అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్‌కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్‌లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.
కొన్ని రోజుల క్రితం..
పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్‌లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్‌కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.
దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.
గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్‌ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్‌లో జరిగిన నేషనల్ రౌండ్‌లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్‌కు ఎంపికైంది.
నేషనల్ రౌండ్‌లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.
ఛాంపియన్స్ చేంజ్‌మేకర్..
‘క్వార్కీ’ అనే రోబోట్‌ను స్టూడెంట్స్‌తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.
‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్‌కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.
ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్‌ఫండింగ్‌కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్‌మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.
ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
Comments
Please login to add a commentAdd a comment