ఓంపురి ఆకస్మిక మృతి
► గుండెపోటుతో కన్నుమూసిన విలక్షణ నటుడు
► బాలీవుడ్, రాజకీయ నేతల సంతాపం
ముంబై/సాక్షి, హైదరాబాద్: నటనకు కొత్త భాష్యం పలికిన విలక్షణ నటుడు, సమాంతర చిత్రాల దిగ్గజం ఓంపురి(66) ఇకలేరు. ముంబైలో స్వగృహంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందారు. ఓం పురి వంటగదిలో నేలపై విగతజీవిలా కనిపించారని ఆయన మాజీ భార్య నందిత చెప్పారు. ఓం పురి, నందితలకు ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఓంపురి భౌతికకాయాన్ని అమితాబ్ బచ్చన్, షబానా అజ్మీ, శేఖర్ కపూర్ తదితర సినీ ప్రముఖులు సందర్శించి, నివాళి అర్పించారు. అంత్యక్రియలను ఓషివారా శ్మశాన వాటికలో కుమారుడు పూర్తి చేశాడు.
అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. ఓం పురి మృతిపై బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. షారుక్ ఖాన్, శ్యాం బెనగళ్, మీరా నాయర్, ప్రియాంకా చోప్రా తదితరులు ఆయనతో తమ సినీ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా సంతాపం తెలిపారు. భారత సినీ పరిశ్రమ గొప్ప నటుణ్ని కోల్పోయిందని ప్రణబ్ అన్నారు. ‘సామాజిక చైతన్యం ఉన్న నటుడిని కోల్పోయాం’ అని సోనియా పేర్కొన్నారు. ఓం పురి వర్ధమాన నటులకు ఆదర్శమని, సినీపరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
సహజ నటుడు..: బాలీవుడ్ హీరో అంటే ‘అందంగా ఉండాల’నే భావనను ఓం పురి బద్దలు కొట్టాడు. పాత్రల స్వభావాలను అత్యం త సహజంగా ప్రదర్శించడం ఆయనకు కొట్టినపిండి. ‘అర్ధ్ సత్య,’ ‘ఆక్రోశ్’, ‘మిర్చ్ మసాలా’, ‘సద్గతి’, ‘దిశ’, ‘భూమిక’ వంటి మరెన్నో చిత్రాలు ఆయన నటనా పటిమకు అద్దం పడతా యి. బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ.. ‘గాంధీ’, ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘ఊల్ఫ్’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’ వంటి చిత్రాలతో మెప్పించారు. తెలుగు చిత్రం ‘అంకురం’లోనూ కనిపించారు. పలు మలయాళీ సినిమాల్లోనూ నటించిన ఆయనకు కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ‘విజేత’, ‘ద్రోహ్ కాల్’, ‘చాచీ 420’, ‘దేవ్’, ‘ఘాయల్’ వంటి ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ సత్తా చాటారు.
హరియాణాలోని అంబాలాలో జన్మించిన ఓం పురి పుణేలోని ప్రఖ్యాత ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో పాఠాలు నేర్చుకున్నారు. మరో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఆయనకు సహధ్యాయి. 1976లో ‘ఘాసీరామ్ కొత్వాల్’ మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఓం పురి 300కుపైగా చిత్రాల్లో నటించారు. జాతీయ ఉత్తమ నటుడు, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గానూ పనిచేశారు. బ్రిటిష్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆయనను ‘హానరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారంతో సత్కరించింది.
నందిత ‘ఓం పురి: అన్ లైక్లీ హీరో’(2009) పేరుతో ఆయన జీవిత చరిత్రను రాశారు. ‘నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయాక నటుడిగా తను చేసిన కృషిని ప్రపంచం గుర్తిస్తుంది. యువతరం.. ముఖ్యంగా సినీ విద్యార్థులు నా చిత్రాలను చూస్తారు’ అని ఒంపురి గత డిసెంబర్‌లో ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. అనుకున్నదాన్ని నిర్భయంగా చెప్పే ఓం పురి.. గోవధపై నిషేధానికి వ్యతిరేకంగా, నక్సల్స్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.