...ఏకాకి జీవితం నాది! | music dircter chakri wife special chat | Sakshi
Sakshi News home page

...ఏకాకి జీవితం నాది!

Published Fri, Dec 19 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

...ఏకాకి జీవితం నాది!

...ఏకాకి జీవితం నాది!

కనులకు కలలే కాదు... అవి కల్లలైపోతే పెట్టేందుకు కన్నీళ్లనూ ఇచ్చాడు దేవుడు. ఆ నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వయసు శ్రావణిది.

అందుకే భర్త చక్రితో తన జీవితం గురించి, తామిద్దరి భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ ఉంది. కానీ అంతలోనే ఆమె కలలు
 కల్లలైపోయాయి. కన్నుమూసి తెరిచేలోగా కన్నీళ్లు వరదలా ఆమె జీవితాన్ని ముంచేశాయి. ప్రాణంగా ప్రేమించే భర్త మరణంతో
 కన్నీరు మున్నీరవుతోన్న శ్రావణిని కదిలించడం భావ్యం కాకపోయినా...  ‘సాక్షి’ ఆమెను కలిసింది. చక్రితో ఆమె అనుబంధాన్ని, హఠాత్పరిణామం తర్వాత ఆమె ఆవేదనను ఇలా అక్షరరూపంలో పాఠకుల ముందు ఉంచుతోంది.
 
 
చక్రి లేకపోవడం...

 
అవును! ఒక్కసారిగా అంతా శూన్యమైపోయినట్టుగా ఉంది. ప్రతిక్షణం చక్రే గుర్తొస్తున్నాడు. ఒక్కోసారి తను చనిపోలేదేమో, ఏదైనా ఊరు వెళ్లాడేమో అనిపిస్తోంది. (కన్నీళ్లు జాలువారుతుండగా) కానీ... అది నిజం కాదన్న విషయం జ్ఞాపకం వస్తుంటే నేను మాత్రం ఇంకా బతికున్నానా అనిపిస్తోంది. సంతోషంగా సాగిపోయే జీవితంలో ఒక్కసారిగా తుపాను రేగింది!
  
అసలా రోజు ఏం జరిగింది?
 

ముందురోజు సాయంత్రం వరకూ చక్రి ఇంటిలోనే ఉన్నారు. మా నాన్న, తమ్ముడు వస్తే కబుర్లు చెప్పారు. సాయంత్రం బయటకు వెళ్లి, రాత్రి ఎప్పటికో వచ్చారు. ‘నువ్వు పడుకో, నేను బట్టలు మార్చుకుని వస్తాను’ అంటే నేను పడుకుండిపోయాను. కాసేపు టీవీ చూసి, రెండున్నర ప్రాంతంలో వచ్చి పడుకున్నారు. అంతే... ఆ తర్వాత...

ఆయన ఇక లేరు అన్న విషయాన్ని మీరెలా గుర్తించారు?

తెల్లవారుజామున నేను ట్యాబ్లెట్ వేసుకోవడానికని లేచాను. ఆయన గురక పెడతారు. కానీ అప్పుడు గురక శబ్దం వినిపించడం లేదు. దాంతో అనుమానం వచ్చి ఆయనవైపు చూశాను. అప్పటికే ఒంటి రంగు మారిపోయింది. ముఖం నీలిరంగులోకి వచ్చేసింది. పిలిచినా పలకలేదు. తట్టినా లేవలేదు. ఒళ్లంతా చల్లబడిపోయింది. ఊపిరి తీసుకోవడం లేదు. నా మనసు కీడు శంకించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. (కన్నీళ్లతో) నా చక్రి అప్పటికే నన్ను విడిచి వెళ్లిపోయారు. ఆ వార్త నన్ను పిచ్చిదాన్ని చేసేసింది.

ఒక్కసారిగా ఏర్పడ్డ వెలితి... భరించడం చాలా కష్టం కదా?!

మామూలు కష్టం కాదు. ఇద్దరికీ సరిపడక అనుక్షణం పోట్లాడుకునే భార్యాభర్తలు కూడా ఒకరికేమైనా అయితే ఇంకొకరు తల్లడిల్లిపోతారు. అలాంటిది... తన ప్రాణం కంటే మిన్నగా నన్ను ప్రేమించి, అనుక్షణం నేనే ప్రపంచంగా మెలిగిన నా భర్త పోతే నాకెలా ఉంటుంది! తనకి అసలు ఏమీ తెలియదు. చిన్నపిల్లాడితో సమానం. స్నానానికి వెళ్తే టవల్ ఇవ్వాలి. స్నానం చేసి వస్తే బట్టలు తీసివ్వాలి. ఏ ప్యాంటు మీదికి ఏ చొక్కా వేసుకోవాలో కూడా నేనే చెప్పాలి. ప్రతిక్షణం శ్రావణీ శ్రావణీ అంటూ కలవరించేవారు. పొద్దున్న లేవగానే నా ముఖమే చూడాలి. నేను వెళ్లి ఎదురుగా నిలబడేవరకూ కళ్లు కూడా తెరిచేవారు కాదు. ఇక ఏ పరీక్షలు రాయడానికో మా పుట్టింటికి వెళ్తే ఎన్ని ఫోన్లు చేసేవారో! నాకు నిద్రపట్టడం లేదు శ్రావణీ అంటూ రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉండేవారు. అలాంటిది నన్ను ఒంటరిగా వదిలేసి ఎప్పటికీ లేవనంత గాఢనిద్రలోకి ఎలా వెళ్లిపోయారో ఏమో!

 ఆయన అనారోగ్యమే ఆయన ప్రాణాలు తీసిందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి మీరు ఆయనను ఎప్పుడూ హెచ్చరించలేదా?
 చాలాసార్లు చెప్పాను. మొదట్లో చూద్దాంలే అనేవారు. కానీ రానురాను ఒబేసిటీతో చాలా ఇబ్బంది పడేవారు. అసలు 2010లోనే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్నాక ఎవరో ఆయనతో ఆ ఆపరేషన్ రిస్క్ అని చెప్పారు. దాంతో వెనకడుగు వేశారు. అయినప్పటికీ గత కొంతకాలంగా తన ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సర్జరీ చేయించుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ కొంతకాలం ఆగమని కార్డియాలజిస్ట్ చెప్పడంతో వాయిదా వేశారు. అసలు ఈ వారంలో డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఈలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది.

ఆయన డిప్రెషన్‌లో కూడా ఉన్నారని...

నిజమే. కొంతకాలంగా కెరీర్ ఏం బాలేదు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. మొన్ననే డిసెంబర్ 31న ఒక షో చేసే అవకాశం వచ్చింది. ఆ రోజు నా దగ్గరకు వచ్చి... ‘ఈ సమయంలో మనకి ఈ షో అవకాశం రావడం ఎంత అదృష్టమో తెలుసారా, మన దగ్గర అస్సలు డబ్బులు లేవు, మొత్తం అయిపోయాయి, లక్కీగా ఇప్పుడిది వచ్చింది’ అన్నారు ఎంతో సంతోషంగా. కానీ ఉన్నట్టుండి ఆ షో క్యాన్సిలయ్యింది. దాంతో దిగాలు పడిపోయారు. దానికితోడు ఓ సినిమా అవకాశం కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇవన్నీ కలిసి ఆయనను డిప్రెషన్‌కి గురి చేశాయి.

చాలా సినిమాలు చేశారు కదా... ఆర్థికంగా అంత ఎలా చితికిపోయారు?

 చాలామంది అనుకుంటారు, బోలెడన్ని సినిమాలు చేశాడు కదా చాలా సంపాదించి ఉంటాడు అని. కానీ చక్రి పెద్దగా వెనకేసిందేమీ లేదు. బ్యాంకు బ్యాలెన్సులూ, ఆస్తులూ లేవు. ఉన్నదల్లా ఒక్క ఇల్లే. సంపాదించినదాన్ని కుటుంబం కోసం ఖర్చు పెట్టేవారు. దానధర్మాలు చేసేసేవారు.

ఆస్తులు లేవంటున్నారు... కానీ మీ కుటుంబంలో ఆస్తుల గురించి కలహాలు రేగాయి కదా?

దయచేసి ఆ విషయం ఇక వదిలేయండి. చక్రి ఇక లేడని తెలియగానే నా మెదడు బ్లాంక్ అయిపోయింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో సహజ మరణమేనా అంటూ ఆరా తీశారు. అది తట్టుకోలేకపోయాను. దాంతో కాస్త ఆవేశపడ్డాను. మరికొన్ని పరిస్థితుల వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వచ్చి అపార్థాలు తలెత్తాయి. తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. ఏ సమస్యలూ లేకుండా చేసుకున్నాం. చక్రి ఉన్నా లేకపోయినా మేమంతా ఒకే కుటుంబం. ఒక్కటి మాత్రం నిజం. చక్రికి వాళ్ల అమ్మన్నా, తమ్ముడు మహిత్ అన్నా ప్రాణం. వాళ్లని మాత్రం నేను జీవితాంతం నా సొంత తల్లి, తమ్ముడిలాగే చూసుకుంటాను. అందులో సందేహం లేదు.

సరే వదిలేయండి. ఈ క్షణం కళ్లు మూసుకుని చక్రి గురించి ఆలోచిస్తే... మీకేం గుర్తుకొస్తోంది?

తనతో గడిపిన ప్రతి క్షణమూ మనసులో మెదులుతోంది. మా ఇద్దరి ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. వేణ్నీళ్లతో స్నానం చేసినప్పుడు బాత్రూమ్ అద్దం మీద ఆవిరి పడుతుంది కదా! దానిమీద ఐలవ్యూ అని రాయడం ఇద్దరికీ అలవాటు. నేను స్నానం చేసి వచ్చేటప్పుడు ‘ఐలవ్యూ నాన్నా’ అని రాసేదాన్ని. తను చేసి వచ్చేటప్పుడు ‘ఐలవ్యూ శ్రావణీ’ అని రాసేవారు. ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోతే ఎందుకు రాయలేదు అని సరదాగా పోట్లాటకు దిగేవాళ్లం. అంత పిచ్చి ఒకరంటే ఒకరికి. నేనెప్పుడూ ఆయనకి సర్‌ప్రైజ్ గిఫ్టులిస్తూ ఉండేదాన్ని. వాటిని చూసి చిన్నపిల్లాడిలా సంబరపడిపోయేవారు. ఓసారి  బ్రాండెడ్ వాచ్‌మీద ఆయన ఫొటో ఫిక్స్ చేయించి ప్రెజెంట్ చేశాను. దాన్ని ప్రాణంగా చూసుకునేవారు. అందరూ భలే ఉందని అంటుంటే మురిసిపోయేవారు.

 చాలామంది సెలెబ్రిటీలు తమ భార్యలను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. చక్రి మిమ్మల్ని ఎప్పుడూ రమ్మనలేదా?
 
లేదు. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అందుకే నేను బొతిక్ పెట్టుకుంటానని అడిగితే సరే అన్నారు. కొన్నాళ్లు దాన్ని నడిపిన తర్వాత అడిగాను... మీరు పని చేసే ఏదైనా సినిమాకి గానీ, ఒక్క పాటకైనా గానీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే చాన్స్ ఇవ్వమని. కానీ ఆయన  ఒప్పుకోలేదు. ‘ఈ ఫీల్డ్‌లో మనగలగడం అంత ఈజీ కాదు. వద్దు’ అన్నారు. తర్వాత నేనిక ఆ ప్రసక్తి తీసుకురాలేదు. అదనే కాదు... ఆయన ఏది చెప్పినా బాగా ఆలోచించి, నా మంచి కోసమే చెప్తారని నాకు తెలుసు. అందుకే దేనికీ వాదించేదాన్ని కాదు. అయినా కళ్లలో పెట్టుకునే చూసుకునే ఆయన ఉండగా వేరే వాటి గురించి బెంగ ఎందుకులే అనుకునేదాన్ని.
 
కానీ ఇప్పుడాయన లేరు కదా..?

 అవును. లేరు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. ఇలాంటి రోజొకటి వస్తుందని ఎన్నడూ ఊహించింది లేదు. కనీసం ఆయన జ్ఞాపకంగా ఓ బిడ్డ ఉన్నా బాగుండేది. దేవుడు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు.
 
మీరిద్దరూ పిల్లల గురించి ఆలోచించలేదా?
 
ఆలోచించడం కాదు... తపించాం. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఐవీఎఫ్‌ని ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రాసెస్ చాలా బాధాకరంగా ఉండేది. అది ఆయన తట్టుకోలేకపోయారు. పిల్లలంటే తనకున్న ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి... ‘నువ్వలా కష్టపడితే నేను చూడలేను శ్రావణీ, ఎవరినైనా తెచ్చి పెంచుకుందాంలే’ అన్నారు. కానీ నాకది ఇష్టం లేకపోయింది. సరొగసీకి కూడా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నా చక్రి రక్తం పంచుకున్న బిడ్డకు నేను స్వయంగా జన్మనివ్వాలి. అందులో ఉండే ఆనందమే వేరు. అందుకే మళ్లీ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. డిసెంబర్ పద్నాలుగున డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. కానీ ఆరోజు ఆదివారం కావడంతో తర్వాతి రోజు వెళ్దామనుకున్నాను. కానీ వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. చక్రి ఆ రోజు ఉదయమే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు.

మరి ఇప్పుడు భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు?

ఆలోచించడానికి ఇంకా ఏం మిగిలిందని! నా ప్రాణానికి ప్రాణమైన చక్రియే వెళ్లిపోయిన తర్వాత నాకింకా భవిష్యత్తు ఎక్కడిది? నాకీ జీవితం మీద పెద్ద ఆసక్తి లేదు. బతకాలన్న కోరిక అంతకన్నా లేదు. నా వరకూ నాకు చక్రి లేని జీవితం అసలు జీవితమే కాదు. కానీ నేను బతికి తీరాలి. చక్రి ఒక స్టూడియో పెట్టాలనుకున్నారు. ‘సీ స్టూడియోస్’ అనే పేరుని రిజిస్టర్ కూడా చేయించారు. కానీ తన కల నెరవేరకుండానే కన్నుమూశారు. ఆ కలను నేను నెరవేరుస్తాను. అయితే అది ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పటికైనా చేసి తీరతాను.
 
ప్రేమించడం తనని చూసే నేర్చుకోవాలి!

చక్రితో ప్రతిక్షణం ఎంతో ఆనందంగా ఉండేది. భార్యని ఎలా ప్రేమించాలో ఎవరైనా తనని చూసే నేర్చుకోవాలి. నేను ప్యూర్ వెజిటేరియన్‌ని. ఆ విషయాన్ని తను ఏ క్షణం మర్చిపోయేవారు కాదు. తనకెంత ఇష్టమైనా నన్ను నాన్‌వెజ్ వండమని ఎప్పుడూ అడగలేదు. తినమనీ బలవంతపెట్టలేదు. నాకోసం తనే వెజ్‌ని ఇష్టంగా తినేవారు. తనకసలు కోపమన్నదే రాదు. నాకు మాత్రం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఏదైనా చిన్న తేడా వచ్చినా వెంటనే  కోప్పడిపోతాను. అప్పుడు కూడా ఆయన ఒక్క మాట అనేవారు కాదు. నవ్వేవారు. కూల్‌గా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవారు. అంత నిబ్బరంగా ఎలా ఉండేవారో అర్థమయ్యేది కాదు నాకు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement