ముఖం ఉన్న నటుడు | Veteran actor Om Puri passes away, Bollywood mourns his demise | Sakshi
Sakshi News home page

ముఖం ఉన్న నటుడు

Published Sat, Jan 7 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

ముఖం ఉన్న నటుడు

ముఖం ఉన్న నటుడు

ప్రఖ్యాత దూరదర్శన్‌ టెలివిజన్‌ ఫిల్మ్‌ ‘తమస్‌’ ఓంపురితోనే ప్రారంభం అవుతుంది. పందులు మేపుకునే ఓంపురిని ఒక బ్రిటిష్‌వాడు పందిని చంపి ఇవ్వమంటాడు. కారణం తెలియని ఓంపురి చంపి ఇస్తాడు. మరుసటి రోజు దాని కళేబరం మసీదు ముందు ప్రత్యక్షమవుతుంది. ఇది హిందువులు చేసిన పనే అని ముస్లిమ్‌లు భావిస్తారు. కలహాలు మొదలవుతాయి. తప్పు ఎక్కడ మొదలైందో తెలిసిన ఓంపురి నలిగిపోతాడు. ఆ కలహాల్లో గర్భిణి అయిన తన భార్యతో అతడు పడే కష్టాలు ఎవరూ మర్చిపోరు. ‘బాబీ’ సినిమా (1973) వచ్చిన రోజు ల్లోనే ఓంపురి కూడా ముంబైలో అవకాశాల కోసం వెతుకు తున్నాడని గుర్తు చేసుకోవడం మనకు ముఖ్యం.

అందమైన ముఖాలు, రిషి కపూర్‌ వంటి చాక్లెట్‌బాయ్‌లు చెల్లుబాటు అవుతున్న రోజుల్లో ముఖం నిండా స్ఫోటకపు మచ్చలున్న ఒక నటుడు అవకాశాల కోసం వెతకడం చాలా విడ్డూరం– వింత– హాస్యాస్పదమైన విషయం. కానీ ఓంపురి నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (న్యూఢిల్లీ) స్టూడెంట్‌. నేషనల్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పూనా)లో నటనను అభ్యసించిన విద్యార్థి. ముక్కు పెద్దగా ఉందని, పళ్లు వంకరగా ఉన్నాయని, నడుము లావుగా ఉందని ప్రపంచ సినిమాలో నటులు కాకుండా పోయిన వాళ్లు లేరు. వాళ్లు ఎలా ఉన్నారో అలానే గొప్ప నటులయ్యారు. ఓంపురి కూడా తాను ఎలా ఉన్నానో అలానే నటుడుగా రాణించగలనని నమ్మాడు. అదే ముఖంతో రాణించాడు.

యాక్టింగ్‌ స్కూళ్లలో తన సహధ్యాయి అయిన నసీరుద్దీన్‌ షా, సినిమాల్లోకి వచ్చాక పరిచయమైన షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, అమ్రిష్‌ పురి, దీప్తీ నావల్, దీపా సాహి వంటి పారలల్‌ తారాగణంతో కమర్షియల్‌ సినిమాలను ఒరుసుకుంటూ ఒక పెద్ద సమాంతర ఆవరణం ఏర్పడటానికి కారణమైనవారిలో ఓంపురి చాలా కీలకమైన పాత్ర పోషించాడు. టేక్‌లోకి వెళ్లే ముందు జుట్టు సరి చేసుకునే హీరోలు ఉన్న రోజుల్లో పాత్రను చేసే ముందు హోంవర్క్‌ ముఖ్యమని చూపించిన నటుల్లో ఓంపురి ఉంటాడు. అంతవరకూ ‘ఫిల్మీ’గా ఉండే పోలీస్‌ ఆఫీసర్లను చూసిన ప్రేక్షకులకు ఓంపురి ‘అర్ధ్‌ సత్య’లో నిజమైన పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా ఉంటాడో చూపించాడు. అందుకోసం ముంబై పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. ఆఫీసర్లను పరిశీలించాడు. ఆ పరిశీలనతో రాణించాడు. ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’ సినిమాలో రిక్షావాడిగా నటించడానికి పదిహేను రోజుల పాటు కలకత్తాలో రిక్షా నడిపిన నటుడు ఓంపురియే.

కాని అతడి బాల్యం, యౌవనం, వైవాహిక జీవితం కూడా అంత సుఖంగా సాగలేదు. తల్లికి బాల్యంలోనే మతిస్థిమితం తప్పింది. తండ్రి పట్టించుకోలేదు. ఆరేళ్ల వయసులో టీ అంగళ్లలో కప్పులు కడిగాడు. ధాబాలలో పని చేశాడు. రాత్రి పదింటికి కూడా పని చేయమంటే చిన్న పిల్లాడు కనుక నిద్ర వచ్చి ఆ పని పోగొట్టుకున్నాడు. దగ్గరి బంధువు కొన్నాళ్లు అన్నం పెట్టి ఆ తర్వాత వెళ్లగొట్టాడు. ముంబైకి చేరుకున్నాక కూడా చాలారోజులు సంఘర్షణ చేయాల్సి వచ్చింది. అయితే ఇవేవీ నటుడు కావాలనే అతడి తపనను చల్లార్చలేకపోయాయి. నటుడు కావాలనుకున్నాడు. అయ్యాడు.

నసీరుద్దీన్‌ షా, ఫరూక్‌ షేక్, అమోల్‌ పాలేకర్‌... వీరంతా పారలల్‌ సినిమాలకు హీరోలుగా నిలదొక్కుకున్నారు. కాని ఓంపురి అతి త్వరగా కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చింది. పాత్రే అతని ఉనికి. పాత్రే అతని ఆహారం. శ్యాం బెనగళ్, గోవింద్‌ నిహలానీ,  కేతన్‌ మెహతా, సయీద్‌ మిర్జా.. ఇలాంటి దర్శకులంతా ఓంపురికి ఆకలి తీర్చే పాత్రలు ఇచ్చి తమ సినిమాలను శక్తిమంతం చేసుకున్నారు. సత్యజిత్‌ రే వంటి దర్శకుడు ప్రేమ్‌చంద్‌ రాసిన ‘సద్గతి’ కథను దూరదర్శన్‌కు తీస్తూ దళితుడి పాత్రను ఓంపురికి ఇచ్చాడు. కూతురి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని పురోహితుడి ఇంటికి వెళితే అతడు నానా పనులు చెప్పి కట్టెలు కొట్టమంటాడు.

అసలే జ్వరంతో ఉన్న ఓంపురి కట్టెలు కొట్టీ కొట్టీ ప్రాణం లేని కట్టెపేడుగా మారే సన్నివేశానికి దుఃఖం ముంచుకొస్తుంది. హిందీ సినిమాలలో దళితుడంటే ఓంపురియే. తెలుగులో ఆ మర్యాద చాలాకాలం తర్వాత పి.ఎల్‌. నారాయణకు దక్కింది. తెలుగులో సి.ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘అంకురం’ సినిమాలో ఓంపురి పోషించిన నక్సలైట్‌ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా వేసే ముద్ర పెద్దది.

గొప్ప నటులంతా సీరియస్‌ పాత్రలను ఎంత బాగా చేయగలరో హాస్యాన్ని కూడా అంతే బాగా చేస్తారు. ‘ఆక్రోశ్‌’లో సీరియస్‌గా చేసిన ఓంపురియే ‘జానే భిదో యారో’లో నవ్వులు పూయించడం చాలామంది గమనించారు. కమల్‌హాసన్‌ ‘భామనే సత్యభామనే’ హిందీలో ‘చాచీ 420’గా తీసినప్పుడు దొంగ మేనేజర్‌గా ఓంపురి నవ్వులు చిందిస్తాడు. ఓంపురి కెరీర్‌లోని చివరి దశ అంతా ఈ కామిక్‌ టైమింగ్‌ మీదే ఆధారపడింది. ముఖ్యంగా దర్శకుడు ప్రియదర్శన్‌ ఓంపురి చేత లెక్కలేననన్ని కామెడీ వేషాలు వేయించాడు.

ఓంపురికి సంబంధించి మనకు ఇటీవలి జ్ఞాపకం ‘బజరంగి భాయ్‌ జాన్‌’లో ఆయన వేసిన పాకిస్తానీ మౌల్వీసాబ్‌ వేషం. దారి తప్పిన పసిపిల్లను తీసుకుని సల్మాన్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ వస్తే మౌల్వీ అయిన ఓంపురి ఆశ్రయం ఇస్తాడు. ఎటువైపు వెళ్లాలో దారి చూపించి ‘ఈ పిల్ల కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తాను. ఖుదా హఫీస్‌’ అంటాడు. ఆంజనేయస్వామి భక్తుడైన సల్మాన్‌ ‘ఖుదా హఫీస్‌’ అనడానికి సంశయిస్తే ‘మీరేం అంటారు?’ అని అడుగుతాడు. ‘జైశ్రీరాం’ అని సల్మాన్‌ అనగానే ‘జైశ్రీరాం’ అని మౌల్వీ కూడా అంటాడు. హృద్యమైన సీన్‌ అది.

ఓంపురికి మన రాజకీయ నాయకుల మీద గౌరవం లేదు. వాళ్లను ‘అన్‌పడ్‌’ (వేలిముద్రగాళ్లు) అని తిట్టి ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఓంపురి జీవితం మీద అతడి భార్య నందితా పురి రాసిన జీవితకథ వివాదాస్పదం అయ్యింది. అందులో ఆమె అత్యుత్సాహం కొద్దీ అతడి లైంగిక సంబంధాలు ప్రస్తావించడంతో ఓంపురి మనసు కష్టపెట్టుకున్నాడు. ఈ గొడవ వారిద్దరి విడాకులకు దారి తీసింది. ‘బీహార్‌ రోడ్లు ఓంపురి చెంపల్లా గరుకుగా ఉన్నాయి. వీటిని త్వరలో హేమమాలిని బుగ్గల్లా నునుపుగా చేస్తాను’ అని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనడం ఓంపురి విలోమ ప్రాచుర్యానికి ఒక నమూనా.

ఓంపురికి చాలా అవార్డులు వచ్చాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ అంపైర్‌’తో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అవన్నీ అదనపు అలంకారాలే. అతడి అసలు అలంకారం సినిమాలో చేసే పాత్ర. దానిని నిర్వహించే తీరు. ఇన్నాళ్లూ... ఓంపురి ఉన్నాడన్న ధైర్యం ఉండేది. అతడి పోకడతో అది సగం అయ్యింది. నటనతో నిండిన అతడి గరుకు ముఖాన్ని ఇప్పుడప్పట్లో మనం మర్చిపోలేము. – ఖదీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement