the film
-
స్పెషల్ ఎట్రాక్షన్!
ప్రాగ్... యూరప్‌లోని ఓ దేశం పేరిది. అక్కడ లొకేషన్లు కొత్తగా, అందంగా ఉంటాయట! మన తెలుగు ప్రేక్షకులకు వాటిని చూపించాలని హీరో నాని అండ్ కో అక్కడికి వెళ్లారు. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్దిలు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాగ్లో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుస విజయాల్లో ఉన్న నాని హీరోగా ఈ సినిమా నిర్మిస్తుండడం హ్యాపీగా ఉంది. నాని డ్యూయల్ రోల్ సిన్మాకు స్పెషల్ అట్రాక్షన్! కథ, క్యారెక్టరైజేషన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవలే పొల్లాచ్చీలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం. రషెస్ చూసి హ్యాపీగా ఉన్నాం. ప్రాగ్లో 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ‘ధృవ’ ఫేమ్ ‘హిప్ హాప్’ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోయిన్లు ఎవరనేది త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: వెంకట్ బోయినపల్లి. -
టైటిల్ మారిన సాహసం
సాహసం చిత్రం పేరు ఇప్పుడు సాగహం ఎండ్ర వీరచ్చయల్‌గా మారింది. ప్రశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సాహసం.ఆస్ట్రేలియా బ్యూటీ అమండా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మించారు. నవ దర్శకుడు అరుణ్రాజ్వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్, తంబిరామయ్య, ఎంఎస్.భాస్కర్, జాన్‌విజయ్, దేవదర్శిని, లిమాబాబు ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ క్రేజీ నటి నర్గిస్ఫక్రి ప్రత్యేక పాటలో ప్రశాంత్‌తో ఆడి పాడిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిన జులాయి చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం.అయితే దీన్ని కాన్సెప్ట్ మారకుండా చిన్న చిన్న మార్పులతో మళ్లీ తెలుగులో విడుదల చేయనున్నట్లు నిర్మాత త్యాగరాజన్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించడం విశేషం. కారణం ప్రశాంత్‌కు తెలుగులో మంచి ఆదరణ ఉండడమే అని చెప్పవచ్చు. ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన చిత్రం గీతాలు ఇప్పటకే యూట్యూబ్‌లో విడుదలై హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మొదట సాహసం అని పేరును నిర్ణయించారు. అయితే ఇప్పుడు దాన్ని సాగసం ఎండ్ర వీరచ్చెయల్ అని మార్చినట్లు నిర్మాత వెల్లడించారు. సాహసం అన్నది తమిళ భాషకు చెందిన వాక్యం కాదని ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం ఉండదనే కారణంగానే చిత్రం పేరును మార్చినట్లు త్యాగరాజన్ వివరించారు. సాగహం ఎండ్ర వీరచ్చెయల్ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొంది ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేయనుంది. నటుడు ప్రశాంత్ తదుపరి హిందీ చిత్రం స్పెషల్ 26 రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. -
డిఫరెంట్ అలర్ట్
కొత్త సినిమా గురూ! మామూలుగా ఉగ్రవాద నేపథ్యంలో సినిమాలంటే చాలా సీరియస్‌గా ఉంటాయి. ఫన్‌కి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ఫార్ములాను బ్రేక్ చేస్తూ రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చంద్రమహేశ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాత పీవీ శ్రీరామ్‌రెడ్డి. ఆయన తనయుడు హెచ్.హెచ్.మహదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ ఏంటంటే... హైదరాబాద్‌లో ఘనంగా జరిగే గణేశ్ నిమజ్జనం చూడటానికి పల్లెటూరి నుంచి మహదేవ్, శివ, రామకృష్ణ, శీను సిటీకి వస్తారు. సిటీలో ఓ చాన ల్లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ పిలవడంతో ఈ నలుగురూ భాగ్యనగరంలోకి అడుగుపెడతారు. గణేశ్ నిమజ్జనం జోరుగా జరుగుతున్న సమయంలో నగరాన్ని అల్లకల్లోలం చేయాలని ఓ నలుగురు తీవ్రవాదులు ప్లాన్ చేస్తుంటారు. ఇది తెలుసుకుని నగరంలో పోలీస్ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది. తీవ్రవాదులను ఏరిపారేయడానికి హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ భువనేశ్వరి చార్జ్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నగరం చూడ్డానికి వచ్చిన నలుగురు కుర్రాళ్లకూ పూనా వెళుతున్నానంటూ శ్రీరామ్ నుంచి మెసేజ్ అందుతుంది. దాంతో ఓ హోటల్లో దిగుతారు. వాళ్లకు ఓ చోట డబ్బుల మూట దొరుకుతుంది. లైఫ్ టర్న్ అయిందని సంబర పడిపోయి ఆ మూటను హోటల్ గదికి తీసుకువస్తారు. పూర్తిగా తెరిచి చూస్తే, అందులో తల లేని మొండం దొరుకుతుంది. కట్ చేస్తే వీళ్లు ప్రయాణం చేసిన క్యాబ్ డ్రైవర్‌కు ఓ తల దొరుకుతుంది. ఇంతకూ ఆ శవం ఎవరిది? ఎవరు చంపారు? శ్రీరామ్ ఏమైపోయాడు? అనేది మిగతా కథ. హీరోయిన్ లేకుండానే.... ‘ప్రేయసి రావె’ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకునిగా పరిచయమై, శ్రీహరితో ‘అయోధ్య రామయ్య’, ‘హనుమంతు’ చిత్రాలతో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. ఈసారి టెర్రిరిజమ్ నేపథ్యంలో కథను అల్లుకుని ఈ సినిమా తీశారు. సుమన్, పోసాని కృష్ణమురళి, జోగీ బ్రదర్స్‌ను మినహాయిస్తే ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవాళ్లే. అనుకున్న కథను ఎక్కడా డైవర్ట్ కాకుండా పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలీ, పోసాని కృష్ణమురళిల కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఓ శవం తాలూకు తల, మొండం ఒకసారి పోసానికి, మరోసారి అలీకి, ఇంకోసారి హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌కు దొరికే సన్నివేశాలు కాస్త ఉత్కంఠ కలిగిస్తూ, ప్రథమార్ధం అంతా ఓ థ్రిల్లర్‌లా సాగిపోతుంది. మొండాన్ని వదిలించేసుకోవాలని ఇంకో సూట్‌కేసులోకి మారుస్తున్నప్పుడు స్పష్టంగా వేలాడుతున్న ఐడీ కార్డ్‌ను హీరో బ్యాచ్ చూడకపోవడం, అలాగే వెస్ట్ జోన్ డీసీపీ స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఓ క్రిమినల్‌ను పట్టుకోవడానికి బార్లో ఐటెమ్ గాళ్ అవతారం ఎత్తడం ఇవన్నీ లాజిక్కు అందని అంశాలుగా చెప్పొచ్చు. కొత్తవాళ్లతో బ్రహ్మాండాలు తీసే అవకాశం ఉండదు కాబట్టి, చంద్రమహేశ్ సేఫ్ జోన్లో వెళ్లారని పిస్తుంది. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టు కున్నారు. ముఖ్యంగా హీరోగా నటించిన మహదేవ్‌కు ఇది మొదటి సినిమా అయినా బాగానే చేశారు. హైలైట్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి చిత్రమిదే ‘జై జై గణేశా...’ అంటూ ఓ సంస్కృత గీతాన్ని శంకర్మహదేవన్తో పాడించారు. ఆ పాట సినిమా క్లైమాక్స్‌లో వస్తుంది. -
అతడే పోలీస్...
క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిందీ సినిమాల్లో పోలీస్ అంటే ఇతడే. పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చుగాని మనిషిని మాత్రం చూడగానే పోల్చుకుంటారు. ‘కానూన్ కే హాత్ లంబే హోతే హై’... ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’... ఈ డైలాగులు చెప్పాలంటే ఇతడే చెప్పాలి. పేరు ఇఫ్తెకార్. ఊరు జలంధర్. గొంతు బాగుంటుందని పాటలు పాడి గాయకుడు కావాలని కలకత్తా వెళ్లి అక్కడ లాభం లేక ముంబై చేరుకున్నాడు. అశోక్ కుమార్ పరిచయం కావడంతో నటుడుగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అయితే 1969లో వచ్చిన ‘ఇత్తెఫాక్’ (దర్శకుడు యశ్ చోప్రా) ఇఫ్తెకార్ కెరీర్‌నే మార్చేసింది. అందులో అతడు వేసిన పోలీస్ ఆఫీసర్ వేషం పెద్ద హిట్టయ్యి ఆ తర్వాత దాదాపు నాలుగు వందల సినిమాల్లో అదే పాత్రకు అతణ్ణి ఖాయపరిచింది. ‘డాన్’లో ఇఫ్తెకార్ వేసిన పాత్రను దాని తెలుగు రీమేక్‌లలో జగ్గయ్య (యుగంధర్), కృష్ణంరాజు (బిల్లా) పోషించారు. -
సూపర్ హిట్ ప్యార్ ఝక్తా నహీ...
ఫ్లాపుల్లో ఉన్న మిథున్ చక్రవర్తిని మళ్లీ నిలబెట్టిన సినిమా ఇది. ప్రేమ జంట విడిపోయి తమకు పుట్టిన పిల్లాడి ద్వారా కలవడం గతంలో ‘ఆ గలే లగ్ జా’ (1973- తెలుగులో మంచి మనసులు) వంటి కథల ద్వారా చూసినా అదే కథ కొంచెం మార్పుచేర్పులతో ప్రేక్షకులను అలరించింది. పేదవాడైన హీరో, కలవారి అమ్మాయి... వారి మధ్య కొందరు అడ్డు పడటం.. ఇంతే కథ. అయితే మిథున్, పద్మిని కొల్హాపురి జంట ప్రేక్షకులకు నచ్చింది. అంతేకాదు సినిమాను లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం నిలబెట్టింది. ‘తుమ్ సే మిల్ కర్... నా జానే క్యూ’... పాట రేడియోలో మోగిపోయింది. 1985లో రిలీజైన ఈ సినిమా సంవత్సరం రోజులు ఆడటం ఆప్పట్లో ఆషామాషీ కాదు. దీని ప్రభావం దక్షిణాదిన పడింది. తమిళంలో రజనీకాంత్, కన్నడలో విష్ణువర్థన్ దీని రీమేక్‌లలో నటించారు. తెలుగులో ‘పచ్చని కాపురం’ పేరుతో కృష్ణ, శ్రీదేవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పట్లో ఎస్.పి.బాలు, కృష్ణల మధ్య స్పర్థలు ఉండటంతో ఇందులోని పాటలు కె.జె. ఏసుదాస్ గళంలో వినిపిస్తాయి. ‘వెన్నెలైనా చీకటైనా’... పాట ఇప్పటికీ హిట్టే. -
పెద్దవాళ్లకు కూడా కోపాలు తప్పవు
మ్యూజిక్ గాయకుడు మహమ్మద్ రఫీ పీక్‌లో ఉన్నప్పుడు మ్యూజికల్ నైట్స్‌కు చాలా డిమాండ్ ఉండేది. రఫీ తానే సొంతగా కొన్ని నైట్స్ చేసేవాడు. సినిమాల అవకాశాలు తగ్గినవాళ్లు కొన్ని చేసేవారు. ఫీల్డ్‌లో కొత్తగా వచ్చిన కల్యాణ్‌జీ-ఆనంద్జీ తాము చేస్తున్న మ్యూజికల్ నైట్స్‌లో పాడమని రఫీని అడిగారు. నేను బిజీగా ఉన్నాను లతాను అడగండి అని రఫీ అన్నాడు. వాళ్లకు కోపం వచ్చింది. చాలా కాలం రఫీతో పాటలు రికార్డింగ్ చేయించలేదు. గమనిస్తే వాళ్ల సంగీతంలో రఫీ పాటలు తక్కువ ఉంటాయి. అలాగే సంగీత దర్శకుడు ఖయ్యామ్కూడా రఫీని తన మ్యూజికల్ నైట్‌లో పాడమని అడిగితే- ముందు నువ్వు సంగీత దర్శకుడిగా పేరు సంపాదించు. ఆ తర్వాత మ్యూజికల్ నైట్ పెట్టు అన్నాడు రఫీ. అది మనసులో పెట్టుకుని ఖయ్యాం చాలాకాలం రఫీకి బదులుగా మహేంద్ర కపూర్ చేత పాడించాడు. హమ్ కిసీసే కమ్ నహీ (1977) సినిమాలో రఫీ పాడిన ‘క్యా హువా తేరా వాదా’ పాటకు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. అయితే అదే సంవత్సరం అమర్ అక్బర్ ఆంథోనికి సంగీతం అందించిన లక్ష్మీకాంత్-ప్యారేలాల్కు ఉత్తమ సంగీత దర్శకులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది. ఉత్తమ గాయకుడిగా అవార్డు తీసుకున్నవాడు ఆ పాటను పాడాలి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ల ముందు తాను హమ్ కిసీసే కమ్ నహీకి సంగీతం అందించిన ఆర్.డి.బర్మన్ ట్యూన్‌ను పాడితే వాళ్లకెక్కడ కోపం వస్తుందోనని రఫీ ఆ వేడుకకు వెళ్లడానికి భయపడ్డాడు. ఆ సంగతి తెలిసి లక్ష్మీకాంత్ ప్యారేలాల్లు తాము ఆర్కెస్ట్రా అరేంజ్ చేసి ఆర్.డి,బర్మన్ పాటైనా సరే మేము సహకరిస్తాం అని చెప్పి రఫీ చేత పాడించారు. రఫీ ఊపిరి పీల్చుకున్నాడు. పెద్దవాళ్ల కష్టాలు ఇలా ఉంటాయి. -
కమింగ్ సూన్.. ‘అమీర్‌పేటలో’..
- ఐటీ విద్యార్థుల కథే సినిమాగా.. హైదరాబాద్ మహానగరం ప్రయోగాలకు వేదిక. సిటీలోని ఒక్కో ప్రాంతానిది ఓ ప్రత్యేకత. కృష్ణానగర్ సినీ జీవుల నిలయం.. మాదాపూర్ ఐటీ ఉద్యోగుల ప్లేస్.. అమీర్‌పేట ఐటీ కోర్సులు చేసి అమెరికా వెళ్లాలనుకునే జీవుల ఆశల అడ్డా. ఇప్పుడు ఈ అడ్డా సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాల నిలయంగా పేరున్న అమీర్‌పేట.. సోషల్ వెబ్సైట్, కళాశాలల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘అమీర్‌పేటలో’.. ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసిన కొద్దీ రోజుల్లోనే వేలాది మంది ఆ గ్రూప్‌లో చేరడం ఆ పేరుకు ఉన్న క్రేజ్‌కి అద్దం పడుతోంది. ఇంతకీ ఈ పేరే ంటో అనేకదా..! అమీర్‌పేటలో అన్నది సిటీలో ఓ ప్రాంతం పేరు.. అంతకు మించి ఇప్పుడిది సినిమా పేరు. -సాక్షి, సిటీబ్యూరో - సోషల్ మీడియాలో హల్చల్ - యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం - సిటీ లైఫ్‌లో కొత్తకోణం ‘అమీర్‌పేటలో’.. సినిమా టైటిల్. ‘కాప్షన్ కమింగ్ సూన్’ అన్నది కాప్షన్. ఈ మూవీ పేరును ఇప్పుడు సిటీలో యూత్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పేర్లకు ముందు తమ ప్రాంతం పేరును యాడ్ చేసి ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నారు. ‘అమీర్‌పేటలో శ్రీ, అమీర్‌పేటలో అనూష’.. అంటూ ఈ ప్రాంతం వారు ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసుకుంటే.. ‘ఉప్పల్‌లో సోనీ’, ‘రామాంతపూర్‌లో రాము’, ‘మెహదీపట్నంలో సందీప్’, ‘లింగంపల్లిలో కిషన్‌రావు’.. ఇతర ప్రాంతాలవారు కూడా ఇలా కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు. ఒక రకంగా వీరంతా ‘అమీర్‌పేటలో’.. చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. మరోపక్క ఈ మూవీ కథాంశాన్ని యువతకు తెలియజేస్తూ ఈ చిత్రం టీం సిటీలోని వివిధ కళాశాలల్లో ఫ్లాష్ మాబ్ డాన్స్ చేస్తున్నారు. దీనికి అట్రాక్ట్ అయిన కాలేజీ కుర్రాళ్లు ‘అమీర్‌పేటలో’ మూవీ ప్రమోషన్‌లోనూ భాగమువుతున్నారు. ‘బీటెక్ చదువు తర్వాత తమ కెరీర్ గోల్ చేరుకునే క్రమంలో అమీర్‌పేట అడ్డాగా ఎంత మందికి లైఫ్నిస్తుందో, అక్కడ విద్యార్థుల లైఫ్ స్టైల్‌ను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా కథాంశం మాకు బాగా నచ్చింది. సినిమా టైటిల్ కొత్తగా ఉండటంతో ఈ మూవీ పబ్లిసిటీలో భాగస్వాములం అవుదామని వారి ఫేస్బుక్ పేజీలో మెంబర్ అయ్యామ’ని చెబుతున్నారు ఓ కళాశాల విద్యార్థులు. ‘ఈ టైటిల్ ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగే ఈ సినిమాను తెరకెక్కించడం, బీటెక్ చదివిన మధును హీరోయిన్గా తీసుకోవడం... ఇలా దాదాపు బీటెక్ చదివిన వారందరూ ఈ మూవీలో చేస్తుండటం మమ్మల్ని ఆలోచింపజేస్తోంది. అందుకే మా వంతుగా ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్నామని చెబుతున్నారు అమీర్‌పేట హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకులు. వాస్తవానికి ‘అమీర్‌పేటలో’.. అంటూ ఓ ప్రాంతం పేరును సినిమా టైటిల్‌గా పెట్టడం కొత్తేమీ కాదు. దాదాపు 24 ఏళ్ల క్రితమే కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘మధురానగరిలో’.. చిత్రం వచ్చింది. అయితే, అప్పటికి ఫేస్బుక్, మాబ్ డాన్సుల వంటి ప్రచారం లేదు. ఇన్నోవేటివ్ పబ్లిసిటీ.. సినిమా షూటింగ్ పూర్తయ్యాక పబ్లిసిటీపై దృష్టి పెడతారు. అయితే ‘అమీర్‌పేటలో’ టీం మాత్రం.. ఓ వైపు షూటింగ్ చేస్తూ.. పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ వెబ్‌సైట్‌తో పాటు తమ టైటిల్ లోగోతో కాలేజీలకు వెళ్లి యువతను ఆకట్టుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్‌తో ఉన్న టీషర్ట్‌లతో వెళుతుండడం అందరినీ అటువైపు కన్నేసేలా ఉంది ప్రచారం. ఆడియో లాంచింగ్ కూడా డిఫరెంట్‌గా.. అమీర్‌పేట వేదికగా చేసే ప్లాన్‌లో ఉన్నారు ఈ మూవీ టీం. ఉద్యోగం వదిలేశా.. ‘నేను చదివింది బీటెక్. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. అప్పుడు అమీర్‌పేటలో ఉండేవాడిని. అక్కడి వాతావరణం, విద్యార్థుల తీరు చూశాక.. నా వ్యక్తిగత అనుభవంతో ఓ మూవీ చేయాలనుకున్నా. అందుకే ఏడాది క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశా. 20 మంది ఫ్రెండ్స్‌తో కలిసి ఈ మూవీ ప్లాన్ చేశా. ‘అమీర్‌పేటలో..’ టైటిల్ చెప్పగానే ఓకే అన్నారు. తొలుత ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు సాఫీగా సాగుతోంది. అమీర్‌పేటలో ఉండేవారినే ఈ సినిమాలో క్యారెక్టర్లుగా తీసుకున్నాం. హీరోయిన్ మధు కూడా అక్కడే ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్నా. డెరైక్టర్, నిర్మాతను కూడా నేనే. అమీర్‌పేటలో నా లైఫ్ ఈ మూవీ తీసేలా చేస్తోంద’ని అంటున్నారు శ్రీకాంత్ పొడపాటి. -
సినిమాల వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది
నిన్న ఒక పాత సినిమా, మంచీ-చెడ్డా రెండూ ఉన్నది, చూశాను. చాలా సంవత్సరాల కిందట చూసిందే. అందులో ఒక్క పాట తప్ప మిగతావన్నీ దాదాపు మర్చిపోయాను. అదే సినిమా కొత్తగా చూస్తున్నట్టు చూశాను నిన్న. సినిమాలో పాటలు అద్భుతం! మొత్తం తెలుగు సినిమా ప్రపంచంలో గొప్పదైన పాట ఒకటి ఉంది. అందులో మాటలు కూడా అచ్చంగా మనుషులు మాట్లాడుకున్నట్టే, పాత్రలకు తగినట్టుగా ఉన్నాయి. కథ అయితే, నిజం కథగా మొదలై, నిజం కథగానే ముగిసింది. అనేక కొంపల్లో జరిగే నిజాలు అవే కావచ్చు. అయినా ముగింపు అంత తుక్కుగా జరిగితే, ఇక ఎందూకూ ఆ సినిమా? కేవలం పాటల కోసమేనా? నేను ఎప్పుడూ పాత సినిమాల కోసమే వెతుకుతాను. వాటిల్లో కూడా కథల్లో ముగింపుల్ని ఖూనీలు చేసేస్తూ ఉంటారు. ఈ సినిమాలోనూ పెద్ద ఖూనీయే జరిగింది. అయినా, పాత సినిమాల్లో హాయి అయిన పాటలు కొన్ని అయినా దొరుకుతాయని సంతోషం! అందుకే కొత్త పుస్తకాలు కూడా పక్కన పెట్టి ఈ సినిమాతో గడిపాను. ‘‘గృహమే కదా స్వర్గసీమా’’ అని పాడతాడు ఆ గృహస్తుడు. భార్య వీణ వాయిస్తోంటే, అతగాడు కంఠం కలుపుతూ ఉంటాడు. అతగాడు పాటగాడే కాదు, రాతగాడైన కవి కూడా. కళాపోషకుడిగా పేరూ! స్వర్గ సీమ రుచి తెలిసిపోయినట్టు పాడేవాడు, ఒక నాటకాల నటి వెంటబడి ‘‘హాయి సఖీ’’ అంటూ ఆ సఖికి సఖుడై గానం ప్రారంభించి, తన గృహ స్వర్గసీమని నరక సీమ చేసేస్తాడు. ఈ సినిమాలో భానుమతి పాడిన ‘‘ఓహోహో పావురమా’’ పాట అందరూ వినే వింటారు. అందులో సాహిత్యం, సంగీతం, కంఠం, అన్నీ మధురాతి మధురాలు. అది ఎవరైనా విని ఉండకపోయినా, విన్నామనే చెప్పుకోండి! లేకపోతే పరువు పోతుంది, ఉండదు. ఆ నటికి ఒక నాటకం రాసి పెట్టడం కోసం ఆ కవి, రోజంతా ఆ నటి దగ్గరే గడుపుతూ కొంపకి తిన్నగా రావడం ఎగ్గొడుతూ ఉంటాడు. అతని భార్య అతి వినయంగా భర్తతో, ‘‘మీరు ఆ నాటకం రాసే పని మన ఇంటి దగ్గరే చేసుకోకూడదా?’’ అంటుంది, పాపం వొణుకుతూనే. ఆ కళాకారుడు అతి నిర్లక్ష్యంగా, ‘‘అస్తమానూ ఇంట్లో నీ మొహం చూస్తూ కూర్చోవాలా? నిన్నూ నీ పిల్లల్నీ పోషించడానికే కదా నాటకం రాస్తున్నాను?’’ అనేసి రుస రుసలతో వెళ్ళిపోతాడు. అలా ఒకటి రెండు సార్లు అయ్యాక అసలు ఇంటికి రావడమే బంద్ చేస్తాడు. పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి, నటి పాడినట్టు, ‘‘తరుణ యవ్వనము పొంగి పొరలే వలపు కౌగిలిలో ఓలలాడే’’ స్వర్గ సీమలో మునిగిపోతాడు. ‘స్వర్గ సీమ’ అనేది ఒక భ్రమ! ఒక కల్పన! దాన్ని ఎలా ఊహిస్తే, అదే స్వర్గ సీమగా కనపడుతుంది. ఒకప్పుడు గృహమే స్వర్గసీమ. ఇప్పుడు గృహం బయటే స్వర్గ సీమ! గృహమే స్వర్గ సీమ అయిన వాడికైతే పరాయి సంబంధాలు స్వర్గ సీమలు కాలేవు. మన కవి కోరే స్వర్గ సీమ అంతా, పర స్త్రీ పొందే! ఇంటి నించి భార్య జడుస్తూ ఫోనులు చేస్తే, అతగాడు ఫోను ముట్టడు. ఎప్పటికో ఆ నటే ఆ ఫోను ఎత్తి, కవి భార్యని ఖయ్యిమని కసురుతుంది. భార్య దీనంగా ఉత్తరం రాస్తే, మన కళాపోషకుడు, ఆ ఉత్తరాన్ని ముట్టకుండా, ‘‘తల తిక్క రాతలు’’గా కొట్టిపారేస్తాడు. ఆ భార్యకి ఏడుపేగానీ, ఏడుపుతో పాటు చీమ తలకాయంతైనా కోపం రాదు. ఆ దేహం రక్తమాంసాలున్న దేహమేనా అని డౌటు వచ్చే వాళ్ళకి వస్తుంది. ఆ ఇల్లాలు తన భర్త నడత గురించి శోక రాగాలతో కృష్ణుడి బొమ్మకి చెప్పుకుంటుంది! ఆ కృష్ణుడికి 8 మంది పెళ్ళాలూ, 16 వేల మంది ప్రియురాళ్ళూ అని, ఆమెకి తెలియకపోవచ్చునేమో గానీ, సినిమా తీసిన బి.ఎన్.రెడ్డి గారికీ తెలీదా? ఆమె, తన ఘోషని ఏ బొమ్మకి చెప్పుకున్నా దండగేగానీ, పోనీ చెప్పుకుంటే, ఒకే భార్య గల రాముడి బొమ్మకి చెప్పుకోవాలా, ఆడదాన్ని చూస్తే వదలని కృష్ణుడి బొమ్మకి చెప్పుకోవాలా? దేనికి చెప్పుకున్నా ఆ బొమ్మ ఆ భర్తని తీసుకురాదు గానీ, అక్కడ రాముడి బొమ్మని పెట్టించాలని తెలియలేదా డెరైక్టరు గారికి? ఇక, ఆ భార్య, ఒక పాకలోకి మారి మిషను కుట్టుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ గడుపుతోంది. కానీ భర్తగారి ఫొటోని గోడకి తగిలించి, దానికి రోజూ కొత్త పూలు పెడుతూ!నటితో కలిసి నాటకాలాడేస్తోన్న మన కళాకారుడికి స్టేజి మీదే ఒక ప్రమాదం జరిగి ఆ నటి పోషణలోనే మంచం పట్టాడు. ఆ నాటకాల రంభ, వీణ్ణి వొదిలేసి, వీడికన్నా ఘనుణ్ణి పట్టింది. మంచం పట్టిన ప్రేమికుడు ఫోనులు చేస్తే, ఆ ప్రేయసి పలకదు. ఫోన్ల తర్వాత పలికితే ఖయ్యిమని పలుకుతుంది. తన ప్రేయసి ఇంకోణ్ణి ‘పట్టిన’ సంగతి మన కవికి తెలుస్తుంది. ఇక ఆమె దగ్గర చోటు లేదు. ఆ నటి, ఆ రెండోవాడితో, నాటకాలాడుకుంటూ పాడుకుంటూ, కీర్తి పెంచుకుంటూ, నిశ్చింతగా గడిపేస్తోంది. ఆమె అవసరం అదీ! ఇక, మన కవి, మంచం దిగాడు. ఇల్లు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? రంభ వొదిలేసింది కాబట్టి. అంతే గానీ తన తప్పు తనకి తెలిసి కాదు. ఆత్మ విమర్శతో కలిగిన బాధ కాదు. ఆ రంభ, ఇంకా తనతో నాటకాలు రాయించుకుంటూనే ఉంటే, ఆ కవికి ఇల్లు గుర్తొచ్చేదా? అలా జరగదు. నిలవ నీడ లేకే ఇల్లు గుర్తు! తను చాలా పశ్చాత్తాప పడిపోతున్నట్టు గడ్డం పెంచేశాడు. పశ్చాత్తాపాలకు గుర్తు ఎప్పుడూ గడ్డాలే. లేకపోతే క్షవరానికి డబ్బులు లేకనో! అక్కడే డెరైక్టరు గారు, సైగల్ పాటలోనించి రెండు మాటలు ఇరికించారు, ‘‘దునియా అంతా దుఃఖం బాబా, కళ్ళు తెరిచి చూడు!’’ అంటూ! మనవాడికి ఎవరో ఆ దుఃఖం తెచ్చిపెట్టినట్టు! ఆ గడ్డాలతో తిరుగుతూ తిరుగుతూ పెళ్ళాం ఉన్న పాక దగ్గరికే వస్తాడు. అది రాత్రి పూటే. ఆ ఇల్లాలు పాక తలుపు బార్లాగా తెరిచి పెట్టేసి ఉంచింది. మిషను పని చేసుకుంటూ మిషను మీదే తల వాల్చి కునుకు తీస్తోంది. చిన్న పిల్లలిద్దరూ మంచం మీద నిద్రలు! మనవాడు పాకలోకి జొరబడి గోడ మీద తన ఫొటోని పూలతో చూశాడు. మంచం మీద నిద్ర పోతోన్న పిల్లల తలలు నిమురుతూ ప్రేమలు కురిపించాడు. (అతడి పశ్చాత్తాపాన్ని అందరూ నమ్ముతారని డెరైక్టరు గారు అనుకున్నట్టున్నారు. నేను నమ్మలేదనుకోండీ). మిషను మీద భార్య ఎలాగో తల ఎత్తేసరికి, ఇతగాడు గుమ్మం బైటికి తప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో దగ్ధమై పోతున్నవాడు అలా పారిపోవడం ఎందుకు? ఆమె ముందే తల వాల్చుకుని నిలబడరాదూ? బైటికి వెళ్ళిపోతోన్న వాణ్ణి చూసి ఆ ఇల్లాలు, ‘‘దొంగ, దొంగ’’ అని అరిచింది. అతడు తన భర్తేనేమోనని అనుమానం కూడా వచ్చింది ఆమెకి. దీపం ఎత్తి పట్టుకుని వాడు ఎవడా అని చూడడానికి బైల్దేరింది గుమ్మం బైటికి. వాణ్ణి దొంగే అనుకుంటే, వాడు బైటికి పోయాడు కాబట్టి, వెంటనే తలుపులు మూసేసుకోవాలి. లేదా, అతణ్ణి తన భర్తేనేమో అనుకుంటే, అతను రాదల్చుకుంటే లోపలికి అతనే వస్తాడనుకోవాలి. తను దీపం పట్టుకెళ్ళి అతడి మొహం పరిశీలిస్తుందా! మన ఇల్లాలు అదే చేసింది. వాడు ఇంకెవరు? భర్తే! దీపం అవతల పారేసి, భర్త కాళ్ళ మీద పడిపోయింది! పడితే వాడు పడాలి, భార్య కాళ్ళ మీద! అలా పడి, ‘‘తప్పు చేశాను, తప్పు చేశాను’’ అంటూ దొర్లి దొర్లి ఏడవాలి. భర్త అలా ఏడిస్తే, ‘‘పోనీలే, తప్పు తెలుసుకున్నాడులే. ఏడుస్తున్నాడులే’’ అని భార్య సరిపెట్టుకుందని, ఆ భార్యని మనం సరిపెట్టుకోవచ్చు. అసలా భర్త ఎలా నించున్నాడంటే, పెళ్ళామే తన కాళ్ళ మీద పడాలన్నట్టుగా నిటారుగా నించున్నాడు! ఆ పిచ్చిది అలాగే పడిందిగా, వచ్చేశాడు చాలని? ఇక ఆ తర్వాత, పాక మాయమైంది. ‘‘గృహమే కదా స్వర్గ సీమా’’ అంటూ ఆ భర్త ఎగురుతూ మళ్ళీ పాడేస్తున్నాడు!! ఆ భార్య కూడా ‘‘గాలివాన వెలసె’’ అని పాడేసి, తన ఘోర అవమానాన్ని ‘గాలివాన’తో పోల్చుకుంది. అదీ ‘స్వర్గ సీమ!’ భార్యకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సంస్కరించే ముగింపు ఉండాలి. ఆ మంచి ముగింపు ఇలా ఉండాలి: ఆ గడ్డాల భర్త, భార్య ముందు మొహం వేళ్ళాడేసుకుని నించుంటాడు. అప్పుడు ఆ భార్య అంటుంది. ‘‘పిల్లలు నా పిల్లలే. నా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను. నువ్వు పోషించనక్కర లేదు. నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే, నేను రోజూ నీ మొహం చూస్తూ ఉండాలా? నేనే కొన్నాళ్ళు ఎవడితోనో తిరిగి వస్తే, నేను రావడమే చాలని నువ్వు నా కాళ్ళ మీద పడతావా?’’ అని అడుగుతుంది. అలా అడుగుతూ, అతని పశ్చాత్తాపం నిజమా అని కూడా సందేహిస్తూ చూస్తూ ఉంటుంది. అంతలో, ఆకాశంలోంచి, ‘‘ఓహో పావురమా’’ పాట వినపడుతుంది రయ్యిమంటూ, ఆ నాటకాల నటి వీడి కోసం మళ్ళీ వెతుకుతోంది. ఎందుకంటే, ఆ రెండో వాడు దీని డబ్బంతా ఎత్తుకుని పారిపోయాడు. ఆ నటికి మళ్ళీ కొత్త కొత్త నాటకాలు రాసి యిచ్చే పాత కవి కావలసి వచ్చాడు. అందుకే మళ్ళీ ఆ పావురం పాట ఎత్తుకుంది. పెళ్ళాం ముందు నిలబడ్డ పశ్చాత్తాపాల వాడు, మొహం అటు వైపు తిప్పేశాడు. ఆ కీర్తివంతురాలు, ఆ నాట్యకత్తె, ఆ మధురగాయని, ఆ కళాకారిణి, ఆ సుందరాంగి, మళ్ళీ దొరకబోతోంది! మన కళాకారుడు, పాకలో నించి ఒక్క ఊపుతో బైటికి పరుగుతీశాడు. భార్య ఆశ్చర్యపోతూ చూసింది కొంతసేపు. అతడి పశ్చాత్తాపం అబద్ధమని అప్పటికి స్పష్టంగా గ్రహించింది. చప్పున కదిలి తలుపులు మూసేసింది. గోడ మీద ఫొటో తీసి కింద పెట్టింది. ఆమె మొహంలో విచారం లేదు. మనిషి ప్రశాంతంగా అయింది. పిల్లల దగ్గిర కూర్చుని చక్కని పాట ఎత్తుకుంది. ‘‘మనం తల్లీ పిల్లలం మనం ఒకరికి ఒకరం మన గూడే మన స్వర్గం! మన పాకే మన స్వర్గసీమ! మన యంత్రమే, మన సూదీ దారాలే, మన ఆయుధాలు! మీ రక్షకురాలిని నేనే, నా సంరక్షకులు మీరే! చాలు మనకీ సంతోషం చాలు మనకీ ఆనందం ఇదే ఇదే మన స్వర్గ సీమ!’’ పిల్లలు నిద్రలు లేస్తారు. వాళ్ళు కూడా ఆ పాటలో కలుస్తారు. ఆ తల్లి, మిషను మీద కూర్చుని కుట్టు పని చేస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు జల జలా వర్షిస్తున్నాయి. అయినా, ఆమె మొహం ప్రశాంతతతో ప్రకాశిస్తోంది. - ముగింపు ఇలా ఉంటే, అది ఆ తల్లీ బిడ్డలకు న్యాయం. సినిమాల వాళ్ళకి డబ్బు జబ్బు ఉంటుంది. లాభం జబ్బు! పెట్టిన ఖర్చులు వెనక్కి వస్తే చాలదు. లాభం రావాలి! అత్యధిక లాభం రావాలి! ఆ భార్య, భర్త కాళ్ళ మీద పడకపోతే, టిక్కెట్లు కొనే భర్తలు పెళ్ళాల్ని సినిమాకి తీసుకురారని సినిమా వాళ్ళకి భయం! సగం టికెట్లు అమ్ముడు కావని దడ! అందుకే ఆడ వాళ్ళని బానిసల్ని చేస్తారు. వాళ్ళ జీవితాల్నీ, కుటుంబాల్నీ, స్వర్గ సీమల్నీ, ఖూనీలు చేస్తారు. ఆ ఖూనీయే జరిగింది ఈ కథ ముగింపులో! ఈ సినిమా ఏం చెప్పిందంటే, భర్తలు బైటికిపోయి ప్రియురాళ్ళతో తిరిగి రాగానే, అతడు రావడమే చాలని భార్యలు ఆనందంతో అతడి కాళ్ళమీద పడాలి! మళ్ళీ పోయినా, మళ్ళీ వస్తాడని, ఓపికతో నిరీక్షించాలి!- ఇదే కదా స్వర్గసీమలు నిలిచే మార్గం! - రంగనాయకమ్మ -
అతడు ఏలూరెళ్లాలి....
కథల నామకరణం - 3 సినిమాల్లో కూడా షావుకారు, మిస్సమ్మ పేర్లకే అలవాటు పడ్డారుగాని ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. చాలాసార్లు- బుద్ధి ఊరికే ఉండదు కదా- కొన్ని టైటిల్స్ ఫ్యాన్సీగా తడతాయి. వాటికి కథ రాయాలనిపిస్తుంది. ఆ రంధిలో దిగకపోవడమే మంచిది. ఇంటర్లో కథలు మొదలెట్టాక ‘సెంటర్లో శిలావిగ్రహం’ అనే టైటిల్ మీద కథ రాయాలని గట్టిగా అనుకున్నాను. అంటే ఏంటో తెలీదు. కనుక ఎప్పటికీ రాయలేదు. దావత్, జమీన్ కథలు రాశాక - మ్యూజిక్ అంటే కొంత ఆసక్తి గనక, మద్రాసులో రికార్డింగ్స్ అవీ చూసి ఉన్నాను గనక ‘కోరస్’ అనే టైటిల్ మీద కథ రాయాలని మనసు పీకింది. ‘కోరస్’ అనేది కచ్చితంగా కథకు పనికొచ్చే పేరే. కాని అందుకు తగ్గ కథేమీ నా లోపల లేకపోవడంతో రాయలేదు. ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’కు ముందు దర్శకుడు వంశీని కలుస్తూ ఉన్నప్పుడు దీని గురించి చెప్తే ఆయనకు సంగీతం చాలా ఇష్టం కనుక నేను రాస్తాను అని ఎంతో ఉత్సాహంగా ‘కోరస్’ పేరుతో కథ రాశారు. కాని చూపించకుండానే చింపేశారు. అంటే దానికి తగ్గ సమాచారం, అంత తీవ్రంగా స్పందించాల్సిన నిజాయితీ, అందుకు అవసరమైన సంకల్పం లేవని ఆయనకే అర్థమయ్యింది. కథ బాగ రాలేదు. కనుక కొన్ని పేర్లు పుట్టి గిట్టడమే మంచిది. ముందు నుంచీ మనకు కావ్యాలకుగానీ, కథలకుగానీ, సినిమాలకుగానీ ఒకటి రెండు పదాల్లో తేలే పేర్లే తప్ప పొడవు పేర్లు మరీ కవితాత్మకంగా ఉండే దీర్ఘమైన పేర్లు పెట్టే ఆనవాయితీ లేదు. ‘త్వమేవాహం’, ‘మహా ప్రస్థానం’, ‘ఋతు సంహారం’, ‘శేషజ్యోత్స్న’, ‘కృష్ణపక్షము’... ఇవే అలవాటు చేశారు. ‘అమృతం కురిసిన రాత్రి’ తక్కువ. కనుక నవ్యత కోసం ప్రయత్నించిన (అలా ప్రయత్నించడం మంచిదే అయినా) చాలా కవిత్వం పుస్తకాల పేర్లు మనకు గుర్తుండకుండా పోయాయి. ‘ఆమె స్పర్శ సోకినంత మేరా’.... అని ఒక కవితా సంపుటికి పేరు పెడితే ఒక క్షణం బాగుందే అనిపించవచ్చు కాని గుర్తు పెట్టుకోము. సులువుగా మననం చేసుకొని ఇతరులకు చెప్పలేము. ‘అలా అయితే పూలు ప్రవాసం వెళ్లాల్సిందే’ పేరు ఎంత బాగున్నా పాఠకులు ఇదొక పుస్తకానికి ఇష్టపడి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పేరు అని అనుకోరు. సినిమాల్లో కూడా ‘షావుకారు’, ‘మిస్సమ్మ’ పేర్లకే అలవాటు పడ్డారుగాని ‘ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ’ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. ఎన్టీఆర్ ఎంత పట్టుదలగా ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ అని పెట్టినా ఊళ్లలో అందరూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వచ్చిందట అని సులువు చేసుకున్నారు. తమిళులు అలా కాదు. ముందు నుంచీ వారు కవితాత్మక మకుటాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ‘ఒడ్డంతా చంపక పుష్పాలే’ అనేది ఒక నవల పేరు. ఇలా మనవాళ్లు పెట్టరు. ‘పసుపుపచ్చని ఎండ’, ‘బుగ్గ మీద ముద్దులాడింది’ ఇవి సినిమాల పేర్లు. ఇవి కూడా మనకు నప్పవు. కనుక మనం కథ రాసి సూటిగా ‘ఇంద్రధనస్సు’ అనే పేరు పెడితే తెలుగువాళ్లకు నచ్చుతుంది గుర్తుంచుకుంటారు తప్ప ‘ఒక ఇంద్రధనస్సు విరిసే ముందు’ అనంటే కాదనకపోయినా ఇబ్బందైతే పడతారు. కథకు పేరు ఇంటికి గడప వంటిది. పూరి గుడిసె గడప వేరు. పెంకుటిల్లు వాకిలి వేరు. రాజమహల్ సింహద్వారం వేరు. వీటిని ఒకదానికి ఒకటి పెడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో మకుటం గురి తప్పితే అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. మకుటం కుదిరి, ప్రవేశం అనాయాసంగా జరిగితే లోపల చెప్పే కథను పాఠకుడు చెవి ఒగ్గి వినే శ్రద్ధ పెరుగుతుంది. మామిడిచెట్టు (రావిశాస్త్రి), ఏలూరెళ్లాలి (చాసో), చూపున్న పాట (కెఎన్‌వై పతంజలి), వఱడు (అల్లం శేషగిరిరావు), మాడంత మబ్బు (కల్యాణసుందరి జగన్నాథ్), పొద్దుచాలని మనిషి (మధురాంతకం రాజారాం), పడవ ప్రయాణం (పాలగుమ్మి పద్మరాజు), ఊరబావి (కొలకలూరి ఇనాక్), చివరి గుడిసె (డా.కేశవరెడ్డి), తోడు (ఓల్గా), అతడు (అల్లం రాజయ్య), ఖాళీ సీసాలు (స్మైల్), మురళి ఊదే పాపడు (దాదాహయత్)... ఇలా ఎన్నో కథలు మంచి మకుటాలతో మకుటాలకు తగ్గ వస్తుబలంతో నిలబడ్డాయి. రచయితలను నిలబెట్టాయి. కనుక- ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రచయితగా పేరు రావాలంటే మనకు పేరు పెట్టడంసరిగా రావాలనే. - ఖదీర్ -
పదికాలాల... బాలచంద్రికలు
కె.బాలచందర్ - భారతీయ సినిమా సగర్వంగా తలెత్తి చూసే దర్శక శిఖరం. మాలాంటి వాళ్లం పుట్టకముందే ఆయన ప్రముఖ రచయిత, దర్శకుడు. అంటే మాకు ఊహ తెలిసి, సినిమాల మీద మోజు పడేటప్పుటికి బాలచందర్ ఆలోచనలు, సినిమాలు అవుట్‌డేటెడ్ అయిపోయి ఉండాలి. కాని... మొన్న మొన్నటి దాకా ఏ జనరేషన్ ఎమోషన్ - ఆ జనరేషన్ టైమ్‌లోనే పట్టుకుని - మధ్య తరగతి కష్టాలు, యువతరం ఆవేశాలు, ప్రేమ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన అద్భుత చిత్రకారుడు బాలచందర్. తమిళుడైనా - తమిళ, తెలుగు, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా సూపర్‌హిట్ సినిమాలు తీశారు. కాని ఎక్కడా ఏ ప్రాంతం, భాష వాసనా రాదు. మానవత్వం, వాస్తవాల పరిమళాలే వీస్తాయి. కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. మరికొన్ని చాలా ఘాటుగా ఉంటాయి. 50 సంవత్సరాల సినిమా కెరీర్లో 101 సినిమాలు - వాటిలో కొన్ని వందల జీవితాలు - ముందు తరాలకి కూడా చేరువయ్యేలా. వాటిలో నుంచి కొన్ని ఎంపిక చేసుకోవడం కష్టమైనదే. వేటిని కాదనగలం? వేటిని వదిలేయగలం? అయినప్పటికీ మనసుపై చెరగని ముద్రవేసిన ఓ పది సినిమాల గురించి... బొమ్మా - బొరుసా? (1971) ‘సుఖదుఃఖాలు’, ‘సర్వర్ సుందరం’, ‘సంబరాల రాంబాబు’ - ఈ సినిమాలతో బాలచందర్ కథలు తెలుగు ప్రేక్షకులని పలకరించాయి. సుఖదుఃఖాలు (మేజర్ చంద్రకాంత్), సర్వర్ సుందరం - ఆయన రాసిన నాటకాలు. ‘భలే కోడళ్లు’, ‘సత్తెకాలపు సత్తయ్య’ చిత్రాలతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన స్టార్డమ్ స్టామినాకి తెలుగులో బాక్సాఫీస్ సాక్షిగా శ్రీకారం చుట్టిన సినిమా ‘బొమ్మా-బొరుసా?’. అంతవరకూ బాలచందర్‌గారి స్క్రిప్టుల్లో నాటకీయత, సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉండేది. పూర్తిగా వినోదంతో కొంత వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథ ‘బొమ్మా- బొరుసా?’. 1971లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి అత్తా అల్లుళ్ల ఛాలెంజ్‌ల కథలకి ముడిసరుకు. బాలచందర్ సినిమా నేపథ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తారనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. విజయవాడ, నాగార్జున సాగర్ బాక్డ్రాప్లో కథ నడుస్తుంటుంది. అహంభావి, గర్విష్టి, డబ్బు మీద ఆశ ఉన్న (అత్తగారికీ (ఎస్. వరలక్ష్మి), ముగ్గురు అల్లుళ్లు (జట్కాబండి అల్లుడు - చలం, మిగిలిన వారు రామకృష్ణ, చంద్రమోహన్) ఎలా బుద్ధి చెప్పారనేది లైన్. సాధారణంగా బాలచందర్ సినిమా ప్రారంభంలోనే ప్రధాన పాత్రలని పరిచయం చేసి, కథలో ఇన్వాల్వ్ అయ్యేలా కథనాన్ని పరిగెత్తిస్తారు. ఫస్ట్ షాట్‌లోనే సినిమా ఎలా ఉంటుందనేది చెప్పడం బాలచందర్ స్టయిల్. దానికి మరో అందమైన సాక్ష్యం - ఈ సినిమా ప్రారంభం. బొడ్లో తాళాల గుత్తి దోపుకున్న ఎస్. వరలక్ష్మి మాట్లాడుతుంటే, పక్కనే బీరువా మీద ఉన్న బొమ్మ తలాడిస్తుంటుంది. అత్త మాటలకి అల్లుడు తందానా తానా అనేది చాలా సింబాలిక్‌గా చెప్పారు. ఎ.వి.ఎమ్. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అరంగేట్రం (తమిళం) (1973) తమిళనాట పెను సంచలనం సృష్టించిన సినిమా ‘అరంగ్రేటం’. బాలచందర్ సినిమాల్లో స్త్రీ పాత్రలని చాలా బోల్డ్‌గా చూపించడం ఈ సినిమాతోనే ప్రారంభమైనందని చెప్పాలి. ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలోకి దిగడమనేది ఈ సినిమా కథాంశం. ప్రమీల కథానాయిక పాత్ర పోషించారు. అప్పట్లో ఈ సినిమా పలు వివాదాలకి, విమర్శలకి దారి తీసింది. అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్‌హాసన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జీవిత రంగం’ పేరుతో పి.డి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. హిందీలో ముంతాజ్, రాజేష్‌ఖన్నాలతో ‘అయినా’ అని బాలచందరే స్వయంగా రీమేక్ చేశారు. అంతులేని కథ (1976) బాలచందర్ కీర్తి తెలుగునాట పతాక స్థాయికి చేర్చిన సినిమా ‘అంతులేని కథ’. ఓ వర్కింగ్ ఉమెన్ జీవితంలోని ఒడిదుడుకులని, ఆశలని, నిరాశలని చాలా హృద్యంగా చిత్రీకరించారు బాలచందర్.‘మేఘ దాకా తారా’ అనే అస్సామీ చిత్రం ప్రభావం దీనిపై ఉందని కొంతమంది విమర్శకులు అంటుంటారు. జయప్రదకి విశేషంగా పేరు తెచ్చి పెట్టిన ఈ సినిమాలో ఎందరో మహిళా ఉద్యోగినులు తమ వేదనని వెదుక్కున్నారు.మొదట సుజాత హీరోయిన్గా 1974లో ‘అవళ్ ఒరు తోడర్ కథై’ పేరుతో ఈ సినిమా తీశారు. హిందీలో రేఖతో తాతినేని రామారావు ‘జీవన్‌ధార’, కన్నడంలో సుహాసినితో బాలచందరే స్వయంగా ‘బెంకెయిల్లి అరిడ హూవు’ (అగ్నిలో పుట్టిన పువ్వు) పేరిట రీమేక్ చేశారు. బెంగాలీలో కూడా ‘కబిత’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ముగింపులో, పబ్లిసిటీలో ‘ఇంకా ఉంది’ అని ప్రచారం చేయడం - ప్రేక్షకులు సరికొత్తగా ఫీలయ్యారు. ఈ చిత్రం మీద ఆసక్తి రెట్టింపయ్యింది. అపూర్వ రాగంగళ్ (1975) తండ్రి మీద ఓ యువతి మనసు పడుతుంది. ఆ తండ్రి కొడుకు ఆ యువతి తల్లిపై ప్రేమ పెంచుకుంటాడు. విచిత్రమైన ఈ పొడుపు కథలాంటి కథతో సినిమా తీయాలంటే ఆ డెరైక్టర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి? ఆ ధైర్యం బాలచందర్‌కి ఉంది కాబట్టే - ఆయన అజరామరమైన దర్శకుడయ్యారు. 1975లో వచ్చిన ఈ సినిమా చాలా చర్చనీయాంశమైంది. సామాజిక కట్టుబాట్లని సవాల్ చేసింది. శ్రీవిద్య, కమల్‌హాసన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిచయమయ్యారు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ కథాంశం కొత్తగా ఉంటుంది. అంతే కాదు - స్వతహాగా రచయిత అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు తొలిసారి రీమేక్ చేసింది ఈ సినిమానే (తూర్పు-పడమర). జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకుంది ఈ ‘అపూర్వ రాగంగళ్’. బాలచందర్ స్వయంగా రాజ్‌కుమార్, కమల్‌హాసన్, హేమమాలిని, పద్మిని కొల్హాపురిలతో ‘ఏక్ నయా పమేలీ’ పేరుతో రీమేక్ చేశారు. ఆకలి రాజ్యం (1981) 80వ దశకంలో యువతరం ముందున్న ప్రధాన సమస్య ఆకలి, నిరుద్యోగం - మరోవైపు కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం. అప్పటికే బాలచందర్ ఆడవాళ్ల కన్నీళ్లు (అంతులేని కథ, ఇది కథ కాదు, ఆడవాళ్లు మీకు జోహార్లు) కుర్రాళ్ల కలలు (మన్మథలీల, మరోచరిత్ర, అందమైన అనుభవం) తెరపై చూపించేశారు. రగులుతున్న సమస్యల్ని తనదైన కోణంలో చెప్పాలనుకున్నారు. అందుకు దేశ రాజధాని ఢిల్లీనే నేపథ్యంగా ఎంచుకున్నారు. వ్యవస్థ మీద ఎంత వ్యంగ్యంగా చెప్పాలో అంత వ్యంగ్యంగా చెప్పారు. ఓ సంగీత విద్వాంసుడి కొడుకు పొట్టకూటి కోసం క్షురకవృత్తి చేపట్టడం పరాకాష్ట. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్‌హాసన్ ఆశువుగా చెప్పిన కవితలు, ప్రసిద్ధ గాయకుడు పి.బి. శ్రీనివాస్ రాసిన హిందీ పాట... బురదలో పడ్డ ఆపిల్‌ని కడుక్కుని తినడం - ఒకటా, రెండా.. ఎన్నెన్నో గుర్తుండిపోయే అంశాలు. కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 1981 జనవరి 9న ఈ సినిమా విడుదలయితే, దీనితోపాటు ఎన్టీఆర్-రాఘవేంద్రరావుల ‘గజదొంగ’, జనవరి 14న కృష్ణ-రాఘవేంద్రరావుల ‘ఊరికి మొనగాడు’ విడుదలయ్యాయి. ఆ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రెండింటినీ తట్టుకుని ఈ సినిమా ఘన విజయం సాధించిందంటే ‘ఆకలిరాజ్యం’ పొటెన్షియాలిటీ అర్థం చేసుకోవచ్చు. ఎరడు రేఖగళ్ (కన్నడ) (1984) తన ప్రియురాలే తనపై అధికారిణిగా వస్తే... ఆమెని వదిలి, మరొకరిని వివాహమాడిన అతని పరిస్థితి ఏమవుతుంది? ‘ఇరుకోడగళ్’ అనే పేరుతో షావుకారు జానకి, జెమినీ గణేశన్, జయంతిలతో 1969లో కె. బాలచందర్ తమిళంలో తీసిన సినిమా ఇది.ఈ కథాంశంతో తెలుగులో ‘కలెక్టర్ జానకి’ సినిమా వచ్చింది.బాలచందర్ తమిళ-తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా, 1983లో ‘బెంకెయిల్లి అరడ హొవు’ చిత్రంతో కన్నడంతో ఎంటరయ్యారు. ఆ సినిమా సక్సెస్‌తో - 1984లో శ్రీనాథ్, సరిత, గీతలతో ‘ఎరడు రేఖగళ్’ (రెండు రేకులు) రూపొందించారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మాటల్లో చెప్పలేం. హిందీలో అమితాబ్ ‘సంజోగ్’ చిత్రానికి మూలం ఇదే. అంటే బాలచందర్ ఓ కథ రాస్తే, అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. భారతదేశమంతటా ఆ కథ భావోద్వేగం కలిగిస్తుందనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ఏక్ దూజ్ కే లియే (1981) భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రం ‘ఏక్ దూజ్ కే లియే’ మన తెలుగు సూపర్‌హిట్ ‘మరో చరిత్ర’ని హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. సినీ లెజెండ్ ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. తెలుగువారు, తమిళుల మధ్య ఎక్కువ అభిప్రాయభేధాలుండవు. కాని హిందీ-తమిళ భాషల మధ్య రాజకీయ నాయకుల పుణ్యమాని చాలా దూరం సృష్టించి ఉంది. అందుకే హిందీలో ఈ చిత్రం మరింత జనరంజకమయ్యింది. ప్రేమకి భాష అడ్డుకాదని వెండితెరపై ఒట్టేసి, చాలా బలంగా చెప్పిన సినిమా ఇది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారిని హిందీకి తీసుకెళ్లి, జాతీయ అవార్డుతో ఆయన ప్రతిభ ఏంటో దేశానికి చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలోని విరహం, విషాదం మబ్బు తునకలా గుండెని తడుపుతూనే ఉంటుంది. తెలుగులో విషాదాంతమైన ముగింపుని హిందీలో సుఖాంతం చేస్తే ఎలా ఉంటుందని చాలా చర్చలు జరిగాయి. రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేసి, చివరికి ట్రాజెడీనే ఎంచుకున్నారు. అందుకే ‘దేవదాసు’లా ఇదో అజరామరమైన ప్రేమకథ. ఇప్పటికీ ప్రేమకథల్లో (తొలిప్రేమ) బాలు యే హీరో. తన్నిరు - తన్నిరు (1981) మనిషికి అత్యవసరమైన వాటిల్లో నీరు ముఖ్యం. గాలి, నీరు అనేవి ప్రకృతి ఇచ్చేవి. కాని వాటిని కూడా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిస్తే సామాన్యులు ఎలా నలిగిపోతారనేది ‘తన్నిరు-తన్నిరు’ కథాంశం. ఓ పాపులర్ తమిళ నాటకం ఆధారంగా బాలచందర్ దీనిని తెరకెక్కించారు. 1981లో సరిత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ భారతాన్ని కళ్లకి కట్టినట్లు చూపించింది. యధావిధిగానే ఈ సినిమా సంచలనం రేకెత్తించింది. జాతీయ అవార్డులతో పాటు - చాలా ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. తెలుగులో ‘ఏ ఎండకా గొడుగు’ పేరుతో అనువాదమైంది. భారతీయ వంద ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాని ఐబిఎన్ ఛానెల్ పేర్కొంది సింధు భైరవి (1985) కళాకారుడికి ఎప్పుడూ ప్రేరణ అవసరం. అది ప్రకృతి నుంచి లభించవచ్చు. లేదా - ఎవరి ప్రేమ నుంచో దొరకొచ్చు. ఆ రెండోది అయితేనే సమస్య వస్తుంది. ఓ కర్ణాటక సంగీత విద్వాంసుడు తన ప్రియురాలిని స్ఫూర్తిగా తీసుకుని రాణిస్తుంటాడు. ఆమె దూరం కావడంతో సంగీతానికి దూరమవుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇద్దరు స్త్రీలు చేసిన ప్రయత్నం ఈ సినిమా. సుహాసిని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాగే ఇళయరాజా, చిత్రాలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది. రుద్రవీణ (1988) ‘ఇది కథ కాదు’ ‘47 రోజులు’ - కె. బాలచందర్ మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన చిత్రాలు. ఆ రెండింట్లో నెగెటివ్ పాత్రలు చేశారు చిరంజీవి. అన్నట్లు ‘ఆడవాళ్లూ - మీకు జోహార్లు’లో అతిథిపాత్రలో తళుక్కున మెరిశారు. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు - దర్శకుడిగా వాళ్ల ఫస్ట్ ఛాయిస్ బాలచందర్‌గారే! అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు - కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. అంతే కాదు - తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ‘రుద్రవీణ’ స్ఫూర్తితో యువకులందరూ కలిసి ఊళ్లోవాళ్ల తాగుడు మాన్పించి, ఆ డబ్బుతో లైబ్రరీ, స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ప్రభావితం చేశారనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? -
మళ్లి కూయవా గువ్వా!
► జగమంత కుటుంబం తనది! చక్రిదీ, నాదీ చిరకాల స్నేహం. సినిమాల్లోకి రావడాని కన్నా ముందే మా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రాంతంలో ఒక రికార్డింగ్ స్టూడియో ఉండేది. అక్కడ మా ఇద్దరికీ తొలి పరిచయమైంది. అతను గీత రచయితగా ఉన్నప్పుడు పాటలు రాసేవాడు. మా ఇద్దరి సినిమా కెరీర్లు కూడా దాదాపు ఒకటే సమయంలో మొదలయ్యాయి. పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా చక్రికి తొలి అవకాశం వచ్చిన రోజు కూడా నాకు బాగా గుర్తే. ముందుగా నాకు ‘చిత్రం’ (2000) సినిమాతో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైనప్పుడు దిల్సుఖ్ నగర్‌లోని గంగా థియేటర్లో మేమందరం వెళ్ళి, ‘చిత్రం’ షో చూస్తున్నాం. ఇంతలో, చక్రికి ఫోన్ వచ్చింది. పూరి జగన్నాథ్ ‘బాచి’ (2000) సినిమాకు ఛాన్స్ వచ్చింది. అంతే! ‘జగనన్న నుంచి ఫోన్ వచ్చింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. వెళ్ళి కలవాలి’ అంటూ సినిమా సగంలోనే వెళ్ళాడు. అలా అతని సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. తెలుగు సినీ సంగీతంలో మా ఇద్దరి కెరీర్లూ సమాంతరంగా సాగాయి. పోటాపోటీగా సినిమాలు చేశాం. అయితే, ఒకరి అవకాశాలను మరొకరు చేజిక్కించుకోవడం లాంటి అవాంఛనీయ ధోరణి ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు మంచి సంగీతంతో, మంచి పాటలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించేవాళ్ళం. పైగా, మా ఇద్దరికీ వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగా చాలా మంచి అనుబంధం ఉండేది. నన్ను అన్నయ్యగా భావిస్తే, తను నాకు తమ్ముడనుకొనేవాణ్ణి. పైగా, 2000 ప్రాంతంలో మా ఇద్దరి లక్ష్యం ఒకటే - సినీ సంగీత పరిశ్రమను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడేలా చేయాలని! అందుకోసం వీలైనంత కృషి చేశాం. ఇక్కడ వీలైనంత ఎక్కువమంది గాయనీ గాయకులనూ, సంగీత కళాకారులనూ పరిచయం చేశాం. స్థానికులకు అవకాశాలిచ్చాం. పైగా, రవివర్మ, కౌసల్య, ఉష లాంటి చాలా మంది యువ గాయనీ గాయకులు మా ఇద్దరి సంగీతంలో రెగ్యులర్‌గా పాటలు పాడేవారు. సంగీతం అందించాలంటూ తన దగ్గరకు వచ్చినవాళ్ళను అతను ఎప్పుడూ నొప్పించేవాడు కాదు. ‘నాకు పని వచ్చింది. అది బాగా చేయాలి’ అన్నదే అతని దృష్టి అంతా! అందుకే, సినిమాలతో నిత్యం బిజీగా ఉండేవాడు. అచిరకాలంలోనే 90 పైచిలుకు సినిమాలు పూర్తి చేయగలిగాడు. సంగీతపరంగా చక్రి బాణీల్లో అరబిక్ సంగీత స్పర్శ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ ప్రభావం ఉండేది. అందుకనే, అతను అంత మాస్ బాణీలు, బీట్ పాటలు ఇచ్చేవాడు. అదే సమయంలో చక్కటి శ్రావ్యమైన పాటలూ కూర్చాడు. ‘ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంలో అతను కూర్చిన మెలొడీ పాటలు ఆల్‌టైమ్ హిట్. కెరీర్లో జోరు కాస్తంత తగ్గినప్పుడల్లా మళ్ళీ ఒక సూపర్‌హిట్ సినిమా ఆల్బమ్‌తో ముందుకు దూసుకొచ్చేవాడు. చక్రి చాలా బోళామనిషి. గోరంత పొగిడినా, కొండంత సంతోషించే మనిషి. ఎప్పుడూ ఎవరి గురించీ చెడు మాట్లాడేవాడు కాదు. చక్రిలో అది నాకు బాగా నచ్చేది. చక్రి ఎన్నో పాటలు కూర్చినా, ఈ క్షణంలో చక్రి పాట అంటే నాకు గుర్తొస్తున్నది మాత్రం - ‘చక్రం’ చిత్రంలోని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది!’ దానికి కారణం లేకపోలేదు. చక్రికి ఎప్పుడూ చుట్టూరా జనం ఉండాలి... ఎంతమంది వచ్చినా, అందరికీ భోజనం పెట్టాలి. అదీ అతని స్నేహశీలత. ఇవాళ అంతమంది స్నేహితుల్ని సంపాదించుకొని, అందరినీ వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. చక్రి సినీ, వ్యక్తిగత జీవితం నుంచి అందరం నేర్చుకోవాల్సింది కూడా ఒకటుంది. ఎంత పని ఉన్నా... చేయండి. కానీ, దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. వేళకు తిండి తినండి. వేళాపాళా లేకుండా తినడం, అర్ధరాత్రి దాకా పనిచేసి, తెల్లవారు జామున ఎప్పుడో నాలుగింటికి తినడం లాంటి పనులు చేయకండి. ఆ జాగ్రత్తలు పాటించి ఉంటే, నలభై ఏళ్ళూ నిండీ నిండకుండానే చక్రి మనకు దూరమయ్యేవాడు కాదు. చక్రి మా ఇంట్లో సభ్యుడి లాంటివాడు. ఆ సభ్యుడు ఇవాళ లేడు. అది తీరని బాధ! - ఆర్.పి. పట్నాయక్ (సినీ సంగీత దర్శకుడు, చక్రికి చిరకాల స్నేహితుడు) -
ఇలాగొచ్చి అలా వెళ్లిపోయావా!
► ఒరేయ్ బిడ్డా...! ► నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. ► నేను హైదరాబాద్ కమలాపురి కాలనీలోని హుస్సేన్‌గారి అపార్ట్మెంట్లో ఉండేవాణ్ణి. ► ఆ ఎదురుగానే నిర్మాత జయకృష్ణ గారి సినిమా ఆఫీసు. ► నేను బయటికొస్తుంటే నువ్వు గేటు దగ్గర తగిలి, పరిచయం చేసుకున్నావ్. ► అప్పుడింత లావు లేవు... కొంచెం సన్నగా ఉన్నావ్ ► అగ్గగ్గలాడుతూ ‘నాకో ఛాన్సివ్వండి’ అనడిగావ్. ఇది జరిగిన నెలరోజుల తర్వాత- ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా పని మొదలైంది. మామూలుగా నా సినిమాలకు ఇళయరాజాగారే మ్యూజిక్కు. ఇదేమో చిన్న సినిమా. బడ్జెట్ సహకరించదు. హైదరాబాద్‌లో ఎవరున్నారా అని ఎంక్వైరీ చేస్తుంటే, ‘మళ్లి కూయవే గువ్వా’ పాట విన్నా. ఆ పాట నువ్వు చేసిందే! ‘ఇట్లు శ్రావణి - సుబ్రహ్మణ్యం’ సినిమాలోది. దాని డెరైక్టర్ పూరి జగన్నాథ్ గారిని నీ గురించి అడిగితే, ‘‘తక్కిన వాళ్లకంటే భిన్నంగా అతనిలో ఏదో ఉందండీ’’ అని చెప్పారు. దాంతో నిర్మాతకు నీ పేరే రికమండ్ చేశా.ఆ వేళ ఉదయం తొమ్మిదింటికి కంపోజింగ్ మొదలెట్టాలి. తొమ్మిదిన్నరైంది. నువ్వింకా రాలేదు. ‘మేస్ట్రో’ ఇళయరాజాతో చాలా సినిమాలలో పని చేసిన నాకు నువ్వెలా సింక్ అవుతావోనన్న బెంగ ఉంది. సాయంత్రం నాలుగు వరకూ చూసినా నువ్వు రాలేదు. నాకు భలే కోపం వచ్చేసింది. ‘‘అబ్బే... ఇతనితో కష్టం’’ అనేసుకుని కారెక్కిబోతుంటే నువ్వొచ్చావ్. షార్టు, బనీను వేసుకుని జాగింగ్‌కు వెళ్తున్నట్టుగా వచ్చావ్. ‘గుడీవినింగ్ సార్’ అని నువ్వు చెబితే, నేను కోప్పడి వెళ్ళిపోబోయాను. నువ్వు తెగ బతిమిలాడావ్. నాకు అప్పటికప్పుడు‘వెన్నెల్లో హాయ్‌హాయ్’ పాట వినిపిస్తే అక్కడికక్కడే చతికిలపడిపోయా. నీ మీద కోపమంతా పోయింది. నువ్వేదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు. అప్పట్నుంచి నువ్వు నన్నొదల్లేదు. నేను నిన్నొదల్లేదు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ పాటలు ఎంత హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నేను తీసిన ‘దొంగ రాముడు అండ్ పార్టీ’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’, ‘గోపి-గోపిక-గోదావరి’, ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమాలకు నువ్వే మ్యూజిక్కిచ్చావ్. అన్నీ మంచి మంచి పాటలే. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటలైతే రింగ్టోన్లుగా, కాలర్ ట్యూన్లుగా మార్మోగిపోయాయి కదా! నాకు లాంగ్ డ్రైవ్లిష్టం. నువ్వే నీ కారులో ఎక్కడెక్కడికో తిప్పేవాడివి. ఇద్దరం కలిసి రకరకాల తిండి తినేవాళ్లం. ఓసారి మీ ఊరు కంబాలపల్లి తీసుకెళ్లావ్. నువ్వొస్తున్నావని తెలిసి ఎంతమంది జనమో! ఎవరికి వాళ్లు నిన్ను పలకరించేవాళ్లే. ఇదంతా మ్యూజిక్ డెరైక్టర్‌గా నీ ఫాలోయింగ్ అనుకున్నా. కాదు... ఓ వ్యక్తిగా నీ ఫాలోయింగ్ అని తర్వాత తెలిసింది. మామూలుగా ఆగస్టు తొలి ఆదివార మో ఎప్పుడో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. కానీ నువ్వేమో ఫిబ్రవరి 10న ఓ ఫ్రెండ్షిప్ డే క్రియేట్ చేసుకున్నావ్. ఆ రోజు నువ్వు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మహబూబాబాద్, వరంగల్, కంబాలపల్లి.... ఇలా రకరకాల ఊళ్ళ నుంచి నీ ఫ్రెండ్సంతా వచ్చేస్తారు. ఇక హైదరాబాద్ గ్యాంగ్ ఎలాగూ ఉంటారు. మార్నింగ్ ఎనిమిదింటికి మొదలెడితే నెక్ట్స్డే మార్నింగ్ వరకూ పండగే పండగ. చాలామంది సింగర్స్ నీ పాటలు పాడుతుంటే సంబరపడిపోయేవాడివి. మంచి ఫుడ్ పెట్టేవాడివి. ►నీ బర్త్‌డే రోజు కూడా అంతే... సందడి చేసేవాడివి. ► ఇలాంటివి ఏంటేంటో... అద్భుతాలు చేసేసేవాడివి. ► అన్నదానాలు, రక్తదానాలు కూడా చేసేవాడివి. ఓ రోజు నిన్ను జెల్ల కొట్టాను. ‘గట్టిగా కొట్టకండి’ అన్నావు నువ్వు. ‘ఏం... దేనికి’ అని నేను రెట్టిస్తే, ‘‘నేనొక వ్యవస్థను. నా మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు’’ అంటూ నువ్వు నీ ట్రస్ట్ గురించి, నువ్వు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పుకొస్తే చాలా అబ్బురపడిపోయాన్నేను. అప్పట్లో మనం ఎన్నోసార్లు కలుసుకునేవాళ్లం. ఎందుకో ఈ మధ్య నేను బిజీ అయిపోయి నిన్ను కలవడమే తగ్గిపోయింది. సరిగ్గా క్రితం వారమే అనుకుంటా కదా... నిన్ను కలిసింది. అప్పుడు నువ్వో మాటన్నావ్. ‘‘నెక్ట్స్ సినిమా ఓ అద్భుతం చేద్దాం’’ అని బలంగా చెప్పావు. నా లైఫ్‌లో చాలా చాలా అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. నేను జీవితంలో డబ్బేమీ సంపాదించుకోలేదు. కానీ, అద్భుతమైన వ్యక్తుల సాంగత్యాన్ని సంపాదించుకున్నా. ఆ అద్భుతమైన వ్యక్తుల్లో నువ్వొకడివి. ఎవ్వరికీ సాయమే తప్ప హాని చేయని ఓ మరపురాని మనిషివి నువ్వు. అందరూ నువ్వీ భూమ్మీద నుంచి వెళ్లిపోయావంటున్నారు. నాకైతే నమ్మశక్యంగా లేదు. ఏ కంబాలపల్లో వెళ్లావనుకుంటున్నాను. అయినా నీకెందుకంత తొందర. ఇలాగొచ్చి మరీ... అలా వెళ్లిపోయావ్! నమ్మలేకపోతున్నా బిడ్డా! నీ వంశీ -
సినిమా, క్రికెట్‌ను భారతీయులు ఆరాధిస్తారు
45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను ప్రారంభించిన అరుణ్ జైట్లీ పణజి: భారతీయులు క్రికెట్‌ను ఎంత ఆరాధిస్తారో.. సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారు. గోవా రాజధాని పణజిలో 45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ముఖ్య అతిథిగా హాజరై భారతీయ సినిమా పరిణామంపై ప్రసంగించారు. ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డును రజినీకాంత్ అందుకున్నారు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురైన రజినీ బిగ్‌బీ పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, అనుపమ్ ఖేర్, రవీనా టండన్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్
కళా దర్శకుడి ప్రతిభను బట్టే వెండితెరకు నిండుదనం చేకూరుతుంది. అతనెంత సృజన చూపితే అంతగా ఆ సినిమాలోని సెట్టింగ్స్ ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఆయా సన్నివేశాలకు బలమైన నేపథ్యంగా ఉపయోగపడటంతో పాటు కొన్నిసార్లు ‘సీన్’ను పీక్కు తీసుకువెళ్తాయి. సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసేవి సెట్టింగ్‌లే. అందుకే, వీటికున్న ప్రాధాన్యమే వేరు. కళా దర్శకుడు చూపే వైవిధ్యమే వీటికి ప్రాణం. ఇదే విషయం ఆనంద్‌సాయిని అడిగితే- ‘నా ‘కళ’ సినిమాలు దాటి పెళ్లి మంటపాల వరకూ చేరి అదో ట్రెండ్‌గా స్థిరపడింది. నా మొదటి సినిమా తొలిప్రేమ. అందులో నేను వేసిన తాజ్‌మహల్ సెట్టింగ్ అందరికీ చాలా బాగా నచ్చింది’ అంటారు. ఈ రంగంపై మీకు ఆసక్తి ఎలా కలిగిందంటే- ‘ఫైన్ ఆర్ట్స్ పూర్తవ్వగానే.. నా మనసు ఆర్ట్ డిపార్ట్మెంట్కు అంకితమైపోయింది. దర్శకుడికి అవసరమైన అవుట్‌పుట్ ఇస్తూనే.. ఆ సెట్టింగ్‌లో అడుగడుగునా నా మార్క్ కనిపించేలా ప్రయత్నిస్తుంటాను. సినిమా చూసిన ప్రేక్షకులకు అద్భుతమైన రూపాలను చూపించాలన్న తపనే.. నా ఊహలకు ప్రాణం పోస్తుంది’ అంటారాయన. నాన్నే స్ఫూర్తి... ‘మా నాన్న ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ బి.చలం.జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా.. వంటి సినిమాలకు ఆయన ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. దాదాపు 700 సినిమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన నాన్నే ఈ కళలో నాకు స్ఫూర్తి. ఆయన వారసత్వంగా వచ్చిన ఈ కళను.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ‘సెట్’ చేసుకుంటున్నాను. సినిమా సినిమాకూ కొత్తదనం చూపించగలగాలి.. అప్పుడే మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సినిమాలకు పనిచేస్తూనే పెళ్లిళ్లకు సెట్టింగ్‌లు వే స్తుంటాను. చిరంజీవి కుమార్తె పెళ్లి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వరకూ చాలామంది ప్రముఖుల పెళ్లిళ్లకు సెట్లు వేశాను. నిజమైన కట్టడాలను మరపించేలా కనిపించే ఆ సెట్టింగ్‌లకు ఖర్చు పెద్ద మొత్తంలోనే అవుతుంది. ఖర్చు ఎంతైనా.. వెనుకాడకుండా ఎంతో ఆసక్తితో దగ్గరుండి మరీ సెట్టింగ్‌లు వేయించునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది’ అని వివరించారు ఆనంద్‌సాయి. సెట్ అయిపోతుంది.. ఈ మధ్యకాలంలో ఒక సినిమా కోసం వేసిన సినిమా సెట్టింగ్‌ను చిన్న చిన్న మార్పులతో ఇతర సినిమాలకూ వాడుతున్నారు.‘బృందావనం’ సినిమాకి వేసిన ఇంటి సెట్టింగ్‌ను ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాలకు వాడారు. అలాగే ‘నాయక్’ సినిమాకి వేసిన కాలనీ సెట్టింగ్‌ను స్వల్ప మార్పు చేర్పులతో ‘ఎవడు’ సినిమాకీ వాడారు. కోట్లు ఖర్చు పెట్టి వేయించుకున్న సెట్టింగ్‌లను మళ్లీ మళ్లీ వేరే కోణాల్లో వాడుతున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తవగానే కొన్ని సెట్లను తీసేస్తారు. కొన్నింటిని అలాగే ఉంచుతారు. ‘నేను ‘యమదొంగ’ సినిమా కోసం వేసిన యమలోకం సెట్ అలాంటిదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. తర్వాత చాలా సినిమాలకు ఆ సెట్టింగ్ వాడారు’ అని ఆనంద్ చెబుతారు. ప్రయాణాలే రహస్యం.. వైవిధ్యభరితమైన సెట్టింగ్స్‌కు రూపమెలా ఇస్తారని అడిగితే- ‘సీక్రెట్ ఏమీ లేదు. విరివిగా ప్రయాణాలు చేస్తా. ఎక్కడికి వెళ్లినా.. ప్రత్యేకంగా కనిపించే దృశ్యాల కోసం నా కళ్లు వెతుకుతాయి. అవి నా మనసుకు హత్తుకుంటే వెంటనే కళ్లలో ప్రింట్ చేసుకుంటాను. లేదంటే అప్పటికప్పుడు పేపర్‌పై పెట్టేస్తాను’అంటారాయన. -
జీవితం అంటే టీవి సీరియల్స్ మాత్రమేనా?
టీవి చూడడాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు. టీవిలో సీరియల్స్ చూడడాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. కానీ, శృతి మించితే ఏదైనా సీరియస్‌గా తీసుకోకతప్పదనిపిస్తుంది. మా ఆవిడకు టీవియే లోకం, ప్రాణం. టీవీలో వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. అది గతంలో థియేటర్లో చూసిన సినిమా అయినా సరే. ఇక టీవీలలో సీరియల్స్ మొదలైన తరువాత... అవి చూడడం ఆమెకు ఒక వ్యసనంగా మారింది. సీరియల్స్ చూడడం, అందులొని సన్నివేశాలను పక్కింటి వాళ్లకు చెప్పడం ఆమెకు పరిపాటిగా మారింది. ‘‘ఎప్పుడూ ఆ టీవి సీరియల్స్ చూసే బదులు ఏవైనా మంచి పుస్తకాలు చదువుకోవచ్చు కదా’’ అని ఒకరోజు సలహా ఇస్తే - ‘‘మీ చాదస్తాలన్నీ నా మీద రుద్దకండి. మీ పనేదో మీరు చూసుకోండి’’ అని హెచ్చరించింది. నా పనేదో నేను చూసుకుందామనే అనుకున్నానుగానీ, మా ఆవిడ సీరియల్స్ పిచ్చి కారణంగా పిల్లల చదువు పూర్తిగా దెబ్బతింటోంది. ఒకప్పుడు పిల్లలను కూర్చోబెట్టుకొని చదివించేది. ఇప్పుడు టీవీకి అతుక్కుపోవడం తప్ప పిల్లల చదువు గురించి ఆలోచించడం లేదు. ‘‘సీరియల్స్ చూడడం తగ్గించు. జీవితం అంటే టీవి సీరియల్స్ మాత్రమే కాదు. చాలా ఉంది. పిల్లల చదువు పట్టించుకో’’ అని చెప్పాలని ఉంది.కానీ అంత ధైర్యం లేక, కాస్తో కూస్తో ఉన్న ధైర్యం చాలక... నాలో నేను రగిలిపోతున్నాను. - ఆర్, విజయవాడ -
పిల్లల కోసం బళ్లో...
స్ఫూర్తి అప్పుడెప్పుడో కాలేజీ బుల్లోడు అనే సినిమా వచ్చింది. కోట్ల ఆస్తి ఉండి కూడా కొడుకుని దార్లో పెట్టడానికి ఏఎన్నార్ కాలేజీలో చేరతారు. ఆ వయసులో కాలేజీకి వెళ్లడమేంటి, సినిమా కాబట్టి సరిపోయింది అనుకున్నారంతా. కానీ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా అలా జరుగు తుందని ముంబైకి చెందిన జయశ్రీ కానమ్ నిరూపించింది. నలభయ్యొక్కేళ్ల వయసులో జయశ్రీ బడిలో చేరింది. అయితే ఏఎన్నార్లాగా పిల్లల్ని దారిలో పెట్టడానికి కాదు.. తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తునూ తీర్చిదిద్దడానికి! చిన్నప్పుడు ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసింది జయశ్రీ. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేది. యుక్త వయసు వచ్చిన తరువాత జయంత్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడ పిల్లలకు తల్లయ్యింది. అంతా ఆనందంగా ఉంది అనుకున్న సమయంలో ఆమె జీవితం అల్లకల్లోలం అయ్యింది. 2005లో... ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న జయంత్ హఠాత్తుగా వచ్చిన వరద నీటిలో చిక్కుకుని మరణించాడు. దాంతో కూతుళ్ల బాధ్యత జయశ్రీ మీదే పడింది. ఇళ్లల్లో వంట పని చేస్తూ కూతుళ్లను చదివించసాగింది. అంతలో అనుకోకుండా అంగన్వాడీలో పనిచేసే అవకాశం వచ్చింది జయశ్రీకి. అక్కడ చిన్న పిల్లలకు తనకు తెలిసిన చదువు చెప్పేది. ఆమె తెలివితేటలను గుర్తించిన ఓ ప్రభుత్వాధికారి, ‘నువ్వు చదువుకుని ఉంటే ఇంకా మంచి పని ఇప్పించే వాడిని, పిల్లల్ని ఇంకా బాగా పెంచుకునేదానివి’ అన్నారు. అంతే... ఆ క్షణమే ఆమె చదువుకోవాలని నిర్ణయించుకుంది. జయశ్రీ పెద్ద కూతురు షీతల్ ఇంటర్ చదువుతోంది. రెండో కూతురు శ్వేత ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. కూతురితో పాటే జయశ్రీ కూడా పరీక్షలు రాసింది. డిగ్రీ కూడా చేస్తానంటోంది. ఇన్నేళ్ల తరువాత చదువుకుంటు న్నందుకు సంతోషపడటం లేదామె. తన కూతుళ్ల కోసం చదువుకుంటున్నందుకు సంబరపడుతోంది. తమ కోసం కష్టపడుతోన్న తల్లికి షీతల్, శ్వేతలు సహాయ పడుతున్నారు. తాము కూడా బాగా చదివి తల్లిని మహరాణిలా చూసు కుంటామంటున్నారు. అమ్మ రుణం తీర్చుకోవడానికి వాళ్లు ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటారు!