అతడు ఏలూరెళ్లాలి.... | as some of the fancy titles. | Sakshi
Sakshi News home page

అతడు ఏలూరెళ్లాలి....

Published Sat, Jan 3 2015 12:02 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

అతడు ఏలూరెళ్లాలి.... - Sakshi

అతడు ఏలూరెళ్లాలి....

కథల నామకరణం - 3
 
సినిమాల్లో కూడా షావుకారు, మిస్సమ్మ పేర్లకే అలవాటు పడ్డారుగాని ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు.
 
చాలాసార్లు- బుద్ధి ఊరికే ఉండదు కదా- కొన్ని టైటిల్స్ ఫ్యాన్సీగా తడతాయి. వాటికి కథ రాయాలనిపిస్తుంది. ఆ రంధిలో దిగకపోవడమే మంచిది. ఇంటర్‌లో కథలు మొదలెట్టాక ‘సెంటర్లో శిలావిగ్రహం’ అనే టైటిల్ మీద కథ రాయాలని గట్టిగా అనుకున్నాను. అంటే ఏంటో తెలీదు. కనుక ఎప్పటికీ రాయలేదు. దావత్, జమీన్ కథలు రాశాక - మ్యూజిక్ అంటే కొంత ఆసక్తి గనక, మద్రాసులో రికార్డింగ్స్ అవీ చూసి ఉన్నాను గనక ‘కోరస్’ అనే టైటిల్ మీద కథ రాయాలని మనసు పీకింది. ‘కోరస్’ అనేది కచ్చితంగా కథకు పనికొచ్చే పేరే. కాని అందుకు తగ్గ కథేమీ నా లోపల లేకపోవడంతో రాయలేదు. ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’కు ముందు దర్శకుడు వంశీని కలుస్తూ ఉన్నప్పుడు దీని గురించి చెప్తే ఆయనకు  సంగీతం చాలా  ఇష్టం కనుక నేను రాస్తాను అని ఎంతో ఉత్సాహంగా ‘కోరస్’ పేరుతో కథ రాశారు. కాని చూపించకుండానే చింపేశారు. అంటే దానికి తగ్గ సమాచారం, అంత తీవ్రంగా స్పందించాల్సిన నిజాయితీ, అందుకు అవసరమైన సంకల్పం లేవని ఆయనకే అర్థమయ్యింది. కథ బాగ రాలేదు. కనుక కొన్ని పేర్లు పుట్టి గిట్టడమే మంచిది.

ముందు నుంచీ మనకు కావ్యాలకుగానీ, కథలకుగానీ, సినిమాలకుగానీ ఒకటి రెండు పదాల్లో తేలే పేర్లే తప్ప పొడవు పేర్లు మరీ కవితాత్మకంగా ఉండే దీర్ఘమైన పేర్లు పెట్టే ఆనవాయితీ లేదు. ‘త్వమేవాహం’, ‘మహా ప్రస్థానం’, ‘ఋతు సంహారం’, ‘శేషజ్యోత్స్న’, ‘కృష్ణపక్షము’... ఇవే అలవాటు చేశారు. ‘అమృతం కురిసిన రాత్రి’ తక్కువ.  కనుక నవ్యత కోసం ప్రయత్నించిన (అలా ప్రయత్నించడం మంచిదే అయినా) చాలా కవిత్వం పుస్తకాల పేర్లు మనకు గుర్తుండకుండా పోయాయి. ‘ఆమె స్పర్శ సోకినంత మేరా’.... అని ఒక కవితా సంపుటికి పేరు పెడితే ఒక క్షణం బాగుందే అనిపించవచ్చు కాని గుర్తు పెట్టుకోము. సులువుగా మననం చేసుకొని ఇతరులకు చెప్పలేము. ‘అలా అయితే పూలు ప్రవాసం వెళ్లాల్సిందే’ పేరు ఎంత బాగున్నా పాఠకులు ఇదొక పుస్తకానికి  ఇష్టపడి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పేరు అని అనుకోరు. సినిమాల్లో కూడా ‘షావుకారు’, ‘మిస్సమ్మ’ పేర్లకే అలవాటు పడ్డారుగాని ‘ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ’ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. ఎన్టీఆర్ ఎంత పట్టుదలగా ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ అని పెట్టినా ఊళ్లలో అందరూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వచ్చిందట అని సులువు చేసుకున్నారు. తమిళులు అలా కాదు. ముందు నుంచీ వారు కవితాత్మక మకుటాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ‘ఒడ్డంతా చంపక పుష్పాలే’ అనేది ఒక నవల పేరు. ఇలా మనవాళ్లు పెట్టరు. ‘పసుపుపచ్చని ఎండ’, ‘బుగ్గ మీద ముద్దులాడింది’ ఇవి సినిమాల పేర్లు. ఇవి కూడా మనకు నప్పవు. కనుక మనం కథ రాసి సూటిగా ‘ఇంద్రధనస్సు’ అనే పేరు పెడితే తెలుగువాళ్లకు నచ్చుతుంది గుర్తుంచుకుంటారు తప్ప ‘ఒక ఇంద్రధనస్సు విరిసే ముందు’ అనంటే కాదనకపోయినా ఇబ్బందైతే పడతారు.

కథకు పేరు ఇంటికి గడప వంటిది.

పూరి గుడిసె గడప వేరు. పెంకుటిల్లు వాకిలి వేరు. రాజమహల్ సింహద్వారం వేరు. వీటిని ఒకదానికి ఒకటి పెడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో మకుటం గురి తప్పితే అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. మకుటం కుదిరి, ప్రవేశం అనాయాసంగా జరిగితే లోపల చెప్పే కథను పాఠకుడు చెవి ఒగ్గి వినే శ్రద్ధ పెరుగుతుంది.

 మామిడిచెట్టు (రావిశాస్త్రి), ఏలూరెళ్లాలి (చాసో), చూపున్న పాట (కెఎన్‌వై పతంజలి), వఱడు (అల్లం శేషగిరిరావు), మాడంత మబ్బు (కల్యాణసుందరి జగన్నాథ్), పొద్దుచాలని మనిషి (మధురాంతకం రాజారాం), పడవ ప్రయాణం (పాలగుమ్మి పద్మరాజు), ఊరబావి (కొలకలూరి ఇనాక్), చివరి గుడిసె (డా.కేశవరెడ్డి), తోడు (ఓల్గా), అతడు (అల్లం రాజయ్య), ఖాళీ సీసాలు (స్మైల్), మురళి ఊదే పాపడు (దాదాహయత్)... ఇలా ఎన్నో కథలు మంచి మకుటాలతో మకుటాలకు తగ్గ వస్తుబలంతో నిలబడ్డాయి. రచయితలను నిలబెట్టాయి.
 కనుక- ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రచయితగా పేరు రావాలంటే మనకు పేరు పెట్టడంసరిగా రావాలనే.
 - ఖదీర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement