దారుణంగా కొట్టి కుమార్తెను కడతేర్చిన తల్లిదండ్రులు
భర్తతో విడిపోయి మరో వివాహం చేసుకోవడమే కారణం
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.
కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది.
ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్‌ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.
పూడ్చిపెట్టి.. పైన కంప వేసి..
శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు.
తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.
దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment