భారతీయ సినిమా అంటే... బాలీవుడ్డేనా !? | Indian cinema is only bollywood ? | Sakshi
Sakshi News home page

భారతీయ సినిమా అంటే... బాలీవుడ్డేనా !?

Published Mon, Nov 24 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

భారతీయ సినిమా అంటే... బాలీవుడ్డేనా !?

భారతీయ సినిమా అంటే... బాలీవుడ్డేనా !?

1970లలో దేశమంతటా మధ్యతరగతిని అమితంగా ఆకట్టుకున్న హీరో అంటే... అమోల్ పాలేకరే. ఆయన నటించిన ‘గోల్‌మాల్’, ‘చిత్‌చోర్’, ‘ఛోటీ సీ బాత్’ - ఇలా ప్రతి చిత్రం అప్పట్లో ఒక క్రేజ్. అందుకే, మరాఠీ గడ్డ మీద పుట్టిన ఈ మరపురాని నటుడికి ఆ నాటి నుంచి ఈ నాటి దాకా ఒక వర్గంలో చెరగని అభిమానం. ఉత్తమ నటుడిగా ఆరుసార్లు ప్రభుత్వ అవార్డులు అందుకున్న ఆయన ఆ తర్వాత మనసుకు నచ్చిన పాత్రలే చేస్తూ, అరుదుగా తెరపైకొస్తున్నారు. అయితే, దర్శకుడిగా, మంచి చిత్రాల ఉద్యమశీలిగా సినిమా రంగంతోనే మమేకమై జీవితం సాగిస్తున్నారు. ‘యాదృచ్ఛి కంగా నటుణ్ణయ్యా. తప్పనిసరై నిర్మాతనయ్యా. ఏరికోరి దర్శకుడినయ్యా...’ అనే అమోల్‌తో సంభాషణ ఒక ఆలోచనాంతరంగ యానం.

రంగస్థలం, సినిమా, టీవీ - ఇలా అన్నిటిలో తనదైన ముద్ర వేసిన ఈ కళాకృషీవలుడికి సినీ మీడియవ్‌ు మీద అతి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అటు కళాత్మక చిత్రాలకూ, ఇటు కమర్షియల్ చిత్రాలకూ మధ్య వారధిగా... నేటి మార్కెట్ చోదిత సినీ సృజనపై అమితమైన ఆవేదన ఉంది. ‘చిల్డ్రన్‌‌స ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’కు సారథ్యం వహిస్తూ, దేశంలో బాలల చలనచిత్రోత్స వానికి నాంది పలికిన వ్యక్తిగా... బాలల సినిమా భవిష్యత్తుకు చేయాల్సిన పనిపై అవగాహన ఉంది. అమోల్ పాలేకర్‌ను కదిలిస్తే... ఆ భావాల జల్లులో తడవాల్సిందే. ఆలోచనలో మునగాల్సిందే.  

నేటితో ఏడుపదులు నిండిన అమోల్ అంతరంగ ఆవిష్కరణ... అభిమాన పాఠకులకు ‘సాక్షి ఫ్యామిలీ’ గిఫ్ట్.


నటుడిగా, దర్శకుడిగా నేనెప్పుడూ ప్రధాన స్రవంతి చిత్రాల్లో భాగం కాదు. 47 ఏళ్ళుగా ఏటికి ఎదురీదుతూనే ఉన్నా. ప్రధాన స్రవంతికి దూరంగా ఇన్నేళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతున్నందుకు హ్యాపీ. నిజానికి, బాసు ఛటర్జీ, హృషీకేశ్ ముఖర్జీల చిత్రాలు అప్పట్లో ఆడాయంటే కారణం - అవి ప్రధాన స్రవంతివి కాకపోవడమే. బస్సులో, లోకల్ ట్రెయిన్‌లో తిరిగే హీరోగా తెరపై కనిపించిన మొదటివాణ్ణి నేనే.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1960ల నుంచి ’80ల వరకు రంగస్థలం, సంగీతం, నృత్యం, శిల్పకళ, సినిమా - ఇలా అనేక రంగాల్లో మన ప్రభ వెలిగింది. ఆ కాలఘట్టంలో మన భారతీయ ఉనికినీ, గుర్తింపునూ చాటుకోగలిగాం. ఆయా రంగాల్లో ఉద్దండులైన మహామహులు చుట్టూ ఉండేవారు. దాంతో మన భారతీయ సమాంతర చలనచిత్ర ఉద్యమం కూడా పరిఢవిల్లింది. కానీ, క్రమంగా ఆ వెలుగు తగ్గింది.
 
వాణిజ్య విజయమే గీటురాయా?
 
భారతీయ సినిమా శతవసంతాలు జరుపుకొన్నా, ఇప్ప టికీ అమ్మాయి, అబ్బాయిల ప్రేమకథల చుట్టూనే తిరుగు తున్నాం. వాటి నుంచి బయటకు రావడం లేదు. ఇవాళ మన సినిమాలు ‘వంద కోట్ల క్లబ్’లో చేరడం ఆనందమే అయినా, అంతకు మించి ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల గురించి మాట్లాడు కోవడానికి ఏమీ లేదన్నది బాధగా ఉంది. ఇక, నాన్ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల గురించేమో మనమసలు మాట్లాడడమే లేదు.

మరోపక్క ప్రాంతీయ భాషల్లోనూ హీరోలకు కోట్లలో పారితోషికాలిచ్చే స్థాయికి సినీ పరిశ్రమ చేరింది. ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా పదుల కోట్లలో వసూలు చేస్తున్నాయి. ఆ మధ్య ‘దునియా దారీ’ అనే మరాఠీ చిత్రం రూ. 35 కోట్లు వసూలు చేసింది. వ్యాపార రీత్యా అది శుభపరిణామమే. కానీ, సినిమాకు సంబంధించి అది ఒక కోణమే! కళాత్మకత గురించి పట్టింపు లేకుండా, ఎంతసేపూ కమర్షియల్ విజయాన్నే గీటురాయిగా పెట్టుకోవడం తప్పు అంటాను!

సినిమా ఫర్నిచర్‌లో భాగమైన కథానాయి

ఇవాళ మనదేశంలో మహిళా ప్రధాన చిత్రాలు ఎన్నొస్తున్నాయి చెప్పండి! ప్రస్తుతం మన హీరోయిన్లు సినిమాలో ఉపయోగించే ఫర్నిచర్‌లో భాగంగా కనిపిస్తున్నారు. అంతే! దురదృష్టవశాత్తూ మన సినీ సంస్కృతి అలాంటిది. అందుకే, బలమైన స్త్రీ పాత్రలే లేకుండా మన చిత్రాలొస్తున్నాయి.

విచిత్రం ఏమిటంటే, ఇవాళ మీడియా కూడా మారింది. మీడియా అడుగుతున్న తొలి ప్రశ్న - ఇవాళ సినిమా ఎంత వసూలు చేసిందనే! మన దృష్టి అంతా ఎన్ని స్క్రీన్స్‌లో రిలీ జైంది, ఎంత వసూలు చేసిందనే అంశాల మీదే! అలాంటి ఆలోచనా ధోరణిలో ఉంటే, మంచి సినిమాలెలా వస్తాయి!

అలాంటి చిత్రాలకు ప్రచారమేదీ?

అప్పట్లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో నేను, విద్యాసిన్హా నటించిన ‘రజనీగంధా’ (1974) అందరికీ తెలుసు. ’67లోనే మరాఠీలో సినీనటుణ్ణి అయిన నాకు అది తొలి హిందీ చిత్రం. విద్యాసిన్హా తెరపైకి రావడం అదే మొదలు. ఆ చిత్రంలో వాణిజ్యాంశాలు లేవు. నాటకీయ దృశ్యాలూ లేవు. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడం వల్లే ఆ సినిమా విజయవంత మైంది. అదే తర్కాన్ని ఇవాళ మన సినిమాలకు, కనీసం బాలల చిత్రాలకైనా ఎందుకు వర్తింపజేయం?

అయితే, పాతవన్నీ మంచివి. కొత్తవన్నీ చెత్తవనే భావన నాకు లేదు. ఇవాళ మనం గురుదత్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఆ సమయంలోనూ చెత్త సినిమాలొచ్చా యని మర్చిపోకూడదు. ఇవాళ్టి తరంలోనూ మంచి సినిమాలు తీసే రాజ్‌కుమార్ హిరానీ, అనురాగ్ కాశ్యప్, ఆశుతోష్ గోవా రీకర్, జోయా అఖ్తర్ లాంటివాళ్ళున్నారు. ప్రస్తుత కమర్షియల్ వాతావరణంలోనూ కొన్ని మంచి చిత్రాలొస్తున్నాయి! ‘పాన్ సింగ్ తోమార్’, ‘ఉడాన్’, ‘కహానీ’ లాంటివి మంచివేగా! అయితే, వాటికి తగినంత ప్రచారం రావడం లేదు. 4 కోట్లతో తీసి, రూ. 12 కోట్లు వచ్చినవాటి గురించి మనం మాట్లాడం. వంద కోట్లు రాకపోతే, ఫ్లాప్ అనేస్తున్నాం. అది తప్పు.
 ఇరానియన్ సినిమాల్లో ఐటమ్ సాంగులున్నాయా?   
 
నిజానికి, కళాత్మక సినిమా తీయాలంటే, వసూళ్ళ గురించి మర్చిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది వట్టి అపప్రథ. అప్పట్లో నాలాంటి వాళ్ళతో దర్శ కుడు బాసూ ఛటర్జీ తీసినవి నాటకీయత లేకపోయినా, సక్సెస్ సాధించాయి. అంతెందుకు, ఇప్పటికీ గొప్పగా చెప్పుకొనే ఇరానియన్ చిత్రాలు సైతం ఇటు కళాత్మకంగా ఉంటూనే, అటు వాణిజ్య విజయం సాధిస్తున్నాయి. మనం వాణిజ్య ఫార్ములా అనుకొనే ఐటమ్ సాంగులు, ఫైట్లు లేకుండానే ఆ చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి, మనవాళ్ళు ‘వాణిజ్యపరంగా సేఫ్‌గా ఉండడాని’కంటూ ఏవేవో లెక్కలేసుకొని మాట్లాడడం, స్టార్లతోనే సినిమాలు తీయాలనుకోవడం తప్పు. అయినా, స్టార్లతో తీసినా సక్సెస్ వస్తుందన్న నమ్మకం ఏముంది! స్టార్లున్నా నూటికి 90 సినిమాలు ఫెయిలవుతున్నాయిగా!

ఒక చిన్న ఉదాహరణ. మన అనేక రాష్ట్రాల కన్నా చిన్నది - చెక్ రిపబ్లిక్. ఇవాళ అక్కడి సినిమాలు ప్రపంచమంతటా చెప్పుకొనే స్థాయిలో ఉంటున్నాయి. మంచి చిత్రాలు రావడానికి డబ్బుల కన్నా కొత్త ఆలోచన ముఖ్యం. సాధారణ చిత్రాల మధ్య వినూత్నంగా ఉంటూ, ఆకర్షించాలి. అదే కీలకమంత్రం.

సాహిత్యానికి దూరమవడం దెబ్బే!

ఇప్పటికీ భారతీయ సినిమా అంటే, ఎప్పుడూ సోకాల్డ్ ‘బాలీవుడ్’ గురించే మాట్లాడుతున్నాం. కానీ, తెలుగు, తమిళ, మలయాళ, బెంగాలీ, మరాఠీ తదితర భాషా చిత్రాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రతి పాంతానికీ తనదైన ప్రత్యేక భాష, సంస్కృతి, వ్యక్తిత్వం ఉన్నాయి. అవన్నీ కలిస్తేనే - మన భారతీయ సినిమా. అది గ్రహించకుండా ఎంతసేప టికీ ‘బాలీవుడ్’నే ప్రస్తావిస్తున్నాం. సాహిత్యం నుంచి మన సినిమాలు దూరం కావడం మరో పెద్ద దెబ్బ. నిజానికి, మన భాషల్లో అద్భుతమైన రచనలున్నాయి. సంప్రదాయం, సంస్కృతి ఉన్నాయి. వాటిని తెరపైకి తీసుకొస్తే ఇంకేం కావాలి!

సాంకేతిక యుగంలో వచ్చిన తంటా

గమ్మత్తేమిటంటే, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. పాత తరాలకు వాటిని చూసి భయం కానీ, పిల్లలకది ఈజీ. అయితే, మరింత తెలుసుకోవాలనే కోరిక ఈ తరంలోని కొందరిలో ఆ తొలి దశలోనే ఆగిపోతోంది. దేని గురించైనా తెలుసుకోవాలంటే వికీపీడియాలో చూసి వచ్చే స్తారు. అది సరైనదో కాదో చూసుకోవడం మానేస్తున్నారు. దాంతో, అసలు తంటా వస్తోంది. ఒకప్పుడు లైబ్రరీలకు వెళ్ళి, పుస్తకాలు వెతికి, చదివి, తెలుసుకొని, లోతుగా అధ్యయనం చేసేవాళ్ళం. ఇప్పుడది మానేశాం.
 ఇవాళ ఎవరైనా సులభంగా సినిమా తీసే డిజిటల్ యుగం వచ్చింది. కానీ, ఏం లాభం! ఉదాహరణకు, మనం కెమేరాలో తీసింది కేవలం ‘బొమ్మ’, అంతేతప్ప ‘ఫోటో’ కాదు. సరైన ఎక్స్‌పోజర్, సరైన ప్రింటింగ్ లాంటి వన్నీ ఉంటేనే ఏది ‘మంచి ఫోటో’ అనేది తెలుస్తుంది. అలాగే, సినీ రూపకల్పన కూడా! ముఖ్యంగా, ఇవాళ పిల్లల సినిమా తీయాలంటే, వాళ్ళకు ఏది ఆసక్తికరం, ఏది బాగుంటుందని ఆలో చించాలి. దానికి మళ్ళీ మనం ప్రాథమిక అంశాల దగ్గర కెళ్ళాలి. కానీ, అందుకు టైమ్ లేదంటాం. చిక్కంతా అదే!

బాలల చిత్రాల్లోనూ... చూపు అటే!

నిజంగా, ఇవాళ బాలల చిత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయంటే విచారం కలుగుతుంది. ఇన్ని కోట్ల మంది యువ జనాభా ఉన్నప్పటికీ మనం ఏమీ చేయడం లేదంటే తప్పు మనదే! ఎంతసేపటికీ ‘చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఏం చేస్తోంది, భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అని విమర్శలు గుప్పిస్తే సరిపోదు. మన పిల్లలకు మనం చేయా ల్సింది చేస్తున్నామా అన్నది ముఖ్యం. అది మనం ఆత్మ పరి శీలన చేసుకోవాలి. ఇవాళ్టికీ బాలల చిత్రం అనగానే చాలా మంది మాయలు, దయ్యాల కథ లాంటివనుకుంటున్నారు. అవే తీస్తున్నారు. అది తప్పు. అంతకు మించి అంశాలెన్నో ఉన్నాయి. కానీ, వాటికి మార్కెట్‌లో అండ కావాలి.

నా స్వీయ అనుభవమే చెప్పాలంటే, ఆరేళ్ళ క్రితం ‘దుమ్ కటా’ అనే హిందీ చిత్రం పిల్లల కోసం తీశా. అది మిస్టరీ కథాంశం కాదు. దయ్యాల కథ కాదు. దానికి గుల్జార్ గీత రచయిత. ప్రసిద్ధ శంకర్ -ఎహ్‌సాన్- లాయ్ త్రయం సంగీతమిచ్చింది. ఓంపురి లాంటి ప్రముఖులు నటించారు. కానీ, ఏం లాభం! ప్రచారం రాలేదు. ఎవరికీ తెలియదు. స్టార్ వ్యాల్యూ ఉన్నా, వాణిజ్య అంశాలు లేవని ఆ సినిమాను మార్కెట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదీ దుఃస్థితి. ఈ విషవలయంతో అంతా మార్కెట్ నడిపించిన వైపు నడిచేస్తున్నారు.

కొత్త భాష, భావవ్యక్తీకరణ అవసరం!

నిజానికి, కొంతకాలంగా ‘జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ’ (ఎన్.ఎఫ్.డి.సి) చాలా మంచి సినిమాలు అందిస్తోంది. సహ నిర్మాణమైన ‘ది లంచ్ బాక్స్’, స్వయంగా నిర్మించిన ‘ది గుడ్ రోడ్’ లాంటి వాటితో ఇవాళ భారతీయ సినిమా ముఖచిత్రాన్నే అది మార్చేసింది. ఒక గౌరవాన్ని తెచ్చింది. మనందరం గర్వించేలా చేసింది. కానీ, వాటికి మనం అండదండగా నిలవడం లేదు. ఎంతసేపటికీ ‘ఎంతో డబ్బు వృథా అయింది’ అంటూ నెగటివ్ కోణం గురించే చెబుతు న్నాం. పాజిటివ్ కోణం గురించి మాట్లాడడం లేదు.

అలాగే, కాఫీ మొదలు సినిమా దాకా ప్రతి ఒక్కటీ ఇన్‌స్టంట్‌గా ఉండాలని ఇవాళ్టి తరం భావిస్తోంది. అదే వాళ్ళ మంత్రం. కానీ, జీవితానికి అది సరిపడదని నా భావన. ప్రతి సమస్యకూ మనం త్వరితగతి పరిష్కా రాలు, సమాధానాలు ఆశిస్తున్నాం. కానీ, అలాంటివి ఉండవు.  పిల్లలను తీర్చిదిద్దేందుకూ, వారిలో సున్నిత మైన భావోద్వేగాల స్పృహ కలిగించేందుకూ మంచి సాహిత్యం అవసరం. మంచి రంగస్థలం అవసరం. అలాగే, మంచి సంగీతం, మంచి సినిమా కూడా అవసరం. అప్పుడే పిల్లలు - మంచి పెద్దలుగా, మంచి మనుషులుగా తయారవుతారు.

అయితే, పిల్లలు సైతం పరస్పరం ఎస్.ఎం.ఎస్.ల ద్వారా, ఇంటర్నెట్‌లో ఇ-మెయిల్స్ ద్వారా మాట్లాడుకుంటున్న రోజులివి. అందుకే, వాళ్ళను ఆకట్టుకోవాలంటే, ఈ తరం సినీ రూపకర్తలు తమదైన కొత్త భాషనూ, భావ వ్యక్తీకరణనూ ఆవిష్కరించు కోవాలి. అది కీలకం. ఇప్పుడు మళ్ళీ అన్ని రంగాల్లో ఆ పాత వైభవాన్ని పునరుద్ధరించాలంటే, తగిన కృషి చేయాల్సిన బాధ్యత యువతరానిదే! ఈ సమాజంలోని ఆలోచనాపరులం, బాధ్యతాయుతమైన పౌరులమైన ప్రతి ఒక్కరం ఆలోచించి, ఆ విషయంలో ఏ కొద్దిగానైనా మద్దతుగా నిలిస్తే ఎంతో చేయవచ్చు! అది నా ఆశ, ఆకాంక్ష మాత్రమే కాదు... అభ్యర్థన కూడా!!
   
- సంభాషణ: రెంటాల జయదేవ
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement