ఇలాగొచ్చి అలా వెళ్లిపోయావా!
► ఒరేయ్ బిడ్డా...!
► నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది.
► నేను హైదరాబాద్ కమలాపురి కాలనీలోని హుస్సేన్‌గారి అపార్ట్‌మెంట్‌లో ఉండేవాణ్ణి.
► ఆ ఎదురుగానే నిర్మాత జయకృష్ణ గారి సినిమా ఆఫీసు.
► నేను బయటికొస్తుంటే నువ్వు గేటు దగ్గర తగిలి, పరిచయం చేసుకున్నావ్.
► అప్పుడింత లావు లేవు... కొంచెం సన్నగా ఉన్నావ్
► అగ్గగ్గలాడుతూ ‘నాకో ఛాన్సివ్వండి’ అనడిగావ్.
ఇది జరిగిన నెలరోజుల తర్వాత- ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా పని మొదలైంది. మామూలుగా నా సినిమాలకు ఇళయరాజాగారే మ్యూజిక్కు. ఇదేమో చిన్న సినిమా. బడ్జెట్ సహకరించదు. హైదరాబాద్‌లో ఎవరున్నారా అని ఎంక్వైరీ చేస్తుంటే, ‘మళ్లి కూయవే గువ్వా’ పాట విన్నా. ఆ పాట నువ్వు చేసిందే! ‘ఇట్లు శ్రావణి - సుబ్రహ్మణ్యం’ సినిమాలోది. దాని డెరైక్టర్ పూరి జగన్నాథ్ గారిని నీ గురించి అడిగితే, ‘‘తక్కిన వాళ్లకంటే భిన్నంగా అతనిలో ఏదో ఉందండీ’’ అని చెప్పారు.
దాంతో నిర్మాతకు నీ పేరే రికమండ్ చేశా.ఆ వేళ ఉదయం తొమ్మిదింటికి కంపోజింగ్ మొదలెట్టాలి. తొమ్మిదిన్నరైంది. నువ్వింకా రాలేదు. ‘మేస్ట్రో’ ఇళయరాజాతో చాలా సినిమాలలో పని చేసిన నాకు నువ్వెలా సింక్ అవుతావోనన్న బెంగ ఉంది. సాయంత్రం నాలుగు వరకూ చూసినా నువ్వు రాలేదు. నాకు భలే కోపం వచ్చేసింది. ‘‘అబ్బే... ఇతనితో కష్టం’’ అనేసుకుని కారెక్కిబోతుంటే నువ్వొచ్చావ్.
షార్టు, బనీను వేసుకుని జాగింగ్‌కు వెళ్తున్నట్టుగా వచ్చావ్. ‘గుడీవినింగ్ సార్’ అని నువ్వు చెబితే, నేను కోప్పడి వెళ్ళిపోబోయాను.
నువ్వు తెగ బతిమిలాడావ్. నాకు అప్పటికప్పుడు‘వెన్నెల్లో హాయ్‌హాయ్’ పాట వినిపిస్తే అక్కడికక్కడే చతికిలపడిపోయా.
నీ మీద కోపమంతా పోయింది. నువ్వేదో ఎక్స్‌ప్లెనేషన్ ఇస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు. అప్పట్నుంచి నువ్వు నన్నొదల్లేదు. నేను నిన్నొదల్లేదు.
‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ పాటలు ఎంత హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నేను తీసిన ‘దొంగ రాముడు అండ్ పార్టీ’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’, ‘గోపి-గోపిక-గోదావరి’, ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమాలకు నువ్వే మ్యూజిక్కిచ్చావ్. అన్నీ మంచి మంచి పాటలే. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటలైతే రింగ్‌టోన్లుగా, కాలర్ ట్యూన్లుగా మార్మోగిపోయాయి కదా!
నాకు లాంగ్ డ్రైవ్‌లిష్టం. నువ్వే నీ కారులో ఎక్కడెక్కడికో తిప్పేవాడివి. ఇద్దరం కలిసి రకరకాల తిండి తినేవాళ్లం. ఓసారి మీ ఊరు కంబాలపల్లి తీసుకెళ్లావ్. నువ్వొస్తున్నావని తెలిసి ఎంతమంది జనమో! ఎవరికి వాళ్లు నిన్ను పలకరించేవాళ్లే. ఇదంతా మ్యూజిక్ డెరైక్టర్‌గా నీ ఫాలోయింగ్ అనుకున్నా. కాదు... ఓ వ్యక్తిగా నీ ఫాలోయింగ్ అని తర్వాత తెలిసింది. మామూలుగా ఆగస్టు తొలి ఆదివార మో ఎప్పుడో ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు. కానీ నువ్వేమో ఫిబ్రవరి 10న ఓ ఫ్రెండ్‌షిప్ డే క్రియేట్ చేసుకున్నావ్. ఆ రోజు నువ్వు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మహబూబాబాద్, వరంగల్, కంబాలపల్లి.... ఇలా రకరకాల ఊళ్ళ నుంచి నీ ఫ్రెండ్సంతా వచ్చేస్తారు. ఇక హైదరాబాద్ గ్యాంగ్ ఎలాగూ ఉంటారు. మార్నింగ్ ఎనిమిదింటికి మొదలెడితే నెక్ట్స్‌డే మార్నింగ్ వరకూ పండగే పండగ.
చాలామంది సింగర్స్ నీ పాటలు పాడుతుంటే సంబరపడిపోయేవాడివి. మంచి ఫుడ్ పెట్టేవాడివి.
►నీ బర్త్‌డే రోజు కూడా అంతే... సందడి చేసేవాడివి.
► ఇలాంటివి ఏంటేంటో... అద్భుతాలు చేసేసేవాడివి.
► అన్నదానాలు, రక్తదానాలు కూడా చేసేవాడివి.
ఓ రోజు నిన్ను జెల్ల కొట్టాను. ‘గట్టిగా కొట్టకండి’ అన్నావు నువ్వు. ‘ఏం... దేనికి’ అని నేను రెట్టిస్తే, ‘‘నేనొక వ్యవస్థను. నా మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు’’ అంటూ నువ్వు నీ ట్రస్ట్ గురించి, నువ్వు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పుకొస్తే చాలా అబ్బురపడిపోయాన్నేను. అప్పట్లో మనం ఎన్నోసార్లు కలుసుకునేవాళ్లం. ఎందుకో ఈ మధ్య నేను బిజీ అయిపోయి నిన్ను కలవడమే తగ్గిపోయింది. సరిగ్గా క్రితం వారమే అనుకుంటా కదా... నిన్ను కలిసింది.
అప్పుడు నువ్వో మాటన్నావ్. ‘‘నెక్ట్స్ సినిమా ఓ అద్భుతం చేద్దాం’’ అని బలంగా చెప్పావు. నా లైఫ్‌లో చాలా చాలా అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. నేను జీవితంలో డబ్బేమీ సంపాదించుకోలేదు. కానీ, అద్భుతమైన వ్యక్తుల సాంగత్యాన్ని సంపాదించుకున్నా. ఆ అద్భుతమైన వ్యక్తుల్లో నువ్వొకడివి. ఎవ్వరికీ సాయమే తప్ప హాని చేయని ఓ మరపురాని మనిషివి నువ్వు. అందరూ నువ్వీ భూమ్మీద నుంచి వెళ్లిపోయావంటున్నారు. నాకైతే నమ్మశక్యంగా లేదు. ఏ కంబాలపల్లో వెళ్లావనుకుంటున్నాను. అయినా నీకెందుకంత తొందర. ఇలాగొచ్చి మరీ... అలా వెళ్లిపోయావ్! నమ్మలేకపోతున్నా బిడ్డా!
నీ వంశీ