసి పంపాడు. పేరు కూడా మంచిదే పెట్టాడు. ‘భూమమ్మ’. కాని తిరిగి వచ్చింది. ఈలోపు సంవత్సరం గడిచిపోయింది. అదే పత్రిక ఈసారి కథల పోటీ పెట్టింది. కథ పంపాలి. పాత కథే మళ్లీ తీశాడు. ఊళ్లో ఉన్న సీనియర్ రచయితకు చూపించాడు. ఆ సీనియర్ రచయిత కథంతా చదివి, గతంలో పెట్టిన పేరు కొట్టేసి ‘మన్ను తిన్న మనిషి’ అని పెట్టి- ఇప్పుడు పంపు అన్నాడు. పంపాడు. కొన్నాళ్లు గడిచాయి. ఫలితాలు వచ్చాయి. గతంలో సాధారణ ప్రచురణకు ఎన్నిక కాని కథ ఇప్పుడు ప్రైజ్ కొట్టింది. ఆ రచయిత పేరు- చిలుకూరి దేవపుత్ర. పేరు సరి చేసిన రచయిత పేరు - సింగమనేని నారాయణ. గతంలోనూ ఇలాగే జరిగింది. ఒక రచయిత మంచి కథ రాసి పత్రిక్కి పంపాడు. సంపాదకుడు దానిని చదివాడు. బాగున్నట్టో బాగలేనట్టో అర్థం కాలేదు. కథ పేరు - ‘విపణి వీధి’. తిప్పి పంపాడు. మళ్లీ కొన్నాళ్లకు అదే రచయిత అదే కథను ఇంకో పత్రిక్కి పంపాడు. ఆ పత్రికలో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు స్వయంగా రచయిత. కథను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయనదే. కథను చదివాడు. బాగుంది. కొంచెం కత్తిరించాలి. రచయితకు చెప్పి ఆ పని చేశాడు. పేరు కూడా మార్చాలి. మార్చాడు. ‘కువైట్ సావిత్రమ్మ’. అచ్చయ్యింది. తెలుగు నేలంతా ఆ కథ మోగిపోయింది.రచయిత - చక్రవేణు. పేరు సరి చేసిన రచయిత- పి. రామకృష్ణ. సెప్టెంబర్ 11 జరిగింది. ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. అక్కడే ఉంటున్న రచయిత అక్కిరాజు భట్టిప్రోలు ఒక కథ రాశాడు. ఒక విధ్వంస చర్య ఒక జాతి మీదున్న నమ్మకాన్ని కుప్పకూల్చరాదు. కొందరి పని అందరి మీదా విద్వేషాన్ని రగల్చరాదు. అంతే కథ. ఒక్క ఊపులో రాశాడు. పేరేం పెట్టాలో తెలియలేదు. సాటి రచయిత- చంద్ర కన్నెగంటికి పంపాడు. అతనికి కవిత్వం తెలుసు. కథ చదవగానే బైరాగి కవితేదో గుర్తొచ్చింది. టైటిల్ తట్టింది- నాక్కొంచెం నమ్మకమివ్వు. ఇలా జరుగుతుంటుంది చాలాసార్లు. వంటంతా అద్భుతంగా చేసిన చీఫ్ చెఫ్ కూడా ఆఖరులో ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని వాళ్ల దగ్గరా వీళ్ల దగ్గరా గరిటె పట్టుకొని తిరుగుతాడు. రుచి చూసి చెప్తే ఇంకొంచెం వేయడమో ఎక్కువైందని తెలిస్తే రిపేరు చేయడమో... ఇదొక ప్రాసెస్. కథంతా రాశాక పేరు పెట్టడం తెలియదు మనలో చాలామందికి. కొందరు ముందే పేరు అనుకొని కథ మొదలుపెడతారు. అంటే కథ, కథతో పాటు పేరూ ఒకేసారి తడతాయి. ఇది నయం. కాని కథ మొదట తట్టి తర్వాత పేరంటేనే కష్టం. నిజాయితీతో రాసిన కథకు నిజాయితీతో కూడిన మకుటమే పెట్టాలి ఎప్పుడూ. కథలో మోసం ఉన్నా టైటిల్లో మోసం ఉన్నా పాఠకుడు మూచూడడు. చూసినా హృదయానికి పులుముకోడు. గురజాడ టైటిల్స్ చూడండి... దిద్దుబాటు... మీ పేరేమిటి... మెటిల్డా. సూటిగా ఉంటాయి. మల్లాది, శ్రీపాద టైటిల్స్? వేరే చెప్పాలా? మల్లాది ఒక కథకు ‘ఏలేలో’ అని పెట్టారు. మధురం. శ్రీపాద ‘అరికాళ్ల కింద మంటలు’... అనగానే మరి ఆ కథను వదలం. ఎవరి అరికాళ్ల కింద మంటలు అవి? ఏ మంటలు? దాని వల్ల ఏమైంది? కథ చదవడం మొదలెట్టి రెండు మూడు పేజీలు దాటేసరికి మనకు మెల్లగా తెలుస్తుంది మంటలు ఉన్నది మన అరికాళ్ల కిందే అని. కథ గడిచే కొద్దీ ఆ సెగ అంటుకుంటుంది. ఆఖరులో పంటి బిగువు మీద జట్కా పరిగెత్తి పోయి మలుపు తిరిగితే తప్ప మనం తెరిపిన పడం. నీళ్ల బకెట్టులో కాళ్లు పెట్టుకున్నట్టుగా చల్లబడం. అయితే ఆ తర్వాత మన టైటిల్స్ కొంచెం మారాయి. జంట పదాలతో మూస పోశాయి. ఈ ధోరణి బహుశా బుచ్బిబాబు తెచ్చారనుకుంటాను. ‘ఊడిన చక్రం వాడిన పుష్పం’, ‘కాగితం ముక్కలు గాజు పెంకులు’, ‘మర మేకులు చీర మడతలు’, ‘వెనుక చూపు ముందు నడక’.... ఇవన్నీ ఆయన కథల పేర్లే. సామాన్యుణ్ణి దృష్టిలో పెట్టుకుందాం ఒక క్షణం. ఏం కథ చదివారు అనంటే ‘మర మేకులు చీర మడతలు’ అంటాడా? ఆ పేరు అతనికి గుర్తే ఉండదు. దాంతో పాటే కథ కూడా. కాని ఈ ధోరణి కొంత కాలం పాటు తెలుగు కథను పట్టి పీడించింది. ‘భవదీయుడు బంతిపూలు’, ‘పూర్ణము నిరంతమూ’, ‘బింబం ప్రతిబింబం’, ‘ధ్వని ప్రతిధ్వని’, ‘పయనం పలాయనం’, ‘పరిధులూ ప్రమేయాలూ’... ఆఖరుకు బాపుగారు తన జీవితంలో రాసిన ఒకటి రెండు కథల్లో ఒక కథ పేరు ‘మబ్బువానా మల్లెవాసనా’. ఈ వ్యవహారం చూసి చూసి ముళ్లపూడి వెంకట రమణ ఒక హాస్యకథ రాసి దానికి ‘భగ్నవీణలూ బాష్పకణాలూ’ అని పేరు పెట్టి వెక్కిరించారు. అయినా మార్పు లేదు. కాలం అలాంటిది. ప్రభావాలూ అలాంటివే. మధురాంతకం నరేంద్ర ఒక చాలా మంచి కథ రాశారు. ఇంట్లో బాధలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఆడవాళ్ల మీదే ఆ బరువంతా వేసి బలాదూరు తిరిగే మగవాళ్ల కథ అది. పేరు ‘నిత్యమూ నిరంతమూ’. కాని ‘ఎప్పటిలాగే’ అనే పేరు కూడా ఎంత బాగుండేదో కదా అనిపిస్తుంది. మూసలో కొట్టుకుపోవడం అంటే పులివేషగాళ్ల మధ్య పులేషం వేసుకొని తిరగడం. ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. మందతో పాటు తప్పెట్ల మోతలో పోతూ ఉండటమే. కొన్నాళ్లు ఇంకో వింత జరిగింది. ‘రాధమ్మ పెళ్లి (లేక) బంగారుగాజులు’, ‘గడ్డిమోపు (లేక) వీరిగాడి పెళ్లాం’ ఇలాంటి పేర్లు పెట్టారు చాలా మంది. ఈ లేక ఏమిటి? రచయితకు తెలియదా ఇదో లేక అదో. అతడికే తెలియనప్పుడు పాఠకుడికి ఎందుకు? ఆ తర్వాత ‘అను’ అనే ఇంకో వైపరీత్యం వచ్చింది. దీనికి ఆద్యులు రావిశాస్త్రి గారా? ‘ది స్మోకింగ్ టైగర్ అను పులిపూజ’ అనే కథ రాశాడాయన. ఆ తర్వాత కథల పేర్లు- ‘న్యాయం అను టిప్పు సుల్తాన్ కతి’్త, ‘నల్లబజార్ అను సుబ్బారావు పాతబాకీ’... ఇలాంటివి వచ్చాయి. ఈ ధోరణి ఎంత ప్రభావం రేపిందంటే అనంతపురంలో ఉంటూ తమ స్వంత ధోరణిలో కథలు రాసుకునే బండి నారాయణ స్వామి, సింగమనేని నారాయణ వంటి కథకులు కూడా వరుసగా- ‘తెల్లదయ్యం అను గ్రామవివక్ష కథ’, ‘సెప్టెంబర్ 11 అను ఫిరంగిలో జ్వరం’... అనే అను కథలు రాశారు. చెప్పుకోవడానికి ఏమీ లేని వ్యక్తి ఉంగరాలు తొడుక్కుని, బ్రాస్లెట్ పెట్టుకొని, మెళ్లో చైను దిగేసుకొని వీటిని చూసైనా మర్యాదివ్వండి అని చెప్పడం ఎలాగో కథలో ఏమీ లేకపోతే ఒక ఆర్భాటమైన టైటిల్ పెట్టి ఇందులో ఏదో ఉంది అని మోసం చేయడం అలాగ. - ఖదీర్ -
క్యాలెండర్ కాదనర్హం.....
తెలుసుకుంటే పాతకాలం సంగతులు కూడా తమాషా. జాక్ లండన్ రోజుకు వెయ్యి పదాలు రాస్తానని పంతం పట్టి, రోజంతా ఎన్ని బేకార్ పనుల్లో ఉన్నా, అర్ధరాత్రయినా సరే అన్ని పదాలూ రాసి నిద్రపోయేవాడట. మార్క్ టై్వన్ సంగతి తెలిసిందే. ప్రతి ముక్కా నిలబడే రాసి తానొస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయినా లేచి నిలబడేంత పేరు సంపాదించాడు. ఇక హెమింగ్వేకు తెల్లవారుజామున మొదటి సూర్య కిరణం తాకుతుండగా రాయడం అలవాటు. జేమ్స్ జాయిస్ మంచం పై పొట్ట మీద వాలి (బోర్లా పడుకొని) రాయడం అందరికీ తెలుసు. మన కొ.కు కూడా సాయంత్రం చందమామ ఆఫీస్ నుంచి వచ్చీ రాగానే ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ఇంటి హాలులో నేలపై పొట్ట మీద వాలి రాసుకుంటూ ఉండిపోయేవారట. అయితే కొందరు భావుకుల కథ వేరే. కొబ్బరి మీగడలాంటి కాగితం సుతారంగా నడిచే కలం కనబడటమే తరువాయి రాయడానికి పూనుకునేవారట మల్లాది రామకృష్ణశాస్త్రి. జాతక కథలను నేరుగా పాళీ నుంచి తెలుగులోకి అనువదించిన తల్లావఝల శివశంకరశాస్త్రి తాను ఏ పుస్తకం రాస్తూ ఉన్నా పక్కన పరిమళాలీనే ఒక పువ్వును ఉంచుకునేవారట. ఆచంట జానకీరామ్ కూడా అంతే. రాసేటప్పుడైనా, చదివేటప్పుడైనా తన ఎడమ చేతి గుప్పిట్లో రెండు మూడు గండుమల్లెలని ఉంచుకొని వాటి సువాసన ఆస్వాదిస్తూ రచనాలోకాల్లో విహరించేవారట. విశ్వనాథకు మధ్య మధ్య ఇంగ్లిష్ సినిమాల సైరు ఉంటే తప్ప కలం కదిలేదు కాదు. చలం మహాశయునికి ఈ గొడవంతా లేదు. ఎండ కావాలని, వాన కావాలని, వరండా కావాలని, వెన్నెల కావాలని అనేవారు కాదట. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది లోపల ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రాసేవారట. తొమ్మిది తర్వాత బంద్. కాకి అరిచినా పిల్లలు గోల చేసినా మూడ్ ఏ మాత్రం డిస్ట్రర్బ్ అయ్యేది కాదట. వాళ్ల గోల వాళ్లదే. ఈయన రాత ఈయనదే. పతంజలి చేతివేళ్లు చాలా బలంగా దృఢంగా చివర్లు కూసుగా ప్రొక్లయినర్ పళ్లలాగా ఉండేవి. ఆయన ఒక చేత్తో సిగరెట్ వెలిగించి ఒక చేత్తో పెద్ద పెద్ద అక్షరాలతో చకచకమని రాయడం- నల్లకుంటలో- ‘రాజుల లోగిళ్లు’ నవల అనుకుంటాను- చూశాను. మరి నెలలు నిండాయని గ్రహించక, సరంజామా దగ్గర ఉంచుకోక, ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యి లబోదిబోమంటుండగా, రాయడానికి ఏమీ దొరక్క గోడకు తగిలించి ఉన్న పంచాంగం క్యాలెండర్ అందుకొని పేజీల వెనుక వైపంతా గబగబా కథ రాసిన సందర్భాలు పెద్దిభొట్ల సుబ్బరామయ్యకు ఉన్నాయి. ‘ఫినిష్డ్ స్టోరీస్’ అంటారు. అంటే లోలోపలే కథంతా సంపూర్ణంగా తయారయ్యి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆటంకాలు అవరోధాలు లేకుండా బయట పడటం. సింగిల్ డ్రాఫ్ట్. దీనికి లోపల చాలా కసరత్తు జరగాలి. అందుకు చాలా అనుభవం కావాలి. కాని చాలామంది రాస్తూ రాస్తూనే తమకు కావలసిన కథను వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. హెమింగ్వే ఇలాంటి సాధనే చేశానని చెప్పుకున్నాడు. అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా సరే- రాయడం, తిరగ రాయడం తప్పని సరి. ఈ చూసుకోవడం సరి చేసుకోవడమే జీవితాంతం ఈ వెర్రిబాగులకు సిరి. - ఖదీర్ -
ఒక కరువు.... మూడు కథలు....
స్థలకాలాలూ సరే.స్పందనంటూ ఒకటుంటుంది కదా. దాని సంగతేంటి? ఒకటేదో చూస్తాం. మనసుకు రాపిడి కలుగుతుంది. ఒకటేదో వింటాం. హృదయం కళవళ పడుతుంది. ఎండ- ఒకోసారి నిలువెల్లా తడిపేస్తుంది. వాన- అణువణువూ మండించేస్తుంది. అప్పుడిక కలం అందుకోవడమే శరణ్యం. ఊరికే ఉండలేక, లోపల అదిమిపెట్టుకోలేక అనిపించింది చెప్పడమే శరణ్యం. దానికి స్థలం లేదు, కాలం లేదు, భాషా లేదు. స్పందన ఒకటే శరణ్యం. మలయాళ కథ గుర్తుకొస్తోంది. దాని పేరు ‘పోతిచోరు’. అంటే ‘అన్నం పొట్లం’అని అర్థం. మంచి కరువు కాలం. అనేక కాలాలుగా పిడికెడు మెతుకులు కూడా దొరకని కాలం. అలాంటి కాలంలో ఒక మధ్యాహ్నం ఒక స్కూల్లో ఒక పిల్లవాడి అన్నం పొట్లం మాయమయ్యింది. ఎవరు తిన్నట్టు? అన్నం పొట్లం అంటే సామాన్యమా? మెతుకు మెతుకూ బంగారమే. ఆ పిల్లవాడు ప్రధానోపాధ్యాయుడికి కంప్లయింట్ చేశాడు. విచారణ జరిగింది. ఎవరూ దొరక లేదు. ఆ దొంగనో ఈ దొంగనో అయితే పట్టుకోవచ్చుగాని అన్నం దొంగను ఎవరు పట్టుకుంటారు? ప్రధానోపాధ్యాయుడు ఏదో సర్దుబాటు చేశాడు. కాని మరునాటికి ఆయన టేబుల్ మీద ఒక లేఖ ఉంది. దానిని దొంగ రాశాడు. అన్నం పొట్లాన్ని దొంగిలించిన దొంగ. అయ్యా... మరేం చేయమంటారు. కడుపు నిండా తిని చాలా కాలం అయ్యింది. అసలు అన్నం తినే చాలా కాలం అయ్యింది. చేస్తున్న పని అన్నం పెట్టడం లేదు. జీతాలు సక్రమంగా అందడం లేదు. ఏం చేయమంటారు? కళ్లు తిరిగి, శోష వస్తుంటే ఎంత ఏడుపూ గుప్పెడు మెతుకులకు సమానం కాదు కదా అని గతిలేక దొంగతనం చేశాను. దీనికి నేను పైలోకాల్లో సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికి స్థిమితం కోసం మీతో చెప్పుకుంటున్నాను.... హెడ్మాస్టర్ కింద పేరు కోసం చూశాడు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అక్కడ ఇలా ఉంది: ఇట్లు, మీ రెండో తరగతి ఉపాధ్యాయుడు! ఈ కథను రాసింది కరూర్ నీలకంఠ పిళ్లై. కేరళలో రచయితల సహకార సమాఖ్యకి ఊపిరిపోసిన వ్యవస్థాపకుడు. స్కూల్ టీచర్. గొప్ప రచయిత. 1950లనాటి కరువుని ఒక బడిపంతులి కోణం నుంచి రాసిన ఈ కథ కేరళను ఊపేసింది. ఇంకో కథ గుర్తుకొస్తోంది. తమిళ కథ. పేరు ‘ఎస్తర్’. ఆ పల్లెలో అదొక పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో చాలామంది. అప్పటికి చాలా రోజులుగా కరువు. ఎండకు అంతులేదు. రాత్రి చల్లదనం ఎరగదు. గొడ్డూ గోదా ఇళ్ల దగ్గర గడ్డిపోచక్కూడా నోచుకోక అడవి దారి పట్టి అక్కడా ఏమీ దొరక్క గుడ్లు తేలేస్తున్నాయి. నీళ్లు లేవు. పసిపిల్లలు తినడానికి రాగి పిండి కూడా మిగలడం లేదు. ఈ కరువు ఇప్పుడల్లా పోదా? వేచి చూశారు. వేచి చూశారు. వేచి చూశారు. కదలదే. కడుపులు ఎండిపోతున్నాయి. మనుషులు ఎండిపోతున్నారు. ఇక లాభం లేదు. మధురైకు వెళ్లి కూలో నాలో చేసుకు బతకాల్సిందే. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. కాని ఇప్పుడు? తప్పదు. అయితే ఇంట్లో ఒక ముసలావిడ ఉంది. మంచాన పడి ఉంది. చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. చావు రాదు. ఈ పాడుకాలంలో కరువుకాలంలో ఆమెను మోసుకొని ఎక్కడికని వెళ్లడం? ఆమెను వదిలి వెళ్లడానికే నిశ్చయమైంది. ఆమె కూతురు ఎస్తర్- కుటుంబ పెద్ద- నలిగిపోతూ ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రయాణం. ముసలామె మరణించింది. అమ్మయ్య. కరువు రోజుల్లో ఏవో అంత్యక్రియలు అయ్యాయంటే అయ్యాయనిపించారు. ఆ తర్వాత ఆ కుటుంబం వలసకు బయలుదేరింది. కాని... కాని.... ఎస్తర్‌కు ముసలామె గుర్తుకొస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె కళ్లు. పైకప్పును చూస్తున్న, తడిదేరినట్టున్న ఆ కళ్లు ఆమెను చాలాకాలం వెంటాడిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల వరకూ వాటినామె మర్చిపోలేకపోయింది. కథ ముగిసింది. అంటే? ఒక నిమిషం మనకు వెలగదు. వెలిగాక ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎస్తర్ ఆ ముసలామెను చంపేసింది. ఆ ముసలామె తన కన్నకూతురి వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండగా కొనఊపిరితో ఉన్న ఆమె ప్రాణాన్ని తీసేసింది! తప్పదు. కరువు. మనం మిగలాలి కదా. ప్రసిద్ధ తమిళ రచయిత వణ్ణ నిలవన్ రాసిన కథ ఇది. కరువు విశ్వరూపాన్ని చూపిన కథ. ఇంకో కథ కూడా గుర్తుకు వస్తోందే. తెలుగు కథ. ‘సావు కూడు’. అసలే అనంతపురం. ఆపైన కరువుకాలం. ముసలాడు టపీమన్నాడు. అప్పటికే ఊళ్లో అందరికీ పంచెలు మాసిపోయి ఉన్నాయి. గడ్డాలు పెరిగిపోయి ఉన్నాయి. ఇళ్లల్లో ఆడాళ్లు నూరడానికి నాలుగు మిరపకాయలు కూడా లేక కారాలు మిరియాలు నూరుతున్నారు. కాని కర్మంతరం చేయక తప్పదు కదా. అక్కడకు తిరిగి ఇక్కడకు తిరిగి కుంటిదో గుడ్డిదో ముసలిదో ఏదో ఒక గొర్రెను పట్టుకొచ్చారు. కోశారు. ఏళ్ల తర్వాత ఒండినట్టుగా అదే మహాభాగ్యం అన్నట్టుగా మసాలా వేసి కూర వండారు. వేటకూర తిని ఎన్నాళ్లయ్యింది? కరువొచ్చినవాడికి తెలుస్తుంది ఆ భాగ్యం. అందరూ బిలబిలమని వచ్చారు. పీకల మొయ్యా తిన్నారు. తృప్తిగా ఆకువక్క నములుతున్నారు. కాని సరిగ్గా ఆ సమయంలోనే లోపలి నుంచి ముసలిదాని ఏడుపు మొదలయ్యింది. బొరోమని ఒకటే ఏడుపు. ముసలాడి మీద భ్రమ చావక ముసల్ది ఎంత ఏడుస్తుందమ్మా అని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఊరుకోబెట్టడానికి చూశారు. ఊరుకుంటేనా? ఇంకా ఏడవడమే. ఏమైందే ముసలిదానా... ఎందుకట్టా ఏడ్చి సస్తున్నావ్ నువ్వేడిస్తే పోయినోడు తిరిగొస్తాడా అని కొడుకు కొట్టడానికి వచ్చాడు. కాని ముసలాడి కోసమా ముసల్దాని ఏడుపు? కాదు. ముసల్ది ఏమందో తెలుసునా? మూడు నూర్లు పెట్టి గొర్రె తెస్తిరి. ఊరందరి కోసం కూర చేస్తిరి. ఎవరెవరికో పుట్టిన నా కొడుకులంతా గొంతు వరకూ తిని పాయిరి. నా ఇస్తరాకులో మాత్రం నాలుగు తునకలు కూడా ఎయ్యకపాతిరి... కూరంతా అయిపోయి బొమికలు మిగిలెను గదరా ముండనా కొడకల్లారా అని ఒకటే శోకం. ఎంత విషాదం ఇది. చావును అధిగమించిన ఆకలి విషాదం. బండి నారాయణస్వామి రాసిన ఈ కథ కరువు ఉన్నంత కాలం ఉంటుంది. కరువు మాయమయ్యేంత వరకూ ఉంటుంది. ఒక కరువు. మూడు ప్రాంతాలు. ముగ్గురు రచయితలు. ఒకే స్పందన. తాకలేదు మనల్ని? కదిలించలేదూ? అదిగో అలా కదిలించడం కొరకే నిద్రాహారాలు మాని ఆత్మనూ దేహాన్ని కోతకు గురి చేసి కథలు రాస్తుంటారు చాలా మంది. స్పందనగా చిన్న కరచాలనం దొరికితే చిర్నవ్వుతో మరో కథ వైపు నడుస్తుంటారు చాలామంది. - ఖదీర్ -
స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి
కథలెందుకు రాస్తారు? సాధారణంగా ఒక రచయిత రచనలను అంచనా కట్టాలంటే వాటిని ఆ రచయిత జీవించిన స్థలకాలాల్లో నిలబెట్టి అంచనా కట్టమంటారు. అంటే అతడు తన కాలానికి చెందిన ప్రజలని వ్యక్తం చేశాడా? తన స్థలం సాధకబాధకాలను రిప్రజెంట్ చేశాడా? చూడమంటారు. అవి రాయనివాడు ఏం రాసినా అనవసరమే. గురజాడ ఏ రచన చూసినా ఆయన ఏ కాలంలో ఏ ప్రజల్ని చెబుతున్నాడో తెలిసిపోతుంది. శ్రీపాద కథలు తన స్థలకాలాలకు నిలువుటద్దాలు కదా. సాధారణంగా ప్రతి మంచి రచయిత ఏం చేస్తాడంటే తన ప్రతి రచనలోనూ తన స్థలకాలాల ఆనవాలును వదిలే తీరతాడు. అతడు గతంలోకి వెళ్లొచ్చు. భవిష్యత్తులోకి కూడా వెళ్లొచ్చు. కాని ఏ వర్తమానంలో నిలుచుని ఉన్నాడో చెప్పే తీరతాడు. రెండో ప్రపంచయుద్ధాన్ని చూసిన రచయితలు ఆ యుద్ధాన్ని ఎక్కడో ఒక చోట రాయకుండా వదల్లేదు. యూదుల ఊచకోతను చూసిన రచయితలు ఆ ఊచకోతను ఏదో ఒక విధంగా రాయకుండా ఊరుకోలేదు. విప్లవానికి ముందు రష్యన్ సమాజంలో రేగుతున్న అగ్గిని చూసిన రచయితలు దానిని ఏదో ఒక మేరకు రాజేయకుండా ఊరుకోలేదు. విప్లవం వచ్చాక అందులోని పొసగని విషయాలను చూసిన రచయితలు ఏదో ఒక మేరకు వెక్కిరించి పరాయి దేశాలకు పారిపోకుండా కూడా ఊరుకోలేదు. అందరూ రచయితలే. తమ స్థలకాలాలకు నిబద్ధులు. అమెరికాలో ఇద్దరు రచయిత్రులు వేరే వేరే సమయాల్లో పుట్టారు. ఒకామె హెరియత్ బీచర్ స్టవ్. 1811లో పుట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె చూసింది ఒకటే ఒకటి- నల్ల బానిసత్వం. ఆడవాళ్లు మగవాళ్లు పిల్లలు వృద్ధులు ఇళ్లలో పొలాల్లో పశువుల శాలల్లో... పశువుల కంటే ఘోరంగా... ప్రాణాలకు తెగించి పారిపోతే తప్ప వీళ్లకు మోక్షం లేదు. కాని యజమానులు ఆ దారి కూడా మూసేశారు.1850లో ‘ఫ్యుజిటివ్ స్లేవ్ లా’ తెచ్చారు. అంటే అమెరికాలో ఎక్కడికి పారిపోయినా పట్టుకున్నవాళ్లు తిరిగి యజమానికి అప్పగించాల్సిందే. వీళ్లను వాసన పట్టి వేటాడ్డానికి కుక్కలను కూడా ప్రవేశ పెట్టారు. ఎంత నీచం ఇది. ఇక ఆమె ఆగలేకపోయింది. ఉండబట్టలేని మనసుతో తీవ్రమైన ఆవేదనతో 1852లో నవల రాసింది. ్ఖఛ్ఛి ఖీౌఝ’ట ఇ్చఛజీ. బానిసత్వంపై తొలినవల. ప్రపంచానికి తెరిచిన కిటికీ. కొట్లాది కాపీలు అమ్ముడుపోయింది. బానిస సంస్కరణల కోసం సంకల్పించిన అబ్రహాం లింకన్‌కు స్ఫూర్తినిచ్చిందనే పేరు సంపాదించింది. అది దాని ఘనత. మరొక రచయిత్రి హార్పర్ లీ. 1926లో పుట్టింది. ఆమె కూడా ఊహ తెలిసినప్పటి నుంచి నల్లవాళ్లను చూసింది. ఇప్పుడు బానిసత్వం లేదు. కాని అడుగడుగునా వివక్ష. వర్ణ వివక్ష. రంగు మారితే మనిషి మారిపోవడం, పరిస్థితులు మారిపోవడం, అవకాశాలు మారిపోవడం. నిందలూ నేరారోపణలూ... ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉందా? ఆమెకు కోపం వచ్చింది. అందరికీ వాతలు పెడుతూ 1960లో నవల రాసింది. ఎన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోయాయంటే ఇప్పటికీ దీని రికార్డ్‌ను బ్రేక్ చేసే అమ్మకాలు ఏ నవలా సాధించలేదు. స్థలం ఒకటే. కాని కాలం మారింది. దానికి తగ్గట్టుగా స్పందన మారింది. తమ కాలంతో పాటు కలసి పాడాలని ఆ ఇద్దరు రచయిత్రులూ నిశ్చయించుకున్నారు. చిరాయువును పొందారు. స్థలకాలాలు అలా బ్లెస్ చేస్తాయి రచయితలని. అదిగో- అలా బ్లెస్ చేసిన ప్రతి సందర్భంలోనూ చేతులు ముడుచుకు కూచోక కలం పట్టుకుని కదను తొక్కడానికీ పాఠకుల గుండెలను తట్టి ఆ స్పందనలో సంతృప్తిని వెతుక్కోవడానికీ చాలామంది రాస్తుంటారు. రాసి నిలుస్తూ ఉంటారు. - ఖదీర్ -
ఓవర్‌కోట్ వేసిన దారి.....
కథలెందుకు రాస్తారు? ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ 170 ఏళ్ల క్రితమే ఓవర్‌కోట్ కథ రాసి రచయితలు ఎందుకు రాయాలో సమాజంలో దేనిని చూడాలో తెలియజేసి వెళ్లాడు.... పో మొదట గుర్తుకు రావాలి. తొలి నమస్కారం అతడికే. పిదప గొగోల్. ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టారు- మన తెలుగు కథ పుట్టడానికి సరిగ్గా వందేళ్ల ముందర. 1809లో. ఇద్దరూ ఒకేసారి కథలు రాశారు. కథ మొదలయ్యింది- అంటే ఇవాళ మనం చూస్తున్న వచన కథ మొదలయ్యింది అడ్గార్ ఆలెన్ పో తోనే అనంటారు. పో 1833లో MS.Found in a Bottleఅనే కథ రాసి లోకం దృష్టిలో పడ్డాడు. ఏమిటి వస్తువు? సముద్ర సాహసం. ఆ రోజుల్లో అదే కథావస్తువు అంటే. స్వప్నలోకానికి తీసుకెళ్లి దిగవిడిచే మాయాబెత్తం. అందుకే పో ఆ వస్తువు తీసుకున్నాడు. ఒక ఓడ. ఒక కథకుడు. ఓడ తుఫాన్లో చిక్కుకోవడం. ఎటో కొట్టుకు పోవడం. కథకుడు నానా అగచాట్లు పడి బతికి బట్టకట్టి దీవికి చేరుకోవడం వగైరా వగైరా. ఆ తర్వాత పో అలాంటివి చాలా రాసుకుంటూ పోయాడు. ఒక కొత్త మీడియం వంటబట్టాక దానిని ప్రచారం చేయడమే అతడికి ముఖ్యం తప్ప దానితో సాధించాల్సిన ప్రయోజనం తర్వాతి సంగతి. కాని గొగోల్ అలా కాదు. కథ రాయడం అంటూ తెలిశాక కథతో ఏం చెప్పాలి అనేది అతడు వెంటనే నిర్ణయించేసుకున్నాడు. కథ ఎందుకు పుట్టిందో కలం ఎందుకు పట్టాలో అతడికి తెలుసు. గొగోల్ 1842లో తన విశ్వవిఖ్యాత కథ The Overcoatరాశాడు. ఏం రాశాడు అందులో? ఒక గుమస్తా సుబ్బారావు. గుమస్తా బతుకు తప్ప వేరే ఏమీ తెలియదు. ఏం తింటాడు ఏం తాగుతాడు ఎలా బతుకుతాడు ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా అతడి పాత ఓవర్కోటే. చివికి ఛిద్రమై ఖననానికి సిద్ధంగా ఉన్న ఆ పాత ఓవర్కోటునే సుబ్బారావు ఏళ్ల తరబడి సెయింట్ పీటర్స్బర్గ్ చలి నుంచి కాపాడుకోవడానికి వాడుతూ ఉంటాడు. అందరికీ అతణ్ణి చూసినా ఆ పాత ఓవర్‌కోట్‌ను చూసినా హేళన. ఎగతాళి. నవ్వు. కాని సుబ్బారావు ఏం చేయగలడు? అవన్నీ పడటం తప్ప అంతకు మించి ఏం చేయగలడు? కాని సుబ్బారావుకీ అతడి పట్ల సానుభూతి ఉన్న ఒక టైలరుకీ ఉమ్మడిగా ఒకటే కల. సుబ్బారావు ఎప్పటికైనా ఒక కొత్త ఓవర్‌కోట్ వేసుకోవాలి. వేసుకొని దర్జాగా తిరగాలి. దానిని అందరూ చూడాలి. అంతే కోరిక. చిన్న కోరిక. కాని పైసలెక్కడివి? చాలీచాలని జీతాల భయంకర రోజులు. భయంకరమైన బతుకులు. సరే ఏవో పొదుపులూ బోనస్‌లూ కలిసి రావడం పైసలు జతపడటం జరిగి సుబ్బారావు- నాసీదేం కాదు- ఉన్నంతలో చాలా మంచి ఓవర్కోటు ఒకటి టైలరు ద్వారా కుట్టించుకుంటాడు. అది తొడిగిన రోజు సుబ్బారావు పేరు సుబ్బారావు కాదు. సంతోషం. ఆనందం. సంబరం. అ సంబరంలో అతడు వెర్రెక్కి పోయాడు. కిందా మీదా అయిపోయాడు. పరుగులు తీశాడు. ఆడపిల్లల వైపు ఏంవోయ్ అన్నట్టుగా ఎగాదిగా చూశాడు. వెన్ను నిటారుగా పెట్టి నడిచాడు. భలే. అంతవరకూ మృతజీవితం గడుపుతున్న సుబ్బారావుకు కొత్త ఓవర్కోటు కొత్తఊపిరి పోసింది. ఉనికినిచ్చింది. సమాజంలో సుబ్బారావు కూడా ఒక మనిషే కావాలంటే అతడికీ ఒక కొత్త ఓవర్‌కోట్ ఉంది చూడండి అంటూ చూపించింది. కాని- ఆ రాత్రి ఒకటి జరిగింది. ఇంటికెళుతున్న దారిలో భయంకరమైన మంచులో ఎవరో ఇద్దరు దుష్టులు సుబ్బారావును కొట్టి చితకబాది కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా అతని ఓవర్‌కోట్ లాక్కుని పోయారు. ఎంత దెబ్బ అది. మృత్యువు కంటే భయంకరమైన దెబ్బ. సుబ్బారావు సగమై పోయాడు. మిగిలిన సగంలో ప్రాణం పెట్టుకొని ఇలాంటివి జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అలాంటి ఒక అధికారి దగ్గరకు పోయాడు. కాని అధికారి ఇతణ్ణి మతించడానికి ఇతడేమైనా కలిగినవాడా? పలుకుబడి ఉన్నవాడా? గుమస్తా సుబ్బారావు. పోనీ పోయిందేమైనా మణులా మాణిక్యాలా? ఆఫ్టరాల్ ఒక ఓవర్కోటు. అధికారి ఛీ అన్నాడు. చీదరించుకున్నాడు. అవతలకి పో అన్నాడు. సుబ్బారావు ఆ అవమానానికి పూర్తిగా చచ్చాడు. నిజంగానే రాత్రికి రాత్రి జ్వరం వచ్చి, కలవరింతలు మొదలయ్యి, ఏడుస్తూ, అధికారిని శాపనార్థాలు పెడుతూ ప్రాణాలు విడిచాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో గగ్గోలు. సుబ్బారావు ప్రేతాత్మై తిరుగుతున్నాడట. ఎవరివిబడితే వాళ్లవి ఓవర్కోట్లు లాక్కుని పోతున్నాడట. పోలీసులకు ఇదంతా ఓ తలనొప్పయ్యింది. ప్రేతాత్మను ఎలా పట్టుకోవడం? మరికొన్నాళ్లకు ఏ అధికారి అయితే సుబ్బారావును చీదరించుకున్నాడో ఆ అధికారి ఓవర్‌కోట్‌ను కూడా సుబ్బారావు ప్రేతాత్మ దొంగిలించగలిగింది. అంతటితో దానికి శాంతి కలిగింది. ఆ తర్వాత మరి అది ఆ నగరంలో కనిపించలేదుగాని ఇంకెవరి ప్రేతాత్మో ఇలాంటి పనిలోకే దిగిందని చెప్తూ కథ ముగుస్తుంది. అంటే ఏమిటి? ఈ సమాజం ఉంటుంది. అది కొందరిని కనీస మర్యాదకు నోచుకోని స్థితిలో ఉంచుతుంది. ఆ కనీస మర్యాద పొందాలంటే ఏం చేయాలో చెప్పి ఆ మర్యాద పొందడానికి అవసరమైన జీవన స్థితిగతులు లేకుండా చేస్తుంది. ఇక అలాంటి వాళ్లంతా ఆ మర్యాదను, తాహతును, కనీస గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అందుకోవడానికి పెనుగులా డుతుంటారు. ఎదురు దెబ్బలు తింటుంటారు. కొద్దో గొప్పో సాధిస్తే ఆ సాధించినవి అంతకంటే అధముల చేత పోగొట్టుకొని వీధిన పడుతుంటారు. అధికారుల చేతుల్లో చెప్పుదెబ్బలు తిని, విసిగి, తుదకు తిరగబడి ప్రతీకారంగా దొంగదెబ్బలు తీస్తూ బతుకుతుంటారు. లేకుంటే అంతరించి పోతుంటారు. ఏం సాక్షాత్కారం ఇది! కథ చదివాక కలిగే సాక్షాత్కారం. ఒక శక్తివంతమైన మాధ్యమం చేతజిక్కితే ఒక శక్తిమంతమైన రచయిత ఏం చేయగలడో 170 ఏళ్ల క్రితమే చూపించిన కథ ఇది. రచయిత అనేవాడు ఎవరి వైపు, ఎందుకు, ఏం చేయడానికి నిలుచోవాలో ప్రకటన చేసిన కథ. అందుకే అంతటి దోస్తవ్ స్కీ కూడా గోర్కి గట్రా మేమందరం ఓవర్‌కోట్ నుంచి వచ్చినవాళ్లమే అన్నాడు. అదీ ఓవర్‌కోట్ పరంపర. మహా రచయితలకు మార్గం చూపిన ఘన పరంపర. ఇవాళ్టికీ నాది గొగోల్ పరంపర అనడంలో ఒక గర్వం ఉంటుందిగాని పో పరంపర అనడంలో మర్యాద లేదు. అందువల్లే, అలా అనిపించుకోవడం కోసమే- గొగోల్ దారిలో నడవడం కోసమే- గొగోల్ అందించిన టార్చ్‌ను అందుకోవడం కోసమే- గొగోల్ చూపించిన విధంగా పథించడం కోసమే చాలామంది కథలు రాస్తుంటారు. రాసి నిలుస్తూ ఉంటారు. - ఖదీర్ -
నీ ప్రేమలేఖ చూశా.. నే గాయపడిన చోట...
తెలుగు కవి, దళిత కవి దిగ్గజం పైడి తెరేష్‌బాబు మృతి కవిత్వానికే కాదు సామాజికమార్పు కోసం సాగే తెలుగు సాహితీపోరాటాలకు కూడా తీరనిలోటు. కవిత్వం, కథ, పాట, మాట... ఇలా బహుముఖాలుగా సాగిన తెరేష్ సృజన తెలుగు సాహిత్యాభిమానులకు ఆత్మీయమైనదనడంలో సందేహం అక్కర్లేదు. నీ ప్రేమలేఖ చూశా... నే గాయపడిన చోట... ఒక దీపకళిక చూశా... నే శలభమైన చోట... తెరేష్తో ఎవరు ఏ మెహఫిల్లో కూచున్నా ఈ పాట పాడించుకుంటారు. అతడికి ఉర్దూ అంటే ఇష్టమని, గజల్ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడని, తాను కూడా ఆ మృదువైన సంప్రదాయంలో రాశాడని, అంతకు మించి బాగా పాడతాడని అతడికి సన్నిహితులైన కొద్దిమందికే తెలుసు. తెరేష్ రెండు విధాలుగా రాశాడు. ఒకటి: ఈ లోకంలోని కశ్మలాన్ని, కలుషితాన్ని, పాదాలు ఊరువులు వక్షం శిరస్సులను గర్భస్థావరాలుగా చేసుకుని మనుషులు పుడతారన్న వ్యవస్థని, అందులోని మైలనీ, ఆ మైలకు కొందరిని శాశ్వతంగా బలి చేయాలనుకునే కుట్రని... అందువల్ల నేటికీ కొనసాగుతున్న చీకటిని... దానిని తగులబెట్టేందుకు అవసరమైన చండాలుని చేతి కొరివి వంటి కవిత్వాన్ని... దాన్ని రాశాడు. రెండు: దేశీయ సౌందర్యాన్ని, నల్ల సౌందర్యాన్ని, వాడ సౌందర్యాన్ని, ఆ వంటిళ్లలో ఉడికే తునకల కూర రుచిని, ఆ కచ్చేరీల నిప్పు సెగలో మెరిసే డప్పు వర్ణాన్ని, ఆ దరువుని, సద్దన్నంలో పంటి కింద వచ్చే పచ్చిమిరప చురుకుని, పైగుడ్డ లేకుండా పెరటి వేపచెట్టు కింద పవళించి నిండు సందమామను చూస్తూ మనసు విప్పి పాడుకునే పాటని... దానినీ రాశాడు. తెరేష్‌కు రెండు చేతులా? కవిత్వం రాశాడు. కథలు రాశాడు. పాటలు రాశాడు. నాటకాలు రాశాడు. సినిమాలకు రాశాడు. సీరియల్స్‌కు రాశాడు. ఇన్ని చేతుల మనిషి ఒక్క బలహీనతతో ఎలా పోరాడలేకపోయాడు? తెరేష్ చాలా మందికి కనిపించని గురువు. అశ్వాలను అదలాయించి రథాన్ని నడిపిన సారథి. మద్దూరి నగేశ్‌బాబు, తెరేష్ ఒకరి కాంతి మరొకరిపై ప్రసరింపజేసుకుంటూ దళిత కవిత్వం ఆవిర్భావ సమయంలో చేతులు చేతులు పట్టుకొని గబగబా పరిగెత్తుకుంటూ గుండె గుండెకూ చేరడం అందరూ ఆశ్చర్యంతో విభ్రమంతో చూళ్లేదూ? ఇవాళ్టి కవిత నాది... ఈ ఆదివారం నాది... అదిగో చూశావా ఆ వాత నాదే.... ఈ చర్నాకోల దెబ్బ నేను కొట్టిందే. సింహాలు తమ ఆత్మకథలు రాయడం మొదలుపెట్టిన క్షణాలు అవి. వేట చరిత్ర, వేటగాళ్ల చరిత్ర పునర్లిఖింపబడుతున్న సమయం. ఎండ్లూరి సుధాకర్, కత్తి పద్మారావు, శిఖామణి, మద్దెల శాంతయ్య, సతీశ్ చందర్... కొత్త చెప్పుల పరిమళం వంటి కొత్త కవితా పంక్తులను తీసుకొని వస్తుంటే తప్పుకోండి తప్పుకోండి అంటూ తెలుగు కవితా మార్గంలో స్థిరపడి ఉన్న వర్గాలన్నీ, వైనాలన్నీ, వర్ణాలన్నీ తప్పుకుని పంచములకు తల వంచడాన్ని చారిత్రక ఘట్టంగా గమనించలేదూ? తెరేష్ తొందరపడటం గబగబా రాసి నాలుగు పుస్తకాలు వేసుకొని అవార్డుల కోసం వెంపర్లాడటం ఎవరూ చూడలేదు. ప్రతి మధ్యాహ్నం నిద్ర లేచి ఒక్క కవితన్నా రాయాలి అనే లగ్జరీ అతడికి లేదు. కవిత రాయాలంటే లోన మండాలి. కడుపు కాలాలి. పేగు తెగిపడాలి. నెత్తురు ఉరకలెత్తాలి. నోటి గుండా శషభిషలు లేని మంచి తిట్టు ఒకటి బయటకి ఎగదన్నుకొని రావాలి. ఆ పైన కలం చేతినందుకుని నల్ల సిరాను ద్రావకంలా భగ్గున మండించాలి. తెరేష్ ‘హిందూ మహా సముద్రం’ పేరుతో కవితా సంపుటిని వెలువరించినప్పుడు ఆ శ్లేషకే- ఆ శ్లేష వల్ల ఆ మాటకు వచ్చిన కొత్త అర్థానికే చాలా మంది భయపడిపోయారు. చిన్న పోలికకే ఇంత భయం కలిగితే అందులోని పీడననీ ఆ పీడన తాలూకు పైశాచిక విశ్వరూపాన్ని అనుభవించినవాడు ఎలాంటి కవిత్వం రాస్తాడు? ‘అల్ప పీడనం’ పేరుతో తెరేష్ కవితా సంపుటి వెలువరించినప్పుడు ఇక సమయం వచ్చేసిందనీ ‘అల్పు’లంతా కలిసి తుఫానులా మారి ఈ వర్ణవ్యవస్థ వికృతత్వాన్ని ఎత్తి సముద్రంలో విసిరేయాలని అర్థం చేసుకొని తోడుగా ఎందరో కొత్త కవులు బాణాల్ని ఎక్కుపెట్టలేదూ? వ్యంగ్యం, శ్లేష అనాదిగా పైవర్ణాల ఖడ్గాలు. కాని తొలిరోజు నుంచే వాటిని అందుకొని వాటితోనే ఆ పైవర్ణాల మీద యుద్ధానికి దిగడం ఈ వెనుకబడ్డ ఒంగోలుజిల్లావాడికి కడజాతి వాడికి ఎలా వచ్చింది? తెరేష్‌కు దృశ్యమాధ్యమం బాగా తెలుసు. ఈటీవీలో ప్రసారమైన విధి, సంఘర్షణ రచయిత అతడే. ‘పైడిశ్రీ’ అతడి కలం పేరు. ఆ అనుభవంతోనే కేవలం ఒక్క కెమెరాను వెంటబెట్టుకొని ఒకరోజులో తాను చూసిన హైదరాబాద్ జీవనాన్ని ‘నేనూ నా వింతలమారి ప్రపంచమూ’ పేరుతో డాక్యుమెంట్ చేశాడు. ‘అమృతవాణి’లో పని చేసినప్పుడు వచ్చిన అనుభవంతో, ఆలిండియా రేడియోలో పని చేయడం వల్ల తేటదీరిన కంఠంతో కవిత్వాన్ని ఆడియో క్యాసెట్లుగా విడుదల చేసి మాట మాటనూ భాస్వరంలా మండించి అక్షరమ్ముక్క రాని దళితులకు వినిపిస్తే అది విని వాళ్లు కన్నీరు కారే కళ్లను చుట్టపొగ వెనుక దాచుకుంటే ధన్యుడనయ్యాను కదా అని పక్కకు వెళ్లి పొగిలి పొగిలి ఏడ్చినవాడు తెరేష్. ఇంత పేరు వచ్చినా ఇంత ఉగ్ర కవితాశక్తి కలిగినా తెరేష్ మెరమెచ్చులకు పోవడం ఎవరూ చూళ్లేదు. రాసిన పుస్తకాలను ప్రమోషన్ల కోసం తగు మనుషులకు అంకితాలు ఇవ్వడం కూడా చూళ్లేదు. లోకమంతా ఒకవైపు తానొక్కడే ఒకవైపు అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణమద్దతు తెలిపి ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టి ‘కావడి కుండలు’ కవితా సంకలనం తెచ్చి ప్రజాసమూహాల మాటా కవి మాటా వేరు వేరు కాదని చెప్పినవాడు తెరేష్. తెరేష్ జీవితంలో చాలా యుద్ధాలు చేశాడు. తన పుట్టక వల్ల చదువులో చాలా యుద్ధాలు చేశాడు. తన ప్రేమ కోసం మతాంతరపెళ్లి కోసం చాలా యుద్ధాలు చేశాడు. కవిగా తన పతాకాన్ని నిలబెట్టడానికి చాలా యుద్ధాలు చేశాడు. తన కెరీర్లో వివక్ష దరి చేరకుండా చాలా యుద్ధాలు చేశాడు. అన్నింటినీ గెలిచాడు. కాని అనారోగ్యాన్నీ ఆ అనారోగ్యానికి కారణమైన బలహీనతనీ జయించలేకపోయాడు. 50 ఏళ్ల వయసు కూడా లేని తెరేష్. తన సమూహంలో తనలాంటివాడు తయారవ్వాలంటే మరెంత కాలం పడుతుంది అని అలోచించలేకపోయాడా? తాను లేకపోవడం వల్ల తనవాళ్లకు ఎంత నష్టమో ఆలోచించలేకపోయాడా? ఒక మనిషి లేకపోవడం అంటే అతడి చదువు, జ్ఞానం, పోరాటం, సృజన, సుదీర్ఘమైన అనుభవం ఇవన్నీ లేకుండా పోవడమే కదా. తెరేష్... ఎంత పని చేశావు. నీ మరణాన్ని మాకు ప్రేమలేఖలా అందించి వెళ్లావా? నీ ప్రేమలేఖ చూశా... నే గాయపడిన చోట... - ఖదీర్