తిరుపతి జిల్లాలో ఘటన
సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది.
సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది.
వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్‌ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment