International competition
-
అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!
మహబూబాబాద్: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్య సత్తా చాటింది.ఈనెల 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. కాగా, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తనకు సాయపడిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్‌కు, కోచ్ వీఎన్ రాజశేఖర్‌కు సుకన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.దేనికి ధైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా పవర్ లిఫ్టింగ్లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించానన్నారు. ఇంకా పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని తెలిపారు. -
ఈ పేదింటి బంగారం.. ఓ అద్భుతం!
అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్‌కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్‌లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.కొన్ని రోజుల క్రితం..పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్‌కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్‌ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్‌లో జరిగిన నేషనల్ రౌండ్లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్‌కు ఎంపికైంది.నేషనల్ రౌండ్లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.ఛాంపియన్స్ చేంజ్‌మేకర్..‘క్వార్కీ’ అనే రోబోట్‌ను స్టూడెంట్స్‌తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్‌కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్‌ఫండింగ్‌కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్‌మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు! -
ఇద్దరూ ఇద్దరే.. స్కేటింగ్‌లో చిరుతలే.!
మురారీని ఓ రోజు తల్లిదండ్రులు వుడా(వీఎంఆర్డీఏ) పార్కుకు తీసుకెళ్లగా.. అక్క డ కొందరు స్కేటింగ్ ఆడుతున్నారు. వారిని చూసి తాను నేర్చుకుంటానని మారాం చేశాడు. కుమారుడి ఆసక్తిని గుర్తించిన ఆ తల్లిదండ్రులు వెంటనే శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. అలా మురారి 2012లో స్కేటింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అనతికాలంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగాడు. అన్నయ్య బాటలోనే తమ్ముడు ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. ప్రపంచస్థాయి ఎంపిక పోటీలో నాలుగో స్థానంలో నిలిచాడు. త్రుటిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. సీతమ్మధార(విశాఖ ఉత్తర): స్కేటింగ్‌లో తారాజువ్వల్లా దూసుకుపోతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. రోలర్ స్కేటింగ్‌లో భాగంగా ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. వారే జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలేనికి చెందిన చందక వెంకట సురేష్ కుమార్, అంబిక దంపతుల కుమారులు వెంకట్ పవన్ కార్తికేయ, వెంకట నాగ మురారి. త్వరలో అర్జెంటీనాలో జరిగే ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో దేశం నుంచి ముగ్గురు ఎంపిక కాగా.. అందులో పవన్ కార్తికేయ ఒకడు. చదువులోనూ ప్రతిభావంతులే.. చదువులోనూ వీరిద్దరూ ప్రతిభ చూపిస్తున్నారు. 90 శాతం మార్కులు సాధిస్తున్నారు. క్రీడలు, చదువును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్పీడ్ విభాగంలో ఎల్.కృష్ణకుమార్ వద్ద, ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో తండ్రి సురేష్ వద్ద వీరు శిక్షణ తీసుకుంటున్నారు. కఠోర సాధనతో.. స్కేటింగ్‌లో ప్రతిభ చూపాలంటే కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారం కూడా కీలకం. మంచి కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ కాపాడుకోవాలి. అప్పుడే పతకాలు సాధించగలరు. పవన్ కార్తికేయ ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి ఆర్కేబీచ్, ఆరిలోవ, సింహచలం రోడ్డు తదితర ప్రాంతాల్లో సాధన చేస్తూ.. సాయంత్రం వీఎంఆర్డీఏ పార్కు స్కేటింగ్ రింక్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. రోడ్లు ఖాళీ లేని సమయంలో సింహాచలం రోడ్లపై కూడా సాధన చేస్తుంటాడు. డౌన్‌హిల్ ఈవెంట్లో మెరుపులు కొండ శిఖరం నుంచి వాలులో కిందకు దూసుకొస్తూ.. ప్రత్యర్థులను దాటుకుంటూ రావాలి. వేగం, స్థిరత్వం కలగలసి అత్యంత చాకచాక్యంగా ఆడాల్సిన క్రీడ ఇది. దీనిలో ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. పవన్ కార్తికేయ ఇంతటి కష్టమైన క్రీడాంశంలో సైతం మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐదేళ్లుగా ఇన్లైన్ ఆలై్పన్ ఈవెంట్లో అన్నదమ్ములిద్దరూ జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతూ.. దూసుకుపోతున్నారు. పైలట్ అవుతా.. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ నా కల.. అదే లక్ష్యంతో చదువుతున్నాను. స్కేటింగ్‌లో ప్రపంచస్థాయిలో గెలిచి దేశానికి మంచి పేరు తీసుకువస్తా. – పవన్ కార్తికేయ ఐఐటీలో ర్యాంక్ సాధిస్తాను. ప్రపంచస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించేందుకు కృషి చేస్తున్నాను. తల్లిదండ్రుల ఆశయాలు నేరవేరస్తాను. – నాగ మురారి మురారి విజయాలివీ.. 2018లో వీఎంఆర్డీఏ పార్కులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 2019లో విశాఖలో జరిగిన స్కేటింగ్ పోటీల్లో వెండి పతకం 2020లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 2021లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వెండి పతకం 2022 ప్రపంచ స్థాయి పోటీల ఎంపికలో నాలుగో స్థానం కార్తికేయన్ విజయాలివి 2013లో స్కూల్ గేమ్స్ పోటీల్లో రజతం 2016లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం. కర్నాటకలో నిర్వహించిన జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏడో స్థానం 2017లో తిరుపతిలో జరిగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ గేమ్స్‌లో రజతం 2018లో విశాఖలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం, కాంస్యం 2019లో విశాఖలో వీఎంఆర్డీఏ పార్కులో జాతీయస్థాయి ఆర్ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం 2019లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో ఇన్లైన్ ఆలై్పన్ ఈవెంట్లో 14వ స్థానం. ఈ పోటీలకు 96 దేశాల క్రీడాకారులు హాజరయ్యారు. 2020లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 2021లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం ఈ ఏడాది అక్టోబర్‌లో అర్జెంటీనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక ప్రతిభకు ప్రోత్సాహం చందక వెంకట పవన్ కార్తికేయకు 2019లో వైఎస్సార్ క్రీడా పురస్కారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల నగదు బహుమతి ప్రదానం చేసింది. 2021లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.50 వేలు అందజేసింది. 2022లో ప్రపంచస్థాయి పోటీలకు అయ్యే ఖర్చుల నిమిత్తం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జెడ్పీ కార్యాలయం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా రూ.2.65లక్షలు డి.డి.రూపంలో ఆర్.ఎస్.ఎఫ్.ఐకార్యాలయానికి పంపించారు. (చదవండి: ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే) -
పంచ్ పాండవులు
♦ కరాటేలో కొత్తవలస కుర్రాళ్ల ప్రతిభ ♦ అంతర్జాతీయ డిప్లమో సాధన ♦ జిల్లాలోనే తొలి జపాన్ డిప్లమో కైవశం ♦ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు ఆత్మరక్షణ విద్య అందరూ నేర్చుకుంటారు. అత్యుత్తమ ప్రమాణాలను కొందరే అందుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతారు. అయిదుగురు సామాన్య విద్యార్థులు ఆ ఘనత సాధించారు. జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయం సాధించారు. పతకాలు కొల్లగొడుతున్నారు. కొత్తవలస మండలానికి చెందిన ఆ ‘పంచ్’ పాండవులపై స్ఫూర్తిదాయకమైన కథనమిది. –కొత్తవలస రూరల్ ♦ ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ నుంచి గుజూర్యూ కరాటే– డో–ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏషియా కరాటే చాంపియన్ షిప్, ఎంఎల్ఏ కప్, 14 ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్, 18 ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్, 1వ ఏపీ గుజూర్యూ కరాటే చాంపియన్ షిప్, నార్త్ ఏపీ గుజూర్యూ, సౌత్ ఇండియా గుజూర్యూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయ శిఖరాలు అధిరోహించారు. ♦ ఇద్దరు విద్యార్థులు నేషనల్ స్పోర్ట్స్ కరాటే–డో–కాస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కార్యదర్శిగా, సభ్యునిగా ఎంపికయ్యారు. ♦ ఈ అయిదుగురు విద్యార్థులు జార్ఖండ్ రాష్ట్రంలో జూన్ 25, 26 తేదీల్లో జేఆర్డీ టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 12వ జాతీయ కరాటే పోటీల్లో పతకాలు సాధించారు. ఇదే కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ జపాన్ డిప్లమా పోటీల్లో పాల్గొని బ్లాక్ బెల్టులు సాధించటం జిల్లా చరిత్రలో తొలిసారి. ♦ కొత్తవలస మండలానికి చెందిన ఎం.సుధీర్‌బాబు, ఎన్.భరత్ కుమార్, ఎం.నరేంద్ర, ఎం.నీలాంజీని ప్రసాద్, ఎస్.శ్రీనివాస్‌కు ఆత్మరక్షణ విద్య అంటే ఎంతో మక్కువ. వీరంతా కొత్తవలస మండలం ములగవాకవానిపాలెం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ బ్లాక్‌బెల్టు 5 వడాన్ రాష్ట్ర గుజూర్యూ ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ములగపాక త్రినాథ్‌రావు శిష్యులు. చిన్నప్పటి నుంచి వీరంతా కోచ్ త్రినా«థ్ వద్ద కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. కరాటేలో ఎల్లో బెల్టు నుంచి బ్లాక్ బెల్టుల వరకూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధిస్తున్నారు. ‘నరేంద్ర’జాలం కొత్తవలస మండలం నిమ్మలపాలెంకు చెందిన ఎం.నరేంద్ర ప్రస్తుతం జిందాల్ భారతి విద్యామందిర్‌లో 9 తరగతి చదువుతున్నాడు. తండ్రి నారాయణరావు కిరాణా వ్యాపారి. జార్ఖండ్‌లో జరిగిన జపాన్ డిప్లమా బ్లాక్ బెల్ట్ పోటీల్లో నరేంద్ర మొదటి ఏఐకేఎఫ్ ఈస్ట్‌జోన్ కరాటే చాంపియన్ షిప్–2017లో కాంస్య పతకం సాధించాడు. 2016 జాతీయస్థాయి ఏషియన్ కరాటే చాంపియన్ షిప్ బంగారు, విశాఖపట్నం స్వర్ణభారతి, రాజీవ్‌గాంధీ స్టేడియాల్లో 2015లో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు రజిత పతకాలను సాధించాడు. భళా భరత్ వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన ఎన్.భరత్‌కుమార్ ప్రస్తుతం మంగళపాలెం సెయింటాన్స్‌లో 10 తరగతి చదువుతున్నాడు. అయిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే త్రినాథ్ శిక్షణలో రాటుదేరాడు. తండ్రి ఆటో డ్రైవర్. నిరుపేద కుటుంబానికి చెందిన భరత్‌కుమార్ జార్ఖండ్‌లో అంతర్జాతీయ జపాన్ డిప్లమా పోటీల్లో బ్లాక్‌బెల్టు, జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. 2015 ఏషియన్ కరాటే చాంపియన్ షిప్లో బంగారు పతకం. 2016లో ఏపీ ఎంఎల్ఏ కప్, 12వ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్, ఏసియన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించాడు. తాపీమేస్త్రి కొడుకు తారస్థాయికి.. చింతపాలెం గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాసరావు ప్రస్తుతం పెందుర్తి శ్రీగురు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి తాపీ పనులు చేస్తుంటాడు. శ్రీనివాసరావు 2016 జాతీయ ఏషియన్ కరాటే చాంపియన్ షిప్లో రజతం, విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ పోటీలు, 2015లో జాతీయస్థాయిలో గాజువాకలో జరిగిన ఎంఎల్ఏ కప్ పోటీల్లో 2 బంగారు పతకాలు సాధించాడు. 14వ ఆల్ ఇండియా, 12 ఆలిండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్, జార్ఖండ్‌లో జరిగిన జపాన్ డిప్లమా బ్లాక్‌బెల్ట్, మొదటి ఏఐకేఎఫ్ ఈస్ట్‌జోన్ కరాటే చాంపియన్ షిప్–2017 పోటీల్లో కాంస్య పతకాలను సాధించాడు. ఒలింపిక్ పతకమే ధ్యేయం జర్మనీ, కెనడా, కొలంబోల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక స్తోమత చాలక, ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించక అవకాశం కోల్పోయాను. ఒలింపిక్స్‌లో పతకం సాధించటమే నా ధ్యేయం. అందుకే శిక్షణ ఇస్తున్నా. ప్రతి ఒక్కరూ.. ప్రదానంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 16 వేల మందికి శిక్షణ ఇచ్చాను. ఏఐకేఎప్ లో రాష్ట్రంలో 5వ డాన్‌గా మెదటిసారిగా బ్లాక్‌బెల్టు తీసుకున్నాను. – ఎం.త్రినాథరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ గూజూర్యూ పంచ్ కొడితే పతకమే కొత్తవలస మండలం మునగపాకవానిపాలెం గ్రామానికి చెందిన ఎం.నీలాంజని ప్రసాద్ నరపాం కోస్టల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరిగిన కరాటే పోటీల్లో 2 బంగారు, 2 రజిత, 2 కాంస్య పతకాలు సాధించాడు. జపాన్ డిప్లమా బ్లాక్‌బెల్టు సాధించాడు. 2016లో విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఏషియన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో బంగారుపతకం, 2015లో రాజీవ్‌గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి, 2017 జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్య పతకాలను సాధించాడు. స్వర్ణాల సుధీర్ కొత్తవలస మండలం కోస్టల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న సుధీర్‌బాబు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన అంతర్జాతీయ జపాన్ డిప్లమా పోటీల్లో పాల్గొని జపాన్ బ్లాక్ బెల్టు సాధించాడు. జార్ఖండ్‌లో జరిగిన మొదటి ఏఐకేఎఫ్ ఈస్ట్‌జోన్ కరాటే చాంపియన్ షిప్–2017లో కాంస్య పతకం సాధించాడు. సౌత్ ఇండియా గుజూర్యూ కరాటే డో ఫెడరేషన్ అసోసియేషన్ మెదటి శిక్షణలో పాల్గొన్నాడు. ఏషియన్ షిప్లో బంగారు పతకం, 2016లో మొదటి ఆంధ్రప్రదేశ్ గుజూర్యూ కరాటే చాంపియన్ షిప్ ఎంఎల్ఏ కప్ బంగారు పతకం సా«ధించాడు. 2016లో నార్త్ ఆంధ్ర గుజూర్యూ కరాటే చాంపియన్‌షిప్ సాధించాడు. 2016లో 12వ ఆల్ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ హైపవర్ కప్‌లో బంగారు పతకం సా«ధించాడు. నేషనల్ స్పోర్ట్సు కరాటే డో కాస్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ విజయనగరం జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యాడు. -
నైనాకు రూ.3 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) సత్కరించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్) ఆమెకు రూ. 3 లక్షల చెక్‌ను అందజేశారు. పాకిస్థాన్‌లో గత నెల జరిగిన ఆసియా జూనియర్, క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో ఆమె ఒక్కో స్వర్ణ, రజతం గెలిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నజరానాను అందజేసింది. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న నైనాను లవ్ అగర్వాల్, రమణాచారిలు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు.