జీవితం అంటే టీవి సీరియల్స్ మాత్రమేనా?
టీవి చూడడాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు. టీవిలో సీరియల్స్ చూడడాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. కానీ, శృతి మించితే ఏదైనా సీరియస్‌గా తీసుకోకతప్పదనిపిస్తుంది. మా ఆవిడకు టీవియే లోకం, ప్రాణం.
టీవీలో వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. అది గతంలో థియేటర్‌లో చూసిన సినిమా అయినా సరే. ఇక టీవీలలో సీరియల్స్ మొదలైన తరువాత... అవి చూడడం ఆమెకు ఒక వ్యసనంగా మారింది. సీరియల్స్ చూడడం, అందులొని సన్నివేశాలను పక్కింటి వాళ్లకు చెప్పడం ఆమెకు పరిపాటిగా మారింది.
‘‘ఎప్పుడూ ఆ టీవి సీరియల్స్ చూసే బదులు ఏవైనా మంచి పుస్తకాలు చదువుకోవచ్చు కదా’’ అని ఒకరోజు సలహా ఇస్తే -
‘‘మీ చాదస్తాలన్నీ నా మీద రుద్దకండి. మీ పనేదో మీరు చూసుకోండి’’ అని హెచ్చరించింది.
నా పనేదో నేను చూసుకుందామనే అనుకున్నానుగానీ, మా ఆవిడ సీరియల్స్ పిచ్చి కారణంగా పిల్లల చదువు పూర్తిగా దెబ్బతింటోంది. ఒకప్పుడు పిల్లలను కూర్చోబెట్టుకొని చదివించేది. ఇప్పుడు టీవీకి అతుక్కుపోవడం తప్ప పిల్లల చదువు గురించి ఆలోచించడం లేదు.
‘‘సీరియల్స్ చూడడం తగ్గించు. జీవితం అంటే టీవి సీరియల్స్ మాత్రమే కాదు. చాలా ఉంది. పిల్లల చదువు పట్టించుకో’’ అని చెప్పాలని ఉంది.కానీ అంత ధైర్యం లేక, కాస్తో కూస్తో ఉన్న ధైర్యం చాలక... నాలో నేను రగిలిపోతున్నాను.
- ఆర్, విజయవాడ