పదికాలాల... బాలచంద్రికలు | k. balachandhar special | Sakshi
Sakshi News home page

పదికాలాల... బాలచంద్రికలు

Published Tue, Dec 23 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

పదికాలాల...  బాలచంద్రికలు

పదికాలాల... బాలచంద్రికలు

కె.బాలచందర్ -  భారతీయ సినిమా సగర్వంగా తలెత్తి చూసే దర్శక శిఖరం. మాలాంటి వాళ్లం పుట్టకముందే ఆయన ప్రముఖ రచయిత, దర్శకుడు. అంటే మాకు ఊహ తెలిసి, సినిమాల మీద మోజు పడేటప్పుటికి బాలచందర్ ఆలోచనలు, సినిమాలు అవుట్‌డేటెడ్ అయిపోయి ఉండాలి. కాని... మొన్న మొన్నటి దాకా ఏ జనరేషన్ ఎమోషన్ - ఆ జనరేషన్ టైమ్‌లోనే పట్టుకుని - మధ్య తరగతి కష్టాలు, యువతరం ఆవేశాలు, ప్రేమ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన అద్భుత చిత్రకారుడు బాలచందర్. తమిళుడైనా - తమిళ, తెలుగు, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా సూపర్‌హిట్ సినిమాలు తీశారు. కాని ఎక్కడా ఏ ప్రాంతం, భాష వాసనా రాదు. మానవత్వం, వాస్తవాల పరిమళాలే వీస్తాయి. కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. మరికొన్ని చాలా ఘాటుగా ఉంటాయి. 50 సంవత్సరాల సినిమా కెరీర్‌లో 101 సినిమాలు - వాటిలో కొన్ని వందల జీవితాలు - ముందు తరాలకి కూడా చేరువయ్యేలా. వాటిలో నుంచి కొన్ని ఎంపిక చేసుకోవడం కష్టమైనదే. వేటిని కాదనగలం? వేటిని వదిలేయగలం? అయినప్పటికీ మనసుపై చెరగని ముద్రవేసిన ఓ పది సినిమాల గురించి...
 
బొమ్మా - బొరుసా? (1971)


‘సుఖదుఃఖాలు’, ‘సర్వర్ సుందరం’, ‘సంబరాల రాంబాబు’ - ఈ సినిమాలతో బాలచందర్ కథలు తెలుగు ప్రేక్షకులని పలకరించాయి. సుఖదుఃఖాలు (మేజర్ చంద్రకాంత్), సర్వర్ సుందరం - ఆయన రాసిన నాటకాలు. ‘భలే కోడళ్లు’, ‘సత్తెకాలపు సత్తయ్య’ చిత్రాలతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన స్టార్‌డమ్ స్టామినాకి తెలుగులో బాక్సాఫీస్ సాక్షిగా శ్రీకారం చుట్టిన సినిమా ‘బొమ్మా-బొరుసా?’. అంతవరకూ బాలచందర్‌గారి స్క్రిప్టుల్లో నాటకీయత, సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉండేది. పూర్తిగా వినోదంతో కొంత వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథ ‘బొమ్మా- బొరుసా?’. 1971లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి అత్తా అల్లుళ్ల ఛాలెంజ్‌ల కథలకి ముడిసరుకు. బాలచందర్ సినిమా నేపథ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తారనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. విజయవాడ, నాగార్జున సాగర్ బాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంటుంది.

అహంభావి, గర్విష్టి, డబ్బు మీద ఆశ ఉన్న (అత్తగారికీ (ఎస్. వరలక్ష్మి), ముగ్గురు అల్లుళ్లు (జట్కాబండి అల్లుడు - చలం, మిగిలిన వారు రామకృష్ణ, చంద్రమోహన్) ఎలా బుద్ధి చెప్పారనేది లైన్. సాధారణంగా బాలచందర్ సినిమా ప్రారంభంలోనే ప్రధాన పాత్రలని పరిచయం చేసి, కథలో ఇన్వాల్వ్ అయ్యేలా కథనాన్ని పరిగెత్తిస్తారు. ఫస్ట్ షాట్‌లోనే సినిమా ఎలా ఉంటుందనేది చెప్పడం బాలచందర్ స్టయిల్. దానికి మరో అందమైన సాక్ష్యం - ఈ సినిమా ప్రారంభం. బొడ్లో తాళాల గుత్తి దోపుకున్న ఎస్. వరలక్ష్మి మాట్లాడుతుంటే, పక్కనే బీరువా మీద ఉన్న బొమ్మ తలాడిస్తుంటుంది. అత్త మాటలకి అల్లుడు తందానా తానా అనేది చాలా సింబాలిక్‌గా చెప్పారు. ఎ.వి.ఎమ్. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
 అరంగేట్రం (తమిళం) (1973)

 తమిళనాట పెను సంచలనం సృష్టించిన సినిమా ‘అరంగ్రేటం’. బాలచందర్ సినిమాల్లో స్త్రీ పాత్రలని చాలా బోల్డ్‌గా చూపించడం ఈ సినిమాతోనే ప్రారంభమైనందని చెప్పాలి.  ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలోకి దిగడమనేది ఈ సినిమా కథాంశం. ప్రమీల కథానాయిక పాత్ర పోషించారు.
 అప్పట్లో ఈ సినిమా పలు వివాదాలకి, విమర్శలకి దారి తీసింది. అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్‌హాసన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జీవిత రంగం’ పేరుతో పి.డి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. హిందీలో ముంతాజ్, రాజేష్‌ఖన్నాలతో ‘అయినా’ అని బాలచందరే స్వయంగా రీమేక్ చేశారు.
 
అంతులేని కథ (1976)

 బాలచందర్ కీర్తి తెలుగునాట పతాక స్థాయికి చేర్చిన సినిమా ‘అంతులేని కథ’. ఓ వర్కింగ్ ఉమెన్ జీవితంలోని ఒడిదుడుకులని, ఆశలని, నిరాశలని చాలా హృద్యంగా చిత్రీకరించారు బాలచందర్.‘మేఘ దాకా తారా’ అనే అస్సామీ చిత్రం ప్రభావం దీనిపై ఉందని కొంతమంది విమర్శకులు అంటుంటారు. జయప్రదకి విశేషంగా పేరు తెచ్చి పెట్టిన ఈ సినిమాలో ఎందరో మహిళా ఉద్యోగినులు తమ వేదనని వెదుక్కున్నారు.మొదట సుజాత హీరోయిన్‌గా 1974లో ‘అవళ్ ఒరు తోడర్ కథై’ పేరుతో ఈ సినిమా తీశారు. హిందీలో రేఖతో తాతినేని రామారావు ‘జీవన్‌ధార’, కన్నడంలో సుహాసినితో బాలచందరే స్వయంగా ‘బెంకెయిల్లి అరిడ హూవు’ (అగ్నిలో పుట్టిన పువ్వు) పేరిట రీమేక్ చేశారు. బెంగాలీలో కూడా ‘కబిత’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ముగింపులో, పబ్లిసిటీలో ‘ఇంకా ఉంది’ అని ప్రచారం చేయడం - ప్రేక్షకులు సరికొత్తగా ఫీలయ్యారు. ఈ చిత్రం మీద ఆసక్తి రెట్టింపయ్యింది.
 
 అపూర్వ రాగంగళ్ (1975)

తండ్రి మీద ఓ యువతి మనసు పడుతుంది. ఆ తండ్రి కొడుకు ఆ యువతి తల్లిపై ప్రేమ పెంచుకుంటాడు. విచిత్రమైన ఈ పొడుపు కథలాంటి కథతో సినిమా తీయాలంటే ఆ డెరైక్టర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి? ఆ ధైర్యం బాలచందర్‌కి ఉంది కాబట్టే - ఆయన అజరామరమైన దర్శకుడయ్యారు. 1975లో వచ్చిన ఈ సినిమా చాలా చర్చనీయాంశమైంది. సామాజిక కట్టుబాట్లని సవాల్ చేసింది.
 శ్రీవిద్య, కమల్‌హాసన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిచయమయ్యారు.
 ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ కథాంశం కొత్తగా ఉంటుంది. అంతే కాదు - స్వతహాగా రచయిత అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు తొలిసారి రీమేక్ చేసింది ఈ సినిమానే (తూర్పు-పడమర). జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకుంది ఈ ‘అపూర్వ రాగంగళ్’. బాలచందర్ స్వయంగా రాజ్‌కుమార్, కమల్‌హాసన్, హేమమాలిని, పద్మిని కొల్హాపురిలతో ‘ఏక్ నయా పమేలీ’ పేరుతో రీమేక్ చేశారు.
 
ఆకలి రాజ్యం (1981)

80వ దశకంలో యువతరం ముందున్న ప్రధాన సమస్య ఆకలి, నిరుద్యోగం - మరోవైపు కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం.
 అప్పటికే బాలచందర్ ఆడవాళ్ల కన్నీళ్లు (అంతులేని కథ, ఇది కథ కాదు, ఆడవాళ్లు మీకు జోహార్లు) కుర్రాళ్ల కలలు (మన్మథలీల, మరోచరిత్ర, అందమైన అనుభవం) తెరపై చూపించేశారు. రగులుతున్న సమస్యల్ని తనదైన కోణంలో చెప్పాలనుకున్నారు. అందుకు దేశ రాజధాని ఢిల్లీనే నేపథ్యంగా ఎంచుకున్నారు. వ్యవస్థ మీద ఎంత వ్యంగ్యంగా చెప్పాలో అంత వ్యంగ్యంగా చెప్పారు. ఓ సంగీత విద్వాంసుడి కొడుకు పొట్టకూటి కోసం క్షురకవృత్తి చేపట్టడం పరాకాష్ట. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్‌హాసన్ ఆశువుగా చెప్పిన కవితలు, ప్రసిద్ధ గాయకుడు పి.బి. శ్రీనివాస్ రాసిన హిందీ పాట... బురదలో పడ్డ ఆపిల్‌ని కడుక్కుని తినడం - ఒకటా, రెండా.. ఎన్నెన్నో గుర్తుండిపోయే అంశాలు. కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 1981 జనవరి 9న ఈ సినిమా విడుదలయితే, దీనితోపాటు ఎన్టీఆర్-రాఘవేంద్రరావుల ‘గజదొంగ’, జనవరి 14న కృష్ణ-రాఘవేంద్రరావుల ‘ఊరికి మొనగాడు’ విడుదలయ్యాయి. ఆ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రెండింటినీ తట్టుకుని ఈ సినిమా ఘన విజయం సాధించిందంటే ‘ఆకలిరాజ్యం’ పొటెన్షియాలిటీ అర్థం చేసుకోవచ్చు.
 
ఎరడు రేఖగళ్ (కన్నడ) (1984)

తన ప్రియురాలే తనపై అధికారిణిగా వస్తే... ఆమెని వదిలి, మరొకరిని వివాహమాడిన అతని పరిస్థితి ఏమవుతుంది?
 ‘ఇరుకోడగళ్’ అనే పేరుతో షావుకారు జానకి, జెమినీ గణేశన్, జయంతిలతో 1969లో కె. బాలచందర్ తమిళంలో తీసిన సినిమా ఇది.ఈ కథాంశంతో తెలుగులో ‘కలెక్టర్ జానకి’ సినిమా వచ్చింది.బాలచందర్ తమిళ-తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా, 1983లో ‘బెంకెయిల్లి అరడ హొవు’ చిత్రంతో కన్నడంతో ఎంటరయ్యారు. ఆ సినిమా సక్సెస్‌తో - 1984లో శ్రీనాథ్, సరిత, గీతలతో ‘ఎరడు రేఖగళ్’ (రెండు రేకులు) రూపొందించారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మాటల్లో చెప్పలేం. హిందీలో అమితాబ్ ‘సంజోగ్’ చిత్రానికి మూలం ఇదే. అంటే బాలచందర్ ఓ కథ రాస్తే, అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. భారతదేశమంతటా ఆ కథ భావోద్వేగం కలిగిస్తుందనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ.
 
ఏక్ దూజ్ కే లియే (1981)

 భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రం ‘ఏక్ దూజ్ కే లియే’ మన తెలుగు సూపర్‌హిట్ ‘మరో చరిత్ర’ని హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. సినీ లెజెండ్ ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. తెలుగువారు, తమిళుల మధ్య ఎక్కువ అభిప్రాయభేధాలుండవు. కాని హిందీ-తమిళ భాషల మధ్య రాజకీయ నాయకుల పుణ్యమాని చాలా దూరం సృష్టించి ఉంది.
 అందుకే హిందీలో ఈ చిత్రం మరింత జనరంజకమయ్యింది. ప్రేమకి భాష అడ్డుకాదని వెండితెరపై ఒట్టేసి, చాలా బలంగా చెప్పిన సినిమా ఇది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారిని హిందీకి తీసుకెళ్లి, జాతీయ అవార్డుతో ఆయన ప్రతిభ ఏంటో దేశానికి చాటి చెప్పిన సినిమా ఇది.
 ఈ సినిమాలోని విరహం, విషాదం మబ్బు తునకలా గుండెని తడుపుతూనే ఉంటుంది. తెలుగులో విషాదాంతమైన ముగింపుని హిందీలో సుఖాంతం చేస్తే ఎలా ఉంటుందని చాలా చర్చలు జరిగాయి. రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేసి, చివరికి ట్రాజెడీనే ఎంచుకున్నారు. అందుకే ‘దేవదాసు’లా ఇదో అజరామరమైన ప్రేమకథ. ఇప్పటికీ ప్రేమకథల్లో (తొలిప్రేమ) బాలు యే హీరో.
 
తన్నిరు - తన్నిరు (1981)

మనిషికి అత్యవసరమైన వాటిల్లో నీరు ముఖ్యం. గాలి, నీరు అనేవి ప్రకృతి ఇచ్చేవి. కాని వాటిని కూడా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిస్తే సామాన్యులు ఎలా నలిగిపోతారనేది ‘తన్నిరు-తన్నిరు’ కథాంశం. ఓ పాపులర్ తమిళ నాటకం ఆధారంగా బాలచందర్ దీనిని తెరకెక్కించారు. 1981లో సరిత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ భారతాన్ని కళ్లకి కట్టినట్లు చూపించింది. యధావిధిగానే ఈ సినిమా సంచలనం రేకెత్తించింది. జాతీయ అవార్డులతో పాటు - చాలా ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. తెలుగులో ‘ఏ ఎండకా గొడుగు’ పేరుతో అనువాదమైంది. భారతీయ వంద ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాని ఐబిఎన్ ఛానెల్ పేర్కొంది
 
సింధు భైరవి (1985)

కళాకారుడికి ఎప్పుడూ ప్రేరణ అవసరం. అది ప్రకృతి నుంచి లభించవచ్చు. లేదా - ఎవరి ప్రేమ నుంచో దొరకొచ్చు. ఆ రెండోది అయితేనే సమస్య వస్తుంది. ఓ కర్ణాటక సంగీత విద్వాంసుడు తన ప్రియురాలిని స్ఫూర్తిగా తీసుకుని రాణిస్తుంటాడు. ఆమె దూరం కావడంతో సంగీతానికి దూరమవుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇద్దరు స్త్రీలు చేసిన ప్రయత్నం ఈ సినిమా. సుహాసిని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాగే ఇళయరాజా, చిత్రాలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది.
 
రుద్రవీణ (1988)

‘ఇది కథ కాదు’ ‘47 రోజులు’ - కె. బాలచందర్ మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన చిత్రాలు. ఆ రెండింట్లో నెగెటివ్ పాత్రలు చేశారు చిరంజీవి. అన్నట్లు ‘ఆడవాళ్లూ - మీకు జోహార్లు’లో అతిథిపాత్రలో తళుక్కున మెరిశారు. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు - దర్శకుడిగా వాళ్ల ఫస్ట్ ఛాయిస్ బాలచందర్‌గారే! అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు - కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. అంతే కాదు - తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ‘రుద్రవీణ’ స్ఫూర్తితో యువకులందరూ కలిసి ఊళ్లోవాళ్ల తాగుడు మాన్పించి, ఆ డబ్బుతో లైబ్రరీ, స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ప్రభావితం చేశారనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement