అమెరికాస్ గాట్ టాలెంట్ వేదికపై తన ప్రదర్శనతో ఉర్రూతలూగించిన మాయా నీలకంఠన్‌ను సైమన్ కోవెల్ ‘రాక్ దేవత’ అని ప్రశంసించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తాడు. ముంబైలోని మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్‌లో మాయ త్వరలో ప్రదర్శన ఇవ్వనుంది. రెండేళ్ల వయసు నుంచే సంగీతంతో స్నేహం మొదలు పెట్టింది మాయ. నాన్న గిటార్ వాయించేవాడు. ఆయన ద్వారా ఎన్నో పాటలు నేర్చుకుంది మాయ.
యూట్యూబ్ వీడియోల ద్వారా గిటార్ వాయించడం ఎలాగో తండ్రి నేర్పించాడు. ఆరేళ్ల వయసు నుంచే గిటార్ ప్లే మొదలు పెట్టింది. యాభైమంది ప్రేక్షకులు ఉన్న హాలులో తొలిసారి స్టేజీపై ప్రదర్శన ఇచ్చింది. ఇంటి నాలుగు గోడలౖకే పరిమితమైన తన ప్రతిభ తొలిసారిగా ప్రేక్షకుల్లోకి వచ్చింది.
ప్రపంచంలోనే నంబర్ వన్ టాలెంట్ షో అమెరికాస్ గాట్ టాలెంట్(ఏజీటీ)లో వెయ్యిమంది ప్రేక్షకుల మధ్య ప్రదర్శన ఇచ్చింది. తాను స్టేజీ మీదికి వెళుతున్నప్పుడు ప్రేక్షకులు అరవడంతో మాయ కాస్త భయపడింది. అయితే మాయ ప్రదర్శన మొదలు కావడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
గిటార్ ప్రసన్న అనే గురువు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకుంది మాయ. ‘ఏజీటీ’ కోసం రెండు మూడు వారాల పాటు శిక్షణ తీసుకుంది. శిక్షణ సమయంలో ప్రసన్నతో పాటు ఎంతోమంది తనకు సలహాలు ఇచ్చారు.
‘ఏజీటీ’ వేదికపై మూమెంట్స్‌కు సంబంధించి నెటిఫ్లిక్స్ సిరీస్ ‘ఆరేంజ్ ఈజ్ ది న్యూ బ్లాక్’తో అవార్డ్ గెలుచుకున్న జెస్సికా పిమెంటల్ శిక్షణ ఇచ్చింది. షో కోసం మానసికంగా సిద్ధం కావడానికి అవసరమైన సలహాలు ఇచ్చింది. ‘విభిన్నమైన జానర్స్‌తో నాదైన సంగీతాన్ని సృష్టించాలనేది నా కల’ అంటుంది మాయా నీలకంఠన్.
Comments
Please login to add a commentAdd a comment