పిల్లల కోసం బళ్లో...
స్ఫూర్తి
అప్పుడెప్పుడో కాలేజీ బుల్లోడు అనే సినిమా వచ్చింది. కోట్ల ఆస్తి ఉండి కూడా కొడుకుని దార్లో పెట్టడానికి ఏఎన్నార్ కాలేజీలో చేరతారు. ఆ వయసులో కాలేజీకి వెళ్లడమేంటి, సినిమా కాబట్టి సరిపోయింది అనుకున్నారంతా. కానీ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా అలా జరుగు తుందని ముంబైకి చెందిన జయశ్రీ కానమ్ నిరూపించింది. నలభయ్యొక్కేళ్ల వయసులో జయశ్రీ బడిలో చేరింది. అయితే ఏఎన్నార్‌లాగా పిల్లల్ని దారిలో పెట్టడానికి కాదు.. తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తునూ తీర్చిదిద్దడానికి!
చిన్నప్పుడు ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసింది జయశ్రీ. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేది. యుక్త వయసు వచ్చిన తరువాత జయంత్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడ పిల్లలకు తల్లయ్యింది. అంతా ఆనందంగా ఉంది అనుకున్న సమయంలో ఆమె జీవితం అల్లకల్లోలం అయ్యింది.
2005లో... ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న జయంత్ హఠాత్తుగా వచ్చిన వరద నీటిలో చిక్కుకుని మరణించాడు. దాంతో కూతుళ్ల బాధ్యత జయశ్రీ మీదే పడింది. ఇళ్లల్లో వంట పని చేస్తూ కూతుళ్లను చదివించసాగింది. అంతలో అనుకోకుండా అంగన్‌వాడీలో పనిచేసే అవకాశం వచ్చింది జయశ్రీకి. అక్కడ చిన్న పిల్లలకు తనకు తెలిసిన చదువు చెప్పేది. ఆమె తెలివితేటలను గుర్తించిన ఓ ప్రభుత్వాధికారి, ‘నువ్వు చదువుకుని ఉంటే ఇంకా మంచి పని ఇప్పించే వాడిని, పిల్లల్ని ఇంకా బాగా పెంచుకునేదానివి’ అన్నారు. అంతే... ఆ క్షణమే ఆమె చదువుకోవాలని నిర్ణయించుకుంది.
జయశ్రీ పెద్ద కూతురు షీతల్ ఇంటర్ చదువుతోంది. రెండో కూతురు శ్వేత ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. కూతురితో పాటే జయశ్రీ కూడా పరీక్షలు రాసింది. డిగ్రీ కూడా చేస్తానంటోంది. ఇన్నేళ్ల తరువాత చదువుకుంటు న్నందుకు సంతోషపడటం లేదామె. తన కూతుళ్ల కోసం చదువుకుంటున్నందుకు సంబరపడుతోంది. తమ కోసం కష్టపడుతోన్న తల్లికి షీతల్, శ్వేతలు సహాయ పడుతున్నారు. తాము కూడా బాగా చదివి తల్లిని మహరాణిలా చూసు కుంటామంటున్నారు. అమ్మ రుణం తీర్చుకోవడానికి వాళ్లు ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటారు!