'విష ప్రయోగం వల్లే చక్రి మరణం'
- అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన సతీమణి శ్రావణి
- భర్త కుటుంబీకులే కారణమని ఆరోపణ
హైదరాబాద్ : తన భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆయనపై విష ప్రయోగం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చక్రి సతీమణి జిల్లా శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. గత నెల 15న తన భర్త మృతికి ఆయన కుటుంబ సభ్యులు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను వేధిస్తున్న అత్త, ఆడపడుచులు, వారి భర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్, ఆడపడుచులు వాణిదేవి, కృష్ణప్రియ, వారి భర్తలు కె. లక్ష్మణ్‌రావు, వి.నాగేశ్వర్‌రావులతో పాటు వారి సన్నిహితులు కె.ఆదర్శిని, గాలి గిరి, గాలి ప్రత్యూష తదితర 9 మందిపై ఐపీసీ సెక్షన్ 498ఏ, 506, రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. తన భర్తపై గత నెల 14వ తేదీ రాత్రి విషప్రయోగం జరిగిందంటూ శ్రావ ణి తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు.
చక్రి వ్యక్తిగత బ్యాగుతో పాటు ఆఫీస్ తాళాలు, మెడలో గొలుసులు, రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డు, చెక్‌బుక్ అన్నీ తన అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. భర్తకు చెందిన ఆడి కారు కూడా వారి వద్దే ఉందని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని భర్త మరణంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటిక నుంచి చక్రి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోకుండా అడ్డుకుంటున్నారని, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
డెత్‌సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సినీ పెద్దలు దాసరి నారాయణ రావు చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తులను లాక్కోవడానికి యత్నిస్తున్నారని, ఒంటరిని చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎస్సై మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.