ఇద్దరూ ఇద్దరే..  స్కేటింగ్‌లో చిరుతలే.!  | Brothers Showing His Skating Talent Participate In International Events | Sakshi
Sakshi News home page

ఇద్దరూ ఇద్దరే..  స్కేటింగ్‌లో చిరుతలే.! 

Published Mon, Jul 18 2022 12:35 PM | Last Updated on Mon, Jul 18 2022 12:35 PM

Brothers Showing His Skating Talent Participate In International Events - Sakshi

మురారీని ఓ రోజు తల్లిదండ్రులు వుడా(వీఎంఆర్డీఏ) పార్కుకు తీసుకెళ్లగా.. అక్క డ కొందరు స్కేటింగ్‌ ఆడుతున్నారు. వారిని చూసి తాను నేర్చుకుంటానని మారాం చేశాడు. కుమారుడి ఆసక్తిని గుర్తించిన ఆ తల్లిదండ్రులు వెంటనే శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. అలా మురారి 2012లో స్కేటింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అనతికాలంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగాడు. అన్నయ్య బాటలోనే తమ్ముడు ఇన్‌లైన్‌ ఆల్పైన్‌ ఈవెంట్‌లో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. ప్రపంచస్థాయి ఎంపిక పోటీలో నాలుగో స్థానంలో నిలిచాడు. త్రుటిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు.  

సీతమ్మధార(విశాఖ ఉత్తర): స్కేటింగ్‌లో తారాజువ్వల్లా దూసుకుపోతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. రోలర్‌ స్కేటింగ్‌లో భాగంగా ఇన్‌లైన్‌ ఆల్పైన్‌ ఈవెంట్‌లో ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. వారే జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలేనికి చెందిన చందక వెంకట సురేష్‌ కుమార్, అంబిక దంపతుల కుమారులు వెంకట్‌ పవన్‌ కార్తికేయ, వెంకట నాగ మురారి. త్వరలో అర్జెంటీనాలో జరిగే ఇన్‌లైన్‌ ఆల్పైన్‌ ఈవెంట్‌లో దేశం నుంచి ముగ్గురు ఎంపిక కాగా.. అందులో పవన్‌ కార్తికేయ ఒకడు.

చదువులోనూ ప్రతిభావంతులే..
చదువులోనూ వీరిద్దరూ ప్రతిభ చూపిస్తున్నారు. 90 శాతం మార్కులు సాధిస్తున్నారు. క్రీడలు, చదువును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  స్పీడ్‌ విభాగంలో ఎల్‌.కృష్ణకుమార్‌ వద్ద, ఇన్‌లైన్‌ ఆల్పైన్‌ ఈవెంట్‌లో తండ్రి సురేష్‌ వద్ద వీరు శిక్షణ తీసుకుంటున్నారు.  

కఠోర సాధనతో.. 
స్కేటింగ్‌లో ప్రతిభ చూపాలంటే కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారం కూడా కీలకం. మంచి కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి. అప్పుడే పతకాలు సాధించగలరు. పవన్‌ కార్తికేయ ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి ఆర్కేబీచ్, ఆరిలోవ, సింహచలం రోడ్డు తదితర ప్రాంతాల్లో సాధన చేస్తూ.. సాయంత్రం వీఎంఆర్డీఏ పార్కు స్కేటింగ్‌ రింక్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. రోడ్లు ఖాళీ లేని సమయంలో సింహాచలం రోడ్లపై కూడా సాధన చేస్తుంటాడు.  

డౌన్‌హిల్‌ ఈవెంట్‌లో మెరుపులు  
కొండ శిఖరం నుంచి వాలులో కిందకు దూసుకొస్తూ.. ప్రత్యర్థులను దాటుకుంటూ రావాలి. వేగం, స్థిరత్వం  కలగలసి అత్యంత చాకచాక్యంగా ఆడాల్సిన క్రీడ ఇది. దీనిలో ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. పవన్‌ కార్తికేయ ఇంతటి కష్టమైన క్రీడాంశంలో సైతం మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐదేళ్లుగా ఇన్‌లైన్‌ ఆలై్పన్‌ ఈవెంట్‌లో అన్నదమ్ములిద్దరూ జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతూ.. దూసుకుపోతున్నారు.  

పైలట్‌ అవుతా.. 
ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ నా కల.. అదే లక్ష్యంతో చదువుతున్నాను. స్కేటింగ్‌లో ప్రపంచస్థాయిలో గెలిచి దేశానికి మంచి పేరు తీసుకువస్తా.  
– పవన్‌ కార్తికేయ 

ఐఐటీలో ర్యాంక్‌ సాధిస్తాను.
ప్రపంచస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించేందుకు కృషి చేస్తున్నాను. తల్లిదండ్రుల ఆశయాలు నేరవేరస్తాను. 
– నాగ మురారి 
మురారి విజయాలివీ..  

  • 2018లో వీఎంఆర్డీఏ పార్కులో జరిగిన 
  • జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం  
  •  2019లో విశాఖలో జరిగిన స్కేటింగ్‌ పోటీల్లో 
  • వెండి పతకం  
  • 2020లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి
  • పోటీల్లో బంగారు పతకం 
  • 2021లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి 
  • పోటీల్లో వెండి పతకం  
  • 2022 ప్రపంచ స్థాయి పోటీల ఎంపికలో నాలుగో స్థానం  

కార్తికేయన్‌ విజయాలివి

  • 2013లో స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో రజతం 
  • 2016లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం. కర్నాటకలో నిర్వహించిన జాతీయ స్కూల్‌ గేమ్స్‌లో ఏడో స్థానం 
  • 2017లో తిరుపతిలో జరిగిన సీబీఎస్‌ఈ 
  • సౌత్‌జోన్‌ గేమ్స్‌లో రజతం 
  • 2018లో విశాఖలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం, కాంస్యం 
  • 2019లో విశాఖలో వీఎంఆర్డీఏ పార్కులో జాతీయస్థాయి ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం  
  • 2019లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్‌ పోటీల్లో ఇన్‌లైన్‌ ఆలై్పన్‌ ఈవెంట్‌లో 14వ స్థానం. ఈ పోటీలకు 96 దేశాల క్రీడాకారులు హాజరయ్యారు.  
  • 2020లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం  
  • 2021లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 
  • ఈ ఏడాది అక్టోబర్‌లో అర్జెంటీనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక 
  • ప్రతిభకు ప్రోత్సాహం 
  • చందక వెంకట పవన్‌ కార్తికేయకు 2019లో వైఎస్సార్‌ క్రీడా పురస్కారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల నగదు బహుమతి ప్రదానం చేసింది.  
  • 2021లో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రూ.50 వేలు అందజేసింది.  
  • 2022లో ప్రపంచస్థాయి పోటీలకు అయ్యే ఖర్చుల నిమిత్తం విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు జెడ్పీ కార్యాలయం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా రూ.2.65లక్షలు డి.డి.రూపంలో ఆర్‌.ఎస్‌.ఎఫ్‌.ఐకార్యాలయానికి పంపించారు.  

(చదవండి: ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్‌ సర్వే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement