ఓవర్‌కోట్ వేసిన దారి..... | Overcoat to cast ..... | Sakshi
Sakshi News home page

ఓవర్‌కోట్ వేసిన దారి.....

Published Fri, Oct 10 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

ఓవర్‌కోట్ వేసిన దారి.....

ఓవర్‌కోట్ వేసిన దారి.....

కథలెందుకు రాస్తారు?
 
ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ 170 ఏళ్ల క్రితమే ఓవర్‌కోట్ కథ రాసి రచయితలు ఎందుకు రాయాలో సమాజంలో దేనిని చూడాలో తెలియజేసి వెళ్లాడు....
 
 పో మొదట గుర్తుకు రావాలి. తొలి నమస్కారం అతడికే. పిదప గొగోల్. ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టారు- మన తెలుగు కథ పుట్టడానికి సరిగ్గా వందేళ్ల ముందర. 1809లో. ఇద్దరూ ఒకేసారి కథలు రాశారు.
 కథ మొదలయ్యింది- అంటే ఇవాళ మనం చూస్తున్న వచన కథ మొదలయ్యింది అడ్గార్ ఆలెన్ పో తోనే అనంటారు.
 పో 1833లో MS.Found in a Bottleఅనే కథ రాసి లోకం దృష్టిలో పడ్డాడు.
 ఏమిటి వస్తువు?
 సముద్ర సాహసం. ఆ రోజుల్లో అదే కథావస్తువు అంటే. స్వప్నలోకానికి తీసుకెళ్లి దిగవిడిచే మాయాబెత్తం. అందుకే పో ఆ వస్తువు తీసుకున్నాడు. ఒక ఓడ. ఒక కథకుడు. ఓడ తుఫాన్‌లో చిక్కుకోవడం. ఎటో కొట్టుకు పోవడం. కథకుడు నానా అగచాట్లు పడి బతికి బట్టకట్టి దీవికి చేరుకోవడం వగైరా వగైరా. ఆ తర్వాత పో అలాంటివి చాలా రాసుకుంటూ పోయాడు. ఒక కొత్త మీడియం వంటబట్టాక దానిని ప్రచారం చేయడమే అతడికి ముఖ్యం తప్ప దానితో సాధించాల్సిన ప్రయోజనం తర్వాతి సంగతి.
 కాని గొగోల్ అలా కాదు.
 కథ రాయడం అంటూ తెలిశాక కథతో ఏం చెప్పాలి అనేది అతడు వెంటనే నిర్ణయించేసుకున్నాడు.
 కథ ఎందుకు పుట్టిందో కలం ఎందుకు పట్టాలో అతడికి తెలుసు.
 గొగోల్ 1842లో తన విశ్వవిఖ్యాత కథ The Overcoatరాశాడు.
 ఏం రాశాడు అందులో?
 ఒక గుమస్తా సుబ్బారావు. గుమస్తా బతుకు తప్ప వేరే ఏమీ తెలియదు. ఏం తింటాడు  ఏం తాగుతాడు ఎలా బతుకుతాడు ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా అతడి పాత ఓవర్‌కోటే. చివికి ఛిద్రమై ఖననానికి సిద్ధంగా ఉన్న ఆ పాత ఓవర్‌కోటునే  సుబ్బారావు ఏళ్ల తరబడి సెయింట్ పీటర్స్‌బర్గ్ చలి నుంచి కాపాడుకోవడానికి వాడుతూ ఉంటాడు. అందరికీ అతణ్ణి చూసినా ఆ పాత ఓవర్‌కోట్‌ను చూసినా హేళన. ఎగతాళి. నవ్వు. కాని సుబ్బారావు ఏం చేయగలడు? అవన్నీ పడటం తప్ప అంతకు మించి ఏం చేయగలడు? కాని సుబ్బారావుకీ అతడి పట్ల సానుభూతి ఉన్న ఒక టైలరుకీ ఉమ్మడిగా ఒకటే కల. సుబ్బారావు ఎప్పటికైనా ఒక కొత్త ఓవర్‌కోట్ వేసుకోవాలి. వేసుకొని దర్జాగా తిరగాలి. దానిని అందరూ చూడాలి. అంతే కోరిక. చిన్న కోరిక. కాని పైసలెక్కడివి? చాలీచాలని జీతాల భయంకర రోజులు. భయంకరమైన బతుకులు. సరే ఏవో పొదుపులూ బోనస్‌లూ కలిసి రావడం పైసలు జతపడటం జరిగి సుబ్బారావు- నాసీదేం కాదు- ఉన్నంతలో చాలా మంచి ఓవర్‌కోటు ఒకటి టైలరు ద్వారా కుట్టించుకుంటాడు. అది తొడిగిన రోజు సుబ్బారావు పేరు సుబ్బారావు కాదు. సంతోషం. ఆనందం. సంబరం. అ సంబరంలో అతడు వెర్రెక్కి పోయాడు. కిందా మీదా అయిపోయాడు. పరుగులు తీశాడు. ఆడపిల్లల వైపు ఏంవోయ్ అన్నట్టుగా ఎగాదిగా చూశాడు. వెన్ను నిటారుగా పెట్టి నడిచాడు. భలే. అంతవరకూ మృతజీవితం గడుపుతున్న సుబ్బారావుకు కొత్త ఓవర్‌కోటు కొత్తఊపిరి పోసింది. ఉనికినిచ్చింది. సమాజంలో సుబ్బారావు కూడా ఒక మనిషే కావాలంటే అతడికీ ఒక కొత్త ఓవర్‌కోట్ ఉంది చూడండి అంటూ చూపించింది. కాని- ఆ రాత్రి ఒకటి జరిగింది. ఇంటికెళుతున్న దారిలో భయంకరమైన మంచులో ఎవరో ఇద్దరు దుష్టులు సుబ్బారావును కొట్టి చితకబాది కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా అతని ఓవర్‌కోట్ లాక్కుని పోయారు. ఎంత దెబ్బ అది.  మృత్యువు కంటే భయంకరమైన దెబ్బ. సుబ్బారావు సగమై పోయాడు. మిగిలిన సగంలో ప్రాణం పెట్టుకొని ఇలాంటివి జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అలాంటి ఒక అధికారి దగ్గరకు పోయాడు. కాని అధికారి ఇతణ్ణి మతించడానికి ఇతడేమైనా కలిగినవాడా? పలుకుబడి ఉన్నవాడా? గుమస్తా సుబ్బారావు. పోనీ పోయిందేమైనా మణులా మాణిక్యాలా? ఆఫ్టరాల్ ఒక ఓవర్‌కోటు. అధికారి ఛీ అన్నాడు. చీదరించుకున్నాడు. అవతలకి పో అన్నాడు.  సుబ్బారావు ఆ అవమానానికి పూర్తిగా చచ్చాడు. నిజంగానే రాత్రికి రాత్రి జ్వరం వచ్చి, కలవరింతలు మొదలయ్యి, ఏడుస్తూ, అధికారిని శాపనార్థాలు పెడుతూ ప్రాణాలు విడిచాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో గగ్గోలు. సుబ్బారావు ప్రేతాత్మై తిరుగుతున్నాడట. ఎవరివిబడితే వాళ్లవి ఓవర్‌కోట్లు లాక్కుని పోతున్నాడట. పోలీసులకు ఇదంతా ఓ తలనొప్పయ్యింది. ప్రేతాత్మను ఎలా పట్టుకోవడం? మరికొన్నాళ్లకు ఏ అధికారి అయితే సుబ్బారావును చీదరించుకున్నాడో ఆ అధికారి ఓవర్‌కోట్‌ను కూడా సుబ్బారావు ప్రేతాత్మ దొంగిలించగలిగింది. అంతటితో దానికి శాంతి కలిగింది. ఆ తర్వాత మరి అది ఆ నగరంలో కనిపించలేదుగాని ఇంకెవరి ప్రేతాత్మో ఇలాంటి పనిలోకే దిగిందని చెప్తూ కథ ముగుస్తుంది.
 అంటే ఏమిటి?
 ఈ సమాజం ఉంటుంది. అది కొందరిని కనీస మర్యాదకు  నోచుకోని స్థితిలో ఉంచుతుంది. ఆ కనీస మర్యాద పొందాలంటే ఏం చేయాలో చెప్పి ఆ మర్యాద పొందడానికి అవసరమైన జీవన స్థితిగతులు లేకుండా చేస్తుంది. ఇక అలాంటి వాళ్లంతా ఆ మర్యాదను, తాహతును, కనీస గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అందుకోవడానికి పెనుగులా
 డుతుంటారు.  ఎదురు దెబ్బలు తింటుంటారు. కొద్దో గొప్పో సాధిస్తే ఆ సాధించినవి అంతకంటే అధముల చేత పోగొట్టుకొని వీధిన పడుతుంటారు. అధికారుల చేతుల్లో చెప్పుదెబ్బలు తిని, విసిగి, తుదకు  తిరగబడి ప్రతీకారంగా దొంగదెబ్బలు తీస్తూ బతుకుతుంటారు. లేకుంటే అంతరించి పోతుంటారు.
 ఏం సాక్షాత్కారం ఇది!
 కథ చదివాక కలిగే సాక్షాత్కారం.
 ఒక శక్తివంతమైన మాధ్యమం చేతజిక్కితే ఒక శక్తిమంతమైన రచయిత ఏం చేయగలడో 170 ఏళ్ల క్రితమే చూపించిన కథ ఇది. రచయిత అనేవాడు ఎవరి వైపు, ఎందుకు, ఏం చేయడానికి నిలుచోవాలో ప్రకటన చేసిన కథ. అందుకే అంతటి దోస్తవ్ స్కీ కూడా గోర్కి గట్రా మేమందరం ఓవర్‌కోట్ నుంచి వచ్చినవాళ్లమే అన్నాడు. అదీ ఓవర్‌కోట్ పరంపర. మహా రచయితలకు మార్గం చూపిన ఘన పరంపర. ఇవాళ్టికీ నాది గొగోల్ పరంపర అనడంలో ఒక గర్వం ఉంటుందిగాని పో పరంపర అనడంలో మర్యాద లేదు.
 అందువల్లే, అలా అనిపించుకోవడం కోసమే-
  గొగోల్ దారిలో నడవడం కోసమే-
 గొగోల్ అందించిన టార్చ్‌ను అందుకోవడం కోసమే-
 గొగోల్ చూపించిన విధంగా పథించడం కోసమే చాలామంది కథలు రాస్తుంటారు. రాసి నిలుస్తూ ఉంటారు.
 
- ఖదీర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement