స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి | The space will bless periods | Sakshi
Sakshi News home page

స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి

Published Fri, Nov 7 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి

స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి

కథలెందుకు రాస్తారు?
 
సాధారణంగా ఒక రచయిత రచనలను అంచనా కట్టాలంటే వాటిని ఆ రచయిత జీవించిన స్థలకాలాల్లో నిలబెట్టి అంచనా కట్టమంటారు. అంటే అతడు తన కాలానికి చెందిన ప్రజలని వ్యక్తం చేశాడా? తన స్థలం సాధకబాధకాలను రిప్రజెంట్ చేశాడా?  చూడమంటారు. అవి రాయనివాడు ఏం రాసినా అనవసరమే. గురజాడ ఏ రచన చూసినా ఆయన ఏ కాలంలో ఏ ప్రజల్ని చెబుతున్నాడో తెలిసిపోతుంది. శ్రీపాద కథలు తన స్థలకాలాలకు నిలువుటద్దాలు కదా. సాధారణంగా ప్రతి మంచి రచయిత ఏం చేస్తాడంటే తన ప్రతి రచనలోనూ తన స్థలకాలాల ఆనవాలును వదిలే తీరతాడు. అతడు గతంలోకి వెళ్లొచ్చు. భవిష్యత్తులోకి కూడా వెళ్లొచ్చు. కాని ఏ వర్తమానంలో నిలుచుని ఉన్నాడో చెప్పే తీరతాడు.

రెండో ప్రపంచయుద్ధాన్ని చూసిన రచయితలు ఆ యుద్ధాన్ని ఎక్కడో ఒక చోట రాయకుండా వదల్లేదు. యూదుల ఊచకోతను చూసిన రచయితలు ఆ ఊచకోతను ఏదో ఒక విధంగా రాయకుండా ఊరుకోలేదు. విప్లవానికి ముందు రష్యన్ సమాజంలో రేగుతున్న అగ్గిని చూసిన రచయితలు దానిని ఏదో ఒక మేరకు రాజేయకుండా ఊరుకోలేదు. విప్లవం వచ్చాక అందులోని పొసగని విషయాలను చూసిన రచయితలు ఏదో ఒక మేరకు వెక్కిరించి పరాయి దేశాలకు పారిపోకుండా కూడా ఊరుకోలేదు.


 అందరూ రచయితలే.  తమ స్థలకాలాలకు నిబద్ధులు.

అమెరికాలో ఇద్దరు రచయిత్రులు వేరే వేరే సమయాల్లో పుట్టారు. ఒకామె హెరియత్ బీచర్ స్టవ్. 1811లో పుట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె చూసింది ఒకటే ఒకటి- నల్ల బానిసత్వం. ఆడవాళ్లు మగవాళ్లు పిల్లలు వృద్ధులు ఇళ్లలో పొలాల్లో పశువుల శాలల్లో... పశువుల కంటే ఘోరంగా... ప్రాణాలకు తెగించి పారిపోతే తప్ప వీళ్లకు మోక్షం లేదు. కాని యజమానులు ఆ దారి కూడా మూసేశారు.1850లో ‘ఫ్యుజిటివ్ స్లేవ్ లా’ తెచ్చారు. అంటే అమెరికాలో ఎక్కడికి పారిపోయినా పట్టుకున్నవాళ్లు తిరిగి యజమానికి అప్పగించాల్సిందే. వీళ్లను వాసన పట్టి వేటాడ్డానికి కుక్కలను కూడా ప్రవేశ పెట్టారు. ఎంత నీచం ఇది. ఇక ఆమె ఆగలేకపోయింది. ఉండబట్టలేని మనసుతో తీవ్రమైన ఆవేదనతో 1852లో నవల రాసింది. ్ఖఛ్ఛి ఖీౌఝ’ట ఇ్చఛజీ. బానిసత్వంపై తొలినవల. ప్రపంచానికి తెరిచిన కిటికీ. కొట్లాది కాపీలు అమ్ముడుపోయింది. బానిస సంస్కరణల కోసం సంకల్పించిన అబ్రహాం లింకన్‌కు స్ఫూర్తినిచ్చిందనే పేరు సంపాదించింది. అది దాని ఘనత.

మరొక రచయిత్రి హార్పర్ లీ. 1926లో పుట్టింది. ఆమె కూడా ఊహ తెలిసినప్పటి నుంచి నల్లవాళ్లను చూసింది. ఇప్పుడు బానిసత్వం లేదు. కాని అడుగడుగునా వివక్ష. వర్ణ వివక్ష. రంగు మారితే మనిషి మారిపోవడం, పరిస్థితులు మారిపోవడం, అవకాశాలు మారిపోవడం. నిందలూ నేరారోపణలూ... ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉందా? ఆమెకు కోపం వచ్చింది. అందరికీ వాతలు పెడుతూ 1960లో నవల రాసింది. ఎన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోయాయంటే ఇప్పటికీ దీని రికార్డ్‌ను బ్రేక్ చేసే అమ్మకాలు ఏ నవలా సాధించలేదు.

 స్థలం ఒకటే. కాని కాలం మారింది. దానికి తగ్గట్టుగా స్పందన మారింది. తమ కాలంతో పాటు కలసి పాడాలని ఆ ఇద్దరు రచయిత్రులూ నిశ్చయించుకున్నారు. చిరాయువును పొందారు.  స్థలకాలాలు అలా బ్లెస్ చేస్తాయి రచయితలని. అదిగో- అలా బ్లెస్ చేసిన ప్రతి సందర్భంలోనూ చేతులు ముడుచుకు కూచోక కలం పట్టుకుని కదను తొక్కడానికీ పాఠకుల గుండెలను తట్టి ఆ స్పందనలో సంతృప్తిని వెతుక్కోవడానికీ చాలామంది రాస్తుంటారు. రాసి నిలుస్తూ ఉంటారు.      
       
- ఖదీర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement