ఈ జాబ్‌ చాలా లక్కీ!: ఐపీఎస్‌ అంకిత సురానా | Successful Journey Of IPS Ankita Surana | Sakshi
Sakshi News home page

ఈ జాబ్‌ చాలా లక్కీ!: ఐపీఎస్‌ అంకిత సురానా

Mar 31 2025 8:55 AM | Updated on Mar 31 2025 8:55 AM

Successful Journey Of IPS Ankita Surana

పార్వతీపురంలో పని చేయడం గొప్ప అనుభూతి 

అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు 

లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే విజయం సులువే

ప్రతి కేసునూ ఛాలెంజింగ్‌గా తీసుకుంటా..

మహిళల భద్రత..చైతన్యం ప్రథమ కర్తవ్యం 

‘సాక్షి’తో ఏఎస్పీ అంకిత సురానా  

సాక్షి, పార్వతీపురం మన్యం: ‘‘మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలవుతారు. అమ్మాయిలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. డాక్టర్, పోలీస్, ఇంజినీర్‌.. ఇలా ఏదైనా సరే! దాన్ని సాధించేందుకు ఎదురైన ప్రతి సవాల్‌నూ ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఎర్విరిథింగ్ ఈజ్‌ పాజిబుల్‌.. కష్టపడితే గెలుపు మన ముందు వచ్చి వాలుతుంది..’’ 

‘‘పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇక్కడ గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత కూడా ఉంది. గత కొన్నేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. బాలికలు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. వారిలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నినస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు స్వయంగా వెళ్లి వివిధ అంశాలపై వివరిస్తున్నా. కేవలం భద్రతనే కాదు.. కెరియర్‌ కోసం కూడా  వివరిస్తుండటం సంతృప్తినిస్తోంది.’’ 



చిన్నప్పుడు అందరిలానే తనూ ఒక సాధారణ అమ్మాయి. చదువు, ఆటపాటలే లోకం. డిగ్రీ చదువుతున్న సమయంలో.. సమాజంలో తన పాత్ర ఏమిటో అవగతమైంది. ఈ సొసైటీకి.. ప్రధానంగా మహిళలు, బాలికల కోసం ఏం చేయాలన్న ప్రశ్నలోనే.. ‘ఐపీఎస్‌’ అన్న లక్ష్యం బోధపడింది. ఆమే.. యువ ఐపీఎస్‌ అధికారిణి, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన. అత్యున్నతమైన ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్ కు ఎంపిక కావడమే కాదు.. శిక్షణలోనూ ప్రతిభను చూపారు. 

నేడు విధి నిర్వహణలోనూ ‘ఫ్రెండ్లీ పోలీస్‌’ అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ, క్లిష్టమైన కేసుల్లోనూ తన మార్కు చూపిస్తూ.. విజయవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి మారుమూలన ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, యువతకు దిశానిర్దేశం చేయడంలో ముందుంటున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి రావడానికి కారణం, విధి నిర్వహణలో సక్సెస్‌ఫుల్‌ జర్నీని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...  

 

శిక్షణ తర్వాత చాలా మార్పు  
సివిల్స్‌ సాధించిన తర్వాత శిక్షణ పూర్తయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. పట్టుదల పెరిగింది. ప్రజలకు సేవ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. బాలలు, మహిళల రక్షణ కోసం పని చేయాలని అనిపించింది. ఈ రంగంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2023లో గ్రేహౌండ్స్‌లో విశాఖలో విధుల్లో చేరా. తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా వచ్చా. ఈ జాబ్‌ పొందడం చాలా లక్కీ! 

మరిచిపోలేని అనుభూతి.. 
రాష్ట్రస్థాయి రిపబ్లిక్‌డే వేడుకల పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి. గర్వపడే సందర్భం. చాలా ఆనందం అనిపించింది. ఒక వారం శిక్షణ పొంది విజయవంతంగా పరేడ్‌ పూర్తి చేయగలిగాం. నాకు అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.  

నేటి తరానికి ఇచ్చే సందేశం.. 
నథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌. ఎవి్వరిథింగ్‌ ఈజ్‌ పాజిబుల్‌. నేటి తరం బాలికలు, యువతకు చెప్పేదొకటే. విద్యార్థి దశలో చదువు, కెరియర్‌పైనే దృష్టి పెట్టాలి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో గట్టిగా నిర్ణయించుకోవాలి. దాని సాధన దిశగా సాగాలి. పదో తరగతి తర్వాత కెరియర్‌ కౌన్సెలింగ్‌ చాలా ముఖ్యం. ఈ దశలో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరంగా సమయం వృథా చేయకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే.. మంచి జీవితం లభిస్తుంది.  

కుటుంబ నేపథ్యం..  
మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. పదో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇంటర్‌ (బైపీసీ) తర్వాత హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ డిగ్రీ, సల్సార్‌ యూనివర్సిటీలో క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తిచేశా. తల్లిదండ్రులు కౌసల్య, మహవీర్‌ సురానా. నాన్న వ్యాపార రంగంలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. 

అందరూ ప్రైవేట్‌ ఉద్యోగాలు, వ్యాపారాలే. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్‌ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిగ్రీలో ఉంటుండగానే కెరియర్‌ కోసం ఆలోచించా. సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో చేరాలని కోరిక. ఆ క్రమంలోనే సివిల్స్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ చదువుతూనే.. సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాను. లక్ష్యంపైనే గురి. మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించాను. 398వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2021 బ్యాచ్‌ మాది.  

ప్రజల సహకారం ఉంటేనే.. 
ప్రజలను సురక్షితంగా ఉంచడం బాధ్యత. ఇదే సమయంలో శాంతి¿¶ద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖపరంగా ఎంత చేసినా.. ప్రజల నుంచీ సహకారం అవసరం. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం, ప్రయాణ సమయంలో హెల్మెట్‌ ధారణ వంటివాటిలో ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. సమాజంలో ప్రధానంగా పోలీసులంటే భయం పోవాలి. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమయంలోనైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఒక్క ఫొటో ద్వారానైనా శక్తి యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర పోలీస్‌ శాఖ టోల్‌ఫ్రీ నంబర్లనూ వినియోగించవచ్చు. శక్తి యాప్‌.. సేఫ్టీయాప్‌. ప్రధానంగా మహిళల వద్ద ఉండాలి. ఒక్క బటన్‌ ప్రెస్‌ చేస్తే పోలీసులు ఉంటారు.  

ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలి 
నేను ఎక్కడ పనిచేసినా.. అక్కడ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించగలిగితే చాలు.. అంతకంటే సంతృప్తి ఉండదు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయగలగాలి. విధి నిర్వహణలో ప్రతి కేసునూ సవాల్‌గానే తీసుకుంటా. పోక్సో కేసులు, వరకట్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు, శాంతిభద్రతలు.. ఇలా ఏదైనా బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి చెందగలం.

 మహిళల హక్కులు, చట్టాలపైన అవగాహన కల్పింస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ, ఇతర కార్యక్రమాలు చేశాం. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ ఒక్కరూ భయపడకూడదు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇటీవల ఒక పోక్సో కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. వారం రోజులు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటర్‌ పరీక్షలు రాసుకుంటోంది.  

శాంతిభద్రతల పరిరక్షణలో... 
డ్రోన్‌ నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. ఈవ్‌టీజింగ్, జూదం, గంజాయి, సారా అక్రమ రవాణా వంటివాటిని డ్రోన్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, కట్టడి చేస్తున్నాం. ప్రతి ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాం. జిల్లాలో టాప్‌ 20 నేరస్తులను గుర్తించాం. వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం పార్వతీపురం, పాలకొండ, సాలూరుల్లో టీమ్స్‌ పని చేస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ఓ వాహనం ఉంటుంది. 100, 112 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ ఉంటారు. గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల కోసం స్వీయ రక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. 

అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా రక్షణ పొందాలి, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పింస్తున్నాం. పాఠశాలల్లో ఈగల్‌ టీమ్స్‌ ద్వారానూ అవగాహన పెంచుతున్నాం. చిన్నారులు, మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ సెంటర్‌ ఉంది. అక్కడ వారికి అవసరమైన అన్ని విధాల మద్దతు కూడా లభిస్తుంది. సైబర్‌ క్రైమ్‌ మోసాలు రోజుకో విధంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రజలు వాటి బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఆయా ఎస్‌హెచ్‌వోల ద్వారా చేపడుతున్నాం. పోలీస్‌ సిబ్బంది సొంత సమస్యలపైనా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement