మళ్లి కూయవా గువ్వా! | music dirctor Chakri Died | Sakshi
Sakshi News home page

మళ్లి కూయవా గువ్వా!

Published Tue, Dec 16 2014 7:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

చక్రీ... ఇంత ట్రాజెడీ ట్యూనా!  We Miss You

చక్రీ... ఇంత ట్రాజెడీ ట్యూనా! We Miss You

జగమంత కుటుంబం తనది!

చక్రిదీ, నాదీ చిరకాల స్నేహం. సినిమాల్లోకి రావడాని కన్నా ముందే మా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రాంతంలో ఒక రికార్డింగ్ స్టూడియో ఉండేది. అక్కడ మా ఇద్దరికీ తొలి పరిచయమైంది. అతను గీత రచయితగా ఉన్నప్పుడు పాటలు రాసేవాడు. మా ఇద్దరి సినిమా కెరీర్లు కూడా దాదాపు ఒకటే సమయంలో మొదలయ్యాయి. పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా చక్రికి తొలి అవకాశం వచ్చిన రోజు కూడా నాకు బాగా గుర్తే. ముందుగా నాకు ‘చిత్రం’ (2000) సినిమాతో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైనప్పుడు దిల్‌సుఖ్ నగర్‌లోని గంగా థియేటర్‌లో మేమందరం వెళ్ళి, ‘చిత్రం’ షో చూస్తున్నాం. ఇంతలో, చక్రికి ఫోన్ వచ్చింది. పూరి జగన్నాథ్ ‘బాచి’ (2000) సినిమాకు ఛాన్స్ వచ్చింది. అంతే! ‘జగనన్న నుంచి ఫోన్ వచ్చింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. వెళ్ళి కలవాలి’ అంటూ సినిమా సగంలోనే వెళ్ళాడు. అలా అతని సినీ సంగీత ప్రస్థానం మొదలైంది.

తెలుగు సినీ సంగీతంలో మా ఇద్దరి కెరీర్లూ సమాంతరంగా సాగాయి. పోటాపోటీగా సినిమాలు చేశాం. అయితే, ఒకరి అవకాశాలను మరొకరు చేజిక్కించుకోవడం లాంటి అవాంఛనీయ ధోరణి ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు మంచి సంగీతంతో, మంచి పాటలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించేవాళ్ళం. పైగా, మా ఇద్దరికీ వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగా చాలా మంచి అనుబంధం ఉండేది. నన్ను అన్నయ్యగా భావిస్తే, తను నాకు తమ్ముడనుకొనేవాణ్ణి. పైగా, 2000 ప్రాంతంలో మా ఇద్దరి లక్ష్యం ఒకటే - సినీ సంగీత పరిశ్రమను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడేలా చేయాలని! అందుకోసం వీలైనంత కృషి చేశాం. ఇక్కడ వీలైనంత ఎక్కువమంది గాయనీ గాయకులనూ, సంగీత కళాకారులనూ పరిచయం చేశాం. స్థానికులకు అవకాశాలిచ్చాం. పైగా, రవివర్మ, కౌసల్య, ఉష లాంటి చాలా మంది యువ గాయనీ గాయకులు మా ఇద్దరి సంగీతంలో రెగ్యులర్‌గా పాటలు పాడేవారు.

సంగీతం అందించాలంటూ తన దగ్గరకు వచ్చినవాళ్ళను అతను ఎప్పుడూ నొప్పించేవాడు కాదు. ‘నాకు పని వచ్చింది. అది బాగా చేయాలి’ అన్నదే అతని దృష్టి అంతా! అందుకే, సినిమాలతో నిత్యం బిజీగా ఉండేవాడు. అచిరకాలంలోనే 90 పైచిలుకు సినిమాలు పూర్తి చేయగలిగాడు.

సంగీతపరంగా చక్రి బాణీల్లో అరబిక్ సంగీత స్పర్శ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ ప్రభావం ఉండేది. అందుకనే, అతను అంత మాస్ బాణీలు, బీట్ పాటలు ఇచ్చేవాడు. అదే సమయంలో చక్కటి శ్రావ్యమైన పాటలూ కూర్చాడు. ‘ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంలో అతను కూర్చిన మెలొడీ పాటలు ఆల్‌టైమ్ హిట్. కెరీర్‌లో జోరు కాస్తంత తగ్గినప్పుడల్లా మళ్ళీ ఒక సూపర్‌హిట్ సినిమా ఆల్బమ్‌తో ముందుకు దూసుకొచ్చేవాడు.

చక్రి చాలా బోళామనిషి. గోరంత పొగిడినా, కొండంత సంతోషించే మనిషి. ఎప్పుడూ ఎవరి గురించీ చెడు మాట్లాడేవాడు కాదు. చక్రిలో అది నాకు బాగా నచ్చేది. చక్రి ఎన్నో పాటలు కూర్చినా, ఈ క్షణంలో చక్రి పాట అంటే నాకు గుర్తొస్తున్నది మాత్రం - ‘చక్రం’ చిత్రంలోని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది!’ దానికి కారణం లేకపోలేదు. చక్రికి ఎప్పుడూ చుట్టూరా జనం ఉండాలి... ఎంతమంది వచ్చినా, అందరికీ భోజనం పెట్టాలి. అదీ అతని స్నేహశీలత. ఇవాళ అంతమంది స్నేహితుల్ని సంపాదించుకొని, అందరినీ వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. చక్రి సినీ, వ్యక్తిగత జీవితం నుంచి అందరం నేర్చుకోవాల్సింది కూడా ఒకటుంది. ఎంత పని ఉన్నా... చేయండి. కానీ, దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. వేళకు తిండి తినండి. వేళాపాళా లేకుండా తినడం, అర్ధరాత్రి దాకా పనిచేసి, తెల్లవారు జామున ఎప్పుడో నాలుగింటికి తినడం లాంటి పనులు చేయకండి. ఆ జాగ్రత్తలు పాటించి ఉంటే, నలభై ఏళ్ళూ నిండీ నిండకుండానే చక్రి మనకు దూరమయ్యేవాడు కాదు. చక్రి మా ఇంట్లో సభ్యుడి లాంటివాడు. ఆ సభ్యుడు ఇవాళ లేడు. అది తీరని బాధ!http://img.sakshi.net/images/cms/2014-12/41418663352_Unknown.jpg
 - ఆర్.పి. పట్నాయక్
 (సినీ సంగీత దర్శకుడు, చక్రికి చిరకాల స్నేహితుడు)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement